జీవన్గీ దగ్గర ఉన్న ఈత వనం
బషీరాబాద్ : 4వ విడత హరితహారంలో తొమ్మిది లక్షల మొక్కలు నాటాలని జిల్లా ఆబ్కారీ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మొక్కలు నాటాలంటే సుమారు రెండు వేల ఎకరాల స్థలం కావాలని ఆబ్కారీ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది మూడో విడతలో చెరువుగట్లపై, గీతా కార్మిక సొసైటీ భూముల్లో, అసైన్డ్ భూముల్లో 8 లక్షల మొక్కలు నాటారు. సంరక్షణలేక పోవడంతో అందులో సగానికి పైగా ఎండిపోయాయి.
దీంతో ఈసారైనా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయనుంది. ఈ విడత లక్ష్యం చేరుకోవడానికి ఎక్సైజ్ యంత్రాంగం ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో తొమ్మిది లక్షల ఈత మొక్కలను ఎక్కడ నాటాలనే ఆలోచనలో పడింది. ఇప్పుడున్న చెరువు గట్లు మీద పెట్టినా స్థలం సరిపోదని భావించిన ఆబ్కారీ అధికారులు సరికొత్త ఆలోచనకు తెరలేపారు.
హరితహారం లక్ష్యాన్ని గీతా కార్మికులకు నిర్ధేశించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొక్కలు నాటడానికి స్థలాలులేకుంటే గౌడల పట్టా భూముల్లోనైనా నాటించాడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఒక్కో గీతా కార్మికుడికి ఐదు వందల నుంచి వెయ్యి ఈత మొక్కలు నాటాలని ఆదేశిస్తున్నారు. గౌడలు ఇంత పెద్దమొత్తంలో మొక్కలు ఎలా నాటాలని లోలోన మదన పడుతున్నారు. అధికారుల ఆదేశాలు విస్మరిస్తే కష్టాలు వస్తాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
పట్టా భూముల్లో నాటండి
తాండూరు నియోజకవర్గంలో 4వ విడత హరితహారం కింద 3లక్షల ఈత మొక్కలు నాటాలని లక్ష్యం ఉంది. దీనికోసం ఒక్కో గీతా కార్మికుడు తప్పనిసరిగా వెయ్యి మొక్కలు నాటాలని తాండూరు ఎక్సైజ్ సీఐ రమావత్ టుక్యానాయక్ ఆదేశిస్తున్నారు.
బషీరాబాద్ మండలంలోని మైల్వార్‌లో ఓ గీతా కార్మికుడి ఇంటికి మంగళవారం వెళ్లి విషయాన్ని చెప్పడంతో అతడి నోట మాట రాలేదు. ‘ఇన్నీ మొక్కలు ఇస్తే ఎక్కడ నాటాలి సార్.. పోయినేడాది నాటిన మొక్కలకే జాగ లేదు.. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి..’ అంటూ ఆ గీతా కార్మికుడు సీఐని ప్రశ్నించారు. మీ పట్టా భూముల్లో నాటండడని సీఐ సమాధానం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment