జీరిక నీరా, బెల్లం భేష్‌! | Fishtail Palm Tree neera | Sakshi
Sakshi News home page

జీరిక నీరా, బెల్లం భేష్‌!

Published Tue, Jan 23 2018 1:08 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

Fishtail Palm Tree neera - Sakshi

తాటి బెల్లం ద్వారా ఒనగూడే ఔషధ గుణాలు, పోషక విలువలు ఎన్నో. అనాదిగా మన పెద్దలు వాడుతున్న ఆరోగ్యదాయకమైనది తాటి బెల్లం. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో తాటి బెల్లానికి, ఆరోగ్య పానీయంగా తాటి నీరా వాడకానికి మళ్లీ ఆదరణ పెరుగుతోంది. తాటి బెల్లాన్ని సాధారణ పంచదార, బెల్లానికి బదులుగా వాడటం ఎంతో ఆరోగ్యదాయకమని వైద్యులు చెబుతున్నారు. అందువల్లే మధుమేహ రోగులు సైతం తాటి బెల్లాన్ని నిక్షేపంగా వాడుతున్నట్లు చెబుతున్నారు.
 
అయితే, ఈ బెల్లం తయారీకి అవసరమైన నీరా ఉత్పత్తి తాటి చెట్టుకు రోజుకు 5–6 లీటర్లకు మాత్రమే పరిమితం. తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే ‘జీరిక’ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ఇటీవల వేలాది జీరిక మొక్కలను నర్సరీల నుంచి సేకరించి తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేస్తున్నారు.

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఇటీవల నల్లగొండ జిల్లా మల్లేపల్లిలో తాటి పరిశోధనా స్థానాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రంలో జీరిక చెట్లపై కూడా పరిశోధన ప్రారంభించటం మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఈ జీరిక చెట్ల మాదిరిగానే కనిపించే అలంకారప్రాయమైన మరో జాతి చెట్లు కూడా ఉన్నాయని, వీటిని కేవలం అందం కోసం లాండ్‌స్కేపింగ్‌లో వాడుతున్నారని.. నీరా కోసం జీరిక మొక్కలను నాటుకునే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గిరిజనుల కల్పవృక్షం.. జీరిక
జీరిక చెట్టును సుల్ఫి లేదా ఫిష్‌టైల్‌ పామ్‌ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో గిరిజనులు సాంప్రదాయకంగా జీరిక నీరాను, కల్లును ఆరోగ్యపానీయంగా వాడుతున్నారు. తాటి చెట్ల నీరా/కల్లు కన్నా రుచికరమైనది కావడంతో జీరిక నీరా/కల్లుకు జగదల్‌పూర్, బస్తర్‌ ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉంది. ఇది గిరిజనులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా కూడా ఉంది.

నాటిన ఆరేళ్ల నుంచే నీరా దిగుబడి..
జీరిక మొక్క నాటిన ఆరేళ్ల నుంచి 25 ఏళ్ల వరకు.. ఒక్కో జీరిక చెట్టు నుంచి సగటున 30–40 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. భూసారం తదితర సానుకూలతల వల్ల కొన్ని చెట్ల నుంచి రోజుకు 50–60 లీటర్ల వరకు నీరాను సేకరిస్తూ, ఆరోగ్య పానీయంగా వినియోగిస్తున్నారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకోవడానికి నీటికి బదులు జీరిక నీరాను గిరిజనులు వినియోగిస్తుంటారు. తద్వారా కేన్సర్, తదితర జబ్బులు నయమవుతున్నాయని కూడా గిరిజన సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తున్నారు.

ఆ విధంగా జీరిక నీరా/కల్లు ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జగదల్‌పూర్, మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగానే కాకుండా.. వారి ఆహార సంస్కృతిలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నది. అందువల్లనే గిరిజనులు జీరిక చెట్టును కల్పవృక్షంగా కొలుస్తారు. ఆడ పిల్లకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే అలవాటు కూడా అక్కడ అనాదిగా ఉన్నది. ఈ కారణంగా ఒక్కో చెట్టు నుంచి ఏటా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు గిరిజనులు ఆదాయం పొందుతుండటం విశేషం.

మైదాన ప్రాంతాలకు జీరిక అనువైనదేనా?
జీరిక చెట్లు ప్రస్తుతం ఆంధ్ర–ఒడిశా– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. తాటి చెట్ల కన్నా 6–7 రెట్ల నీరా దిగుబడినిస్తున్నాయి. అయితే, మైదాన ప్రాంతాల్లో ఈ చెట్లు ఇదే మాదిరిగా అధికంగా నీరా దిగుబడిని ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాలని డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా స్థానం సీనియర్‌ ఆహార శుద్ధి శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ‘సాగుబడి’ తో చెప్పారు.

అనాదిగా జీరిక పెరుగుతున్న మారేడుమిల్లి తదితర ప్రాంతాలు సముద్ర తలం నుంచి 250 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ విధంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు వీటి కన్నా ఎత్తయినవే. కాబట్టి, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మినహా ఎత్తయిన మైదాన ప్రాంతాల్లో కూడా జీరిక సాగు లాభదాయకంగానే ఉండొచ్చని ఆయన చెబుతున్నారు. అయితే, జీరిక నీరా దిగుబడిపై వాతావరణం, భూములు.. ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏమేరకు ఉంటుందో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది.

జగదల్‌పూర్‌లో రెండేళ్ల క్రితమే జీరికపై ప్రత్యేక పరిశోధనా స్థానం ఏర్పాటైంది. దీనిలో పరిశోధనలు ప్రస్తుతం శైశవ దశలోనే ఉన్నాయి. వెంగయ్య తమ పరిశోధనా స్థానంలో గత ఏడాది గిరిజనుల నుంచి సేకరించిన జీరిక మొక్కలను నాటారు. మైదాన ప్రాంతాల్లో కూడా నీరా దిగుబడి బాగా ఉందని రుజువైతే.. ఆరోగ్యదాయకమైన పానీయం నీరాతో పాటు ఔషధగుణాలుండే సహజ జీరిక బెల్లాన్ని కూడా భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి, అశేష ప్రజానీకానికి అందుబాటులోకి తేవటం సాధ్యమవుతుందని వెంగయ్య అన్నారు. తాటి బెల్లంలో మాదిరిగా జీరిక బెల్లంలో కూడా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి.. సాధారణ పంచదార/బెల్లానికి బదులు తాటి/జీరిక బెల్లాన్ని ఏ వయస్సు వారైనా, మధుమేహ రోగులు సైతం వాడొచ్చని ఆయన తెలిపారు.

100 లీటర్ల జీరిక నీరాతో 15 కిలోల బెల్లం
తాటి నీరా కన్నా జీరిక నీరా రుచికరమైనది కూడా. జీరిక నీరాతో తాటి నీరాతో మాదిరిగానే 12–15% బెల్లం రికవరీ(100 లీటర్ల నీరాను ఉడికించితే 12–15 కిలోల బెల్లం ఉత్పత్తి) వస్తున్నదని వెంగయ్య జరిపిన ప్రాధమిక అధ్యయనంలో తేలింది. అయితే, ఔషధగుణాలు, ఖనిజలవణాలు, పోషకాల విషయంలో కూడా తాటి, జీరిక నీరాల మధ్య తేడా ఏమైనా ఉందా అనేది పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా తేడా ఉండకపోవచ్చు అని వెంగయ్య (94931 28932) తెలిపారు.

జీరిక చెట్ల వద్ద రాలిపడిన కాయల ద్వారా మొక్కలు మొలుస్తుంటాయి. గిరిజనులు వాటిని తెచ్చి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో వారపు సంతల్లో విక్రయిస్తుంటారు. జీరిక చెట్ల కాయలు పెద్ద రేగు కాయల సైజులో ఉంటాయి. జీరిక చెట్లలో వైవిధ్యం, అవి పెరుగుతున్న భూములను బట్టి వాటి కాయల రంగులో తేడా కనిపిస్తోంది. ఈ కాయల నుంచి విత్తనాలను సేకరించి.. నర్సరీలో మొక్కలను పెంచుకొని నాటుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.




– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement