Crop farmers
-
పత్తి రైతు కుటుంబాన్ని విస్మరించిన ప్రభుత్వం
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు దుర్భర జీవితం గడుపుతున్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని గోనిమేకులపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు శ్రీనివాసులు(40) అప్పుల బాధతో దాదాపు నాలుగేళ్ల క్రితం(2014 నవంబర్ 5న) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి పంటకు పిచికారీ చేయడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసులుకు భార్య సరోజమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనివాసులు తనకున్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసేవారు. పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో అప్పులపాలయ్యారు. దీనితోపాటు కూతురు పెళ్లి చేయడానికి కొంత అప్పు చేశారు. తన భర్త తమకున్న ఎకరం పొలంలో పంట సాగుచేయడానికి, కూతురి పెళ్లి చేయడానికి రూ. 2 లక్షల దాకా అప్పు చేసినట్లు శ్రీనివాసులు భార్య సరోజమ్మ తెలిపారు. పంట పండకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలని రోజూ అంటూ బాధపడుతూ ఉండేవారన్నారు. అప్పుల దిగులుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందలేదు. మృతుడి భార్య ప్రతిరోజూ కూలీకి వెళ్తూ తన పిల్లలను పోషించుకుంటూ చదివిస్తున్నారు. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు. – కె.ఎల్. నాగరాజు, సాక్షి, రొద్దం, అనంతపురం -
చిరుధాన్యాల సైకిల్ మిల్లు!
ఆరోగ్య సిరులనిచ్చే వివిధ రకాల చిరుధాన్యాలను వర్షాధారంగా సాగు చేసుకునే మెట్టప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం పెను సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసే చిన్న రైతులు వాటిని మిల్లుల్లో మరపట్టించడానికి దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొండ ప్రాంత గిరిజన రైతులకు మరీ ఇబ్బంది. లేదంటే పాత పద్ధతుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. రోట్లో దంచుకొని తినాల్సి వస్తోంది. నిజానికి పండించిన చిరుధాన్యాలను సులభంగా పొట్టు తీసి బియ్యంగా మార్చుకోలేకపోవడం వల్ల చాలా మంది రైతులు వీటిని సాగు చేయడం మానేశారు. అయితే, ఇటీవల కాలంలో పట్టణ, నగరప్రాంత వాసుల్లో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెల (సిరిధాన్యాల) వాడకం పట్ల అమితాసక్తి రేకెత్తడంతో ప్రస్తుతం చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది రైతులు, రైతు బృందాలు సిరిధాన్యాల సాగుకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఖాదర్‌వలీ సాధారణ మిక్సీని వేగాన్ని తగ్గించేందుకు కాయిల్ మార్చడం, బ్లేడు పదునును తగ్గించడం ద్వారా సిరిధాన్యాలను ఇంటిపట్టునే సులభంగా బియ్యం తయారు చేసుకునే పద్ధతిని సూచిస్తున్నారు. ఇదే కోవలో.. మైసూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ(సి.ఎఫ్.టి.ఆర్.ఐ.) సైకిల్ మాదిరిగా తొక్కుతూ చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేసే చిన్న యంత్ర నమూనాను రూపొందించింది. దీన్ని ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ అని పిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు విద్యుత్తు అవసరం లేకుండా గ్రామస్థాయిలో ఉపయోగించుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ డిజైన్‌ను సి.ఎఫ్.టి.ఆర్.ఐ. వెబ్సైట్ ఫ్రీ టెక్నాలజీస్ విభాగం నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని, ఆయా కొలతల మేరకు ఎవరికి వారు ఈ యంత్రాన్ని తమ ఊరిలోనే తయారు చేయించుకునేందుకు అన్ని వివరాలను పొందుపరిచారు. సైకిల్ మాదిరిగా తొక్కుతుంటే.. చిరుధాన్యాల ధాన్యం పైన ఉండే పొట్టు ఊడిపోయి వండుకు తినడానికి అనువైన బియ్యం వెలికి వస్తాయి. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. మైసూరులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ బి. వి. సత్యేంద్రరావు ఈ యంత్రాన్ని రూపొందించారు. ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ ఉపయోగాల గురించి ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి డా. సత్యేంద్రరావు ప్రత్యేకంగా అందించిన వివరాలు.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసి, వండుకుతినే చిన్న, సన్నకారు రైతులు తమ ఇంట్లోనే చిరుధాన్యాల బియ్యం అవసరమైనప్పుడు తయారు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. గ్రామంలో రైతులంతా కలిసి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మట్టిపెళ్లలు, రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రం చేసి ఎండబెట్టిన ధాన్యాన్ని ఉపయోగించాలి. ధాన్యం సరిగ్గా ఎండితేనే తక్కువ మెరికలు వస్తాయి. విద్యుత్తు అవసరం లేదు. సైకిల్ తొక్కినట్టు తొక్కితే చాలు. గంటకు 10–15 కిలోల చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యం రకాన్ని బట్టి, ఎంత వేగంగా తొక్కుతున్నామన్న దాన్ని బట్టి గంటకు ఎన్ని కేజీలు మర ఆడవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. ధాన్యం నెమ్మదిగా యంత్రంలోకి వెళ్లేలా చూసుకోవాలి. వేగంగా ధాన్యం లోపలికి పడుతూ ఉంటే యంత్రాన్ని తొక్కే మనిషి మరింత బలంగా తొక్కాల్సి ఉంటుంది. యంత్రాన్ని స్థిరమైన వేగంతో తొక్కితేనే పని సజావుగా సాగుతుంది. యంత్రాన్ని గంట తొక్కితే 13 కిలోల ఊదలు, 11 కిలోలకు పైగా కొర్రలు, 15 కిలోల అరికెలు, 11 కిలోల ఒరిగెలను మర పట్టవచ్చు. పోషకాలు కోల్పోకుండా నాణ్యంగా చిరుధాన్యాల బియ్యాన్ని పొందవచ్చని డా. సత్యేంద్ర వివరించారు. వేగాన్ని బట్టి యంత్రంలోని బ్లోయర్ తిరుగుతుంది. పై నుంచి జారే ధాన్యాన్ని బ్లోయర్ వేగంగా రబ్బర్ రింగ్‌కు తగిలేలా విసురుతుంది. ఆ దెబ్బకు ధాన్యపు గింజ పైపొర ఊడిపోతుంది. బియ్యం, పొట్టు వేర్వేరుగా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ఈ యంత్రం నమూనా(ప్రొటోటైప్)ను తయారు చేసి మైసూరులో సందర్శకులకు అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ సి.ఎఫ్.టి.ఆర్.ఐ.లో కూడా నమూనా యంత్రాన్ని ప్రదర్శనకు ఉంచితే రైతులకు మేలు కలుగుతుంది. దీని విడిభాగాల కొలతలు, తయారు చేసే విధానాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. దీని తయారీకి రూ. 17,500 ఖర్చు అవుతుందని, రూ.25 వేలకు విక్రయించవచ్చని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. అంచనా. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు పెద్ద ఎత్తున చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచుకుంటే విద్యుత్తు మోటార్లతో నడిచే యంత్రాలు మార్కెట్లో అనేక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని డా. సత్యేంద్ర తెలిపారు. రాళ్లు రప్పలు, మట్టిగడ్డలు తదితరాలను చిరుధాన్యాల నుంచి వేరు చేయడానికి చిన్న, పెద్దస్థాయి యంత్రాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయని డా. సత్యేంద్రరావు తెలిపారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సత్యేంద్రరావును 0821–2514534, 099868 46730 ద్వారా సంప్రదించవచ్చు. Email: ttbd@cftri.res.in -
విచారిస్తాం..పరిహారమిస్తాం
రెండునెలల కిందట ధ్వంసమైన అరటి తోట తాజాగా సీఆర్డీఏ లేఖ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల పంటను ధ్వంసం చేసిన రెండు నెలల తర్వాత విచారణ జరుపుతామనడం విస్మయం కలిగిస్తోంది. రాజధాని అమరావతిలో భూ సమీకరణకు సహకరించని లింగాయపాలెం వాసులు గుండపు రాజేష్, ఆయన సోదరుడు గుండపు చంద్రశేఖర్‌కు చెందిన 7.3 ఎకరాల అరటి తోటను 2015 డిసెంబర్ 8న సీఆర్డీఏ యూనిట్-16 డిప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో తొలగించిన విషయం తెలిసిందే. భూ సమీకరణకు అంగీకరించబోమని, పొలాన్ని సాగు చేసుకుంటామని రాజేష్ సోదరులు తేల్చిచెప్పడం వల్లే ప్రభుత్వం వారి అరటి తోటను నాశనం చేసిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పంటను నాశనం చేయడాన్ని రాజేష్ సోదరులు ప్రశ్నిస్తే.. నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో పరిహారం అందుతుందని రాజేష్ సోదరులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పంట ధ్వంసమైన పొలాన్ని అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడానికి విచారణ చేపడుతుందని పేర్కొంటూ బాధితులకు సీఆర్డీఏ తాజాగా లేఖ రాసింది. అధికారుల బృందం ఫిబ్రవరి 9న పొలాన్ని సందర్శించనుందని పేర్కొంది. రాజేష్ సోదరుల భూమిలో తొలగించిన అరటి చెట్లు ఇప్పుడు మట్టిలో కలిసిపోయాయి. అక్కడ ఆనవాళ్లు కూడా లేవు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
దోపిడీ దందా! జోరుగా నీటి అక్రమ వ్యాపారం
- పొలాల బోర్ల నుంచి 24 గంటలూ తోడుతూ.. - పట్టణాలు, పరిశ్రమలకు అక్రమ రవాణా - నిత్యం 50 లక్షల లీటర్ల నీటి తరలింపు - నెలకు రూ.3 కోట్ల వ్యాపారం - ‘వాల్టా’కు తూట్లు నీటి దోపిడీ దందా జోరుగా సాగుతోంది. దోపిడీదారులు రైతుల పంట పొలాలను అక్రమంగా వాడుకుంటున్నారు. డబ్బు ఆశ చూపి వారి పొలాల్లోని బోర్ల నుంచి నిత్యం లక్షల లీటర్ల నీటిని తోడుతున్నారు. పట్టణాలు, పరిశ్రమలకు రవాణా చేస్తున్నారు. ఈ బోర్లకు ఉచిత కరెంటును వినియోగించుకుంటున్నారు. 24 గంటలూ నీటిని ఇష్టారీతిగా తోడడం వల్ల భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. ‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్నారు. అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోన్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ వ్యాపారం ఇలాగే సాగితే ఇక్కడి బోర్లన్నీ ఎండిపోయి ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. జిన్నారం : జిన్నారం మండలంలోని గడ్డపోతారం, బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సుమారు 400 వరకు వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. వీటికి నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధువులు నీటి దందా నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఫలితంగా పారిశ్రామిక వాడల్లోని గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. సదరు వ్యాపారులు ఈ దందాను కొనసాగించేందుకు సమీప గ్రామాలను ఎంచుకున్నారు. రైతులకు డబ్బు ఆశ చూపి వారి పొలాల వద్ద ఉన్న బోర్ల నుంచి నీటిని పరిశ్రమలకు తరలిస్తున్నారు. మరో ఏడాదిపాటు ఇదే విధంగా కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి రైతులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ గ్రామాల నుంచి... పారిశ్రామిక శివారు గ్రామాలైన కిష్టాయిపల్లి, కొర్లకుంట, నల్తూర్, బొంతపల్లి, దోమడుగు, అన్నారం తదితర గ్రామాల నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నారు. అన్నా రం శివారులోని పొలాల నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది నిత్యం వందలాది ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దులోని రంగారెడ్డి జిల్లా గ్రామాలైన ప్రగతినగర్, దుండిగల్, గాగిల్లాపూర్, గండిమైసమ్మ, కూకట్పల్లి వరకు ఉండే అపార్ట్మెంట్లకు కూడా ఇక్కడి నుంచే నీటిని తరలిస్తున్నారంటే వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. జిన్నారం మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం సుమారు 400 వరకు పెద్ద ట్యాంకర్లు, 500 వరకు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పెద్ద ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, చిన్న ట్యాంకర్ నీటిని రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తుంటారని సమాచారం. అంటే మండల వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.10 లక్షలు, నెలకు సుమారు రూ.3 కోట్ల మేర నీటి వ్యాపారం సాగుతోంది. దీంతో మండల వ్యాప్తంగా రోజుకు సుమారు 50 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడి ఇతర ప్రాంతాలకు, పరిశ్రమలకు, అపార్ట్మెంట్లకు తరలిస్తున్నారు. ఉచిత కరెంటు దుర్వినియోగం.. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ సదుపాయాన్ని కల్పిస్తోంది. కొందరు వ్యక్తులు పంట పొలాల్లోని బోర్ల నుంచి నీటిని తోడేందుకు ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. ఫలితంగా ఈ పథకం దుర్వినియోగమవుతోంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఎక్కువ సామర్థ్యం గల జనరేటర్లను వాడుతూ 24 గంటలూ నీటిని తోడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద గుంతలను తీసి వీటిలో ప్లాస్టిక్ కవర్లను వేసి నీటిని నిల్వ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నీటి వ్యాపారం కొనసాగుతోన్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి నీటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాలని లేనిపక్షంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.