తియ్యని ఆహారం ఎవరికైనా ఆనందదాయకమే. అయితే, తీపి పదార్ధాలుగా విరివిగా వాడుకలో ఉన్న చెరకు చక్కెర, చెరకు బెల్లంలను షుగర్ వ్యాధిగ్రస్తులు తినలేరు. వీటిలో అధిక మోతాదులో గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం.
అయితే, ఫ్రక్టోజు ఎక్కువగా ఉండే తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్ల నీరాతో తయారు చేసే సంప్రదాయక బెల్లం అయితే ఎవరికైనా ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్లు అత్యంత ఆరోగ్యదాయకమైన, ఆల్కహాల్ రహిత పానీయాన్ని అందిస్తాయి. ఇదే నీరా. నీరాను తాజాగా సేవించటం ఆరోగ్యదాయకం (పులిస్తే కల్లుగా మారుతుంది). తాటి, ఈత, కొబ్బరి, జీలుగ నీరాతో తయారు చేసే బెల్లం చాలా ఆరోగ్యదాయకమైన తీపి పదార్థమని పూర్వకాలం నుంచే మనకు తెలుసు. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతున్న నేపథ్యంలో తాటి/ఈత నీరా, బెల్లం తదితర ఉత్ప త్తుల తయారీ, వాడకం పుంజుకుంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈత, తాటి(పామ్) ఉత్పత్తులకు ఆదరణ ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి అనంతపురంలో గీత కార్మికుల సహకార సంఘం శ్రీకారం షుగర్ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా వాడొచ్చంటున్నారు నిపుణులు..
సహకార సంఘం ఆధ్వర్యంలో..
అనంతపురం జిల్లాలో ప్రకృతిసిద్ధమైన ఈత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, రైతుల భూముల్లో లక్షలాది ఈత చెట్లున్నాయి. వీటి నుంచి కల్లు తీసి విక్రయించటం రివాజు. అయితే, ఈత కల్లుకు బదులు నీరా తీసి విక్రయించడంతోపాటు.. నీరాతో బెల్లం తయారు చేసి ప్రజలకు అందించడం మేలని అనంతపురానికి చెందిన సొసైటీ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ రూరల్ యాక్షన్ (సెర) వ్యవస్థాపకులు ఎస్. కుళ్లాయస్వామి తలపెట్టారు.
సిరిధాన్యాలతోపాటు తాటి/ఈత/జీలుగ నీరా, బెల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్న స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి స్ఫూర్తితో కుళ్లాయస్వామి ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 500 మంది ఈడిగ గీత కార్మికులతో ‘సెర నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ’ని నెలకొల్పారు. పరిశుద్ధమైన ఆధునిక పద్ధతిలో నీరా బాట్లింగ్, స్టెయిన్‌లెస్ స్టీలు పరికరాలతో ఈత బెల్లం తయారీ యూనిట్‌ను నాలుగు నెలల క్రితం నెలకొల్పారు.
రోజుకు 500 లీటర్ల నీరా సేకరణ
500 ఈత చెట్లను ఎంపిక చేసుకొని సభ్యుల ద్వారా రోజుకు దాదాపు 500 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. 250 చెట్ల నుంచి ఒక రోజు, మిగతా 250 చెట్ల నుంచి తర్వాత రోజు నీరా సేకరిస్తున్నారు. అక్టోబర్ నుంచి నాణ్యమైన నీరా వస్తుంది. వంద లీటర్ల నీరాను వడకట్టి బాటిల్స్‌లో నింపి అదే రోజు విక్రయిస్తున్నారు. మిగతా 400 లీటర్ల నీరాతో 40 కిలోల బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు.
చామలపల్లి నుంచి తాటి, ఈత ఉత్పత్తులు
తెలంగాణ పామ్ నీరా అండ్ పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చందూరు మండలంలోని చామలపల్లి కేంద్రంగా తాటి, ఈత నీరా, బెల్లం తదితర ఉత్పత్తుల తయారీ గతంలోనే ప్రారంభమైంది. చామలపల్లి పరిసర గ్రామాల నుంచి తాటి నీరాను, వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతం నుంచి ఈత నీరా సేకరిస్తున్నారు. నీరా, బెల్లంతో పాటు తాటి సిరప్, పామ్ షుగర్, పామ్ బూస్ట్ తదితర ఆరోగ్యదాయకమైన అనేక వినూత్న ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు వింజమూరు సత్యం(98498 28999), వేణు తెలిపారు. నవంబర్ నుంచి ఈత, డిసెంబర్ నుంచి తాటి నీరా సేకరణ తిరిగి ప్రారంభిస్తామని వారు తెలిపారు.
ఇందుకోసం ఎక్సయిజ్ శాఖ తోడ్పాటుతో అనంతపురంలోని పోలిస్ కాంప్లెక్స్‌లో నీరా స్టాల్ నెలకొల్పనున్నట్లు కుళ్లాయస్వామి తెలిపారు. ఈత నీరాలో ఆల్కహాల్ లేదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. లాబ్ రిపోర్టులో తేలింది. చిత్తూరులోని ప్రభుత్వ లాబ్‌లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత నీరాను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఎక్సైజ్ అనుమతులు వస్తాయన్నారాయన.
– పంతంగి రాంబాబు
ఈత ఉత్పత్తులను అందరూ వాడొచ్చు
ఈత చెట్టుకు ఏడాదికి రూ.150–200 వరకు రైతుకు చెల్లించి నిపుణులైన గీత కార్మికుల పర్యవేక్షణలో నీరా సేకరిస్తున్నాం. కిలో ఈత బెల్లం తయారీకి 10 లీటర్ల నీరా అవసరం. కిలో బెల్లం ఉత్పత్తికి రూ. 650 వరకు ఖర్చవుతున్నది. రూ. వెయ్యి రిటైల్ ధరకు విక్రయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజలందరూ, షుగర్ ఉన్న వారు సైతం వాడదగ్గ ఆరోగ్యదాయక ఉత్పత్తులు కావటంతో స్థానికంగానే కాకుండా అనేక నగరాల్లోనూ ఈత ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాం.
– ఎస్. కుళ్లాయస్వామి (92464 77103),
సెరా నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అనంతపురం
ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు
ఈత, తాటి, కొబ్బరి, జీలుగ.. ఈ చెట్ల నుంచి తీసిన నీరా, దానితో తయారు చేసే బెల్లం ఆరోగ్యకరమైన దేవుడిచ్చిన తీపి పదార్థాలు. ఇవి మన సంస్కృతిలో ఉన్న ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ హితమైన తీపి పదార్థాలు. వీటిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే లవణాంశాలు మనిషికి రోగనిరోధక శక్తిని అందించి మేలు చేస్తాయి. ఈత నీరా, బెల్లంను హెబిఎ1సి 7–8 లోపు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా రోజుకు 10–15 గ్రా. మించకుండా తీసుకోవచ్చు లేదా వారానికోసారి ఈత బెల్లంతో చేసిన తీపి పదార్ధాన్ని 50 గ్రా. వరకు తినొచ్చు. తీపి పదార్థాలను ఎవరైనా సరే రోజూ తినకూడదు. చెరకు ఎస్టేట్ల వల్ల ఏకపంటల (మోనోకల్చర్) సాగు ప్రబలి, 18% జీవవైవిధ్యం నాశనమైంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే చెరకు బెల్లం, చక్కెర వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈత, తాటి, కొబ్బరి, జీలుగ నీరా, బెల్లంలో ఫ్రక్టోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజు ఉన్న తీపి పదార్థం ఏ హానీ చేయదు.
– డా. ఖాదర్‌వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త
చదవండి: కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు!
Comments
Please login to add a commentAdd a comment