తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని ప్రతిది వృథా కాకుండా బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతోంది. అలాంటి తాటిచెట్లు కొందరు స్వార్థ ప్రయోజనాలకు నేలకొరుగుతున్నాయి. ఈ పరిణామాలతో తాటిచెట్లు కాలక్రమేణ అంతరించి పోతున్నాయి. తాటి చెట్లు గ్రామీణ ప్రజల నిత్య జీవితంలో విడదీయలేని అనుబంధం ఉంది. తాటిచెట్లు ఎందరికో జీవనాధరం. పేదల నివాసానికి తాటి ఆకులు, కొయ్యలు ఉపయోగపడుతుంటే..
తాటి చెట్ల నుంచి వచ్చే నీరా, నీరాతో బెల్లం తయారీ, ఆరోగ్య ప్రదాయిని అయిన స్వచ్ఛమైన కల్లుతో పాటు సీజనల్‌గా తాటిచెట్ల నుంచి వచ్చే తాటి ముంజెలు, తాటి పండ్లు, ఆ తర్వాత తేగలు, బురుగుంజ ఇలా అనేకంగా పొందుతున్నారు. ఇలాంటి కల్పతరువు వంటి తాటిచెట్లు కనుమరుగు అవుతుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆవేదన నెలకొంది.
సాక్షి, వాకాడు (నెల్లూరు): గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఆహ్లాదకరంగా కనిపించే తాటి వనాలు నానాటికి కరుమరుగు అవుతున్నాయి. తాటిచెట్లు గ్రామీణ ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నిరుపేదల కనీస అవసరాల్లో ప్రధానమైన పూరిల్లు నిర్మాణానికి వాడే ప్రతి వస్తువు ఈ తాటి చెట్ల నుంచే సేకరిస్తారు. ఈ చెట్ల కాండాన్ని ఇళ్ల నిర్మాణంలో దూలాలు కింద, ఆ కాండాన్ని చీల్చి దబ్బలు చేసి వీటిని పెండెలుగా ఉపయోగిస్తారు. తాటి ఆకులను ఇళ్ల పైకప్పులకు ఉపయోగించడం తెలిసిందే. ఒక్క విధంగా చెప్పాలంటే గృహ నిర్మాణంలో తాటిచెట్లు పాత్ర ఎనలేనిది. తాటి మానులను ఆంధ్రా టేకుగా వ్యవహరిస్తుంటారు. పూరిల్లు నిర్మాణంలోనే కాకుండా గృహోపకరణాల తయారీలో సైతం ఈ చెట్ల నుంచి సేకరించిన వస్తువులను వాడుతున్నారు.
పోషకాహార పదార్థాలు
తాటి చెట్ల నుంచి లభించే అనేక ఆహార పదార్థాల్లో పోషకాలు ఎక్కువగా లభిస్తున్నాయి. సీజనల్‌గా తాటిగెల నుంచి నీరా వస్తుంది. దీంతో తాటి బెల్లం తయారీ చేసేవారు. తాటిబెల్లంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం తాటిబెల్లం వినియోగం బాగా పెరిగింది. నీరా తర్వాత కల్లు. ఇది మత్తు పానీయం. కానీ తాజాగా కల్లులో కూడా పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాటికాయలు వస్తే.. అందులో లభించే ముంజులు ఆరోగ్యానికి, చల్లదనానికి ఎంతో ఉపయోగపడుతాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు లొట్టలేసుకుని మరీ తింటారు. మార్చి ఆఖరు నుంచి జూన్ వరకు తాటి ముంజుల వ్యపారం జోరుగా జరుగుతుంది. ఇక ఎంతో కమ్మదనానిచ్చే తాటి పండ్లను గ్రామీణులు ప్రీతిగా తింటారు. తాటి పండ్ల నుంచి లభించే టెంకలు నుంచి వచ్చే తేగలు ఇటు గ్రామీణులు, పట్టణ వాసులు అనే తేడా లేకుండా తేగలను ఆప్యాయంగా తింటారు. సీజన్‌లో ఈ తేగలను జిల్లా నుంచి చెన్నైకి ఎగుమతి చేస్తున్నారు.
అంతరించిపోతున్న సంపద
గతంలో ఆధునిక వ్యవసాయం అందుబాటులో లేని రోజుల్లో వేలాది ఎకరాల బీడు భూముల్లో తాటి చెట్లను విస్తృతంగా రైతులు పెంచేవారు. వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత కొంత మేరకు వ్యవసాయ భూములుగా మారిపోయాయి. ఆ తర్వాత చేపలు, రొయ్యిల చెరువులు ఎక్కువ కావడంతో సముద్ర తీర ప్రాంతంలోని తాటి తోపులు అదృశ్యమైపోయాయి. దీంతో భవిష్యత్‌లో మానవ మనగడకే ప్రమాదం ఏర్పడుతుంది. తుపాన్ తాకిడికి సముద్ర తీరం కోతకు గురికాకుండా ఎదుర్కోగల గుణం ఈ వృక్షాలకు ఉంది. పెను తుపాను, ఉప్పెనలూ సంభవించినా ప్రచండ గాలులు వీచినా, తాటి చెట్లు అలాగే నిలిచి ఉంటాయి. కరువు కాటకాల్లో ఈ తాటి చెట్లు గ్రామీణ నిరుపేదలను కామధేనువుల్లా ఆదుకునేవని చెబుతుంటారు.
పేదలకు ఉపాధి
ఏటా తాటి నుంచి తీసే కల్లుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. ఇది ఒక సామాజిక వర్గానికి ఉపాధి వనరు కాగా, గ్రామాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు నిరుపేదలు తాటి సంపదతోనే బతికేవారు. తాటి నుంచి వచ్చిన సంపదను విక్రయిస్తూ బతుకులు నెట్టుకు వస్తున్నారు. ఇప్పుడు పొలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మిగిలిన తాటిచెట్లను కూడా ఎడాపెడా నరికి వేసి, కెమికల్ వేసి చంపేస్తున్నారు. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమైంది. మానవ వికాశానికి దోహదపడే ఈ వృక్షాలను వాడుకోవడం తప్ప వీటి పెంపకాన్ని ప్రోత్సహించే నాథుడే లేకుండా పోయాడు. ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వీలున్న ఈ మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
వినిమయ వస్తువుల తయారీ
తాటి చెట్టుకు సంబంధించిన ప్రతి దానితో ఎన్నో రకాల వస్తువులను తయారు చేయడం విశేషం. పల్లె సీమల్లో ఆధునికత ప్రవేశించని రోజుల్లో తాటాకులతో తయారు చేసిన విసనకర్రలు, బుట్టలు, చాపలు ప్రతి ఇంట్లోను దర్శనమిచ్చేవి. వీటితోనే తయారు చేసిన గూడలను వర్షాకాలంలో గ్రామీణులు గొడుగుల్లా ఉపయోగించేవారు. తాటి నారతో రకరకాల మోకులు, పలుపులు, తాళ్లు విరివిగా తయారు చేసేవారు. తాటి చెట్ల రసం నుంచి తయారు చేసిన తాటి బెల్లంలో విశేష పోషక విలువులున్నాయి.
తాటి వనాల వల్ల అన్నీ లాభాలే
మాలాంటి పేద కుటుంబాల వారికి తాటిచెట్లు ఉంటే నిత్య జీవితంలో అన్ని విధాలా ఆదుకుంటాయి. డబ్బున్న మా రాజులు మిద్దెలు కడుతారు. మా వంటి పేదవాడు తాటి చెట్లు నుంచి వచ్చే ఆకులు, దబ్బలతో పూరిగుడిసె వేసుకుని ఇంటిల్లాపాది దర్జాగా గడుపుతున్నాం. పేదవాడి జీవితంతో తాటిచెట్లు అనుబంధం అలా ఉంటుంది. తాటి వనాలు పెంచడం ద్వారా ఎందరికో ఉపాధి కల్పన జరుగుతుంది. తాటిచెట్లను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ఎంబేటి సుబ్రహ్మణ్యం కుటుంబం, వెంకటరెడ్డిపాళెం
పేదవాడి జీవితం తాటిచెట్లు
గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల జీవితాలు తాటి చెట్లతో ఎంతగానో ముడిపడి ఉన్నాయి. గ్రామీణులు తాటి చెట్ల నుంచి వచ్చే ఆకులు, తేగలు, దబ్బలు, కల్లు, తాటినార తాడులు ఇలా అనేక రకాల వస్తువులను తయారు చేసుకుని ఉపయోగించుకుంటూ ఇతరులకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాం. విపత్తుల సమయంలో వరదలను అడ్డుకుంటాయి. ప్రస్తుతం రొయ్యల చెరువులు వృద్ధి చెంది తాటి వనాలు కనుమరుగవుతున్నాయి. తాటిచెట్లను కాపాడుకుంటే భావితరాలకు మేలు జరుగుతుంది.
– కావలి వీరాఘవులు, వాకాడు
Comments
Please login to add a commentAdd a comment