ముంబై : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యశ్వంత్‌రావు గడఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల విషయంలో పంతానికి పోకూడదని కూటమి నేతలను హెచ్చరించారు. ఇలా చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేస్తారని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి విస్తరణపై పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో కొందరు నాయకులు కేబినెట్ బెర్త్ దక్కకపోవడం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన గడఖ్.. ఉద్ధవ్ సాధారణ రాజకీయనాయకుడు కాదని.. అతనిది కళాకారుడి మనస్తత్వం అని పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంత్రిపదవులకు సంబంధించి ఫిర్యాదులు చేయడం ఆపాలని సూచించారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తరువాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కూటమి ప్రభుత్వంలో విభేదాలు తలెత్తడం ఖాయమని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజుల సమయం తీసుకుందని విమర్శించారు. ఆ తర్వాత శాఖల కేటాయింపులకు మరో వారం రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment