మహారాష్ట్రలో 28న కొత్త ప్రభుత్వం?
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపి సిద్ధమైంది. బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఈరోజు కలిశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపి ఉంది. 122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్క్ ను సాధించాలంటే బీజేపికి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
ఈ నేపధ్యంలో తొలుత ఎన్సీపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపి మనసు మార్చుకొని శివసేన మద్దతు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శివసేన అడిగిన మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా బీజేపి సిద్దపడినట్లు సమాచారం.
బీజేపి శాసనసభా పక్షం సోమవారం సమావేశమై ప్రభుత్వం ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 28న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మొదట అయిదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.
**