సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం నీటి ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పును అపహాస్యం చేసే రీతిలో వ్యవహరిస్తోందని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇష్టారీతిన బ్యారేజీలు కడుతూ దిగువ పరీవాహకానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ జల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది. తాజాగా కృష్ణా-భీమా నదుల సంగమానికి ఎగువన రాష్ట్ర సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపడుతోందని, దీని ద్వారా సమీపంలో నిర్మిస్తున్న భారీ విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటిని సరఫరా చేసే యోచనలో ఉందని నీటిపారుదల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.
ఈ మేరకు నీటిపారుదల శాఖలోని అంతరాష్ట్ర నదీ వివాదాల విభాగం అధికారులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ప్రభుత్వ పెద్దలకు మంగళవారం లేఖలు రాసినట్లు తెలిసింది. కర్ణాటక బ్యారేజీ కడుతున్న ప్రాంతంలో ఇటీవలే రహస్యంగా పర్యటించిన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు సమర్పించిన పలు డాక్యుమెంట్‌లు, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను లేఖతోపాటు పంపినట్లుగా సమాచారం. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేలా ఆ ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరపాలని లేనిపక్షంలో కేంద్ర జల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసి తగిన చర్యల కోసం విన్నవించాలని నీటిపారుదల శాఖ కోరింది.
కర్ణాటక జల దోపిడీని అడ్డుకుందాం
Published Wed, Aug 12 2015 3:22 AM | Last Updated on Tue, Oct 30 2018 5:51 PM
Advertisement