palm trees
-
విశాఖ ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్ల పంపిణీ
తాటిచెట్లపాలెం: మహావిశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 45వ వార్డు తాటిచెట్లపాలెం దరి ఏఎస్ఆర్ నగర్లో 134 టిడ్కో ఇళ్లను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల్లో ఎక్కువమంది గిరిజనులున్నారు. వైఎస్సార్సీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోకు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వారితో కలిసి టిడ్కో బ్లాకులను ప్రారంభించారు. ఇక్కడ నిర్మించిన మొత్తం 288 ఇళ్లలో మొదటి విడతగా 134 ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారులకు పట్టాలు, ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు డబ్బు కట్టించుకుని ఇళ్లు ఇవ్వడంలో విఫలమయ్యాయని చెప్పారు. వారి నగదును వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాపసు ఇచ్చి, లబ్ధిదారులకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తోందని తెలిపారు. ఈ కాలనీలో చిన్నచిన్న పనులున్నా.. వర్షాకాలం సమీపించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడకూడదని త్వరితగతిన ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే దసరాకు వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి సమక్షంలో లబ్ధిదారులందరికీ పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి మిగిలిన పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భారీ ఫ్లెక్సీకి కాలనీవాసులతో కలిసి కె.కె.రాజు, హనోకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్, ఫ్లోర్‌లీడర్ బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–5 జోనల్ కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పాపునాయుడు, టిడ్కో ఎస్ఈ డి.ఎన్.మూర్తి, కార్పొరేటర్లు కంటిపాము కామేశ్వరి, బి.గంగారాం, వార్డు అధ్యక్షుడు పైడి రమణ తదితరులు పాల్గొన్నారు. -
తాటిచెట్టుపై జాతీయ జెండాల ఆవిష్కరణ
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో గీతకార్మికులు వినూత్న రీతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పదిహేను మంది గీతకార్మికులు ఏకకాలంగా తాటిచెట్టుపై నిల్చుని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అరగంట పాటు చెట్టుపై నిలబడి దేశభక్తిని చాటగా, స్థానికులు ఆసక్తిగా పరిశీలించారు. -
Summer Tips: తాటిముంజెలు ఎక్కువగా తింటున్నారా.. ఇందులో 80 శాతానికి పైగా!
Health Benefits Of Ice Apple: తాటిచెట్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఎందరికో జీవనాధారం. తాటి ఆకులు, కొయ్యలతో నివాసాలు ఏర్పరచుకోవచ్చు. ఇక తాటి చెట్ల నుంచి వచ్చే నీరా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని పెద్దల మాట. అంతేకాదు నీరాతో బెల్లం కూడా తయారు చేయవచ్చట. అంతేనా... ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్‌గా తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ అందిస్తాయి తాటిచెట్లు . మరి ఇప్పటికే వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో దొరికే తాటి ముంజెలు(ఐస్ ఆపిల్) తినడం వల్ల కాలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా! తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ►తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి. ►100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి. ►మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. ►లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. ►వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ►బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం. ►ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి. ►కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. చదవండి: World TB Day 2022: ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! -
షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం!
తియ్యని ఆహారం ఎవరికైనా ఆనందదాయకమే. అయితే, తీపి పదార్ధాలుగా విరివిగా వాడుకలో ఉన్న చెరకు చక్కెర, చెరకు బెల్లంలను షుగర్ వ్యాధిగ్రస్తులు తినలేరు. వీటిలో అధిక మోతాదులో గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఫ్రక్టోజు ఎక్కువగా ఉండే తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్ల నీరాతో తయారు చేసే సంప్రదాయక బెల్లం అయితే ఎవరికైనా ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్లు అత్యంత ఆరోగ్యదాయకమైన, ఆల్కహాల్ రహిత పానీయాన్ని అందిస్తాయి. ఇదే నీరా. నీరాను తాజాగా సేవించటం ఆరోగ్యదాయకం (పులిస్తే కల్లుగా మారుతుంది). తాటి, ఈత, కొబ్బరి, జీలుగ నీరాతో తయారు చేసే బెల్లం చాలా ఆరోగ్యదాయకమైన తీపి పదార్థమని పూర్వకాలం నుంచే మనకు తెలుసు. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతున్న నేపథ్యంలో తాటి/ఈత నీరా, బెల్లం తదితర ఉత్ప త్తుల తయారీ, వాడకం పుంజుకుంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈత, తాటి(పామ్) ఉత్పత్తులకు ఆదరణ ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి అనంతపురంలో గీత కార్మికుల సహకార సంఘం శ్రీకారం షుగర్ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా వాడొచ్చంటున్నారు నిపుణులు.. సహకార సంఘం ఆధ్వర్యంలో.. అనంతపురం జిల్లాలో ప్రకృతిసిద్ధమైన ఈత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, రైతుల భూముల్లో లక్షలాది ఈత చెట్లున్నాయి. వీటి నుంచి కల్లు తీసి విక్రయించటం రివాజు. అయితే, ఈత కల్లుకు బదులు నీరా తీసి విక్రయించడంతోపాటు.. నీరాతో బెల్లం తయారు చేసి ప్రజలకు అందించడం మేలని అనంతపురానికి చెందిన సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ యాక్షన్ (సెర) వ్యవస్థాపకులు ఎస్. కుళ్లాయస్వామి తలపెట్టారు. సిరిధాన్యాలతోపాటు తాటి/ఈత/జీలుగ నీరా, బెల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్న స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి స్ఫూర్తితో కుళ్లాయస్వామి ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 500 మంది ఈడిగ గీత కార్మికులతో ‘సెర నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ’ని నెలకొల్పారు. పరిశుద్ధమైన ఆధునిక పద్ధతిలో నీరా బాట్లింగ్, స్టెయిన్లెస్ స్టీలు పరికరాలతో ఈత బెల్లం తయారీ యూనిట్‌ను నాలుగు నెలల క్రితం నెలకొల్పారు. రోజుకు 500 లీటర్ల నీరా సేకరణ 500 ఈత చెట్లను ఎంపిక చేసుకొని సభ్యుల ద్వారా రోజుకు దాదాపు 500 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. 250 చెట్ల నుంచి ఒక రోజు, మిగతా 250 చెట్ల నుంచి తర్వాత రోజు నీరా సేకరిస్తున్నారు. అక్టోబర్ నుంచి నాణ్యమైన నీరా వస్తుంది. వంద లీటర్ల నీరాను వడకట్టి బాటిల్స్‌లో నింపి అదే రోజు విక్రయిస్తున్నారు. మిగతా 400 లీటర్ల నీరాతో 40 కిలోల బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు. చామలపల్లి నుంచి తాటి, ఈత ఉత్పత్తులు తెలంగాణ పామ్ నీరా అండ్ పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చందూరు మండలంలోని చామలపల్లి కేంద్రంగా తాటి, ఈత నీరా, బెల్లం తదితర ఉత్పత్తుల తయారీ గతంలోనే ప్రారంభమైంది. చామలపల్లి పరిసర గ్రామాల నుంచి తాటి నీరాను, వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతం నుంచి ఈత నీరా సేకరిస్తున్నారు. నీరా, బెల్లంతో పాటు తాటి సిరప్, పామ్ షుగర్, పామ్ బూస్ట్ తదితర ఆరోగ్యదాయకమైన అనేక వినూత్న ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు వింజమూరు సత్యం(98498 28999), వేణు తెలిపారు. నవంబర్ నుంచి ఈత, డిసెంబర్ నుంచి తాటి నీరా సేకరణ తిరిగి ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఇందుకోసం ఎక్సయిజ్ శాఖ తోడ్పాటుతో అనంతపురంలోని పోలిస్ కాంప్లెక్స్‌లో నీరా స్టాల్ నెలకొల్పనున్నట్లు కుళ్లాయస్వామి తెలిపారు. ఈత నీరాలో ఆల్కహాల్ లేదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. లాబ్ రిపోర్టులో తేలింది. చిత్తూరులోని ప్రభుత్వ లాబ్‌లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత నీరాను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఎక్సైజ్ అనుమతులు వస్తాయన్నారాయన. – పంతంగి రాంబాబు ఈత ఉత్పత్తులను అందరూ వాడొచ్చు ఈత చెట్టుకు ఏడాదికి రూ.150–200 వరకు రైతుకు చెల్లించి నిపుణులైన గీత కార్మికుల పర్యవేక్షణలో నీరా సేకరిస్తున్నాం. కిలో ఈత బెల్లం తయారీకి 10 లీటర్ల నీరా అవసరం. కిలో బెల్లం ఉత్పత్తికి రూ. 650 వరకు ఖర్చవుతున్నది. రూ. వెయ్యి రిటైల్ ధరకు విక్రయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజలందరూ, షుగర్ ఉన్న వారు సైతం వాడదగ్గ ఆరోగ్యదాయక ఉత్పత్తులు కావటంతో స్థానికంగానే కాకుండా అనేక నగరాల్లోనూ ఈత ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాం. – ఎస్. కుళ్లాయస్వామి (92464 77103), సెరా నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అనంతపురం ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు ఈత, తాటి, కొబ్బరి, జీలుగ.. ఈ చెట్ల నుంచి తీసిన నీరా, దానితో తయారు చేసే బెల్లం ఆరోగ్యకరమైన దేవుడిచ్చిన తీపి పదార్థాలు. ఇవి మన సంస్కృతిలో ఉన్న ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ హితమైన తీపి పదార్థాలు. వీటిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే లవణాంశాలు మనిషికి రోగనిరోధక శక్తిని అందించి మేలు చేస్తాయి. ఈత నీరా, బెల్లంను హెబిఎ1సి 7–8 లోపు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా రోజుకు 10–15 గ్రా. మించకుండా తీసుకోవచ్చు లేదా వారానికోసారి ఈత బెల్లంతో చేసిన తీపి పదార్ధాన్ని 50 గ్రా. వరకు తినొచ్చు. తీపి పదార్థాలను ఎవరైనా సరే రోజూ తినకూడదు. చెరకు ఎస్టేట్ల వల్ల ఏకపంటల (మోనోకల్చర్) సాగు ప్రబలి, 18% జీవవైవిధ్యం నాశనమైంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే చెరకు బెల్లం, చక్కెర వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈత, తాటి, కొబ్బరి, జీలుగ నీరా, బెల్లంలో ఫ్రక్టోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజు ఉన్న తీపి పదార్థం ఏ హానీ చేయదు. – డా. ఖాదర్‌వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త చదవండి: కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు! -
వారి చైతన్యం ‘తాటిచెట్టం’త.. మనకు, వాళ్లకు తేడా ఏంటి?
అదో మారుమూల గ్రామం.. కానీ, ప్రకృతిపరిరక్షణపై చైతన్యం ఎక్కువే. అందుకే.. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చెట్లను కొట్టేయబోతే, అడ్డుకుని వాటిని కాపాడేందుకు ముందుకొచ్చారు.. అక్కడి అధికారులు కూడా సహకరిస్తున్నారు. అవేమీ మర్రి చెట్టులాంటి వృక్షాలు కాదు, తాటిచెట్లు. ఇదీ పశ్చిమ బంగాలోని బంకురా జిల్లా బిష్ణుపూర్ గ్రామీణుల చైతన్యం. సాక్షి, హైదరాబాద్: నీడనిచ్చే విశాలమైన పచ్చనిచెట్లు.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 286 వృక్షాలు.. వీటి వయసు 20 ఏళ్లకుపైబడే ఉంటాయి.. నగర శివారులోని గండిపేట రోడ్డుకు ఆ చెట్లే అందం. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని కొట్టేయబోతే (42 చెట్లకు మాత్రం ట్రాన్స్‌లొకేట్ అనుమతి ఉంది) కొందరు స్థానికులు ముందుకొచ్చి వాటిల్లో యోగ్యమైన వాటిని తరలించి మరోచోట నాటించాలనుకున్నారు. కానీ, అందుకు ఇక్కడి అధికారులు విధించిన షరతులే అడ్డుగా మారాయి. వాటిల్లో 9 చెట్లను మంగళవారం నరికేశారు. బెంగాల్లో తాటి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి కాపాడుకునేందుకు స్థానికులు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. ఆ చెట్ల తరలింపునకు అక్కడి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే వారమే పనులు మొదలు కానున్నాయి. అదే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్ గండిపేట ప్రాంతవాసులు సంప్రదించి కాపాడుకునేందుకు ముందుకు వచ్చినా ఇక్కడి అధికారులు గొడ్డలి వేటుకే జై అంటున్నారు. అక్కడి అధికారులకు, ఇక్కడి అధికారులకు మధ్య ఎంత తేడా? నగరం నుంచి గండిపేటకు దారితేసే రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ చెట్లను కాపాడే దిశలో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న వ్యవహారం వృక్ష ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది. హైకోర్టు జోక్యం చేసుకున్నా వాటిని కాపాడుకోలేని నిస్సహాయత ఇక్కడ నెలకొంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా.. సమస్య పరిష్కారంకాలేదు. సరిగ్గా ఇదే సమయంలో.. బెంగాల్ ప్రజల స్పూర్తిదాయకమైన గాధ తెరపైకి వచ్చింది. తాటి చెట్లను కాపాడుకునే దిశలో.. బెంగాల్‌లోని సారెంగా ప్రాంతానికి వెళ్లే రాష్ట్ర రహదారిని విస్తరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బిష్ణుపూర్ అనే ఊళ్లో 200కుపైగా తాటిచెట్ల తొలగింపునకు మార్కింగ్ చేశారు. ప్రకృతి ప్రేమికులైన స్థానికులు వెంటనే అక్కడి నిషాన్ సబూజే సమాజే అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. తాటిచెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే హైదరాబాద్‌కు చెందిన వటా ఫౌండేషన్ వివరాలను ఇంటర్నెట్లో గుర్తించారు. ఇటీవల గోవాలో కొన్ని తాటిచెట్లను తరలించి కాపాడినట్టు గుర్తించారు. వెంటనే ఆ సంస్థను సంప్రదించగా నిర్వాహకులు అంగీకరించారు. సాంకేతిక, ఆర్థిక సాయం అందించేందుకు అక్కడి జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు. వాచ్చే వారం వాటి ట్రాన్స్‌లొకేట్ పనులు మొదలు కాబోతున్నాయి. ఉపాధి వేటలో.. వెనకబడ్డ బంకురా జిల్లా ప్రాంతంలో కొంతకాలంగా తాటిచెట్లను ఉపాధికి అవకాశంగా మార్చుకోవటం ప్రారంభించారు. తాటి కల్లు నుంచి బెల్లం, ఇతర స్వీట్ల తయారీని నేర్చుకున్నారు. అందుకు తాటిచెట్లకు కొదవ లేదు. ఎన్ని చెట్లున్నా.. రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్లను వదలకూడదని స్థానికులు నిర్ణయించుకుని హైదరాబాద్ సంస్థను, జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి కాపాడుకుంటున్నారు. -
పొట్టి తాటి చెట్లతో ప్రయోజనాలెన్నో!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో తాటి చెట్ల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. తాటి నీరాతో తయారైన బెల్లానికి కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఎక్కువ ఎత్తు పెరిగే మన దగ్గరి తాటి జాతి కన్నా బీహార్‌కు చెందిన పొట్టి రకం తాటి చెట్ల పెంపకం మేలని పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూపరెడ్డి అంటున్నారు. తెలంగాణలో తాడి చెట్లు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. గింజ నాటిన 12–14 ఏళ్లకు గానీ గీతకు రావు. బీహార్ పొట్టి రకాలైతే 10–20 అడుగుల ఎత్తు పెరుగుతాయి. విత్తిన 5–7 ఏళ్లలోనే గీతకు వస్తాయని, సీజన్లో రోజుకు 3–15 లీటర్ల నీరా, వంద వరకు పండ్లను ఇస్తాయని తమిళనాడులోని తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు విష్ణుస్వరూప్‌రెడ్డి తెలిపారు. ఎత్తు తక్కువ ఉండటం వల్ల గీత కార్మికుల పని సులువు కావటంతోపాటు అభద్రత తగ్గుతుందన్నారు. బీహార్ పొట్టి రకం తాటి పండ్లను గత ఏడాది 5 వేలు తెప్పించి పంచామని, ఈ ఏడాది 1,25,000 వరకు తెప్పిస్తున్నానని అన్నారు. వీటిని హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అదేవిధంగా, రోజుకు 30 లీటర్ల నీరా దిగుబడినిచ్చే డాలర్ (జీలుగ/గిరిక తాడు) మొక్కలను తొలిసారిగా టిష్యూకల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని విష్ణుస్వరూప్‌రెడ్డి (95023 76010) వెల్లడించారు. -
తాటి, ఈత చెట్లను నరికితే నాన్ బెయిలబుల్ కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం 1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశిం చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరు తో తాటి, ఈత చెట్లను నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వచ్చిన వినతులపై ఆయన ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చెట్లను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కనుమరుగవుతున్న కల్పతరువు
తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని ప్రతిది వృథా కాకుండా బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతోంది. అలాంటి తాటిచెట్లు కొందరు స్వార్థ ప్రయోజనాలకు నేలకొరుగుతున్నాయి. ఈ పరిణామాలతో తాటిచెట్లు కాలక్రమేణ అంతరించి పోతున్నాయి. తాటి చెట్లు గ్రామీణ ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. తాటిచెట్లు ఎందరికో జీవనాధరం. పేదల నివాసానికి తాటి ఆకులు, కొయ్యలు ఉపయోగపడుతుంటే.. తాటి చెట్ల నుంచి వచ్చే నీరా, నీరాతో బెల్లం తయారీ, ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్‌గా తాటిచెట్ల నుంచి వచ్చే తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ ఇలా అనేకంగా పొందుతున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది. సాక్షి, వాకాడు (నెల్లూరు): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఆహ్లాదకరంగా కనిపించే తాటి వనాలు నానాటికి కరుమరుగు అవుతున్నాయి. తాటిచెట్లు గ్రామీణ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నిరుపేదల కనీస అవసరాల్లో ప్రధానమైన పూరిల్లు నిర్మాణానికి వాడే ప్రతి వస్తువు ఈ తాటి చెట్ల నుంచే సేకరిస్తారు. ఈ చెట్ల కాండాన్ని ఇళ్ల నిర్మాణంలో దూలాలు కింద, ఆ కాండాన్ని చీల్చి దబ్బలు చేసి వీటిని పెండెలుగా ఉపయోగిస్తారు. తాటి ఆకులను ఇళ్ల పైకప్పులకు ఉపయోగించడం తెలిసిందే. ఒక్క విధంగా చెప్పాలంటే గృహ నిర్మాణంలో తాటిచెట్లు పాత్ర ఎనలేనిది. తాటి మానులను ఆంధ్రా టేకుగా వ్యవహరిస్తుంటారు. పూరిల్లు నిర్మాణంలోనే కాకుండా గృహోపకరణాల తయారీలో సైతం ఈ చెట్ల నుంచి సేకరించిన వస్తువులను వాడుతున్నారు. పోషకాహార పదార్థాలు తాటి చెట్ల నుంచి లభించే అనేక ఆహార పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా లభిస్తున్నాయి. సీజనల్‌గా తాటిగెల నుంచి నీరా వస్తుంది. దీంతో తాటి బెల్లం తయారీ చేసేవారు. తాటిబెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం తాటిబెల్లం వినియోగం బాగా పెరిగింది. నీరా తర్వాత కల్లు. ఇది మత్తు పానీయం. కానీ తాజాగా కల్లులో కూడా పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాటికాయలు వస్తే.. అందులో లభించే ముంజులు ఆరోగ్యానికి, చల్లదనానికి ఎంతో ఉపయోగపడుతాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు లొట్టలేసుకుని మరీ తింటారు. మార్చి ఆఖరు నుంచి జూన్ వరకు తాటి ముంజుల వ్యపారం జోరుగా జరుగుతుంది. ఇక ఎంతో కమ్మదనానిచ్చే తాటి పండ్లను గ్రామీణులు ప్రీతిగా తింటారు. తాటి పండ్ల నుంచి లభించే టెంకలు నుంచి వచ్చే తేగలు ఇటు గ్రామీణులు, పట్టణ వాసులు అనే తేడా లేకుండా తేగలను ఆప్యాయంగా తింటారు. సీజన్లో ఈ తేగలను జిల్లా నుంచి చెన్నైకి ఎగుమతి చేస్తున్నారు. అంతరించిపోతున్న సంపద గతంలో ఆధునిక వ్యవసాయం అందుబాటులో లేని రోజుల్లో వేలాది ఎకరాల బీడు భూముల్లో తాటి చెట్లను విస్తృతంగా రైతులు పెంచేవారు. వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత కొంత మేరకు వ్యవసాయ భూములుగా మారిపోయాయి. ఆ తర్వాత చేపలు, రొయ్యిల చెరువులు ఎక్కువ కావడంతో సముద్ర తీర ప్రాంతంలోని తాటి తోపులు అదృశ్యమైపోయాయి. దీంతో భవిష్యత్‌లో మానవ మనగడకే ప్రమాదం ఏర్పడుతుంది. తుపాన్ తాకిడికి సముద్ర తీరం కోతకు గురికాకుండా ఎదుర్కోగల గుణం ఈ వృక్షాలకు ఉంది. పెను తుపాను, ఉప్పెనలూ సంభవించినా ప్రచండ గాలులు వీచినా, తాటి చెట్లు అలాగే నిలిచి ఉంటాయి. కరువు కాటకాల్లో ఈ తాటి చెట్లు గ్రామీణ నిరుపేదలను కామధేనువుల్లా ఆదుకునేవని చెబుతుంటారు. పేదలకు ఉపాధి ఏటా తాటి నుంచి తీసే కల్లుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. ఇది ఒక సామాజిక వర్గానికి ఉపాధి వనరు కాగా, గ్రామాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు నిరుపేదలు తాటి సంపదతోనే బతికేవారు. తాటి నుంచి వచ్చిన సంపదను విక్రయిస్తూ బతుకులు నెట్టుకు వస్తున్నారు. ఇప్పుడు పొలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మిగిలిన తాటిచెట్లను కూడా ఎడాపెడా నరికి వేసి, కెమికల్ వేసి చంపేస్తున్నారు. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. మానవ వికాశానికి దోహదపడే ఈ వృక్షాలను వాడుకోవడం తప్ప వీటి పెంపకాన్ని ప్రోత్సహించే నాథుడే లేకుండా పోయాడు. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వీలున్న ఈ మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వినిమయ వస్తువుల తయారీ తాటి చెట్టుకు సంబంధించిన ప్రతి దానితో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయడం విశేషం. పల్లె సీమల్లో ఆధునికత ప్రవేశించని రోజుల్లో తాటాకులతో తయారు చేసిన విసనకర్రలు, బుట్టలు, చాపలు ప్రతి ఇంట్లోను దర్శనమిచ్చేవి. వీటితోనే తయారు చేసిన గూడలను వర్షాకాలంలో గ్రామీణులు గొడుగుల్లా ఉపయోగించేవారు. తాటి నారతో రకరకాల మోకులు, పలుపులు, తాళ్లు విరివిగా తయారు చేసేవారు. తాటి చెట్ల రసం నుంచి తయారు చేసిన తాటి బెల్లంలో విశేష పోషక విలువులున్నాయి. తాటి వనాల వల్ల అన్నీ లాభాలే మాలాంటి పేద కుటుంబాల వారికి తాటిచెట్లు ఉంటే నిత్య జీవితంలో అన్ని విధాలా ఆదుకుంటాయి. డబ్బున్న మా రాజులు మిద్దెలు కడుతారు. మా వంటి పేదవాడు తాటి చెట్లు నుంచి వచ్చే ఆకులు, దబ్బలతో పూరిగుడిసె వేసుకుని ఇంటిల్లాపాది దర్జాగా గడుపుతున్నాం. పేదవాడి జీవితంతో తాటిచెట్లు అనుబంధం అలా ఉంటుంది. తాటి వనాలు పెంచడం ద్వారా ఎందరికో ఉపాధి కల్పన జరుగుతుంది. తాటిచెట్లను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎంబేటి సుబ్రహ్మణ్యం కుటుంబం, వెంకటరెడ్డిపాళెం పేదవాడి జీవితం తాటిచెట్లు గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల జీవితాలు తాటి చెట్లతో ఎంతగానో ముడిపడి ఉన్నాయి. గ్రామీణులు తాటి చెట్ల నుంచి వచ్చే ఆకులు, తేగలు, దబ్బలు, కల్లు, తాటినార తాడులు ఇలా అనేక రకాల వస్తువులను తయారు చేసుకుని ఉపయోగించుకుంటూ ఇతరులకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాం. విపత్తుల సమయంలో వరదలను అడ్డుకుంటాయి. ప్రస్తుతం రొయ్యల చెరువులు వృద్ధి చెంది తాటి వనాలు కనుమరుగవుతున్నాయి. తాటిచెట్లను కాపాడుకుంటే భావితరాలకు మేలు జరుగుతుంది. – కావలి వీరాఘవులు, వాకాడు -
రిసార్టులు, పార్కుల్లో అలంకరణకు ఈత చెట్లను..
సాక్షి, పాలకొల్లు అర్బన్(పశ్చిమ గోదావరి) : ఈత చెట్లు ప్రకృతి సంపద. డ్రెయిన్ గట్లు, కాలువ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో, బండిదారి పోరంబోకు స్థలాల్లో ఈత చెట్లు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. వీటిని కొందరు చెట్ల వేళ్లతో సహా తవ్వేసి తరలించుకుపోతున్నారు. కొంతమంది సంపన్నుల గృహాల ముందు, రిసార్టులు, పార్కుల్లో అందంగా అలంకరణ కోసం వీటిని అక్రమంగా తవ్వుకుపోతున్నారు. చెట్టు వేళ్లతో తవ్వేసి పార్కుల్లో తిరిగి పాతడం వల్ల ఈతచెట్టు ఏపుగా పెరిగి కొత్త ఆకులతో అందంగా కనిపిస్తుంది. గల్ఫ్ దేశాల్లో ఇంటి ముందు ఖర్జూరం చెట్లు అందంగా కనిపిస్తుంటాయి. అదే మాదిరిగా స్వదేశంలో విదేశీ సంస్కృతికి అలవాటు పడిన కొందరు సంపన్నులు వారి గృహాల ముందు ఈత చెట్లను అందంగా అలకరించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అభివృద్ధి చేసే పార్కుల్లో సైతం ఈత చెట్లను ఆయా కాంట్రాక్టర్లకు విక్రయించి అక్రమార్కులు సొమ్ములు చేసుకుంటున్నారు. ఉపాధికి గండి వేసవికాలంలో ఈత చెట్ల నుంచి కల్లు తీసి గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అలాగే యానాదులు, ఉప్పర్లు ఈతచెట్ల కొమ్మలను సేకరించి వాటి ఈనెల ద్వారా తట్టలు, బుట్టలు అల్లుకుని ఉపాధి పొందుతున్నారు. ఈత ఈనెలతో తయారు చేసిన తట్టలు, బుట్టలు రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పరికరాలు. కాలువ గట్ల వెంబడి సహజ సిద్ధంగా పెరిగి చూపరులకు కనువిందు చేసే ఈతచెట్లు అక్రమార్కుల కంటపడడంతో అక్రమంగా తవ్వుకుపోతున్నారు. పట్టించుకోని అధికారులు చెట్టు కొట్టాలంటే రెవెన్యూ అధికారి అనుమతి తీసుకోవాలి. అలాగే ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెట్లకు ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇది ఇలా ఉండగా గీత కార్మికుల ఉపాధికి ఉపయోగపడే ఈతచెట్టును ఎక్సైజ్ శాఖ అధికారులు పరిరక్షించాలి. అయితే అటు రెవెన్యూ, ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల పని సులువుగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి ఈతచెట్లను కొంతమంది ముఠాగా ఏర్పడి అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో మా ఉపాధికి గండి పడుతోంది. ఈతకల్లులో పోషక విలువలున్నాయి. చాలామంది ఈతకల్లు కావాలని అడుగుతుంటారు. అయితే ఈత చెట్లు అందుబాటులో ఉండక తాటి చెట్ల నుంచే ఎక్కువగా కల్లు తీసి విక్రయిస్తుంటాం. ఈత చెట్లను వేళ్లతో సహా తొలగించి వ్యాపారం చేసుకుంటున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. –జి.నరసింహరావు, గీత కార్మికుడు, ఆగర్రు -
తాటి చెట్టుకు పది వేలు!
చెరకు పంచదార, బెల్లంకు బదులుగా తాటి బెల్లాన్ని వినియోగించడం అత్యంత ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతుండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శ్రీలంక వంటి దేశాలు తాటి బెల్లం, తాటి చక్కెరను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి నిపుణులు, తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి సి వెంగయ్యతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఎదిగిన ప్రతి తాటి చెట్టు నుంచి తాటి బెల్లం ఉత్పత్తి ద్వారా సంవత్సరానికి రూ. పది వేల ఆదాయాన్ని పొందేందుకు వీలుందని, గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చని, కేవలం రూ. 20 వేల మూల పెట్టుబడితో గ్రామస్థాయిలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆయన చెబుతున్నారు. తాటి బెల్లం ప్రయోజనాలు? తాటి బెల్లం చెరకు పంచదార, బెల్లం కన్నా ఆరోగ్యదాయకమైనది. ఇందులో ఫ్రక్టోజు (76.86 శాతం) ఎక్కువగా, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) 40 లోపే. నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. చెరకు పంచదార జి.ఐ. 100. తిన్న వెంటనే గ్లూకోజ్ రక్తంలోకి చేరుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మాక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజుకు ప్రతి ఒక్కరూ 10 గ్రా. తీసుకుంటే మంచిది. చక్కెర బెల్లం, పంచదారకు బదులు ఇంట్లో తాటి బెల్లం వాడుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం ఉత్పత్తికి ఉన్న అవకాశాలేమిటి? రైతులకు /గీత కార్మికులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనీసం 6 కోట్ల తాటి చెట్లు ఉంటాయని అంచనా. వీటిలో కొన్నిటి నుంచి కల్లు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క శాతం చెట్లను కూడా మనం ఉపయోగించుకోవడం లేదు. 99% చెట్లు వృథాగా ఉండిపోతున్నాయి. చెట్టుకు రోజుకు కనిష్టం 4 (గరిష్టం 8)లీటర్ల చొప్పున వంద రోజుల పాటు నీరాను సేకరించవచ్చు. ఏటా సగటున చెట్టుకు 40 కిలోల తాటి బెల్లం తయారు చేయవచ్చు. ప్రతి చెట్టు నుంచి నెలకు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందవచ్చు. ఏటా కనీసం రూ. 10 నుంచి 12 వేల వరకు ఆదాయం పొందే మార్గాలున్నాయి. 1969 నీరా రూల్స్ ప్రకారం ఎక్సైజ్ శాఖ అనుమతి పొంది గ్రామ స్థాయిలోనే చాలా సులువుగా తాటి బెల్లం తయారు చేయటం ప్రారంభించవచ్చు. వాల్యూ చెయిన్‌ను ప్లాన్ చేస్తే ఏడాది పొడవునా తాటి బెల్లం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, రైతులకు, గీత కార్మికులకూ స్థిరమైన ఆదాయం వస్తుంది. పీచు, తేగల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. తేగల పొడిని మైదాకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యదాయక బేకరీ ఉత్పత్తుల్లో వినియోగించవచ్చు. చిన్న యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది? తాటి చెట్ల నుంచి పరిశుద్ధమైన పద్ధతిలో సున్నం వాడకుండానే నీరాను సేకరించే కూలింగ్ బాక్స్‌ను మేం రూపొందించాం. సాధారణంగా కుండల్లో కొంచెం సున్నం వేసి చెట్టుకు కడతారు. నీరా త్వరగా పులిసిపోకుండా ఉండటానికి ఇలా చేస్తారు. అయితే, సున్నం వేయకుండానే ఈ కూలింగ్ బాక్సుల ద్వారా నీరాను సేకరించే పద్ధతిని మేం కనుగొన్నాం. సేకరించిన నీరాను బాండీల్లో పోసి ఉడకబెడితే రెండు గంటల్లో తాటి బెల్లం తయారవుతుంది. ఇందుకు ఇనుప బాండీల కన్నా స్టెయిన్లెస్ స్టీల్(ఎస్.ఎస్.) బాండీలను వాడితే మంచిది. వంద లీటర్ల ఎస్.ఎస్. బాండీ, కూలింగ్ బాక్సులు ఇతర పరికరాలు కలిపి మొత్తం రూ. 20,000 ఖర్చవుతాయి. బ్యాచ్‌కు పది కిలోల తాటి బెల్లం తయారవుతుంది. ఈ మాత్రం పెట్టుబడితో ప్రతి గ్రామంలోనూ కట్టెలు లేదా గ్యాస్ పొయ్యిలపై తాటి బెల్లం వండుకోవచ్చు. కొంత అధిక పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పితే స్టీమ్ ద్వారా నడిచే 300 లీటర్ల ఎస్. ఎస్. బాండీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నీరా సీజన్ ఎన్నాళ్లు? నవంబర్ నుంచే మగ చెట్ల(పోత్తాళ్ల) నుంచి నీరా తీయొచ్చు. ఆడ చెట్ల (పలుపు తాళ్ల) నుంచి ఫిబ్రవరి నుంచి, పండు తాళ్ల నుంచి జూన్–ఆగస్టు నెలల వరకు నీరా తీస్తూనే ఉండొచ్చు. మెలకువలు పాటిస్తే ఏడాది పొడవునా నీరాను పొందే పద్ధతులను మేం రూపొందించాం. అంటే.. ప్రతి గ్రామంలో స్వల్ప పెట్టుబడితోనే ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప తాటి బెల్లం మరెక్కడా తయారు చేయటం లేదు. ఎన్నాళ్లు నిల్వ ఉంటుంది? నీరుగారిపోతుందని అంటున్నారు? తాటి చెట్లకు మట్టి కుండలు కట్టి నీరా సేకరించే పద్ధతిలో నీరా పులిసిపోకుండా ఉండేందుకు లీటరుకు 3–4 గ్రాముల సున్నం వేస్తుంటారు. సున్నం ఎక్కువైతే నీరా ఉదజని సూచిక(పి.హెచ్) పెరుగుతుంది. పి.హెచ్. 7–8 ఉంటే మంచిది. అంతకన్నా పెరిగితే నీరాలో నిమ్మరసం పిండి, ఉడకబెడుతుంటే సున్నం తెట్టులాగా పైకి తేలుతుంది. దాన్ని తీసేస్తే సరిపోతుంది. నీరా పి.హెచ్. హెచ్చుతగ్గులను సరిగ్గా చూసుకోకపోతే నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, జాగ్రత్తలు పాటించి తయారు చేసిన నాణ్యమైన తాటి బెల్లాన్ని ఎండలో 2–3 గంటలు ఆరబెట్టాలి. తర్వాత గాలి ఎక్కువగా లేకుండా ప్యాకింగ్ చెయ్యాలి. ఇలా చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటుంది. వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే మూడేళ్ల వరకు నిల్వ ఉంటుంది. తాటి బెల్లానికి గాలిలో తేమను చప్పున గ్రహించే స్వభావం ఉంటుంది. బెల్లం వండటంలో మెలకువలేమిటి? నీరాలో 80% నీరే ఉంటుంది. అరిసెల పాకం వచ్చే వరకు మరగకాచి.. అచ్చుల్లో పోసుకొని, అచ్చులను ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. వంద లీటర్ల నీరాకు పది కిలోల బెల్లం వస్తుంది. అరిసెల పాకం వచ్చిన తర్వాత కూడా 10–15 నిమిషాలు బాండీలోనే ఉంచి తిప్పుతూ ఉంటే.. తాటి బెల్లం పొడి తయారవుతుంది. బెల్లంలో తేమ 7% కన్నా తక్కువ ఉంటే సంవత్సరం నిల్వచేసుకోవచ్చు. ఈత, జీలుగ బెల్లం కూడా మంచిదే కదా.. అవును. తాటి చెట్ల నుంచి నాటిన 14 ఏళ్లు, ఈత చెట్టు 6–7 ఏళ్లు, జీలుగ చెట్లు 6వ ఏట నుంచి నీరాను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రోజుకు తాటి చెట్టు నుంచి 1–8 లీటర్లు, ఈత చెట్టు నుంచి 1–3 లీటర్లు, జీలుగ చెట్ల నుంచి 50 లీటర్ల వరకు నీరా ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఏ నీరాతో బెల్లం అయినా ఆరోగ్యదాయకమైనదే. చెట్లు ఎక్కే వాళ్లే కరువయ్యారు కదా.. నిజమే. తాటి బెల్లానికి గిరాకీ పెరిగింది. కిలో రూ. 300 పలుకుతోంది. కాబట్టి ఆదాయమూ బాగా వస్తుంది. అయితే, చెట్లు ఒకే చోట వరుసగా ఉంటాయి కాబట్టి ఒక చోటున్న చెట్లకు కలిపి మంచె కట్టుకోవచ్చు. ఈ చివర చెట్టు దగ్గర మంచె ఎక్కితే, ఆ చివర చెట్టు దగ్గర కిందికి దిగొచ్చు. మా తాటి పరిశోధనా స్థానంలో ఇలాగే చేస్తున్నాం. అప్పుడు చెట్టెక్కే నిపుణులు కాని వారు కూడా సులువుగా నీరా సేకరించుకోవచ్చు. చెట్టుకు ఏటా రూ. 10 వేల నుంచి 12 వేలకు పర్మినెంట్ ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. తమిళనాడులో మాదిరిగా మనమూ దృష్టి పెట్టాలి. (తూ.గో. జిల్లా పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు). -
ఒక్కొక్కరికి.. వెయ్యి ఈత మొక్కలు!
బషీరాబాద్ : 4వ విడత హరితహారంలో తొమ్మిది లక్షల మొక్కలు నాటాలని జిల్లా ఆబ్కారీ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కలు నాటాలంటే సుమారు రెండు వేల ఎకరాల స్థలం కావాలని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మూడో విడతలో చెరువుగట్లపై, గీతా కార్మిక సొసైటీ భూముల్లో, అసైన్డ్ భూముల్లో 8 లక్షల మొక్కలు నాటారు. సంరక్షణలేక పోవడంతో అందులో సగానికి పైగా ఎండిపోయాయి. దీంతో ఈసారైనా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయనుంది. ఈ విడత లక్ష్యం చేరుకోవడానికి ఎక్సైజ్ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో తొమ్మిది లక్షల ఈత మొక్కలను ఎక్కడ నాటాలనే ఆలోచనలో పడింది. ఇప్పుడున్న చెరువు గట్లు మీద పెట్టినా స్థలం సరిపోదని భావించిన ఆబ్కారీ అధికారులు సరికొత్త ఆలోచనకు తెరలేపారు. హరితహారం లక్ష్యాన్ని గీతా కార్మికులకు నిర్ధేశించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొక్కలు నాటడానికి స్థలాలులేకుంటే గౌడల పట్టా భూముల్లోనైనా నాటించాడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఒక్కో గీతా కార్మికుడికి ఐదు వందల నుంచి వెయ్యి ఈత మొక్కలు నాటాలని ఆదేశిస్తున్నారు. గౌడలు ఇంత పెద్దమొత్తంలో మొక్కలు ఎలా నాటాలని లోలోన మదన పడుతున్నారు. అధికారుల ఆదేశాలు విస్మరిస్తే కష్టాలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పట్టా భూముల్లో నాటండి తాండూరు నియోజకవర్గంలో 4వ విడత హరితహారం కింద 3లక్షల ఈత మొక్కలు నాటాలని లక్ష్యం ఉంది. దీనికోసం ఒక్కో గీతా కార్మికుడు తప్పనిసరిగా వెయ్యి మొక్కలు నాటాలని తాండూరు ఎక్సైజ్ సీఐ రమావత్ టుక్యానాయక్ ఆదేశిస్తున్నారు. బషీరాబాద్ మండలంలోని మైల్వార్‌లో ఓ గీతా కార్మికుడి ఇంటికి మంగళవారం వెళ్లి విషయాన్ని చెప్పడంతో అతడి నోట మాట రాలేదు. ‘ఇన్నీ మొక్కలు ఇస్తే ఎక్కడ నాటాలి సార్.. పోయినేడాది నాటిన మొక్కలకే జాగ లేదు.. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి..’ అంటూ ఆ గీతా కార్మికుడు సీఐని ప్రశ్నించారు. మీ పట్టా భూముల్లో నాటండడని సీఐ సమాధానం చెప్పారు. -
జీరిక నీరా, బెల్లం భేష్!
తాటి బెల్లం ద్వారా ఒనగూడే ఔషధ గుణాలు, పోషక విలువలు ఎన్నో. అనాదిగా మన పెద్దలు వాడుతున్న ఆరోగ్యదాయకమైనది తాటి బెల్లం. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తాటి బెల్లానికి, ఆరోగ్య పానీయంగా తాటి నీరా వాడకానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. తాటి బెల్లాన్ని సాధారణ పంచదార, బెల్లానికి బదులుగా వాడటం ఎంతో ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే మధుమేహ రోగులు సైతం తాటి బెల్లాన్ని నిక్షేపంగా వాడుతున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ బెల్లం తయారీకి అవసరమైన నీరా ఉత్పత్తి తాటి చెట్టుకు రోజుకు 5–6 లీటర్లకు మాత్రమే పరిమితం. తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే ‘జీరిక’ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇటీవల వేలాది జీరిక మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల నల్లగొండ జిల్లా మల్లేపల్లిలో తాటి పరిశోధనా స్థానాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రంలో జీరిక చెట్లపై కూడా పరిశోధన ప్రారంభించటం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ జీరిక చెట్ల మాదిరిగానే కనిపించే అలంకారప్రాయమైన మరో జాతి చెట్లు కూడా ఉన్నాయని, వీటిని కేవలం అందం కోసం లాండ్‌స్కేపింగ్‌లో వాడుతున్నారని.. నీరా కోసం జీరిక మొక్కలను నాటుకునే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిరిజనుల కల్పవృక్షం.. జీరిక జీరిక చెట్టును సుల్ఫి లేదా ఫిష్‌టైల్ పామ్ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులు సాంప్రదాయకంగా జీరిక నీరాను, కల్లును ఆరోగ్యపానీయంగా వాడుతున్నారు. తాటి చెట్ల నీరా/కల్లు కన్నా రుచికరమైనది కావడంతో జీరిక నీరా/కల్లుకు జగదల్పూర్, బస్తర్ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇది గిరిజనులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. నాటిన ఆరేళ్ల నుంచే నీరా దిగుబడి.. జీరిక మొక్క నాటిన ఆరేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు.. ఒక్కో జీరిక చెట్టు నుంచి సగటున 30–40 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. భూసారం తదితర సానుకూలతల వల్ల కొన్ని చెట్ల నుంచి రోజుకు 50–60 లీటర్ల వరకు నీరాను సేకరిస్తూ, ఆరోగ్య పానీయంగా వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకోవడానికి నీటికి బదులు జీరిక నీరాను గిరిజనులు వినియోగిస్తుంటారు. తద్వారా కేన్సర్, తదితర జబ్బులు నయమవుతున్నాయని కూడా గిరిజన సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు. ఆ విధంగా జీరిక నీరా/కల్లు ఛత్తీస్‌గఢ్ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జగదల్పూర్, మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా.. వారి ఆహార సంస్కృతిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. అందువల్లనే గిరిజనులు జీరిక చెట్టును కల్పవృక్షంగా కొలుస్తారు. ఆడ పిల్లకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే అలవాటు కూడా అక్కడ అనాదిగా ఉన్నది. ఈ కారణంగా ఒక్కో చెట్టు నుంచి ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు గిరిజనులు ఆదాయం పొందుతుండటం విశేషం. మైదాన ప్రాంతాలకు జీరిక అనువైనదేనా? జీరిక చెట్లు ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. తాటి చెట్ల కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్నాయి. అయితే, మైదాన ప్రాంతాల్లో ఈ చెట్లు ఇదే మాదిరిగా అధికంగా నీరా దిగుబడిని ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ‘సాగుబడి’ తో చెప్పారు. అనాదిగా జీరిక పెరుగుతున్న మారేడుమిల్లి తదితర ప్రాంతాలు సముద్ర తలం నుంచి 250 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వీటి కన్నా ఎత్తయినవే. కాబట్టి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మినహా ఎత్తయిన మైదాన ప్రాంతాల్లో కూడా జీరిక సాగు లాభదాయకంగానే ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. అయితే, జీరిక నీరా దిగుబడిపై వాతావరణం, భూములు.. ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏమేరకు ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది. జగదల్పూర్లో రెండేళ్ల క్రితమే జీరికపై ప్రత్యేక పరిశోధనా స్థానం ఏర్పాటైంది. దీనిలో పరిశోధనలు ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయి. వెంగయ్య తమ పరిశోధనా స్థానంలో గత ఏడాది గిరిజనుల నుంచి సేకరించిన జీరిక మొక్కలను నాటారు. మైదాన ప్రాంతాల్లో కూడా నీరా దిగుబడి బాగా ఉందని రుజువైతే.. ఆరోగ్యదాయకమైన పానీయం నీరాతో పాటు ఔషధగుణాలుండే సహజ జీరిక బెల్లాన్ని కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి, అశేష ప్రజానీకానికి అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుందని వెంగయ్య అన్నారు. తాటి బెల్లంలో మాదిరిగా జీరిక బెల్లంలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి.. సాధారణ పంచదార/బెల్లానికి బదులు తాటి/జీరిక బెల్లాన్ని ఏ వయస్సు వారైనా, మధుమేహ రోగులు సైతం వాడొచ్చని ఆయన తెలిపారు. 100 లీటర్ల జీరిక నీరాతో 15 కిలోల బెల్లం తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది కూడా. జీరిక నీరాతో తాటి నీరాతో మాదిరిగానే 12–15% బెల్లం రికవరీ(100 లీటర్ల నీరాను ఉడికించితే 12–15 కిలోల బెల్లం ఉత్పత్తి) వస్తున్నదని వెంగయ్య జరిపిన ప్రాధమిక అధ్యయనంలో తేలింది. అయితే, ఔషధగుణాలు, ఖనిజలవణాలు, పోషకాల విషయంలో కూడా తాటి, జీరిక నీరాల మధ్య తేడా ఏమైనా ఉందా అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని వెంగయ్య (94931 28932) తెలిపారు. జీరిక చెట్ల వద్ద రాలిపడిన కాయల ద్వారా మొక్కలు మొలుస్తుంటాయి. గిరిజనులు వాటిని తెచ్చి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. జీరిక చెట్ల కాయలు పెద్ద రేగు కాయల సైజులో ఉంటాయి. జీరిక చెట్లలో వైవిధ్యం, అవి పెరుగుతున్న భూములను బట్టి వాటి కాయల రంగులో తేడా కనిపిస్తోంది. ఈ కాయల నుంచి విత్తనాలను సేకరించి.. నర్సరీలో మొక్కలను పెంచుకొని నాటుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
దౌర్జన్యంగా పొలంలో తాటిచెట్లు తొలగింపు
-
నిప్పుంటుకుని ఈతచెట్లు దగ్ధం
కత్లాపూర్ మండలం భూషణ్‌రావుపేటలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 7 ఎకరాలలోని ఈతచెట్లలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. -
నిజమండి! ఆ తాటిచెట్లు నడుస్తాయ్!!
హాలీవుడ్ ఎపిక్ 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్' సినిమా చూస్తే.. అందులో చిత్రవిచిత్రమైన ప్రాణులతోపాటు నడిచే చెట్లు కూడా కనిపిస్తాయి. వేర్లతో సహా అవి చిత్రంగా నడుచుకుంటూ పోతాయి. ఆ వృక్షాలంతా వేగంగా కాకపోయినా కొంచెం నెమ్మదిగా నడిచే చెట్లు నిజంగానే ఉన్నాయి. వాటిని చూడాలంటే ఈక్వెడార్‌కు వెళ్లాల్సిందే. ఈక్వెడార్ రాజధాని క్విటోకు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమాకో బయోస్ఫెర్ రిజర్వు ఉంది. యూనెస్కో గుర్తించిన ఈ అడవి అంచుకు వెళితే ఆహ్లాదకరమైన అందాలు, సహజ సుందరమైన దృశ్యాలే కాదు.. మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే నడిచే తాటిచెట్లు (పామ్ ట్రీస్) కనిపిస్తాయి. ఈ తాటిచెట్లు అడవంతా సంచరిస్తూ ఉంటాయి. ఈ చెట్లకు పెరిగే కొత్త వేర్లు క్రమంగా కొత్త ప్రాంతాలకు పాకుతూ పోవడం వల్ల వాటితోపాటు చెట్లు కూడా వెళ్తూ ఉటాయి. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సెంటీమీటర్లు కూడా ఈ చెట్లు ప్రయాణిస్తుంటాయి. దాదాపు 20 మీటర్ల వరకు ఇవి నడువగలవు. 'భూసారం క్షీణిస్తుండటంతో దృఢమైన మూలాల కోసం ఈ చెట్లు పొడవైన కొత్త వేర్లను పెంచుతాయి. కొన్నిసార్లు ఈ వేర్లు 20 మీటర్ల దూరం వరకు పెరుగుతాయి' అని పురాతన వృక్ష పరిశోధకుడు పీటర్ వృసంకీ తెలిపారు. 'ఇలా కొత్త నేలలోకి తన వేర్లు స్థిరపడిన తర్వాత ఈ తాటిచెట్టు సహనంతో అటువైపు వంగుతాయి. పాత వేర్లు క్రమంగా గాలిలోకి లేస్తాయి. కొత్త వేర్లు పాతుకుంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం మంచి సూర్యరశ్మి, బలమైన భూసారమున్న ప్రదేశానికి ఈ చెట్టు చేరుతుంది' అని స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాటిస్లావాలో పనిచేస్తున్న పీటర్ వివరించారు. అయితే ఎన్నో జీవవైవిధ్య వింతలకు నెలవైన ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం పలు రకాల ముప్పులను ఎదుర్కొంటున్నది. పీటర్, స్థానిక గైడ్, పర్యావరణవేత్త థీయిరీ గ్రాషియా కలిసి కొన్ని నెలలపాటు ఈ అడవిలో గడిపి, ఎన్నో ఆటంకాలు, కష్టనష్టాలు ఎదుర్కొని.. ఇక్కడి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ మహారణ్యంలో 30 మీటర్లకుపైగా జలపాతాలు, బల్లి, కప్ప జాతులకు చెందిన నూతన జీవులను కనుగొన్నట్టు వారు వివరించారు.