అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులు దుర్భర జీవితం గడుపుతున్నారు. కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని గోనిమేకులపల్లి గ్రామానికి చెందిన పత్తి రైతు శ్రీనివాసులు(40) అప్పుల బాధతో దాదాపు నాలుగేళ్ల క్రితం(2014 నవంబర్ 5న) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పత్తి పంటకు పిచికారీ చేయడానికి తీసుకువచ్చిన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనివాసులుకు భార్య సరోజమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శ్రీనివాసులు తనకున్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసేవారు. పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో అప్పులపాలయ్యారు. దీనితోపాటు కూతురు పెళ్లి చేయడానికి కొంత అప్పు చేశారు. తన భర్త తమకున్న ఎకరం పొలంలో పంట సాగుచేయడానికి, కూతురి పెళ్లి చేయడానికి రూ. 2 లక్షల దాకా అప్పు చేసినట్లు శ్రీనివాసులు భార్య సరోజమ్మ తెలిపారు. పంట పండకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలని రోజూ అంటూ బాధపడుతూ ఉండేవారన్నారు. అప్పుల దిగులుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందలేదు. మృతుడి భార్య ప్రతిరోజూ కూలీకి వెళ్తూ తన పిల్లలను పోషించుకుంటూ చదివిస్తున్నారు. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
– కె.ఎల్. నాగరాజు,
సాక్షి, రొద్దం, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment