దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం | Water robbery is became a major business | Sakshi
Sakshi News home page

దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం

Published Sat, Apr 25 2015 1:34 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

Water robbery is became a major business

- పొలాల బోర్ల నుంచి 24 గంటలూ తోడుతూ..
- పట్టణాలు, పరిశ్రమలకు అక్రమ రవాణా
- నిత్యం 50 లక్షల లీటర్ల నీటి తరలింపు
- నెలకు రూ.3 కోట్ల వ్యాపారం
- ‘వాల్టా’కు తూట్లు

నీటి దోపిడీ దందా జోరుగా సాగుతోంది. దోపిడీదారులు రైతుల పంట పొలాలను అక్రమంగా వాడుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి వారి పొలాల్లోని బోర్ల నుంచి నిత్యం లక్షల లీటర్ల నీటిని తోడుతున్నారు. పట్టణాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఈ బోర్లకు ఉచిత కరెంటును వినియోగించుకుంటున్నారు. 24 గంటలూ నీటిని ఇష్టారీతిగా తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వ్యాపారం ఇలాగే సాగితే ఇక్కడి బోర్లన్నీ ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది.        

జిన్నారం : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 400 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువులు నీటి దందా నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

ఫలితంగా పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సదరు వ్యాపారులు ఈ దందాను కొనసాగించేందుకు సమీప గ్రామాలను ఎంచుకున్నారు. రైతులకు డబ్బు ఆశ చూపి వారి పొలాల వద్ద ఉన్న బోర్ల నుంచి నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. మరో ఏడాదిపాటు ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ గ్రామాల నుంచి...
పారిశ్రామిక శివారు గ్రామాలైన కిష్టాయిపల్లి, కొర్లకుంట, నల్తూర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం తదితర గ్రామాల నుంచి  నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. అన్నా రం శివారులోని పొలాల నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దులోని రంగారెడ్డి జిల్లా గ్రామాలైన ప్రగతినగర్, దుండిగల్, గాగిల్లాపూర్, గండిమైసమ్మ, కూకట్‌పల్లి వరకు ఉండే అపార్ట్‌మెంట్లకు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తున్నారంటే వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం సుమారు 400 వరకు పెద్ద ట్యాంకర్లు, 500 వరకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పెద్ద ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, చిన్న ట్యాంకర్ నీటిని రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తుంటారని సమాచారం. అంటే మండల వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల మేర నీటి వ్యాపారం సాగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి ఇతర ప్రాంతాలకు, పరిశ్రమలకు, అపార్ట్‌మెంట్లకు తరలిస్తున్నారు.

ఉచిత కరెంటు దుర్వినియోగం..
ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కొందరు వ్యక్తులు పంట పొలాల్లోని బోర్ల నుంచి నీటిని తోడేందుకు ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగమవుతోంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వాడుతూ 24 గంటలూ నీటిని తోడుతూనే ఉన్నారు.

పెద్ద పెద్ద గుంతలను తీసి వీటిలో ప్లాస్టిక్ కవర్లను వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం కొనసాగుతోన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి  నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement