Water exploitation
-
జల దోపిడీకి దామాషానే విరుగుడు!
► లోటు వర్షపాతం ఉంటే దిగువ ప్రాజెక్టులకు నీటి గండం ► ఎగువ ప్రాజెక్టుల కింద మాత్రం విచ్చలవిడి వినియోగం ► వాటా పేరుతో 1,319 టీఎంసీలు వాడుకుంటున్న కర్ణాటక, మహారాష్ట్ర ► దీనికి దామాషా విధానమే సరైందంటున్న తెలంగాణ ► దీన్నే కేంద్రం, ట్రిబ్యునల్, కోర్టులకు చెప్పాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకుంటే దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో మట్టే మిగులుతుందన్న తెలంగాణ రాష్ట్ర ఆందోళనను మరింత బలంగా కేంద్రం, సుప్రీంకోర్టు, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తిగా ఎండిన వైనాన్ని వివరించి, దామాషా పద్ధతిన నీటి విడుదల అవసరాన్ని నొక్కి చెప్పాలనే నిశ్చయానికి వచ్చింది. కృష్ణాలో నీటి లోటు ఏర్పడిన సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఖరీఫ్ ఆరంభం కష్టమే అన్న వాదనకు, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా అద్దం పడుతున్నాయో వివరించి న్యాయం చేయాలని కోరేందుకు రాష్ట్రం సిద్ధమైంది. మిగులు జలాలతో మొదటికే ముప్పు.. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. నికర జలాలు వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి రెండునెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారనుంది. దీనికి తోడు మిగులు జలాల కేటాయింపు ఆధారంగా కర్ణాటక ఆల్మట్టిలో అదనంగా మరో 100 టీఎంసీల నిల్వ పెంచడానికి వీలుగా ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కాకముందే కర్ణాటక నీటి నిల్వకు దిగడం దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది. ఈ దృష్ట్యా.. ఖరీఫ్ ఆరంభంలోనే ఎగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలైనప్పుడే కేటాయింపుల దామాషా ప్రకారం నీటిని కిందకు విడిచే విధానం ఉండాలని తెలంగాణ కోరు తోంది. ఎగువన 100 టీఎంసీల లభ్యత ఉంటే దామాషా పద్ధతిన దిగువకు కనీసంగా 10 నుంచి 15 టీఎంసీల నీటి వాటా దక్కుతుంది. అలా కాకుండా ప్రస్తుత విధానం కొనసాగి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎగువనే వినియోగిస్తే దిగువకు ఏటా నీటి గండం తప్పని పరిస్థితి. ఇదే అంశాన్ని ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ, వచ్చే నెల 1వ తేదీన సుప్రీం కోర్టు ముందు జరిగే విచారణలోనూ, తర్వాత 13, 14, 15 తేదీల్లో జరిగే ట్రిబ్యునల్ విచారణలోనూ వివరించి న్యాయం చేసేలా కోరాలని నిర్ణయించింది. దిగువకు చుక్కనీరు లేదు.. కృష్ణా బేసిన్లో సకాలంలో వర్షాలు రాకపోతే దిగువకు కలిగే నష్టాలు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ఎగువ కర్ణాటకలో జూన్ నుంచే విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి ప్రవాహాలు మొదలై సుమారు 160 టీఎంసీలు, నారాయణపూర్‌లో 50 టీఎంసీల నీరు వచ్చింది. వీటికి తోడు మైనర్ ఇరిగేషన్‌కింద ఉన్న చెరువుల్లోకి 200 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్రలోనే దాదాపు 400 టీఎంసీల మేర నీరు రాగా ఇందులో 100 టీఎంసీలకు పైగా వినియోగం సైతం జరిగిపోయింది. వినియోగమంతా వారి నికర జలాల కేటాయింపుల మేరకే అయినా.. వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువకు చుక్క నీరు రాలేదు. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారాయి. దీంతో సాగర్ కింద 6.6 లక్షల ఎకరాలు, కృష్ణా జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల పరిధిలోని మరో 7లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
జల దోపిడీపై.. రంగంలోకి కృష్ణా బోర్డు
-
జల దోపిడీపై.. రంగంలోకి కృష్ణా బోర్డు
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమ నీటి వినియోగంపై ఫిర్యాదుతో కదలిక సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డులో చలనం వచ్చింది. నీటి వినియోగ లెక్కలకు సంబంధించి టెలిమెట్రీ అమల్లోకి వచ్చేదాకా సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్న విజ్ఞప్తిపై స్పందించింది. తెలంగాణ, ఏపీ, బోర్డు అధికారులతో కలిపి సంయుక్త కమిటీ వేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఆ కమిటీలోకి సభ్యుల పేర్లు సూచించాలని ఇరు రాష్ట్రాలకు బుధవారం లేఖలు రాసింది. దీంతోపాటు టెలీమెట్రీకి అవసరమైన నిధులు, పట్టిసీమ, పులిచింతల నీటి వినియోగ అంశాలు, సాగర్ ఎడమ కాల్వ కింద నీటి వినియోగం, మహానది జలాలపై ఏర్పాటైన జయశీలన్ కమిటీకి రాష్ట్ర ప్రాజెక్టుల వివరాల అందజేత తదితర అంశాలపైనా ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. హరీశ్‌రావు ఫిర్యాదుతో.. టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చేదాకా సంయుక్త కమిటీతో ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను పర్యవేక్షించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినా.. దాన్ని అమల్లోకి తేవడంలో కృష్ణా బోర్డు విఫలమైందని మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఏపీ ఇష్టమున్నట్లుగా నీటిని తోడేసుకుని, లెక్కల్లో తక్కువగా చూపుతోందని హరీశ్ అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో కృష్ణా బోర్డులో కదలిక వచ్చింది. సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో ఆయా రాష్ట్రాల తరఫున సభ్యులుగా నియమించే అధికారుల పేర్లను రెండు రోజుల్లో తమకు తెలపాలని తెలంగాణ, ఏపీలకు లేఖలు రాసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. ఇక ఇప్పటికే నిర్ణయించిన 49 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చేందుకు మొత్తంగా రూ.2.5 కోట్లు అవసరమని.. ఈ భారాన్ని ఇరు రాష్ట్రాలు సమానంగా భరించి, బోర్డు సూచించిన ఖాతాలో జమ చేయాలని సూచిస్తూ మరో లేఖ రాసింది. పట్టిసీమ లెక్కలు చెప్పండి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటున్న నీటి లెక్కలు చెప్పాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది. పట్టిసీమ, పులిచింతల, పాలేరు, మున్నేరుల కింద ఏపీ వినియోగిస్తున్న నీటికి లెక్కలు లేవని... ఇప్పటికై నా రోజువారీ లెక్కలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ అవసరాల కోసం 15 టీఎంసీలను కేటాయించాలంటూ తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలంటూ ఏపీకి మరో లేఖ రాసింది. మరోవైపు ఒడిశాలోని మహానదిపై నిర్మించిన హీరాకుడ్ రిజర్వాయర్ కింద విద్యుత్ పరిశ్రమలు, ఇరిగేషన్ అవసరాలకు నీటిని వినియోగిస్తున్న తీరుపై ఏర్పాటు చేసిన జయశీలన్ కమిటీ నివేదికను బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాలకు పంపింది. యాభై ఏళ్లుగా వివిధ అవసరాలకు రిజర్వాయర్ నీటిని వినియోగిస్తున్న తీరుపై ఆ కమిటీ చేసిన విశ్లేషణలను అందులో వివరించింది. ఆ తరహా పరిశీలన నిమిత్తం జయశీలన్ కమిటీకి జూరాల, శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీల వద్ద నీటి లభ్యత వివరాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. -
నీళ్ల దోపిడీతోనే వెనుకబాటు: వినోద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వెనుకబాటు తనానికి నీళ్ల దోపిడీనే ప్రధాన కారణమని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిననాడు ఏం చెప్పిందో.. అధికారంలోకి వచ్చాక అదే చేస్తోందన్నారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలసి సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ రాజకీయ ఉనికి ప్రమాదంలో పడడంతో కాంగ్రెస్ సభలు పెట్టి ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటోందన్నారు. అయితే ప్రజలు చైతన్యవంతులని.. వాస్తవాలు ఏంటో, అవాస్తవాలు ఏంటో వారికి తెలుసన్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పరిహారం కోసం కొట్లాడాలని హితవు పలికారు. రాజ్య కాంక్ష తప్పితే కాంగ్రెస్‌కు ప్రజా కాంక్ష లేదన్నారు. -
కర్ణాటక జల దోపిడీని అడ్డుకుందాం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఎగువనున్న కర్ణాటక రాష్ట్రం నీటి ఒప్పందాలు, ట్రిబ్యునల్ తీర్పును అపహాస్యం చేసే రీతిలో వ్యవహరిస్తోందని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఇష్టారీతిన బ్యారేజీలు కడుతూ దిగువ పరీవాహకానికి రావాల్సిన నీటిని అడ్డుకుంటూ జల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించింది. తాజాగా కృష్ణా-భీమా నదుల సంగమానికి ఎగువన రాష్ట్ర సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక మరో బ్యారేజీ నిర్మాణాన్ని చేపడుతోందని, దీని ద్వారా సమీపంలో నిర్మిస్తున్న భారీ విద్యుదుత్పత్తి కేంద్రాలకు నీటిని సరఫరా చేసే యోచనలో ఉందని నీటిపారుదల శాఖ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు నీటిపారుదల శాఖలోని అంతరాష్ట్ర నదీ వివాదాల విభాగం అధికారులు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఇతర ప్రభుత్వ పెద్దలకు మంగళవారం లేఖలు రాసినట్లు తెలిసింది. కర్ణాటక బ్యారేజీ కడుతున్న ప్రాంతంలో ఇటీవలే రహస్యంగా పర్యటించిన అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు సమర్పించిన పలు డాక్యుమెంట్లు, నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను లేఖతోపాటు పంపినట్లుగా సమాచారం. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేలా ఆ ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరపాలని లేనిపక్షంలో కేంద్ర జల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేసి తగిన చర్యల కోసం విన్నవించాలని నీటిపారుదల శాఖ కోరింది. -
దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం
- పొలాల బోర్ల నుంచి 24 గంటలూ తోడుతూ.. - పట్టణాలు, పరిశ్రమలకు అక్రమ రవాణా - నిత్యం 50 లక్షల లీటర్ల నీటి తరలింపు - నెలకు రూ.3 కోట్ల వ్యాపారం - ‘వాల్టా’కు తూట్లు నీటి దోపిడీ దందా జోరుగా సాగుతోంది. దోపిడీదారులు రైతుల పంట పొలాలను అక్రమంగా వాడుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి వారి పొలాల్లోని బోర్ల నుంచి నిత్యం లక్షల లీటర్ల నీటిని తోడుతున్నారు. పట్టణాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఈ బోర్లకు ఉచిత కరెంటును వినియోగించుకుంటున్నారు. 24 గంటలూ నీటిని ఇష్టారీతిగా తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వ్యాపారం ఇలాగే సాగితే ఇక్కడి బోర్లన్నీ ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. జిన్నారం : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 400 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువులు నీటి దందా నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫలితంగా పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సదరు వ్యాపారులు ఈ దందాను కొనసాగించేందుకు సమీప గ్రామాలను ఎంచుకున్నారు. రైతులకు డబ్బు ఆశ చూపి వారి పొలాల వద్ద ఉన్న బోర్ల నుంచి నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. మరో ఏడాదిపాటు ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ గ్రామాల నుంచి... పారిశ్రామిక శివారు గ్రామాలైన కిష్టాయిపల్లి, కొర్లకుంట, నల్తూర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం తదితర గ్రామాల నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. అన్నా రం శివారులోని పొలాల నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దులోని రంగారెడ్డి జిల్లా గ్రామాలైన ప్రగతినగర్, దుండిగల్, గాగిల్లాపూర్, గండిమైసమ్మ, కూకట్పల్లి వరకు ఉండే అపార్ట్మెంట్లకు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తున్నారంటే వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం సుమారు 400 వరకు పెద్ద ట్యాంకర్లు, 500 వరకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పెద్ద ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, చిన్న ట్యాంకర్ నీటిని రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తుంటారని సమాచారం. అంటే మండల వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల మేర నీటి వ్యాపారం సాగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి ఇతర ప్రాంతాలకు, పరిశ్రమలకు, అపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు. ఉచిత కరెంటు దుర్వినియోగం.. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కొందరు వ్యక్తులు పంట పొలాల్లోని బోర్ల నుంచి నీటిని తోడేందుకు ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగమవుతోంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వాడుతూ 24 గంటలూ నీటిని తోడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద గుంతలను తీసి వీటిలో ప్లాస్టిక్ కవర్లను వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం కొనసాగుతోన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.