విశ్లేషణ
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.
భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు.
అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.
మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం.
ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది.
ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.
దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.
మరో తరం సంస్కరణలు అవసరం
ఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్‌తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.
సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది.
అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.
ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్‌లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.
అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.
జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్‌లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.
సుష్మా రామచంద్రన్
వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment