బెంగళూరు వెళ్లడం ఘోరమా.. కొడాలి నాని బహిరంగ లేఖ | Kodali Nani Open Letter To Eenadu Ramoji Rao Over Karnataka Chikkaballapur Road Accident - Sakshi
Sakshi News home page

బెంగళూరు వెళ్లడం ఘోరమా.. కొడాలి నాని బహిరంగ లేఖ

Published Sat, Oct 28 2023 3:39 AM | Last Updated on Sat, Oct 28 2023 10:00 AM

Kodali Nani open letter to Ramoji Rao - Sakshi

సాక్షి, అమరావతి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు చనిపోవటం ఘోరమా? లేక బెంగళూరు వెళ్లడం ఘోరమా? అన్నది రామోజీరావు స్పష్టంచేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్‌ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబునాయుడే 29 మందిని చంపేశారని.. ఘోరం అంటే అది అని కొడాలి నాని తెలిపారు. ఏపీ కార్మికులు కర్ణాటకలో చనిపోయిన ఘటనపై ఈనాడులో రామోజీరావు ‘ఇక్కడే ఉపాధి ఉంటే.. ఈ ఘోరం జరిగేదా? అంటూ రాసిన కథనంపై శుక్రవారం కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన రామోజీరావుకు బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాలు.. 

రామోజీరావు.. ముందుగా అసలు మీ బాధేంటో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడమా?.. ఇంకెప్పటికీ ఆయన అధికారంలోకి రాడన్న ఆక్రోశమా? లేక మీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాల్ని ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా చట్టబద్ధంగా ప్రభుత్వం ప్రశ్నించిందన్న తట్టుకోలేనితనమా? వీటిపై ప్రజలకు సమాధానాలు చెప్పితీరాలి. ఒక రాష్ట్రం వారు, ప్రత్యేకించి సరిహద్దుల్లో ఉన్నవారు మరో రాష్ట్రంలో పనులకు వెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచీ జరుగుతోంది. అది చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నా కూడా ఇలా ఒక రాష్ట్రం వారు మరో రాష్ట్రంలోకి పనుల కోసం వెళ్లడం సర్వసాధారణమే.

ఉదా.. ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజూ కొన్ని వందల మంది పనుల కోసం విజయవాడ వస్తారు. అలాగే, ఒడిశా నుంచి ఉత్తరాంధ్రకు, కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, రాజస్థాన్‌ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వలస వస్తారు. దగ్గర ప్రాంతాల్లో ఉన్నవారు ఉదయం వచ్చి రాత్రికి వెళ్లిపోతే.. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

కానీ, కర్ణాటకలో ఒక రోడ్డు ప్రమాదం జరిగితే.. ఇక్కడ ఉపాధిలేక వారు వెళ్లిపోయారా? లేక అక్కడ మెరుగైన ఉపాధి ఉందని వెళ్లారా? అని కనీసం వారి వివరణ కూడా లేకుండా రామోజీరావు రాశారు. ఇది ఎంతవరకు సమంజసం? దురుద్దేశపూర్వకంగా రాసినట్లు కన్పించటం లేదా రామోజీ? ఇలా రాస్తే ప్రజలు విశ్వసిస్తారా?.. ఒకసారి ఆలోచించండి.

చంద్రబాబు హయాంలో ఏటా కరువే..
ఇక చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కరువు మండలాలు ప్రకటించాల్సిన అవసరంలేని సంవత్సరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఏటా కరువే. ఒక్క 2016నే తీసుకున్నా.. రాయలసీమ నుంచే 6–10 లక్షల మంది వ్యవసాయం చేసుకుంటున్న వారంతా వలసపోయారని అప్పట్లో ఆంగ్ల దినపత్రికలు రాశాయి.

అంటే, వ్యవసాయం చేసుకుంటున్న వారు, వ్యవసాయం మానుకుని వేరే రాష్ట్రాలకు కూలీలుగా వలసపోతే ఆ రోజున రామోజీ ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఉద్యమం చేశారు తప్ప, ఇక్కడే ఉపాధి దొరికి ఉంటే.. ఇన్ని లక్షల రైతు కుటుంబాలు వేరే రాష్ట్రాల్లో కూలీలుగా మారేవారా? అని ఏనాడూ ప్రశ్నించలేదు.

మరి తేడా ఎక్కడుంది? రామోజీరావు దగ్గరే.. ఆయన మనస్సులో, ఆలోచనల్లో, రాతల్లోనే తేడా ఉంది. ఇక గోదావరి పుష్కరాల పేరిట రాజమండ్రిలో చీప్‌ పబ్లిసిటీ కోసం సాక్షాత్తూ చంద్రబాబు 29 మందిని చంపేశారు. నిజానికి.. ఆ రోజు అది బాబు చేసిన ఘోరమే. కానీ, చేసింది బాబు కాబట్టి అది నేరమైనా ఘోరమైనా రామోజీకి కమ్మగా కనిపిస్తోంది, తియ్యగా అనిపిస్తోంది. 

మీ వాడు కాదు కాబట్టే రాళ్లు వేస్తారా?
దుర్మార్గులను వెనకేసుకొచ్చి, దురదృష్టవశాత్తూ భవన నిర్మాణ కార్మికులు కర్ణాటకలో చనిపోతే వారి కుటుంబాలకు ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత నష్టపరిహారాన్ని, పైగా వేరే రాష్ట్రంలో ప్రమాదం జరిగినా ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద, మానవతా సాయం విషయంలో ఏమాత్రం వెనుకాడని నాయకుడి మీద.. తనవాడు కాదు,, గిట్టనివాడు కాబట్టి రాళ్లు వేస్తారా? మరీ ఇంత దుర్మార్గమా రామోజీ? మిగతా రాష్ట్రాలకు వెళ్లడం ఘోరం, నేరం అంటున్న వారు.. మీ తోటి ఎల్లో మీడియా అధిపతులు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి.. అసలు మా రాష్ట్రంతో, మీ సొంతూళ్లతో మీకున్న సంబంధం ఏమిటి?

చంద్రబాబుతో ఉన్న వర్గపరమైన అనుబంధం తప్ప, రామోజీకి మా రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంది? చంద్రబాబునాయుడుకు అయినా, పవన్‌కళ్యాణ్‌కు అయినా, సొంత ఇల్లు కూడా లేని ఈ రాష్ట్రంతో ఏం అనుబంధం ఉంటుంది? పవన్‌కళ్యాణ్‌ తమ్ముడిలా రోజూ మీ ఈనాడులో జగన్‌ అంటూ ఏకవచనంతో ముఖ్యమంత్రిని సంబోధించి ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్‌ వెన్నుపోటు నాడే పత్రికా విలువలను హారతి పళ్లెంలో పెట్టి చంద్రబాబుకు సమర్పించేసుకున్నారు. ఇప్పుడు రామోజీరావు మానవతా విలువల్ని కూడా అదే పద్ధతిలో వదిలేసుకున్నారు. కాస్తంత మానవత్వాన్ని అయినా ఈ 90 ఏళ్ల వయసులో మీరు నిలుపుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement