సుబ్రమణ్యం (ఫైల్), కుమార్తెతో వరలక్ష్మి
వ్యవసాయ జూదంలో ఓడి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న యువ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం విస్మరించడంతో ఆ కుటుంబం మూడేళ్లుగా దుర్భర జీవితం గడుపుతోంది. ప్రభుత్వ సాయం అందక, పూట గడవని స్థితిలో ఆ కుటుంబం సమస్యలతో సహజీవనం చేస్తోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామానికి చెందిన వరకుటి సుబ్రమణ్యం అప్పుల బాధ తాళలేక 2015 ఫిబ్రవరి 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరాకు రూ. 10 వేలు కౌలు చెల్లించి ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని జొన్న పంట సాగు చేశాడు. రసాయనిక ఎరువులు, విత్తనాలు, కౌలు, తదితర పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 2 లక్షలు అప్పు చేశాడు.
వర్షాభావంతోపాటు వాతావరణం అనుకూలించక పంట ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. పైరు బొందుపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్రమణ్యంకు రెండేళ్ల కుమార్తె సుస్మితతోపాటు భార్య వరలక్ష్మి ఉన్నారు. భర్త చనిపోయే నాటికి గర్భవతిగా ఉన్న ఆమె ఆరు నెలలకు ఆమె మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అభం, శుభం తెలియని వయస్సులో ముక్కుపచ్చలారని చిన్నారులకు తండ్రి దూరం కాగా భర్త మరణంతో కుటుంబ పోషణ ఆ ఇల్లాలిపైనే పడింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో ప్రభుత్వం ఆదుకుంటుందని భావించింది.
అధికారులు రెండు, మూడుసార్లు ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థికసాయం చేయకపోవడంతో మూడేళ్లుగా ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. తలదాచుకునేందుకు ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలి పనులకు వెళుతూ వరలక్ష్మి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. చిన్న కుమార్తె రేవతి పుట్టిన ఏడాదికే∙అనారోగ్యం బారిన పడి చనిపోయింది. పెద్ద కుమార్తెను, వృద్ధుడైన మామ వెంకటసుబ్బయ్యను కాయకష్టంతో పోషించుకుంటూ రేవతి కాలం వెళ్లదీస్తోంది. ప్రభుత్వం కరుణించి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.
- కె. మౌలాలి, సాక్షి, కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment