పాతికేళ్ల బంధానికి విడాకులు
ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లుగా కొనసాగుతున్న బంధానికి రెండు పక్షాలు తూచ్ అనేశాయి. దాంతో బీజేపీ.. శివసేన విడాకులు తీసేసుకున్నాయి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న ఒకే ఒక్క అంశం.. ఈ రెండు పార్టీల మధ్య తెగతెంపులకు కారణం అయ్యింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 130 స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ.. తమకు 155 కావల్సిందేనని శివసేన పట్టుబట్టాయి. అయితే, 'మహాయుతి' పేరుతో కొన్ని చిన్న పార్టీలతో ఓ కూటమిని ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఈ రెండు పక్షాలు.. వాళ్లకు ఎలా సీట్లు సర్దుబాటు చేయాలో అర్థం కాక.. ముఖ్యమంత్రి పదవిని ఎవరు పంచుకోవాలో తెలియక మొత్తానికి పొత్తు తెంచేసుకున్నారు. శివసేన మొండిఘటమని, ఎక్కడా సర్దుకుపోలేదని, తాము మాత్రం ఎంత సర్దుకుందామన్నా వాళ్లు వినిపించుకోకపోవడం వల్లే పొత్తు పటాపంచలు అయ్యిందని బీజేపీ నాయకులు అంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ - ఎన్సీపీల మధ్య కూడా పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బంధం తెగిపోయింది. ఇప్పుడు రెండు కూటములలోనూ చీలికలు రావడంతో.. మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ కూటమి మాత్రం ఇప్పటికీ బాగానే ఉందని, సీట్ల పంపీణీ విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలు త్వరలోనే తెగిపోతాయని ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ తొలుత ధీమా వ్యక్తం చేసినా.. అది ఏమాత్రం ఫలించలేదు. మహారాష్ట్రలో తమ బలాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తీరాలని కూడా ఆయన అన్నారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలూ వేటికవే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దాంతో ఈసారి అక్కడ ఎన్నికల వ్యవహారం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.