![Uddhav Thackeray Formally Resigns Raj Bhawan Devendra Fadnavis Takes Oath - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/30/Shiv.jpg.webp?itok=b1a6a3HT)
న్యూఢిల్లీ/ముంబై/గువాహటి: పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించడం, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది.
దాంతో సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కలయికతో రెండున్నరేళ్ల కింద ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం కథ కంచికి చేరింది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి ఇప్పటికే రంగంలోకి దిగి మంత్రివర్గ కూర్పు తదితరాలపై షిండేతో చర్చలు జరుపుతున్నారు. షిండేకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వర్గానికి 9 మంత్రి పదవులిస్తారని సమాచారం. ఎనిమిది రోజులుగా గువాహటిలో ఓ హోటల్లో మకాం చేసిన 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు బుధవారం రాత్రి ప్రైవేట్ చార్టర్ విమానంలో గోవా చేరుకున్నారు. వారంతా గురువారం ఉదయం ముంబై రానున్నట్టు సమాచారం. ‘‘మేం రెబల్స్ కాదు. నిజమైన శివ సైనికులం మేమే’’అని ఈ సందర్భంగా షిండే అన్నారు.
రోజుంతా పలు మలుపులు:
సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్ 21న మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కనీసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్ 20న అర్ధరాత్రి షిండే రాష్ట్రం వీడి సూరత్ చేరుకున్నారు. మర్నాడు గౌహతికి మకాం మార్చారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో చూస్తుండగానే 39 మందికి పైగా షిండే శిబిరంలో చేరిపోయారు. దాంతో ఉద్ధవ్ సర్కారు మైనారిటీలో పడింది. ఉద్ధవ్ బెదిరింపులు, బుజ్జగింపులు, ఇరువర్గాల సవాళ్లూ ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మంగళవారం రాత్రి ఫడ్నవీస్ గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిసి బలపరీక్షకు ఉద్ధవ్‌ను ఆదేశించాలని కోరడంతో ముదురు పాకాన పడింది.
ఆ వెంటనే సీఎంను గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి మంగళవారం రాత్రే లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా లేవు. 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు తదితరాలపై దాడుల నేపథ్యంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పుంది. విపక్ష నేత ఫడ్నవీస్ కూడా నన్ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలంటూ విజ్ఞాపన సమర్పించారు. అందుకే గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సీఎంను ఆదేశిస్తున్నా’’అని పేర్కొన్నారు. దీన్ని సవాలు చేస్తూ శివసేన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశంపై స్టే కోరింది.
అందుకు కోర్టు నిరాకరించింది. బల నిరూపణే సమస్యకు పరిష్కారమని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది. సేన పిటిషన్‌ను ఈ ఉదంతంపై దాఖలైన ఇతర కేసులతో కలిపి జూలై 11న విచారిస్తామని ప్రకటించింది. బలపరీక్ష ఫలితం తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి, ఐదు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
కూలదోసి ఆనందిస్తున్నారు: ఉద్ధవ్
సుప్రీం తీర్పు వెలువడ్డ కొద్ది నిమిషాల్లోనే సీఎం పదవి నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టు ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ‘‘పదవిని వీడుతున్నందుకు నాకు ఏ బాధా లేదు. నంబర్‌గేమ్‌పైనా ఏ మాత్రం ఆసక్తి లేదు. పార్టీ ఎమ్మెల్యేల్లో నన్ను ఒక్కరు వ్యతిరేకించినా నాకది అవమానమే’’అన్నారు. ‘‘రెబల్స్‌ను ముంబై రానివ్వండి. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు దిగొద్దు’’అని శివసేన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
శివసేన, బాల్ ఠాక్రే కారణంగా రాజకీయంగా ఎదిగిన రెబల్ ఎమ్మెల్యేలు చివరికి ఆయన కుమారున్నే సీఎం పదవి నుంచి దించేసి ఆనందిస్తున్నారని వాపోయారు. ఈ పరిణామాన్ని ఉద్ధవ్ బుధవారం ఉదయమే ఊహించారు. దాంతో మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీ ఒకరకంగా ఉద్ధవ్ వీడ్కోలు సమావేశంగా మారింది. తనకు రెండున్నరేళ్లుగా సహకరించినందుకు సంకీర్ణ భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల చీఫ్‌లు శరద్ పవార్, సోనియా గాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
‘‘రెబల్స్ కోరితే సంకీర్ణం నుంచి తప్పుకుని బయటినుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. నన్ను మోసగిస్తారనుకున్న వాళ్లు ఇలా మద్దతుగా నిలబడితే సొంతవాళ్లే మోసగించారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రెబల్స్ తమ సమస్యలపై తన దగ్గరికి వచ్చి ఉండాల్సిందన్నారు. ‘‘శివసేన సామన్యుల పార్టీ. గతంలోనూ ఇలాంటి ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది’’అన్నారు. పార్టీని పునర్నిర్మిస్తానని ప్రకటించారు.
కర్మ సిద్ధాంతం పని చేసింది: బీజేపీ
ఉద్ధవ్ రాజీనామా విషయంలో కర్మ సిద్ధాంతం పని చేసిందని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన దాన్ని అనుభవించే తీరాలి. ఉద్ధవ్ విషయంలోనూ అదే జరిగింది’’అని కేటీ రవి అన్నారు. ‘‘శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎన్నడూ అధికార పదవులు చేపట్టకపోయినా ప్రభుత్వాలను శాసించారు. ఆయన కుమారునిగా ఉద్ధవ్ మాత్రం అధికారంలో ఉండి కూడా సొంత పార్టీనే అదుపు చేయలేకపోయారు. ఎంతటి పతనం!’’అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు
మహారాష్ట్ర సంక్షోభంలో ఎప్పుడేం జరిగిందంటే...
జూన్ 20: మహారాష్ట్రలో 10 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాక శివసేన సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ షిండే అదృశ్యమయ్యారు. ఆయనతో మరో 11 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆ అర్ధరాత్రే బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్ చేరారు.
జూన్ 21: ఉద్ధవ్ ఠాక్రే సమావేశానికి శివసేన ఎమ్మెల్యేల్లో 12 మందే వచ్చారు. పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండేను తొలగించారు. తనకు 40 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే ప్రకటించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్‌ను డిమాండ్ చేశారు.
జూన్ 22: షిండే వర్గం సూరత్ వీడి బీజేపీ పాలిత అస్సాంలోని గువాహటి చేరుకుంది. రెబల్స్ కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సంకీర్ణాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
జూన్ 23: 37 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా షిండేను ఎన్నుకుంటూ తీర్మానం చేశారు.
జూన్ 24: షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌కు సేన ఫిర్యాదు చేసింది. షిండే ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని వడోదర వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో సమావేశమైనట్టు వార్తలొచ్చాయి. బీజేపీలో శివసేన విలీనం, బయటి నుంచి మద్దతు, ఇరువురూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.
జూన్ 26: అనర్హత నోటీసులను షిండే వర్గం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. డిప్యూటీ స్పీకర్‌పై తమ అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉండగా తమకు అనర్హత నోటీసులిచ్చే అధికారం ఆయనకు లేదని వాదించింది.
జూన్ 27: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై జూలై 11 దాకా ఏ నిర్ణయమూ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
జూన్ 28: అదను చూసి బీజేపీ రంగంలోకి దిగింది. ఉద్ధవ్‌ను తక్షణం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఫడ్నవీస్ కోరారు.
జూన్ 29: గురువారం ఉదయానికల్లా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం, దానిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు గువాహటి నుంచి గోవా చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment