కశ్మీర్‌ ప్రజలు ఏమంటున్నారంటే... | Sakshi Guest Column On Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ ప్రజలు ఏమంటున్నారంటే...

Published Sun, Aug 18 2024 12:06 AM | Last Updated on Sun, Aug 18 2024 6:17 AM

Sakshi Guest Column On Jammu and Kashmir

విశ్లేషణ

‘జమ్మూ–కశ్మీర్‌’ విభిన్న జాతులు, మతాలు, భాషలు, నైసర్గిక స్వరూపాలు కలిగిన ప్రాంతాల సమాహారం. ఏదో ఒక కారణంగా కశ్మీర్‌ రోజూ వార్తల్లో ఉంటోంది. పార్టీలు, నాయకులు, మేధా వులు, జాతీయవాదులు ఏదో ఒక సంద ర్భంలో కశ్మీరు గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. 

దేశమంతా కశ్మీరు గురించి చర్చిస్తున్న విషయాల్నే కశ్మీరీలు మాట్లాడుకుంటున్నారా? అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసలు కశ్మీరీల మనసుల్లో ఏముంది? అని అన్వేషించడానికి ‘పీపుల్స్‌ పల్స్‌’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. కశ్మీరు లోయ నుంచి జమ్మూ మైదాన ప్రాంతాల వరకు... ఎందరో సామాన్య కశ్మీరీలతో మాట్లాడి, వారి మనసులో ఏముందో పసిగట్టే ప్రయత్నం చేసింది.

1977లో మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి అయిన తర్వాత కశ్మీరులో జరిగిన అసెంబ్లీ ఎన్నిక ఒక్కటే ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వేచ్ఛగా, న్యాయంగా జరిగిన ఎన్నిక అని కశ్మీరీలు అంటారు. అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నిక లన్నీ ఢిల్లీ పాలకులకు అనుకూలంగా జరిగిన ఎన్నికలేనని వారు భావిస్తున్నారు. 

జమ్మూ– కశ్మీరులో ఏ మూలకు వెళ్లి ఎవ్వరితో  మాట్లాడినా... చాలా సమస్యలపై వారికి ఏకాభిప్రాయం లేనప్ప టికీ, ఉమ్మడి అభిప్రాయం ఉన్నది ఒక విషయంలోనే: ఆ రెండు ప్రాంతాల్లోనూ ఎన్నికలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. 

2019 ఆగస్టు 5న ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో జమ్మూ–కశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదా తొలగిపోయింది. రాష్ట్రాన్ని కశ్మీర్, లద్దాఖ్‌ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు, పూర్వ జమ్మూ– కశ్మీర్‌కి లభిస్తున్న స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని సమర్థించింది. 

అయితే, రాష్ట్ర హోదాను పునరుద్ధరించి, ఈ సెప్టెంబర్‌ 30 నాటికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ‘‘ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరిగినా... మహా అయితే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం లాంటిది ఏర్పడవచ్చు. అక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అలాంటి ప్రభుత్వం మాకొద్దు’’ అని శ్రీనాగ్‌లో ఒక వ్యాపారి చెప్పాడు. ఇంచుమించు ఇదే అభిప్రాయం చాలా చోట్ల వినపడింది.  

రాష్ట్ర హోదాపాలన విషయంలో ఢిల్లీ మోడల్‌ని, సామాన్య స్థానికులతో పాటు గతంలో బీజేపీకి ఓటేసిన వాళ్లే వ్యతిరేకి స్తున్నారు. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గుజ్జర్‌ సామాజిక వర్గం బీజేపీకి ఇప్పుడు దూరం జరిగింది. స్థానిక బీజేపీ నాయకులు కూడా జమ్మూ–కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ఢిల్లీ ప్రభుత్వం లాంటిది వద్దని చెప్తున్నారు. 

కశ్మీర్‌ విషయంలో తమది చరిత్రాత్మక నిర్ణయమని బీజేపీ దేశమంతా ప్రచారం చేసుకుంటోంది. కానీ, కశ్మీరులో స్థానిక బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. అందుకే, లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్‌లో బీజేపీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరి స్థితిపై కొంత అనిశ్చితి నెలకొంది.  

కశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) మనోజ్‌ సిన్హా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో కొన్ని లోపాలు, వైఫల్యాలు ఉంటాయి. కానీ, అది మిలిటరీ సాయంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఎల్జీ పాలన కంటే ఏ విధంగా చూసినా మెరుగ్గానే ఉంటుందని ప్రజలు భావి స్తున్నారు. ‘‘ఎల్జీకి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఎన్నికలు లేకుండా వచ్చిన ఎల్జీ, అతని బ్యూరోక్రాట్ల బృందం నుంచి ప్రజాస్వామిక పరిపాలనను ఆశించలేం అని జమ్మూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు అన్నారు. 

ప్రజలకు, అధికారులకు మధ్య అంతరం పెరిగిపోయింది. మీడియాలో చూపించే వంతెనలు, అండర్‌ పాస్‌లను పక్కన పెడితే, స్థానిక ప్రాంతాలను కలిపే రోడ్లు అధ్వాన్నంగా తయార య్యాయి. కొత్త రోడ్లు వేయడం, రోడ్లను రిపేర్‌ చేయడం పూర్తిగా ఆపేశారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పరిస్థితి చూస్తే, ఇప్పుడున్న దాని కన్నా 2019కి కంటే ముందే బాగుండేదని అనేక ఉదాహరణలు చెబుతున్నారు.

జమ్మూ, శ్రీనగర్‌లు గవర్నమెంట్‌ ప్రకటనల్లో మాత్రమే పేరుకు స్మార్ట్‌ సిటీలనీ, తగిన మౌలిక వసతులు లేక తమ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయనీ స్థానిక వ్యాపారులు చెబుతు న్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అక్రమ మైనింగ్‌ చేస్తున్నారనీ, బయట నుంచి వచ్చిన వాళ్లే మద్యం వ్యాపారం చేస్తున్నారనీ, ముఖ్యమైన స్థానాలన్నింటీలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులే ఉంటున్నారనీ, ఇది తమకు న్యాయం చేయడం లేదనీ ప్రజలు ఏకాభిప్రాయంతో ఆరోపిస్తు న్నారు. ‘‘ఐఐఎం, ఐఐటీల్లో కూడా ముఖ్యమైన పదవుల్లో బయటి వాళ్లనే ఎందుకు నియమిస్తున్నారు? ఎందుకు అంత భయం?’’ అని అడ్వకేట్‌గా పనిచేస్తున్న షేక్‌ షకీల్‌ ప్రశ్నించారు. 

‘‘మాకు ఉద్యోగాలు లేవు, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టు బడులు రావాల్సిన అవసరం ఉంది. మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహుల కింద నేరం మోపుతున్నారు. గత 5 ఏళ్లుగా మేం ఎన్నుకోని ప్రభుత్వంలో ఉన్నాం’’ అనేది కశ్మీరీ యువత అభిప్రాయం. 

చలికాలంలో జమ్మూ, వేసవికాలంలో శ్రీనగర్‌ నుంచి జరిగే దర్బార్‌ పాలనకు 2019లో ఎన్డీయే ప్రభుత్వం చెక్‌ పెట్టింది. దీనికి అనవసర ఖర్చు అవుతోందనీ, ఇది కూడా చరిత్రాత్మక నిర్ణయ మనీ బీజేపీ ప్రచారం చేసుకుంది. కానీ, 5 ఏళ్ల తర్వాత చూస్తే దర్బార్‌ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకోవడం గమనార్హం. ‘‘దర్బార్‌ ఉన్నప్పుడు అధికారులు, వాళ్ల కుటుంబాలు ఇక్కడే బస చేసేవి. 

వారు జమ్మూలో ఐదారు నెలలు పెట్టే ఖర్చే మాకు ఆదాయం అయ్యేది. కానీ, ఇప్పుడు ఆ దారులన్నీ మూసుకు పోయాయ’’ని జమ్మూ వ్యాపారి వికాస్‌ శర్మ చెప్పాడు. జనం కోరుతున్నట్టు దర్బార్‌ను పునరుద్ధరిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇంకా చాలా నిర్ణయాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందనీ, అందుకే తాము అడిగినా నాయకత్వం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.

35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో జమ్మూ–కశ్మీరులో 58.58 శాతం ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఎన్నికలను బహిష్కరించిన ఈ ప్రాంతంలో, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తపిస్తున్న ప్రజల గాఢమైన కోరి కకు ఈ ఓటింగ్‌ శాతం అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరించాలనీ, ‘దిగుమతి’ సర్కారు కాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే ప్రభుత్వం రావాలనీ కోరుకుంటున్న కశ్మీరీల కల నెరవేరుతుందా, లేదా అనేది ఇంకో నెలన్నరలో తేలనుంది.

జి. మురళీకృష్ణ 
వ్యాసకర్త పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థలో పరిశోధకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement