గోవాలో ట్రాన్స్‌లొకేట్ చేస్తున్న తాటిచెట్టు, గండిపేటలో తొలగించిన చెట్టు
అదో మారుమూల గ్రామం.. కానీ, ప్రకృతిపరిరక్షణపై చైతన్యం ఎక్కువే. అందుకే.. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చెట్లను కొట్టేయబోతే, అడ్డుకుని వాటిని కాపాడేందుకు ముందుకొచ్చారు.. అక్కడి అధికారులు కూడా సహకరిస్తున్నారు. అవేమీ మర్రి చెట్టులాంటి వృక్షాలు కాదు, తాటిచెట్లు. ఇదీ పశ్చిమ బంగాలోని బంకురా జిల్లా బిష్ణుపూర్ గ్రామీణుల చైతన్యం.
సాక్షి, హైదరాబాద్: నీడనిచ్చే విశాలమైన పచ్చనిచెట్లు.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 286 వృక్షాలు.. వీటి వయసు 20 ఏళ్లకుపైబడే ఉంటాయి.. నగర శివారులోని గండిపేట రోడ్డుకు ఆ చెట్లే అందం. రోడ్డు విస్తరణలో భాగంగా వాటిని కొట్టేయబోతే (42 చెట్లకు మాత్రం ట్రాన్స్‌లొకేట్ అనుమతి ఉంది) కొందరు స్థానికులు ముందుకొచ్చి వాటిల్లో యోగ్యమైన వాటిని తరలించి మరోచోట నాటించాలనుకున్నారు. కానీ, అందుకు ఇక్కడి అధికారులు విధించిన షరతులే అడ్డుగా మారాయి. వాటిల్లో 9 చెట్లను మంగళవారం నరికేశారు.
బెంగాల్‌లో తాటి చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసి కాపాడుకునేందుకు స్థానికులు హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. ఆ చెట్ల తరలింపునకు అక్కడి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. వచ్చే వారమే పనులు మొదలు కానున్నాయి. అదే స్వచ్ఛంద సంస్థను హైదరాబాద్ గండిపేట ప్రాంతవాసులు సంప్రదించి కాపాడుకునేందుకు ముందుకు వచ్చినా ఇక్కడి అధికారులు గొడ్డలి వేటుకే జై అంటున్నారు. అక్కడి అధికారులకు, ఇక్కడి అధికారులకు మధ్య ఎంత తేడా?
నగరం నుంచి గండిపేటకు దారితేసే రోడ్డును విస్తరించేందుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించే పని రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రారంభించారు. ఈ చెట్లను కాపాడే దిశలో దాదాపు మూడు నెలలుగా జరుగుతున్న వ్యవహారం వృక్ష ప్రేమికులను ఆవేదనకు గురిచేస్తోంది. హైకోర్టు జోక్యం చేసుకున్నా వాటిని కాపాడుకోలేని నిస్సహాయత ఇక్కడ నెలకొంది. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నా.. సమస్య పరిష్కారంకాలేదు. సరిగ్గా ఇదే సమయంలో.. బెంగాల్ ప్రజల స్పూర్తిదాయకమైన గాధ తెరపైకి వచ్చింది.
తాటి చెట్లను కాపాడుకునే దిశలో..
బెంగాల్‌లోని సారెంగా ప్రాంతానికి వెళ్లే రాష్ట్ర రహదారిని విస్తరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బిష్ణుపూర్ అనే ఊళ్లో 200కుపైగా తాటిచెట్ల తొలగింపునకు మార్కింగ్ చేశారు. ప్రకృతి ప్రేమికులైన స్థానికులు వెంటనే అక్కడి నిషాన్ సబూజే సమాజే అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. తాటిచెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసే హైదరాబాద్‌కు చెందిన వటా ఫౌండేషన్ వివరాలను ఇంటర్నెట్‌లో గుర్తించారు. ఇటీవల గోవాలో కొన్ని తాటిచెట్లను తరలించి కాపాడినట్టు గుర్తించారు. వెంటనే ఆ సంస్థను సంప్రదించగా నిర్వాహకులు అంగీకరించారు. సాంకేతిక, ఆర్థిక సాయం అందించేందుకు అక్కడి జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు. వాచ్చే వారం వాటి ట్రాన్స్‌లొకేట్ పనులు మొదలు కాబోతున్నాయి.
ఉపాధి వేటలో..
వెనకబడ్డ బంకురా జిల్లా ప్రాంతంలో కొంతకాలంగా తాటిచెట్లను ఉపాధికి అవకాశంగా మార్చుకోవటం ప్రారంభించారు. తాటి కల్లు నుంచి బెల్లం, ఇతర స్వీట్ల తయారీని నేర్చుకున్నారు. అందుకు తాటిచెట్లకు కొదవ లేదు. ఎన్ని చెట్లున్నా.. రోడ్డు విస్తరణలో కోల్పోయే చెట్లను వదలకూడదని స్థానికులు నిర్ణయించుకుని హైదరాబాద్ సంస్థను, జిల్లా కలెక్టర్‌ను సంప్రదించి కాపాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment