తొలగని ప్రతిష్టంభన
* కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై ముందుకు సాగని యత్నాలు
* నేడు గవర్నర్‌తో పీడీపీ భేటీ
* జమ్మూ కశ్మీర్, అసెంబ్లీ ఎన్నికలు, మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన తొలగలేదు. 87 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లతో అతిపెద్దపార్టీగా అవతరించిన పీడీపీగానీ, రెండవ స్థానం సాధించిన బీజేపీగానీ ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలాన్ని సాధించలేక పోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చకోసం జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా విధించిన గడువు సమీపిస్తోంది. కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని 28మంది పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం గవర్నర్‌ను కలుసుకోనున్నారు. తన 25మంది సభ్యులతో బీజేపీ గురువారం తన ప్రతిపాదనలను గవర్నర్‌కు సమర్పించనుంది.
ప్రస్తుత రాజకీయ ప్రతిష్టంభనను తొలిగించగలిగే పరిష్కారమేదీ ప్రస్తుతానికి తమవద్ద లేదని పీడీపీ ప్రతినిధి నయీం అక్తర్ చెప్పారు. పీడీపీకి మద్దతుగా 15మంది ఎమ్మెల్యేల నేషనల్ కాన్ఫరెన్స్ తీర్మానం ఆమోదించినట్టు వదంతులు రాగా, వాటిని పార్టీ ఖండించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, జమ్మూ కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మలు గవర్నర్‌తో చర్చలు జరిపారు. ప్రభుత్వం ఏర్పాటుపై జనవరి 1న తమ ప్రతిపాదనలను గవర్నర్‌కు సమర్పిస్తామని రాం మాధవ్ చెప్పారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలతో పీడీపీ ‘మహాకూటమి’గా ఏర్పడితే అది కశ్మీర్ ప్రజలకు విద్రోహం చేసినట్టే అవుతుందని జగల్ కిశోర్ శర్మ చెప్పారు. కాగా, కశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ సోజ్ కూడా మంగళవారం గవర్నర్‌తో చర్చించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోరాదంటూ పీడీపీకి సూచన చేశారు.