చిరుధాన్యాల సైకిల్‌ మిల్లు! | small grains cyclic mill | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల సైకిల్‌ మిల్లు!

Published Tue, Jun 26 2018 12:19 AM | Last Updated on Tue, Jun 26 2018 12:19 AM

small grains cyclic mill - Sakshi

చిరుధాన్యాల శుద్ధికి సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. రూపొందించిన యంత్రం

ఆరోగ్య సిరులనిచ్చే వివిధ రకాల చిరుధాన్యాలను వర్షాధారంగా సాగు చేసుకునే మెట్టప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం పెను సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసే చిన్న రైతులు వాటిని మిల్లుల్లో మరపట్టించడానికి దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొండ ప్రాంత గిరిజన రైతులకు మరీ ఇబ్బంది. లేదంటే పాత పద్ధతుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. రోట్లో దంచుకొని తినాల్సి వస్తోంది.

నిజానికి పండించిన చిరుధాన్యాలను సులభంగా పొట్టు తీసి బియ్యంగా మార్చుకోలేకపోవడం వల్ల చాలా మంది రైతులు వీటిని సాగు చేయడం మానేశారు. అయితే, ఇటీవల కాలంలో పట్టణ, నగరప్రాంత వాసుల్లో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెల (సిరిధాన్యాల) వాడకం పట్ల అమితాసక్తి రేకెత్తడంతో ప్రస్తుతం చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది రైతులు, రైతు బృందాలు సిరిధాన్యాల సాగుకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్‌ ఖాదర్‌వలీ సాధారణ మిక్సీని వేగాన్ని తగ్గించేందుకు కాయిల్‌ మార్చడం,  బ్లేడు పదునును తగ్గించడం ద్వారా సిరిధాన్యాలను ఇంటిపట్టునే సులభంగా బియ్యం తయారు చేసుకునే పద్ధతిని సూచిస్తున్నారు.


ఇదే కోవలో.. మైసూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ(సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ.) సైకిల్‌ మాదిరిగా తొక్కుతూ చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేసే చిన్న యంత్ర నమూనాను రూపొందించింది. దీన్ని ‘పెడల్‌ ఆపరేటెడ్‌ మిల్లెట్‌ డీహల్లర్‌’ అని పిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు విద్యుత్తు అవసరం లేకుండా గ్రామస్థాయిలో ఉపయోగించుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ డిజైన్‌ను సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. వెబ్‌సైట్‌ ఫ్రీ టెక్నాలజీస్‌ విభాగం నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆయా కొలతల మేరకు ఎవరికి వారు ఈ యంత్రాన్ని తమ ఊరిలోనే తయారు చేయించుకునేందుకు అన్ని వివరాలను పొందుపరిచారు.

సైకిల్‌ మాదిరిగా తొక్కుతుంటే.. చిరుధాన్యాల ధాన్యం పైన ఉండే పొట్టు ఊడిపోయి వండుకు తినడానికి అనువైన బియ్యం వెలికి వస్తాయి. సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. మైసూరులో టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ బి. వి. సత్యేంద్రరావు ఈ యంత్రాన్ని రూపొందించారు. ‘పెడల్‌ ఆపరేటెడ్‌ మిల్లెట్‌ డీహల్లర్‌’ ఉపయోగాల గురించి ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి డా. సత్యేంద్రరావు ప్రత్యేకంగా అందించిన వివరాలు..

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసి, వండుకుతినే చిన్న, సన్నకారు రైతులు తమ ఇంట్లోనే చిరుధాన్యాల బియ్యం అవసరమైనప్పుడు తయారు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. గ్రామంలో రైతులంతా కలిసి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మట్టిపెళ్లలు, రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రం చేసి ఎండబెట్టిన ధాన్యాన్ని ఉపయోగించాలి. ధాన్యం సరిగ్గా ఎండితేనే తక్కువ మెరికలు వస్తాయి. విద్యుత్తు అవసరం లేదు. సైకిల్‌ తొక్కినట్టు తొక్కితే చాలు. గంటకు 10–15 కిలోల చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యం రకాన్ని బట్టి, ఎంత వేగంగా తొక్కుతున్నామన్న దాన్ని బట్టి గంటకు ఎన్ని కేజీలు మర ఆడవచ్చన్నది ఆధారపడి ఉంటుంది.

ధాన్యం నెమ్మదిగా యంత్రంలోకి వెళ్లేలా చూసుకోవాలి. వేగంగా ధాన్యం లోపలికి పడుతూ ఉంటే యంత్రాన్ని తొక్కే మనిషి మరింత బలంగా తొక్కాల్సి ఉంటుంది. యంత్రాన్ని స్థిరమైన వేగంతో తొక్కితేనే పని సజావుగా సాగుతుంది. యంత్రాన్ని గంట తొక్కితే 13 కిలోల ఊదలు, 11 కిలోలకు పైగా కొర్రలు, 15 కిలోల అరికెలు, 11 కిలోల ఒరిగెలను మర పట్టవచ్చు. పోషకాలు కోల్పోకుండా నాణ్యంగా చిరుధాన్యాల బియ్యాన్ని పొందవచ్చని డా. సత్యేంద్ర వివరించారు. వేగాన్ని బట్టి యంత్రంలోని బ్లోయర్‌ తిరుగుతుంది. పై నుంచి జారే ధాన్యాన్ని బ్లోయర్‌ వేగంగా రబ్బర్‌ రింగ్‌కు తగిలేలా విసురుతుంది. ఆ దెబ్బకు ధాన్యపు గింజ పైపొర ఊడిపోతుంది. బియ్యం, పొట్టు వేర్వేరుగా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు.  

సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. ఈ యంత్రం నమూనా(ప్రొటోటైప్‌)ను తయారు చేసి మైసూరులో సందర్శకులకు అందుబాటులో ఉంచింది. హైదరాబాద్‌ సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ.లో కూడా నమూనా యంత్రాన్ని ప్రదర్శనకు ఉంచితే రైతులకు మేలు కలుగుతుంది. దీని విడిభాగాల కొలతలు, తయారు చేసే విధానాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. దీని తయారీకి రూ. 17,500 ఖర్చు అవుతుందని, రూ.25 వేలకు విక్రయించవచ్చని సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. అంచనా. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు పెద్ద ఎత్తున చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచుకుంటే విద్యుత్తు మోటార్లతో నడిచే యంత్రాలు మార్కెట్‌లో అనేక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని డా. సత్యేంద్ర తెలిపారు. రాళ్లు రప్పలు, మట్టిగడ్డలు తదితరాలను చిరుధాన్యాల నుంచి వేరు చేయడానికి చిన్న, పెద్దస్థాయి యంత్రాలు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్నాయని డా. సత్యేంద్రరావు తెలిపారు. సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ సత్యేంద్రరావును 0821–2514534, 099868 46730 ద్వారా సంప్రదించవచ్చు. Email: ttbd@cftri.res.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement