మౌలాలి భార్య, కుటుంబ సభ్యులు (మౌలాలి)
పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్న రైతు మౌలాలి కుటుంబాన్ని ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయి తీరని దుఃఖంలో మౌలాలి కుటుంబీకులకు ఆసరా లభించడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం పరిధిలోని రాతన గ్రామానికి చెందిన మౌలాలి(50) అనే రైతు అప్పుల బాధతో 2014 నవంబర్ 20వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందాడు. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం తెలియని మౌలాలి 5 ఎకారాల్లో వేరుశనగ, పత్తి పంటలను సాగు చేశాడు. ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ ఏడాది వర్షాభావం, వచ్చిన దిగుబడులకు మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో ఆశలు అడియాసలయ్యాయి.
పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. పాత అప్పులు రూ. 3.50 లక్షలకు కొత్త అప్పులు తోడై వడ్డీలతో కలుపుకొని రూ.5 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నలుగురికి ముఖం చూపలేక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లాలూబీ, పెద్ద కుమారుడు చాంద్ బాషా, రెండో కుమారుడు మున్నా ఉన్నారు. పెద్ద కుమారుడు చాంద్‌బాషా జేసీబీ డ్రైవర్‌గా, చిన్న కుమారుడు మున్నా సైకిల్ షాపులో కూలి పనులు చేస్తున్నారు. లాలూబీ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో వాళ్లందరూ కూలీ నాలీ చేస్తున్నా కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. పైగా అప్పులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయతలచి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని మౌలాలి భార్య లాలూబీ విజ్ఞప్తి చేశారు.
– పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment