దేవేంద్ర ఫడ్నవిస్
మహారాష్ట్రలో ఎన్సీపి మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే చిరకాల మిత్రపక్షమైన శివసేనతో పొత్తు అంశం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. శివసేన సభ్యులు ఎవరూ మంత్రి వర్గంలో చేరడంలేదు.
ఎన్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో బీజేపి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆపార్టీ అధినేత శరద్ పవార్ బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవానికి ఎన్సీపి ఎమ్మెల్యేలు గౌర్హాజరు అవుతారని తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరుకారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపి చెబుతోంది. అయినప్పటికీ ఇంకా మరో పది మంది మద్దతు కావాలి. గవర్నర్ చెప్పిన ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన తరువాత 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. అప్పటికి ఆ పది మందిని సమకూర్చుకోగలమన్న ధీమాతో బీజేపి ఉంది. శివసేనతో చర్చలు ఫలించకపోతే బీజేపికి ఎన్సీపి మద్దతు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
**