తాటి చెట్టుకు పది వేలు! | About 6 crore palm trees are not used in Telugu states | Sakshi
Sakshi News home page

తాటి చెట్టుకు పది వేలు!

Published Tue, Feb 19 2019 2:24 AM | Last Updated on Tue, Feb 19 2019 2:24 AM

About 6 crore palm trees are not used in Telugu states - Sakshi

చెరకు పంచదార, బెల్లంకు బదులుగా తాటి బెల్లాన్ని వినియోగించడం అత్యంత ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతుండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శ్రీలంక వంటి దేశాలు తాటి బెల్లం, తాటి చక్కెరను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి నిపుణులు, తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి సి వెంగయ్యతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఎదిగిన ప్రతి తాటి చెట్టు నుంచి తాటి బెల్లం ఉత్పత్తి ద్వారా సంవత్సరానికి రూ. పది వేల ఆదాయాన్ని పొందేందుకు వీలుందని, గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చని, కేవలం రూ. 20 వేల మూల పెట్టుబడితో గ్రామస్థాయిలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆయన చెబుతున్నారు.  

తాటి బెల్లం ప్రయోజనాలు? 
తాటి బెల్లం చెరకు పంచదార, బెల్లం కన్నా ఆరోగ్యదాయకమైనది. ఇందులో ఫ్రక్టోజు (76.86 శాతం) ఎక్కువగా, గ్లూకోజ్‌ తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జి.ఐ.) 40 లోపే. నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. చెరకు పంచదార జి.ఐ. 100. తిన్న వెంటనే గ్లూకోజ్‌ రక్తంలోకి చేరుతుంది. ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మాక్రో న్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజుకు ప్రతి ఒక్కరూ 10 గ్రా. తీసుకుంటే మంచిది. చక్కెర బెల్లం, పంచదారకు బదులు ఇంట్లో తాటి బెల్లం వాడుకుంటే చాలు.
 
తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం ఉత్పత్తికి ఉన్న అవకాశాలేమిటి? రైతులకు /గీత కార్మికులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనీసం 6 కోట్ల తాటి చెట్లు ఉంటాయని అంచనా. వీటిలో కొన్నిటి నుంచి కల్లు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క శాతం చెట్లను కూడా మనం ఉపయోగించుకోవడం లేదు. 99% చెట్లు వృథాగా ఉండిపోతున్నాయి. చెట్టుకు రోజుకు కనిష్టం 4 (గరిష్టం 8)లీటర్ల చొప్పున వంద రోజుల పాటు నీరాను సేకరించవచ్చు. ఏటా సగటున చెట్టుకు 40 కిలోల తాటి బెల్లం తయారు చేయవచ్చు.

ప్రతి చెట్టు నుంచి నెలకు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందవచ్చు. ఏటా కనీసం రూ. 10 నుంచి 12 వేల వరకు ఆదాయం పొందే మార్గాలున్నాయి. 1969 నీరా రూల్స్‌ ప్రకారం ఎక్సైజ్‌ శాఖ అనుమతి పొంది గ్రామ స్థాయిలోనే చాలా సులువుగా తాటి బెల్లం తయారు చేయటం ప్రారంభించవచ్చు. వాల్యూ చెయిన్‌ను ప్లాన్‌ చేస్తే ఏడాది పొడవునా తాటి బెల్లం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, రైతులకు, గీత కార్మికులకూ స్థిరమైన ఆదాయం వస్తుంది. పీచు, తేగల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. తేగల పొడిని మైదాకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యదాయక బేకరీ ఉత్పత్తుల్లో వినియోగించవచ్చు. 

చిన్న యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది?
తాటి చెట్ల నుంచి పరిశుద్ధమైన పద్ధతిలో సున్నం వాడకుండానే నీరాను సేకరించే కూలింగ్‌ బాక్స్‌ను మేం రూపొందించాం. సాధారణంగా కుండల్లో కొంచెం సున్నం వేసి చెట్టుకు కడతారు. నీరా త్వరగా పులిసిపోకుండా ఉండటానికి ఇలా చేస్తారు. అయితే, సున్నం వేయకుండానే ఈ కూలింగ్‌ బాక్సుల ద్వారా నీరాను సేకరించే పద్ధతిని మేం కనుగొన్నాం. సేకరించిన నీరాను బాండీల్లో పోసి ఉడకబెడితే రెండు గంటల్లో తాటి బెల్లం తయారవుతుంది. ఇందుకు ఇనుప బాండీల కన్నా స్టెయిన్‌లెస్‌ స్టీల్‌(ఎస్‌.ఎస్‌.) బాండీలను వాడితే మంచిది. వంద లీటర్ల ఎస్‌.ఎస్‌. బాండీ, కూలింగ్‌ బాక్సులు ఇతర పరికరాలు కలిపి మొత్తం రూ. 20,000 ఖర్చవుతాయి. బ్యాచ్‌కు పది కిలోల తాటి బెల్లం తయారవుతుంది. ఈ మాత్రం పెట్టుబడితో ప్రతి గ్రామంలోనూ కట్టెలు లేదా గ్యాస్‌ పొయ్యిలపై తాటి బెల్లం వండుకోవచ్చు. కొంత అధిక పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పితే స్టీమ్‌ ద్వారా నడిచే 300 లీటర్ల ఎస్‌. ఎస్‌. బాండీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 

నీరా సీజన్‌ ఎన్నాళ్లు?
నవంబర్‌ నుంచే మగ చెట్ల(పోత్తాళ్ల) నుంచి నీరా తీయొచ్చు. ఆడ చెట్ల (పలుపు తాళ్ల) నుంచి ఫిబ్రవరి నుంచి, పండు తాళ్ల నుంచి జూన్‌–ఆగస్టు నెలల వరకు నీరా తీస్తూనే ఉండొచ్చు. మెలకువలు పాటిస్తే ఏడాది పొడవునా నీరాను పొందే పద్ధతులను మేం రూపొందించాం. అంటే.. ప్రతి గ్రామంలో స్వల్ప పెట్టుబడితోనే ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప తాటి బెల్లం మరెక్కడా తయారు చేయటం లేదు.

ఎన్నాళ్లు నిల్వ ఉంటుంది? నీరుగారిపోతుందని అంటున్నారు?
తాటి చెట్లకు మట్టి కుండలు కట్టి నీరా సేకరించే పద్ధతిలో నీరా పులిసిపోకుండా ఉండేందుకు లీటరుకు 3–4 గ్రాముల సున్నం వేస్తుంటారు. సున్నం ఎక్కువైతే నీరా ఉదజని సూచిక(పి.హెచ్‌) పెరుగుతుంది. పి.హెచ్‌. 7–8 ఉంటే మంచిది. అంతకన్నా పెరిగితే నీరాలో నిమ్మరసం పిండి, ఉడకబెడుతుంటే సున్నం తెట్టులాగా పైకి తేలుతుంది. దాన్ని తీసేస్తే సరిపోతుంది. నీరా పి.హెచ్‌. హెచ్చుతగ్గులను సరిగ్గా చూసుకోకపోతే నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, జాగ్రత్తలు పాటించి తయారు చేసిన నాణ్యమైన తాటి బెల్లాన్ని ఎండలో 2–3 గంటలు ఆరబెట్టాలి. తర్వాత గాలి ఎక్కువగా లేకుండా ప్యాకింగ్‌ చెయ్యాలి. ఇలా చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటుంది. వాక్యూమ్‌ ప్యాకింగ్‌ చేస్తే మూడేళ్ల వరకు నిల్వ ఉంటుంది. తాటి బెల్లానికి గాలిలో తేమను చప్పున గ్రహించే స్వభావం ఉంటుంది. 

బెల్లం వండటంలో మెలకువలేమిటి?
నీరాలో 80% నీరే ఉంటుంది. అరిసెల పాకం వచ్చే వరకు మరగకాచి.. అచ్చుల్లో పోసుకొని, అచ్చులను ఎండబెట్టి ప్యాకింగ్‌ చేసుకోవాలి. వంద లీటర్ల నీరాకు పది కిలోల బెల్లం వస్తుంది. అరిసెల పాకం వచ్చిన తర్వాత కూడా 10–15 నిమిషాలు బాండీలోనే ఉంచి తిప్పుతూ ఉంటే.. తాటి బెల్లం పొడి తయారవుతుంది. బెల్లంలో తేమ 7% కన్నా తక్కువ ఉంటే సంవత్సరం నిల్వచేసుకోవచ్చు. 

ఈత, జీలుగ బెల్లం కూడా మంచిదే కదా..
అవును. తాటి చెట్ల నుంచి నాటిన 14 ఏళ్లు, ఈత చెట్టు 6–7 ఏళ్లు, జీలుగ చెట్లు 6వ ఏట నుంచి నీరాను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రోజుకు తాటి చెట్టు నుంచి 1–8 లీటర్లు, ఈత చెట్టు నుంచి 1–3 లీటర్లు, జీలుగ చెట్ల నుంచి 50 లీటర్ల వరకు నీరా ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఏ నీరాతో బెల్లం అయినా ఆరోగ్యదాయకమైనదే. 

చెట్లు ఎక్కే వాళ్లే కరువయ్యారు కదా..
నిజమే. తాటి బెల్లానికి గిరాకీ పెరిగింది. కిలో రూ. 300 పలుకుతోంది. కాబట్టి ఆదాయమూ బాగా వస్తుంది. అయితే, చెట్లు ఒకే చోట వరుసగా ఉంటాయి కాబట్టి ఒక చోటున్న చెట్లకు కలిపి మంచె కట్టుకోవచ్చు. ఈ చివర చెట్టు దగ్గర మంచె ఎక్కితే, ఆ చివర చెట్టు దగ్గర కిందికి దిగొచ్చు. మా తాటి పరిశోధనా స్థానంలో ఇలాగే చేస్తున్నాం. అప్పుడు చెట్టెక్కే నిపుణులు కాని వారు కూడా సులువుగా నీరా సేకరించుకోవచ్చు. చెట్టుకు ఏటా రూ. 10 వేల నుంచి 12 వేలకు పర్మినెంట్‌ ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. తమిళనాడులో మాదిరిగా మనమూ దృష్టి పెట్టాలి. 
(తూ.గో. జిల్లా పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు).


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement