patangi rambabu
-
జైహింద్ స్పెషల్: మహోద్యమం.. ప్రకృతిసేద్యం
పర్యావరణానికి నష్టదాయకంగా మారిన రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోకపోతే మరో 60 పంట కాలాల్లోనే ప్రపంచ దేశాల్లోని భూములన్నీ పంటల సాగుకు బొత్తిగా యోగ్యం కాకుండా పోతాయని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. ఈ హెచ్చరిక చేసి ఐదేళ్లు గడచింది. అయితే, ఈ గడువు అన్ని దేశాలకూ ఒకేలా లేదు. భారత్ వంటి ఉష్ణమండల దేశాలకు మిగిలింది మహా అయితే మరో 25 పంట కాలాలు మాత్రమే అంటున్నారు నిపుణులు! భవిష్యత్తు..? సమస్యను సృష్టించిన మూసలోనే ముందుకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరకదు. భిన్నంగా ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో ఇప్పుడున్న సంక్షోభం ఆర్థికపరమైనదిగా పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి ఈ సంక్షోభం మూలాలు పర్యావరణంలో ఉన్నాయి. అంటే.. రసాయనాలపై ఆధారపడిన హరిత విప్లవం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి రసాయన రహిత ప్రకృతి సేద్య పద్ధతులకు మళ్లటం తప్ప భవిష్యత్తులో సజావుగా మనుగడ సాగించడానికి మరో మార్గం లేదు. రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు అనేకం అందుబాటులో ఉన్నాయి. గందరగోళపడకుండా.. వాటిల్లో తగిన పద్ధతిని ఎంచుకొని ముందడుగెయ్యటంలోనే విజ్ఞతను చూపాలి. స్వయం ఉపాధి పొందుతున్న రైతు సర్వస్వతంత్రుడు. ఆ పంటపైనే ఆధారపడి వారి జీవనం సాగుతూ ఉంటుంది. అందువల్ల అలవాటైన రసాయనిక వ్యవసాయాన్ని, అది ఎంత భారంగా ఉన్నప్పటికీ, వదలి ప్రకృతి వ్యవసాయంలోకి రైతులు మారటం అంత తేలికేమీ కాదు. ఈ పరిణామక్రమం బలవంతంగా జరగకూడదు. రైతు ఇష్టపూర్వకంగా, భరోసాగా జరగాలి. చెబితే విని రైతులు మారరు. ఎవరైనా చేసి చూపిస్తే.. అప్పుడు నమ్మి ఆ పద్ధతిని అనుసరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతి చాలా మెరుగైన ఫలితాలను అందిస్తోంది. రైతులను దశల వారీగా, కొన్ని సంవత్సరాల కాలంలో ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లేందుకు ప్రోత్సహిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రదర్శన క్షేత్రాల ద్వారా చూపి, పొలంబడులతో నేర్పిస్తూ, అవసరమైన ఉపకరణాలను అందిస్తూ, ఏడాది పొడవునా సలహాలు, సూచనలు ఇచ్చే మద్దతు వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చారు. ఎకరం, అరెకరంతో ప్రారంభించి.. నెమ్మదిగా తమ పొలం మొత్తాన్నీ ప్రకృతి వ్యవసాయంలోకి మళ్లిస్తున్న రైతులు ఎందరో ఇవ్వాళ కనిపిస్తారు. అదే గ్రామంలో రసాయనిక వ్యవసాయం చేసే వారికన్నా తక్కువ ఖర్చుతో, ఎక్కువ దిగుబడి తీస్తున్న సీనియర్ రైతులకూ కొదవ లేదు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం, సాగు నీటి వాడకం, సాగు విద్యుత్తు వాడకం కూడా తగ్గుతోంది. మరోవైపు ప్రకృతి ఆహారం తింటున్న వారి ఆరోగ్యం కుదుటపడుతోంది. రుగ్మతలు దూరమవుతున్నాయి. ఆహారమే ఔషధం అనే మాట మళ్లీ వినిపిస్తోంది. ఈ సానుకూల సంగతులను థర్డ్ పార్టీ పరిశోధనా సంస్థల అధ్యయనాలు నమోదు చేస్తున్నాయి. ఎఫ్.ఎ.ఓ., యు.ఎన్.ఇ.పి., సెస్ వంటి అనేక సంస్థలు నివేదికలు వెలువరిస్తున్నాయి. ఏపీ మార్గదర్శకం జన్యుమార్పిడి లేదా జన్యు సవరణ వంటి క్షేమదాయకం అని రుజువు కాని ప్రమాదకర సాంకేతికతలు గానీ, రసాయనాల అవసరం గానీ బొత్తిగా లేకుండానే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న వనరులతోనే వ్యవసాయ–ఆహార–ఆరోగ్య రంగంలో గొప్ప మౌలిక మార్పు తేవచ్చు అని ‘ఆర్బీకేల ఆధారిత ఆంధ్రప్రదేశ్ నమూనా ప్రకృతి సేద్య అనుభవాలు’ చాటి చెబుతున్నాయి. ప్రకృతి సేద్యంపై పరిశోధనలు చేపట్టేందుకు, ఉన్నత విద్యను అందించేందుకు ఇండో–జర్మన్ అకాడమీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రకృతి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్నీ త్వరలో ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో ఏపీ(6.5 లక్షల మంది రైతులు 2.8 లక్షల ఎకరాలలో) ప్రకృతి సాగు చేస్తూ మెరుగైన ఫలితాలను నమోదు చేస్తున్నది. ముందు నడచిన తోటి రైతుల నుంచే ఇతర రైతులు ప్రకృతి సేద్య విజ్ఞానాన్ని (ఫార్మర్ టు ఫార్మర్ టెక్నాలజీ ట్రాన్స్ ్ఫర్) నేర్చుకుంటున్న తీరును భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాలూ గుర్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తం చేయడానికి చర్యలు చేపట్టింది. వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సంస్థల దృష్టిని ప్రకృతి సేద్యం వైపు మళ్లించింది. అయితే, అప్పుడే అంతా అయిపోలేదు. కథ ఇప్పుడే మొదలైంది. మౌలిక మార్పు దిశగా పాలకులు, శాస్త్రవేత్తలు, రైతులు, వినియోగదారులు అడుగులు వేయాల్సి ఉంది. భారతీయ రైతులకు రసాయనాలు విక్రయిస్తూ ఏటా రూ. లక్షల కోట్లు గడిస్తున్న దేశ విదేశీ బహుళజాతి కంపెనీల లాబీయింగ్‌ను మన రైతులు, మన పాలకులు ఎంత దీటుగా తట్టుకొని నిలబడి ముందడుగు వేయగలరన్న దాన్ని బట్టి ప్రకృతి సేద్యం దేశ విదేశాల్లో ఎంత వేగంగా విస్తరిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్ prambabu.35@gmail.com -
వెలుగు దారులు ఏపీ రైతుల అడుగులు
స్వపరిపాలనలో 75 ఏళ్లు గడిచాయి. భారతీయ వ్యవసాయ రంగం ఇప్పుడెలా మిగిలిందో సింహావలోకనం చేసుకొని.. రాబోయే పాతికేళ్లు ఎలా ఉండబోతోందో కొంతమేరకు అంచనా వేసుకుందాం. ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఆలోచిద్దాం. ‘స్వతంత్ర భారత దేశాన్ని ఆహార కొరత నుంచి గట్టెక్కించి, స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’.. తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెర లేపింది. ఎన్నో శతాబ్దాలుగా చెక్కు చెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం కొన్ని దశాబ్దాల కాలంలోనే తునాతునకలై పోయింది. హరిత విప్లవ చోదకాలైన హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, భారీ యంత్రాలు రైతుల్ని స్వాయత్తత కలిగిన ఉత్పత్తిదారుల స్థితి నుంచి బహుళజాతి సంస్థల వినియోగదారులుగా మార్చి వేశాయి. ఎడతెగని పెట్టుబడుల పర్వంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోసాగారు. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, చీడపీడల విజృంభణ, కూలీల కొరత, మార్కెట్ అనిశ్చితి, దళారుల దోపిడీ.. మొదలైనవి రైతుల ఆదాయంలో అస్థిరతను నింపాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కందాలపై మోసిన మన రైతులు నేడు రెక్కలు తెగిన పక్షలు..’ ఇదీ సమకాలీన వ్యవసాయ సంక్షోభంపై స్వతంత్ర సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి గుండె మండే వాస్తవిక వ్యాఖ్య. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘హరిత విప్లవం నమూనా వ్యవసాయం’ మన కడుపు నింపుతున్నట్లే కనిపిస్తూ మన పుట్టి ముంచింది, ముంచుతోంది. రైతుల జేబులు ఖాళీ చేస్తూ కంపెనీల బొక్కసాలు నింపుతోంది. గత ఆరు దశాబ్దాలుగా మనం ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి రసాయనాలు కొని వేస్తూ ఎంత ఎక్కువ దిగుబడి తీద్దాం అనే ధోరణిలోనే ఆలోచించాం. దీని వల్ల నేలకు, నీటికి, పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి ఏమి హాని జరుగుతోందో ఆలోచించలేదు. పంజాబ్ సంక్షోభం హరిత విప్లవానికి పట్టుగొమ్మగా నిలిచిన పంజాబ్ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటినీ ఇవ్వాళ కేన్సర్ మహమ్మారి కమ్ముకుంది. షుగర్, గుండెజబ్బులు, ఊబకాయం.. వంటి జబ్బులూ తక్కువేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధులు అనూహ్యంగా పెరుగుతూ ఉండటం మనకు తెలియనిది కాదు. హరిత విప్లవ పెడ ధోరణులపై దూరదృష్టితో భాస్కర్ సావే వంటి వారు అప్పట్లోనే నెత్తీ నోరు మొత్తుకున్నా పెద్దగా చెవికెక్కించుకోలేదు మన పాలకులు. లేదా ఈ హాని గురించి ఆలోచించే అంత లగ్జరీ మనకు లేదని సరిపెట్టుకున్నారు. కానీ, తీరా ఇప్పుడు చూస్తే.. వ్యవసాయానికి ఆర్థిక దృష్టి మాత్రమే చాలదు.. పౌష్టికాహార, ఆరోగ్య, పర్యావరణ పరమైన సమగ్ర దృష్టి అవసరం మాత్రమే కాదు.. భూమ్మీద జీవరాశి మనుగడ కొనసాగడానికి మనుషులు ఈ స్పృహను గమనించుకొని మెలగడం అనివార్యం అని స్పష్టంగా అర్థమవుతోంది. భూమి పైపొర నేలలో పంటలు పండుతాయి. ఈ మట్టి ఆరోగ్యవంతంగా ఉంటేనే అందులో పండే పంట దిగుబడి బాగుంటుంది. అంతేకాదు. ఆ పంట దిగుబడుల్లో పోషకాల సమగ్రత కూడా నేలలో పోషకాల లభ్యత స్థాయిని బట్టే నిర్ణయమవుతుంది. నేలల్లో ఉండే సేంద్రియ కర్బనం నేల ఆరోగ్యానికి ఓ ముఖ్య సూచిక. ‘తెలుగు నాట భూముల్లో సేంద్రియ కర్బనం 30 ఏళ్ల క్రితం 0.5% ఉండేది.. ఇప్పుడు 0.2%కి అడుగంటింది. రసాయనాలు కుమ్మరించటం మాని, సేంద్రియ కర్బనం పెంచుకుంటూనే పంటలు పండించుకునే సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించటం అనివార్యం. 0.7% నుంచి 1%కు పెంచుకుంటేనే ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు సాధ్యం అని జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ నిపుణులు డా. వి. రామమూర్తి స్పష్టం చేశారు. మిగిలిందిక పాతిక పంట కాలాలే! రసాయనిక సాంద్ర వ్యవసాయం వల్ల ముంచుకొస్తున్న ముప్పు మన ఒక్క దేశానికే పరిమితమై లేదు. ఐక్యరాజ్య సమితిలో ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతున్నదే మిటంటే.. మనందరం తినే ఆహారంలో 95% భూమి పైపొర మట్టిలో పండినదే. నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పంట భూములు నానాటికీ క్షీణిస్తున్నాయి. భూసారం క్షీణించి భూములు సాగు యోగ్యం కాకుండా పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 83.3 కోట్ల హెక్టార్ల పొలాలు ఉప్పుదేలటమో, చౌడుబారిపోవటమో ఇప్పటికే జరిగింది. అంటే.. పంట భూముల్లో పది శాతం ఈ విధంగా సాగు యోగ్యం కాకుండా పోయాయి. చౌడు సమస్య మరింత పెరిగితే నికర సాగు భూముల విస్తీర్ణం ఇంకా తగ్గిపోతుంది. వ్యవసాయం చేసే పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోక తప్పదు. నేల ఆరోగ్యమే మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యమని అందరూ తెలుసుకోవాలి అని ఎఫ్.ఎ.ఓ. డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు చెబుతున్నారు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు prambabu.35@gmail.com -
మిరప సహా కూరగాయలు, అలంకరణ మొక్కలకూ కొత్త రకం తామర పురుగుల బెడద
మిరప రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న కొత్త రకం తామర పురుగులు మిరప పూలతో పాటు లేత మిరప కాయలను కూడా ఆశిస్తున్నట్లు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. లక్షలాది హెక్టార్లలో సాంద్ర పద్ధతిలో సాగులో ఉన్న మిరప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దీని ఉనికిని గుర్తించారు. మిరప తోపాటు టమాటో, బంగాళదుంప, వంగ వంటి సొలనేసియే కుటుంబానికి చెందిన కూరగాయ పంటలకు కూడా కొత్త రకం తామర పురుగులు సోకే ప్రమాదం వున్నందున అప్రమత్తంగా ఉండాలని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతులకు సూచిస్తోంది. గత ఏడాది జనవరి–ఫిబ్రవరిలో చిలకలూరిపేట, ప్రత్తిపాడు, యడ్లపాడు మండలాల్లో మొట్టమొదటి సారిగా కొత్త రకం తామర పురుగులు మిరప పూలను ఆశిస్తున్నట్లు లాం లోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే గుంటూరు జిల్లాలో కొత్త రకం తామర పురుగు మిరప తోటలను ఆశించిందని లాం ఉద్యాన శాస్త్రవేత్తలు గమనించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతోపాటు తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లోని మిరప తోటలను తామరపురుగు ఆశించిందని సమాచారం. బెంగళూరులోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వ్యవసాయ సంబంధ పురుగు వనరుల జాతీయ బ్యూరో (ఎన్.బి.ఎ.ఐ.ఆర్.) శాస్త్రవేత్తలతో సంప్రదించిన తర్వాత ఇవి ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అనే కొత్త రకం తామర పురుగులని గుర్తించినట్లు డా. వైఎస్సార్ హెచ్.యు. వైస్ ఛాన్సలర్ డా. టి జానకిరాం, పరిశోధనా సంచాలకులు డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త రకం తామర పురుగులు ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. హవాయి, ఇండోనేషియా దేశాల్లో ఈ తామరపురుగులు సొలనేసియే కుటుంబానికి చెందిన మిరపతో పాటు టమాటో, వంగ, బంగాళ దుంప వంటి కూరగాయ మొక్కలను, అలంకరణ మొక్కలను కూడా ఎక్కువగా ఆశించే ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరు రైతులు కొత్త రకం తామర పురుగులను చూసి ఎర్రనల్లి అని భావించి సంబంధిత మందులు వాడుతున్నారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి తెలిపారు. బయో మందులు వాడితే రసంపీల్చే పురుగుల తీవ్రత పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ పురుగు ఆశించిన పొలాల్లో రైతులు భయాందోళనలో విపరీతమైన, విచక్షణారహితంగా పురుగుమందులను కొడుతున్నారు. తద్వారా పురుగు ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందువల్ల తాము సిఫారసు చేసిన పురుగుమందులను సూచించిన మోతాదులో పిచికారీ చేయటం ద్వారా ఉధృతిని తగ్గించుకోవచ్చని డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి వివరించారు. సందేహాలు తీర్చుకోవటం ఎలా? ఈ సమస్య గురించి రైతులు మరింత సమచారం తెలుసుకోవాలంటే.. డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని లామ్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి – సీనియర్ శాస్త్రవేత్త డా. సి. శారద (94904 49466), శాస్త్రవేత్త డా. కె. శిరీష (99891 92223)లను అన్ని పని దినాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో కాల్ చేసి మాట్లాడవచ్చు. రేపు వెబినార్ అధిక వర్షాల సందర్భంగా ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన నష్ట నివారణ చర్యలపై ఈ నెల 24 (బుధవారం) ఉదయం 11 గం. నుంచి మ. 1.30 గం. వరకు డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం జూమ్ ఆప్ ద్వారా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ప్రవేశం ఉచితం. జూమ్ మీటింగ్ ఐ.డి.. 823 5000 1594 పాస్వర్డ్ – 863362. యూట్యూబ్ ద్వారా కూడా పాల్గొనవచ్చు. మిద్దె తోటల సాగుపై 3 రోజుల ఆన్లైన్ కోర్సు ఇంటిపై కూరగాయలు, పండ్ల సాగులో మెలకువలు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికుల ప్రయోజనార్థం డిసెంబర్ 16–18 తేదీల్లో మూడు రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సును నిర్వహించాలని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, విస్తరణ విద్యా సంస్థ (ఇ.ఇ.ఐ.) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆసక్తి గల గృహిణులు, ఉద్యోగులు, యువత తమ ఇంటి నంచే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా శిక్షణ పొందవచ్చని ఇ.ఇ.ఐ. సంచాలకులు డాక్టర్ ఎం. జగన్మోహన్రెడ్డి తెలిపారు. ప్రొఫెసర్లు డా. ఆర్. వసంత, డా. పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ కోర్సు జరగనుంది. వంద మందికి మాత్రమే ప్రవేశం. కోర్సు ఫీజు రూ. 1,500. రిజిస్ట్రేషన్ కోసం... https://pjtsau.edu.in/www.eeihyd.org/ https://forms.gle/wPriDddKVao9Ecj16 ఆకాశ్ చౌరాసియా 5 రోజుల శిక్షణా శిబిరం సేంద్రియ సేద్య పద్ధతిలో బహుళ అంతస్థుల వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ 14 జాతీయ అవార్డులు దక్కించుకున్న యువ రైతు శాస్త్రవేత్త ఆకాశ్ చౌరాసియా తెలంగాణలో 5 రోజుల ఆచరణాత్మక శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు మెదక్ జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లెలోని ‘ఐ.డి.వి.ఎం. కామ్యవనం’ ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుంది. మల్టీ లేయర్ ఫార్మింగ్ సహా 11 అంశాలపై శిక్షణ ఇస్తారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ చౌరాసియా ఆరుతడి పంటల ద్వారా ఏడాది పొడవునా అధికాదాయం పొందే ఆచరణాత్మక మార్గాలపై శిక్షణ ఇవ్వటంలో ఆయన ప్రసిద్ధి పొందారు. 50 మందికే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనదలచిన వారు భోజనం, వసతి, శిక్షణ రుసుముగా రూ. 4 వేలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాల కోసం.. 94495 96039. - పతంగి రాంబాబు, సాగుబడి చదవండి: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
పశువుల్లో యాంటీబయాటిక్స్ లేని పాల ఉత్పత్తికి కొత్త పద్ధతులు..
యాంటీబయాటిక్ ఔషధాలను మనుషులకు చికిత్సలో, పశు వ్యాధుల చికిత్సలో నిర్దేశిత మోతాదుల కన్నా అధికంగా, విచక్షణా రహితంగా వినియోగిస్తున్నందు వల్ల కొన్ని సూక్ష్మక్రిములు ఈ మందులకు అలవాటు పడిపోయి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. మొండికేసిన క్రిములు (సూపర్ బగ్స్) తయారవుతున్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌కూ లొంగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ సమస్యను యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)గా వ్యవహరిస్తున్నాం. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిని అరికట్టడానికి తక్షణం స్పందించకపోతే 2050 నాటికి ఏటా కోటి మంది (ఇందులో 20 లక్షల మంది భారతీయులే) ఎ.ఎం.ఆర్. సమస్యతో చనిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎ.ఎం.ఆర్. సమస్య వల్ల యాంటీబయాటిక్ మందులు అసమర్థంగా మారడంతో శరీరం నుంచి ఇన్ఫెక్షన్లను తొలగించడం కష్టతరంగా మారుతోంది. ఉపయోగించిన యాంటీబయాటిక్స్ పరిమాణంలో 90% విసర్జితాల ద్వారా పర్యావరణంలోకి చేరి నీరు, నేల కలుషితమవుతుంది. ఎ.ఎం.ఆర్. సమస్యను పరిష్కరించాలంటే.. మనుషులతోపాటు పాలు, గుడ్లు, మాంసం కోసం పెంచే పశుపక్ష్యాదుల కోసం యాంటీబయాటిక్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం, జబ్బులు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్‌కు బదులు సంప్రదాయ మూలికలతో కూడిన పశు ఆయుర్వేద పద్ధతులు అనుసరించడం ద్వారా ఎ.ఎం.ఆర్. సమస్య నుంచి సమర్థవంతంగా బయటపడవచ్చని శాస్త్రీయంగా రుజువు కావటం సంతోషదాయకం. బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.) హెల్త్ అండ్ టెక్నాలజీ, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు గత పదేళ్లుగా ఈ దిశగా చేస్తున్న విశేష కృషి సత్ఫలితాలనిచ్చింది. 10 రాష్ట్రాల్లో సంప్రదాయ పశువైద్య పద్ధతులను అధ్యయనం చేసి 441 మూలికా వైద్య మిశ్రమాలను గుర్తించారు. వీటిని పరీక్షించి 353 మందులు సురక్షితమైనవని, ప్రభావవంతమైనవని నిర్థారించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి.) ఈ పశు ఆయుర్వేద పద్ధతులను ఐదేళ్లుగా సహకార సంఘాల ద్వారా పాడి రైతులకు పరిచయం చేసి అద్భుత ఫలితాలను రాబడుతున్నది. 24 రకాల పశు వ్యాధులను నివారించడంలో, నిరోధించడంలోనూ సంప్రదాయ మూలికా మిశ్రమాలు అత్యంత సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఎన్.డి.డి.బి. నిర్థారణకు వచ్చింది. ఈ పద్ధతులను పాడి సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పరిచయం చేస్తోంది. ఏటా యాంటీబయాటిక్ మందుల కొనుగోలుకు రూ. 1.86 కోట్లు ఖర్చు పెట్టే ఎన్.డి.డి.బి. ఈ ఖర్చును సంప్రదాయ మూలికా వైద్యం అనుసరించడం ద్వారా రూ. 50 లక్షలకు తగ్గించుకోగలిగింది. 1,500 గ్రామాల్లో పాడి రైతులకు ఈ మూలికా చికిత్సను ఇప్పటికే నేర్పించింది. తమ పరిసరాల్లోని ఔషధ మొక్కలు, దినుసులతోనే పశు వ్యాధుల నివారణకు, చికిత్సకు ఉపయోగించుకుంటూ శాస్త్రీయంగా యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని 80% తగ్గించామని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా ప్రకటించారు. పొదుగువాపు వ్యాధి, గాలికుంటు వ్యాధులను రసాయనిక యాంటిబయాటిక్స్ వాడకుండా నూటికి నూరు శాతం పూర్తిగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు. పాలలో యాంటీబయాటిక్స్‌ను 88% తగ్గించగలిగాం: ప్రొ. నాయర్ యూనివర్సిటీ ఆఫ్ ట్రాన్స్–డిసిప్లినరీ (యు.టి.డి.)లోని మూలికా పశువైద్య పరిశోధనా విభాగం అధిపతి ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్, తన సహచరులు డా. ఎన్. పుణ్యమూర్తి, ఎస్.కె. కుమార్‌తో కలిసి పశు ఆయుర్వేద పద్ధతులపై పరిశోధనలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో 140 మంది పాడి రైతులతో కలసి మూడేళ్లు ప్రయోగాత్మకంగా మూలికా వైద్యంపై అధ్యయనం చేశారు. పాలలో యాంటీబయాటిక్స్ అవశేషాలను 88% తగ్గించగలిగామని ప్రొ. నాయర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఎన్.డి.డి.బి.తో కలసి ఏపీ, తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లోని 30 పాల సంఘాలలో 1750 మంది పశువైద్యులకు, 30 వేల మంది పాడి రైతులకు, 560 మంది గ్రామ రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తమ యూనివర్సిటీలో రైతుల కోసం 4 రోజుల సర్టిఫికెట్ కోర్సు, పశువైద్యుల కోసం 7 రోజుల సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఎమ్మెస్సీ, పిహెచ్డి కూడా పెట్టామన్నారు. సిక్కిం, హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకొని రసాయనిక యాంటీబయాటిక్స్ అవసరంలేని పశుపోషణపై శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు ముందుకొస్తే స్వల్ప ఫీజుతోనే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులకు పశు ఆయుర్వేద పద్ధతులపై శిక్షణ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వివరాలకు.. ప్రొ. ఎం.ఎన్. బాలకృష్ణన్ నాయర్ – 63602 04672. nair.mnb@tdu.edu.in చదవండి: World's Largest Cemetery: ఇది నగరంలోని శ్మశానం కాదు.. శ్మశానమే ఓ మహానగరంగా! ఎక్కడుందో తెలుసా? -
మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ఇవి కొత్త రకం తామర పురుగులు! ►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. ►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్ (ట్రేసర్), ఫిప్రోనిల్ (రీజెంట్), డయాఫెన్ థయురాన్ (పెగాసస్), ఇంటర్ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్ పిల్ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు: ►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి. ►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది. ►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం. ►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. ►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్ గాని ట్రైటాన్ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. ►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). ►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్ (40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. ►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. ►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. – డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా dir-research@drysrhu.edu.in చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! -
ఈ బియ్యం బలవర్ధకమేనా?
మన దేశ ప్రజల్లో 65 శాతం మంది తెల్లగా పాలిష్ పట్టిన వరి బియ్యాన్ని రోజువారీ ప్రధాన ఆహారంగా తింటున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి మనిషీ రోజుకు 400–500 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. అయితే, మనం ఇందులో సగం కూడా తినటం లేదు. గత పదేళ్లుగా మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని కుంగదీస్తున్న పెను సమస్య రక్తహీనత. దీని మూలంగా స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం మేరకు దేశంపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలను పీడిస్తున్న పౌష్టికాహార లోపాన్ని స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో అధిగమించడానికి కృత్రిమంగా పోషకాలను లేపనం చేసిన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయటమే మేలైన మార్గమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల కోసం 2014 నాటికి పూర్తిగా ఫోర్టిఫై చేసిన సబ్సిడీ బియ్యాన్ని మాత్రమే అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రయోగాత్మక దశ మూడేళ్లు. ఇందుకోసం రూ. 174 కోట్లు కేటాయించారు. అయితే, ఈ విధాన నిర్ణయంపై స్వతంత్ర పౌష్టికాహార నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోర్టిఫైడ్ బియ్యం అంటే? సింథటిక్ పోషకాలతో తయారు చేసిన బియ్యాన్ని సాధారణ బియ్యంలో కలిపి అందించడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే పేదల ఆరోగ్యం మెరుగుపరచవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బియ్యపు నూకను పిండి చేసి, ఆ పిండికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12లను కలిపి, అధునాతన యంత్రాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఇవి రంగు, సైజు అంతా బియ్యపు గింజల మాదిరిగానే ఉంటాయి. వంద సాధారణ బియ్యపు గింజలకు ఒక ఫోర్టిఫైడ్ గింజను కలిపి చౌక దుకాణాలు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కిలో బియ్యానికి ఐరన్ 28 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 25–125 మిల్లీ గ్రాములతోపాటు విటమిన్ బి–12... 0.75 నుంచి 1.25 మిల్లీ గ్రాముల రసాయనిక పోషకాలు కలిపి ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేస్తున్నారు. ఏమిటీ అభ్యంతరాలు? రక్తహీనతకు ఐరన్ లోపం ఒక్కటే కారణం కాదనీ, ఐరన్ తదితర రసాయనిక పోషకాలను బియ్యానికి లేపనం చేసి అందించినా రక్తహీనత తగ్గలేదనీ ఐదు ఖండాల్లో జరిగిన ఓ అధ్యయనంలో తేలిందని 170 మంది ప్రజారోగ్య, పౌష్టికాహార నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు సంయుక్త బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అందరికీ ఐరన్ అదనంగా అవసరం ఉండదు. అవసరం లేని వారు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తినడం వల్ల మేలు కన్నా కీడు ఎక్కువ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార భద్రత పొందడానికి సరైన మార్గం ముడి, లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యం, దేశీ వరి బియ్యం, లేదా చిరుధాన్యాలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వినియోగాన్ని, ఆహార వైవిధ్యాన్ని పెంపొందించటమేనన్నారు. పెరటి తోటలు, మేడలపై ఇంటిపంటల సాగును, ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రతను పెంపొందించవచ్చు. పెరటి కోళ్లు, మాంసం, చేపల వినియోగం పెరగాలంటే ప్రజల ఆదాయం పెంపొందించే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. రక్తహీనతను ఆరోగ్యదాయకంగా, సమర్థంగా అధిగమించడానికి ఇదే ఉత్తమ మార్గమని, రసాయనిక పోషకాలను బియ్యంలో గుప్పించడం కాదని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 13 దేశాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడుతున్నాయి. దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి సరిపడే ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫోర్టిఫికేషన్ ప్రక్రియలో వినియోగించే కృత్రిమ సూక్ష్మపోషకాలను 4–5 విదేశీ కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు మున్ముందు కూడబలుక్కొని ధరలు పెంచే ప్రమాదం లేకపోలేదు. – పంతంగి రాంబాబు సీనియర్ జర్నలిస్టు -
అక్కడా... బడా కంపెనీల లాబీయింగ్?
వ్యవసాయం, పంట ఉత్పత్తుల శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ – ఈ గొలుసు మొత్తం కలిస్తే అది ‘ఆహార వ్యవస్థ’ (ఫుడ్ సిస్టం). ప్రతి ఒక్కరి మనుగడా ఆహార వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. పది వేల ఏళ్ల సంప్రదాయ సేద్య జ్ఞానానికి ప్రతి రూపమై ఔషధంగా విరాజిల్లిన ఆహారం.. రసాయనాలు రంగంలోకొచ్చిన వందేళ్లలోనే – భూగోళానికి, మనుషులకు, పశు పక్ష్యాదులకు – హానికరంగా మారిపోవటం విషాదకరమైన వాస్తవం. దశాబ్దాల తరబడి పారిశ్రామిక / రసాయనిక పద్ధతుల్లో ఆహార వ్యవస్థలను నిర్వహించడం వల్లనే ఈ ముప్పు వచ్చి పడింది. ‘ఇలా రసాయనిక పద్ధతుల్లో పండించిన/శుద్ధి చేస్తున్న, సుదూర ప్రాంతాలకు తరలించి పంపిణీ చేస్తున్న ఆహారం భూతాపోన్నతికి 34% కారణమవుతోంది. పోషకాల లోపంతో, రసాయనిక అవశేషాలతో కూడిన ఈ పారిశ్రామిక ఆహారం ప్రకృతి వనరులకు, వినియోగదారుల ఆరోగ్యానికి ‘నష్టదాయ కంగా’ తయారైంది. ఆహార వ్యవస్థల దుర్గతి వల్ల 70% మంచి నీరు ఖర్చవుతోంది. అంతేకాదు... జీవవైవిధ్యం తరిగి పోవడానికి 80% ఇవే కారణమ’ని ఐరాస తాజా నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. ఐరాస శిఖరాగ్రసభ ఆహార వ్యవస్థలను పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని తీరులోకి ఇప్పటికైనా మార్చుకుంటే ఈ దుస్థితి నుంచి మానవాళిని, భూగోళాన్ని రక్షించుకోగలమని ఐరాస గుర్తించింది. ఇందుకు దోహదపడే అనుభవాలు, ఆవిష్కరణలను క్రోడీకరించి ప్రపంచ దేశాలకు అందించడానికి ‘ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ’ను 18 నెలల కసరత్తు చేసి మరీ గత నెల 23న ఐరాస నిర్వ హించింది. 193 దేశాలకు చెందిన 51 వేల మంది పాల్గొన్నారు. ఆహార వ్యవస్థలలో సమూలంగా, గుణాత్మక మార్పు తేవడానికి 2 వేలకు పైగా సూచనలు, అనుభవాలను పంచుకున్నారని ఐరాస ప్రకటించింది. అయితే, ఉత్తమ సంప్రదాయాలకు ఐరాస తిలోదకాలివ్వటంతో అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగింది. బహుళజాతి కంపెనీల కొమ్ము కాచే అంతర్జాతీయ వితరణ సంస్థల కనుసన్నల్లోనే ఆద్యంతం ఈ తంతు సాగిందంటూ పలు అంతర్జాతీయ పౌర, స్వచ్ఛంద, రైతు సంస్థలు భగ్గుమన్నాయి. ఏమిటీ పౌర సంస్థల అభ్యంతరం? ఆహారం గురించి, పౌష్టికత గురించి ప్రజాస్వామికంగా చర్చించి సభ్య దేశాలకు విధానపరమైన సూచనలు అందించే అధికారం ఐక్యరాజ్యసమితిలోని ఆహార భద్రతా కమిటీ (సి.ఎఫ్.ఎస్.)కి ఉంది. ఇందులో సభ్య దేశాలతో పాటు రైతులు, ఆదివాసులు, పౌర, స్వచ్ఛంద సంస్థలకు కూడా పూర్వం నుంచి సముచిత ప్రాతినిధ్యం ఉంది. విధాన నిర్ణయాలపై ఆయా దేశాలకు సూచనలు పంపడానికి ముందే పౌర సంస్థలు తమకున్న అభ్యంతరాలను తెలియజెప్పడానికి, ఆయా దేశాలతో చర్చించడా నికి అవకాశం ఉంటుంది. అయితే, ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ విషయంలో ఐరాస సెక్రటరీ జనరల్ భిన్నంగా వ్యవహరిం చారు. సి.ఎఫ్.ఎస్.ను పక్కనపెట్టి.. కార్పొరేట్ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించి శిఖరాగ్ర సభను జరిపించటం ఏమిటని స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆహార హక్కుపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి మైఖేల్ ఫక్రి కూడా నిరసించటం విశేషం. కొద్ది కంపెనీలదే రాజ్యం ప్రపంచ ఆహార, వినిమయ వస్తువుల వాణిజ్యం అతికొద్ది బహుళ జాతి కంపెనీల చేతుల్లో కేంద్రీ కృతం కావడమే ముఖ్య సమస్య. ప్రపంచ విత్తనాల మార్కెట్లో 53% వాటా 2 కంపెనీలదే. వ్యవసాయ రసాయనాల ఉత్పత్తి, వాణిజ్యంలో 70% వాటా 3 కంపెనీలదే. పశువులకు సంబంధించిన బ్రీడింగ్, ఔషధాలు, వ్యవసాయ యంత్రాల తయారీ, సరుకు వాణిజ్యంలోనూ రెండు, మూడు కంపెనీలదే సింహభాగం. బడా కంపెనీలు తమకు లాభాలు తెచ్చిపెట్టే ఆధునిక టెక్నాలజీలను, జన్యుమార్పిడి పంటలను సరికొత్త మాటల గారడీతో ఐరాస సభ్య దేశాలపై రుద్దే ప్రమాదం పొంచి ఉంది. మన రైతుల విజయాలు చాలవూ? అనేక ఖండాల్లో చిన్న, సన్నకారు రైతులు సంప్రదాయ విజ్ఞా నంతో ఆవిష్కర్తలుగా మారి ఆహార వ్యవస్థలను ప్రకృతికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని సాగు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మన దేశం ముందుంది. పెద్ద వ్యవ సాయ రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోకెల్లా పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాధారణ రైతులు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ గణాం కాల ప్రకారం.. 1,30,000 మంది రైతులు 3–4 ఏళ్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. మరో 3.5 లక్షల మంది రైతులు కొద్దిమేర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2.7 లక్షల మంది భూమి లేని గ్రామీణ పేదలు ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాల్లో ప్రకృతి సేద్య పద్ధతుల్లో పెరటి తోటలు సాగు చేస్తున్నారు. ‘సెస్’, ఐ.డి.ఎస్.ల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ఎసెస్ మెంట్ మూడేళ్లుగా జరుగుతోంది. ‘ప్రకృతి వ్యవసాయం వల్ల ఏపీలో ఖర్చు తగ్గుతోంది, దిగుబడులు పెరుగుతున్నాయి, రైతుల నికరాదాయం పెరుగుతోంది..’ అని ఈ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఐరాస శిఖరాగ్ర సభలో ఉత్పత్తిదారుల విభాగంలో ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం అధిపతి టి. విజయకుమార్ మన రైతుల ప్రకృతి సేద్య అనుభవాలను సాకల్యంగా వివరిం చారు. గుత్తాధిపత్యానికి దారితీసే బడా బహుళజాతి కంపెనీల అత్యాధునిక సాంకేతికతల అవసరం లేకుండానే, ఆహార వ్యవస్థ లను శాశ్వతంగా పునరుజ్జీవింపజేసుకునేందుకు దోహదపడే సుసంపన్న అనుభవాలు ఇవి. అయితే, అత్యంత ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఐరాస ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభలో భారత ప్రభుత్వ ప్రతినిధి సమర్పించిన అధికార పత్రంలో ఏపీ ప్రకృతి రైతుల అపురూప అనుభవాలను మచ్చుకు కూడా ప్రస్తావించలేదు. బడా కార్పొరేట్ సంస్థల లాబీ యింగ్ ప్రభావానికి ఇదొక మచ్చుతునకేమో మరి! – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
షుగర్ వ్యాధిగ్రస్తులకు ‘తీపి’ కబురు.. పామ్ నీరా, బెల్లం!
తియ్యని ఆహారం ఎవరికైనా ఆనందదాయకమే. అయితే, తీపి పదార్ధాలుగా విరివిగా వాడుకలో ఉన్న చెరకు చక్కెర, చెరకు బెల్లంలను షుగర్ వ్యాధిగ్రస్తులు తినలేరు. వీటిలో అధిక మోతాదులో గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే పరిస్థితి ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఫ్రక్టోజు ఎక్కువగా ఉండే తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్ల నీరాతో తయారు చేసే సంప్రదాయక బెల్లం అయితే ఎవరికైనా ఆరోగ్యదాయకం అంటున్నారు నిపుణులు. తాటి/ ఈత/ కొబ్బరి/ జీలుగ చెట్లు అత్యంత ఆరోగ్యదాయకమైన, ఆల్కహాల్ రహిత పానీయాన్ని అందిస్తాయి. ఇదే నీరా. నీరాను తాజాగా సేవించటం ఆరోగ్యదాయకం (పులిస్తే కల్లుగా మారుతుంది). తాటి, ఈత, కొబ్బరి, జీలుగ నీరాతో తయారు చేసే బెల్లం చాలా ఆరోగ్యదాయకమైన తీపి పదార్థమని పూర్వకాలం నుంచే మనకు తెలుసు. ప్రజల్లో ఆరోగ్యస్పృహ పెరుగుతున్న నేపథ్యంలో తాటి/ఈత నీరా, బెల్లం తదితర ఉత్ప త్తుల తయారీ, వాడకం పుంజుకుంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈత, తాటి(పామ్) ఉత్పత్తులకు ఆదరణ ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి అనంతపురంలో గీత కార్మికుల సహకార సంఘం శ్రీకారం షుగర్ వ్యాధిగ్రస్తులూ పరిమితంగా వాడొచ్చంటున్నారు నిపుణులు.. సహకార సంఘం ఆధ్వర్యంలో.. అనంతపురం జిల్లాలో ప్రకృతిసిద్ధమైన ఈత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ, రైతుల భూముల్లో లక్షలాది ఈత చెట్లున్నాయి. వీటి నుంచి కల్లు తీసి విక్రయించటం రివాజు. అయితే, ఈత కల్లుకు బదులు నీరా తీసి విక్రయించడంతోపాటు.. నీరాతో బెల్లం తయారు చేసి ప్రజలకు అందించడం మేలని అనంతపురానికి చెందిన సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ రూరల్ యాక్షన్ (సెర) వ్యవస్థాపకులు ఎస్. కుళ్లాయస్వామి తలపెట్టారు. సిరిధాన్యాలతోపాటు తాటి/ఈత/జీలుగ నీరా, బెల్లం వాడకాన్ని ప్రోత్సహిస్తున్న స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి స్ఫూర్తితో కుళ్లాయస్వామి ఈత నీరా, బెల్లం ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. 500 మంది ఈడిగ గీత కార్మికులతో ‘సెర నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ’ని నెలకొల్పారు. పరిశుద్ధమైన ఆధునిక పద్ధతిలో నీరా బాట్లింగ్, స్టెయిన్లెస్ స్టీలు పరికరాలతో ఈత బెల్లం తయారీ యూనిట్‌ను నాలుగు నెలల క్రితం నెలకొల్పారు. రోజుకు 500 లీటర్ల నీరా సేకరణ 500 ఈత చెట్లను ఎంపిక చేసుకొని సభ్యుల ద్వారా రోజుకు దాదాపు 500 లీటర్ల నీరాను సేకరిస్తున్నారు. 250 చెట్ల నుంచి ఒక రోజు, మిగతా 250 చెట్ల నుంచి తర్వాత రోజు నీరా సేకరిస్తున్నారు. అక్టోబర్ నుంచి నాణ్యమైన నీరా వస్తుంది. వంద లీటర్ల నీరాను వడకట్టి బాటిల్స్‌లో నింపి అదే రోజు విక్రయిస్తున్నారు. మిగతా 400 లీటర్ల నీరాతో 40 కిలోల బెల్లం ఉత్పత్తి చేస్తున్నారు. చామలపల్లి నుంచి తాటి, ఈత ఉత్పత్తులు తెలంగాణ పామ్ నీరా అండ్ పామ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా చందూరు మండలంలోని చామలపల్లి కేంద్రంగా తాటి, ఈత నీరా, బెల్లం తదితర ఉత్పత్తుల తయారీ గతంలోనే ప్రారంభమైంది. చామలపల్లి పరిసర గ్రామాల నుంచి తాటి నీరాను, వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతం నుంచి ఈత నీరా సేకరిస్తున్నారు. నీరా, బెల్లంతో పాటు తాటి సిరప్, పామ్ షుగర్, పామ్ బూస్ట్ తదితర ఆరోగ్యదాయకమైన అనేక వినూత్న ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు అందిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు వింజమూరు సత్యం(98498 28999), వేణు తెలిపారు. నవంబర్ నుంచి ఈత, డిసెంబర్ నుంచి తాటి నీరా సేకరణ తిరిగి ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఇందుకోసం ఎక్సయిజ్ శాఖ తోడ్పాటుతో అనంతపురంలోని పోలిస్ కాంప్లెక్స్‌లో నీరా స్టాల్ నెలకొల్పనున్నట్లు కుళ్లాయస్వామి తెలిపారు. ఈత నీరాలో ఆల్కహాల్ లేదని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. లాబ్ రిపోర్టులో తేలింది. చిత్తూరులోని ప్రభుత్వ లాబ్‌లో టెస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత నీరాను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడానికి ఎక్సైజ్ అనుమతులు వస్తాయన్నారాయన. – పంతంగి రాంబాబు ఈత ఉత్పత్తులను అందరూ వాడొచ్చు ఈత చెట్టుకు ఏడాదికి రూ.150–200 వరకు రైతుకు చెల్లించి నిపుణులైన గీత కార్మికుల పర్యవేక్షణలో నీరా సేకరిస్తున్నాం. కిలో ఈత బెల్లం తయారీకి 10 లీటర్ల నీరా అవసరం. కిలో బెల్లం ఉత్పత్తికి రూ. 650 వరకు ఖర్చవుతున్నది. రూ. వెయ్యి రిటైల్ ధరకు విక్రయిస్తున్నాం. ఎటువంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజలందరూ, షుగర్ ఉన్న వారు సైతం వాడదగ్గ ఆరోగ్యదాయక ఉత్పత్తులు కావటంతో స్థానికంగానే కాకుండా అనేక నగరాల్లోనూ ఈత ఉత్పత్తులను విక్రయించే ప్రయత్నం చేస్తున్నాం. – ఎస్. కుళ్లాయస్వామి (92464 77103), సెరా నీరా టాపర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అనంతపురం ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు ఈత, తాటి, కొబ్బరి, జీలుగ.. ఈ చెట్ల నుంచి తీసిన నీరా, దానితో తయారు చేసే బెల్లం ఆరోగ్యకరమైన దేవుడిచ్చిన తీపి పదార్థాలు. ఇవి మన సంస్కృతిలో ఉన్న ప్రకృతిసిద్ధమైన, పర్యావరణ హితమైన తీపి పదార్థాలు. వీటిలోని ప్రకృతికి దగ్గరగా ఉండే లవణాంశాలు మనిషికి రోగనిరోధక శక్తిని అందించి మేలు చేస్తాయి. ఈత నీరా, బెల్లంను హెబిఎ1సి 7–8 లోపు ఉన్న షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా రోజుకు 10–15 గ్రా. మించకుండా తీసుకోవచ్చు లేదా వారానికోసారి ఈత బెల్లంతో చేసిన తీపి పదార్ధాన్ని 50 గ్రా. వరకు తినొచ్చు. తీపి పదార్థాలను ఎవరైనా సరే రోజూ తినకూడదు. చెరకు ఎస్టేట్ల వల్ల ఏకపంటల (మోనోకల్చర్) సాగు ప్రబలి, 18% జీవవైవిధ్యం నాశనమైంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉండే చెరకు బెల్లం, చక్కెర వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈత, తాటి, కొబ్బరి, జీలుగ నీరా, బెల్లంలో ఫ్రక్టోజు ఎక్కువ ఉంటుంది. ఫ్రక్టోజు ఉన్న తీపి పదార్థం ఏ హానీ చేయదు. – డా. ఖాదర్‌వలి, స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త చదవండి: కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు! -
ఈయన లాంటోడు గ్రామానికి ఒకడుంటే చాలు
హివరె బజర్!... పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ కరువును ఆమడ దూరం పారదోలిన అద్భుత ఆదర్శ గ్రామం. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో మారుమూల సహ్యాద్రి పర్వతప్రాంతంలో ఉంది. 400 ఎం.ఎం. వర్షపాతం. కరువు కాటకాలు. కటిక పేదరికం. హింసాత్మక వాతావరణం.. వెరసి జీవితేచ్ఛ అడుగంటిపోతున్న గడ్డు పరిస్థితుల్లో పొపట్రావ్ పవార్ కంకణం కట్టుకున్నాడు. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న కొద్ది ఏళ్లలోనే ఆ గ్రామం రూపు రేఖలను మార్చేశారు. ఆ కొద్ది వాన నీటినీ ఒడిసిపట్టి, గ్రామీణుల్లో సమష్టి భావనను మేల్కొల్పి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని నిబద్ధంగా నడిపించారు. ‘వాటర్ బడ్జెటింగ్’కు పట్టం కట్టి వ్యవసాయ విప్లవం కలను సాకారం చేసింది హివరె బజార్. వాటర్ మేనేజ్మెంట్ ఫోరం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం సంయుక్త ఆహ్వానంపై ఇటీవల హైదరాబాద్ వచ్చిన గాంధేయ వాది, ప్రసిద్ధ జలయోధుడు పొపట్రావు పవార్‌తో ‘సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ఉన్నత విద్యావంతులై, రాష్ట్రస్థాయి క్రికెటర్‌గా పేరు గడించిన తర్వాత మారుమూల ప్రాంతంలోని మీ స్వగ్రామం హివరె బజార్లో స్థిరపడ్డారు. 28 ఏళ్ల నుంచి గ్రామాన్నే అంటిపెట్టుకొని ఉంటూ అద్భుత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.. ప్రస్తుతం మీ గ్రామం ఎలా ఉంది? 1989లో నేను మా ఊరిపై దృష్టి పెట్టే నాటికి తీవ్ర కరువు ఉండేది. పంటలు లేవు. తాగు నీటికీ కటకటగా ఉండేది. గ్రామంలో ఉపాధి లేదు. గొడవలు, హత్యల వల్ల మా గ్రామాన్ని అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. 95% కుటుంబాలు పొట్ట చేతపట్టుకొని పట్టణాలు, నగరాలకు వలసపోయి జీవించేవారు. మా ఊరికి ఏదైనా చెయ్యాలని ఉద్యోగానికి వెళ్లకుండా 28 ఏళ్ల క్రితం నుంచి అక్కడే ఉండిపోయాను. తొలి ఏడాదే నేను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. రిజర్వేషన్ లేనప్పుడు సర్పంచ్‌గా, రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉపసర్పంచ్‌గా ఉంటున్నాను. రెండేళ్లుగా ఉప సర్పంచ్‌గా ఉన్నాను. మౌలిక మార్పు తెచ్చే పనికి వాన నీటి సంరక్షణ పనులతో శ్రీకారం చుట్టాం. 40 వేల మీటర్ల పొడవున మీటరు లోతు, మీటరు వెడల్పుతో కొండల చుట్టూతూ కందకాలు తీయించాం(40 మీటర్లకు ఒక చోట 1–2 మీటర్లు వదిలేసి కందకం తీయాలి). వాననీటిని ఇంకించే 2 పర్క్యులేషన్ చెరువులు, 54 మట్టి కట్టలతో కూడిన చెరువులు, 9 సెమీ స్టోరేజ్ టాంక్లు నిర్మించాం. వీటన్నిటినీ గ్రామస్తులతో ఉపాధి హామీ పథకం కింద అమలుపరిచాం. ఇప్పుడు మా భూముల్లో 30–40 అడుగుల లోతులో నీరుంటుంది(చుట్టుపక్కల గ్రామాల్లో 300–400 అడుగుల లోతులోనే నీరుంటుంది). అయినా, ఎంత వర్షపు నీరు భూగర్భంలోకి చేరిందో, అంత నీటిని మాత్రమే తిరిగి వాడుకుంటున్నాం. రబీ, వేసవి కాలపు పంటలకు లెక్కగట్టి మరీ వాడుకుంటాం. ఖరీఫ్‌లో పంటలకు నీటి తడులు ఇవ్వం. రబీ, వేసవి పంటలకు మాత్రమే డ్రిప్, స్ప్రింక్లర్లు వాడుతూ పొదుపుగా నీటిని వాడుతున్నాం. నీటిని అధికంగా తీసుకునే చెరకు, అరటి, దానిమ్మ, వరి తదితర పంటలను పూర్తిగా నిషేధించాం. 400 ఎం.ఎం. మా గ్రామం సగటు వర్షపాతం. 100 ఎం.ఎం. వర్షం పడితే మంచినీటికి కొరత ఉండదు. 400 ఎం.ఎం. పడిన సంవత్సరం రబీ, వేసవి పంటలు కూడా సాగు చేస్తాం. 300 ఎం.ఎం. వర్షం మాత్రమే కురిస్తే ఖరీఫ్, రబీ లతోనే సరిపెడతాం. వేసవిలో ఏ పంటా వేయం. టమాటా తొటలో తోటి రైతులతో పవార్ ‘వాటర్ బడ్జెటింగ్’ అంటే..? అవును. 1995 నుంచి గ్రామసభలో ‘వాటర్ బడ్జెటింగ్’ చేసుకుంటున్నాం. వర్షం తక్కువ కురిస్తే ఆ ఏడాది తక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తాం. భూ గర్భంలోకి ఆ ఏడాది అదనంగా చేరిన నీటిని మాత్రమే బావుల ద్వారా తోడుకొని, ఆ నీటితో పండించగలిగే రకం పంటలను, తగిన విస్తీర్ణంలో మాత్రమే పండిస్తాం. ప్రతి రెండు నెలలకు గ్రామ సభ జరుగుతుంది. అందరిముందూ చర్చించి నిర్ణయం తీసుకొని అమలు చేస్తాం. బోర్లను పూర్తిగా నిషేధించాం. అందరి పొలాల్లోనూ బావులే (మొత్తం 376) ఉంటాయి. నీటి సంరక్షణ ఫలితంగా పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా పోయింది. పశుసంపద పెరిగింది. రోజుకు 5 వేల లీటర్ల పాలు అమ్ముతున్నాం. దాదాపు ప్రతి ఇంట్లో బయోగ్యాస్ ఉంటుంది. స్లర్రీని పంటలకు ఎరువుగా వాడుతున్నాం. క్రమంగా 80 శాతం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించేశాం. మా భూములు సారవంతమయ్యాయి. తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. సేంద్రియ కర్బనం 1 శాతం కన్నా ఎక్కువగానే ఉంది. నీటి నాణ్యత, భూసారం, పంటల ఉత్పాదకత పెరిగింది. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ గత రెండేళ్ల పరిస్థితి ఎలా ఉంది? గత రెండేళ్లలో వర్షం సరిగ్గా లేదు. గత ఏడాది 168 ఎం. ఎం. కురిసింది. అంతకుముందు ఏడాదీ దాదాపు అంతే. ఖరీఫ్‌లో వర్షాధారంగా పంటలు పండించాం. పశుగ్రాసపు పంటలు తప్ప రబీ, వేసవి పంటలకు పూర్తిగా విరామం ప్రకటించాం. దాదాపు ప్రతిఇంట్లోనూ గేదెలు, ఆవులు ఉన్నాయి. అందరికీ రోజువారీగా పాడి ఆదాయం వస్తుంది. అడవిలో పశువులు మేపడం నిషేధించాం. దసరా, దీపావళి తర్వాత గడ్డి కోసుకోవడానికి రైతులకు వీలు కల్పించాం. ఏడాదికి రూ. 100 రుసుము. బలహీనవర్గాలకు రూ. 25 మాత్రమే. చెట్లు నరకడంపై నిషేధం మొదటి నుంచీ ఉంది. మా గ్రామ పరిసరాల్లో 10 లక్షల చెట్లు నాటాం. పచ్చగా అలరారుతున్న హివరె బజార్ గ్రామం గ్రామస్తులను భాగస్వాములను చేయడం ద్వారా 28 ఏళ్లుగా ప్రకృతి వనరులను పరిరక్షించుకుంటూ నిజమైన అభివృద్ధికి బాటలు వేశారు కదా.. పేదరికాన్ని పూర్తిగా జయించగలిగారా? అవును. మా గ్రామంలో 1995లో 95% కుటుంబాలు పేదరికంలో మగ్గేవి. ఇప్పుడు మా గ్రామంలో పేదరికంతో బాధపడేవారు ఒక్కరూ లేరు. ఉపాధి హామీ పని కావాలని అడిగే వారే లేరు. నెలకు తలసరి ఆదాయం అప్పట్లో రూ. 830 ఉండేది, ఇప్పుడు రూ. 32,000కి పెరిగింది. ఆర్థికాభివృద్ధి కన్నా ఆనందంగా ఉండటంపైనే దృష్టి పెడుతున్నాం. మా ఊళ్లో రైతులెవరూ ఇతరులకు భూములు అమ్మకూడదని నియమం పెట్టుకున్నాం. ఊళ్లో నలుగురికి తప్ప మిగతా అందరికీ భూమి ఉంది. వారికి కూడా త్వరలో భూమి ఇప్పిస్తాం. 79% కుటుంబాల్లో కనీసం ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. టీచర్లు, సైనికులుగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. మీ గ్రామంలో సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ, కుల, మత గొడవలు లేవు. చాలా ఏళ్ల క్రితమే ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. దోమల్లేకుండా చేశాం. దోమను పట్టి చూపితే రూ. వంద బహుమతి ప్రకటించాం. మద్యపానాన్ని నిషేధించాం. హోటల్ లేదు. ఎటువంటి విగ్రహాలూ పెట్టం. సిగరెట్, తంబాకు, మాదకద్రవ్యాలకు అనుమతి లేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నేతలు ఊరి బయటే వాహనాలు, జెండాలు వదిలి గ్రామంలోకి వచ్చి ప్రచారం చేసుకోవాలి. నినాదాలు ఇవ్వకూడదు. ఏజెంట్లను గ్రామసభే ఎంపిక చేస్తుంది. పోలింగ్ గొడవలకు తావులేదు. 90%పైగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మా ఊళ్లో మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అన్ని ఇళ్లలోనూ వంటగ్యాస్ ఉంది. వంట చెరకు కోసం, నీటి కోసం కడవలతో కిలోమీటర్లు తిరగాల్సిన బాధ తప్పటం, మద్యనిషేధం, మంచి నడవడిక నేర్పే చదువు 10వ తరగతి వరకు ఊళ్లోనే అందుబాటులోకిరావడంతో ముఖ్యంగా మహిళలు సంతోషంగా ఉన్నారు. నీటిని పొదుపుగా వాడుకునే పంటల సరళి గురించి చెప్పండి..? మార్కెట్‌ను బట్టి పంటలను ఎంపిక చేసుకొని పండించడం వల్లనే రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారు. పర్యావరణానికి హాని కలగని రీతిలో పంటల సరళిని రూపొందించుకోవాలి. నీటి అక్షరాస్యత, పంటల సరళి అక్షరాస్యత, గ్రామ ప్రజల భాగస్వామ్యం.. గ్రామాల అభివృద్ధికి చాలా కీలకం. మన భూములు ఎలాంటివి? ఆ భూములకు నీటి తేమను పట్టి ఉంచే శక్తి ఎంత మేరకు ఉంది? భూగర్భంలోకి ఎంత వాన నీటిని ఇంకింపజేసుకోవచ్చు? వర్షాకాలంలో వ్యవసాయ బావుల్లోకి నీరు ఎంత మేరకు వస్తోంది? ఈ వివరాలను అధ్యయనం చేస్తే మూడేళ్లకు ఆ గ్రామంపై పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత సాగుకు నీరు ఎంత అందుబాటులో ఉండేదీ అంచనా వేసుకొని, ఆ ఏడాది ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది నిర్ణయించుకోవాలి. హివరె బజార్లో జలసంపదను చూపుతున్న పొపట్రావు పవార్ మీ గ్రామంలో ఎలా చేశారు? ఉన్నది వెయ్యి హెక్టార్ల సాగు భూమి. 250 హెక్టార్లలో చింత, వేప, మామిడి, బత్తాయి వంటి తోటలు వేసి వర్షాధారంగానే సాగు చేస్తున్నాం. ఈ తోటల్లో అంతరపంటలుగా మునగ, తదితర కూరగాయలు వేస్తుంటాం. ఖరీఫ్‌లో వర్షం బాగానే ఉంటే ఉల్లి ఎక్కువ వేస్తాం. ప్రధానంగా తీపి జొన్న, సజ్జ, టమాటా, బంతి పూలు, ఆకుకూరలు వర్షాధారంగానే సాగు చేస్తాం. రబీలో పంటలకు మాత్రమే నీటి తడులు ఇస్తాం. నీటిని పారగట్టడం అసలు లేదు. రబీలో జొన్న, బంగాళదుంప, బఠాణి, టమాట, ఆకుకూరలు వంటి పంటలు వేస్తాం. సగం నీరు వర్షం ద్వారా అందతుంది. మిగతా సగం నీరు డ్రిప్/స్ప్రింక్లర్ ద్వారా ఇస్తాం. ఏడాది పొడవునా ముఖ్యంగా వేసవిలో పశుగ్రాసపు పంటలు వేస్తాం, పాడి పశువులకు ఇబ్బంది లేకుండా. వేసవిలో పూల తోటలు కూడా వేస్తాం. వరుసగా రెండేళ్లు 400 ఎం.ఎం. వర్షపాతం ఉంటే పూర్తిస్థాయిలో పంటలు పండిస్తాం. అంటే.. ఖరీఫ్‌లో 100%, రబీలో డ్రిప్/స్ప్రింక్లర్ల ద్వారా 70%, వేసవిలో 30% విస్తీర్ణంలో తగిన పంటలు వేస్తాం. 200 ఎం.ఎం. మాత్రమే వర్షపాతం ఉంటే ఖరీఫ్‌లో తక్కువ రోజుల్లో తక్కువ నీటితో పండే బఠాణి, ఆకుకూరలు, పశుగ్రాసం, టమాట పండిస్తాం. రబీలోనూ అంతే. నాలుగు సార్లు నీటి తడి అవసరమయ్యే ఉల్లి పంట కూడా వేయం. తీపి జొన్నకు రెండు తడులు, శనగకు ఒక తడి సరిపోతాయి. ఉల్లికి 4 తడులు అవసరమవుతాయి. రైతులంతా ఒప్పుకుంటున్నారా? గ్రామసభలోనే చర్చించి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొదటి ఐదేళ్లలో కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు నీటి అక్షరాస్యత పెంపొందించుకోవడంతో రైతులందరూ సంతోషంగానే ఒప్పుకుంటున్నారు. పంట విరామం కాలంలో బంధువుల ఊళ్లకు వెళ్లి సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు. హెక్టారుకు ఎంత నికరాదాయం వస్తున్నది? సాధారణంగా హెక్టారుకు ఏడాదికి రూ. 30 వేల నుంచి 50 వేల వరకు రైతులకు నికరాదాయం వస్తున్నది. ఎక్కువ డబ్బు కావాలని లేదు. ఆనందంగా ఎంత వస్తే అంతే చాలు. మీ కుటుంబం గురించి..? మాది ఉమ్మడి కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఉమ్మడి భూమి 25 ఎకరాలు. 28 ఏళ్ల నాడూ అంతే, ఇప్పుడూ అంతే. 10 ఎకరాల్లో సీతాఫలం తోట వేశాం. మిగతా 15 ఎకరాల్లో ఉల్లి, తీపి జొన్న, టమాట, బంతి పూలు తదితర పంటలు పండిస్తున్నాం. ఎం.కాం. చదివాను. క్రికెటర్‌గా రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించాను. అయినా, ఉద్యోగం చూసుకోవడం కన్నా ఊరికోసం పనిచేయడం మంచిదని ఊళ్లోనే ఉంటున్నాను. నా కుమార్తెకు పెళ్లి చేశాను. కుమారుడు ఈ మధ్యనే అగ్రి బిఎస్సీ పూర్తి చేశాడు. ఊళ్లోనే ఉండి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నీటి నిపుణుల దృష్టిని మీ గ్రామం ఆకర్షించింది కదా..? 1995 నుంచి గ్రామస్థాయిలో పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేస్తున్నాం. ఉపాధి హామీ, ఆదర్శ గ్రామ పథకం ద్వారా నిధులతో, గ్రామస్తుల శ్రమదానంతోనే అన్ని పనులూ చేసుకున్నాం. అదనపు నిధులు గానీ, విదేశీ నిధులు గానీ, కార్పొరేట్ నిధులు గానీ పైసా కూడా తీసుకోవట్లేదు. గ్రామానికి చెందిన వారి విరాళాలను మాత్రమే తీసుకుంటున్నాం. మా గ్రామాన్ని రోజూ 500 మంది సందర్శిస్తూ ఉంటారు. 60 దేశాల నీటి నిపుణులు సందర్శించారు. అనేక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మా అభివృద్ధి నమూనాను అధ్యయనం చేస్తున్నాయి. రాజకీయ, కుల, మత ప్రాతిపదికపై చీలిపోయి ఉన్న గ్రామాల్లో మీ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యమే. మొదట ఒక వ్యక్తి లేదా కుటుంబం గ్రామంలోనే ఉండి దృఢ దీక్షతో పనిచేయాలి. నాలుగైదేళ్ల తర్వాత ఫలితాలు రావడం చూసి ప్రజలు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఎటొచ్చీ నాయకత్వం వహించే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా నిలబడాలి. అంతే. నాకు అసెంబ్లీ, పార్లమెంటు టిక్కెట్లు ఇస్తామని అనేక పార్టీలు ఆఫర్ ఇచ్చినా నేను తిరస్కరించి, గ్రామం కోసమే నిలబడ్డాను. రాజధానిలో ప్రణాళికలు రచించి ఒక శాఖ లేదా సంస్థ ద్వారా వాటిని అమలు పరిస్తే.. ఇక గ్రామీణ సమాజానికి భాగస్వామ్యం ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచం ఇవ్వాళ ఎదుర్కొంటున్న సమస్యలను మేం 25 ఏళ్ల క్రితమే పరిష్కరించగలిగాం. గ్రామ ప్రజలను భాగస్వాముల్ని చేయగలిగాం కాబట్టే ఇది సాధ్యపడింది. గ్రామాలు, ప్రభుత్వం కలిసి అభివృద్ధి కోసం పాటుపడాలి. అయితే, ఈ ప్రయాణంలో గ్రామాలే డ్రైవర్ సీటులో ఉండాలి! -
చినుకు బతికిం‘చేను’
ఎండిన బోర్లలోకి వాన నీటిని ఒడిసిపట్టి కరువుకు చెక్! కరువు తాకిడికి రైతులు విలవిల్లాడుతుంటే.. పూర్తిస్థాయి వర్షాల జాడ లేక కళ తప్పిన పొలాలు బావురుమంటున్నాయి. కానీ, కోటంక గ్రామానికి చెందిన రైతు బోయ రామాంజనేయులు మాత్రం ముందెన్నడూ లేనంత ధైర్యంగా ఉన్నాడు! వర్షాలు ఆలస్యమైనా తన మిరప, వేరుశనగ తోటలకేమీ ఢోకా లేదంటున్నాడు! ఈ రైతే కాదు..ఆ గ్రామంలో మరికొందరు రైతులు కూడా ఇంతే ధీమాగా పంటలు పండిస్తున్నారు. అంతేకాదు.. తాగునీటి కొరతతో ఊళ్లకు ఊళ్లు అల్లాడుతుంటే.. ఆ గ్రామంలో మాత్రం తాగునీటి ఎద్దడి లేదు! అలాగని.. ఈ గ్రామం నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్రాంతంలోనిదనుకుంటే పొరపాటే. కరువు సీమైన అనంతపురం జిల్లాలో ఉంది! ఎండిపోయిన బోర్లు, బావులను వాన నీటి ఇంకుడు గుంతల ద్వారా రీచార్జి చేయడం తాలూకూ మహత్తు ఇది..! * కరువు సీమలో కాంతిరేఖ * వాన నీటి సంరక్షణ మహత్తు చాటుతున్న అనంతపురం జిల్లా కోటంక రైతులు * ఎండిన బోరుకు రీచార్జితో వేసవిలోనూ నిశ్చింతగా తుంపర్లు, బిందు సేద్యం * గ్రామంలో 20% బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మిస్తే చాలంటున్న నిపుణులు * సులభమైన పద్ధతిలో రైతులే నిర్మించుకునే అవకాశం * మెట్ట రైతులను బ్యాంకు రుణంతో ప్రోత్సహిస్తే సాగు నీటికి భద్రత తొలకరి చినుకు నేలతల్లిని పులకింపజేస్తుంది. మొలకెత్తిన విత్తనం పంటవుతుంది. కానీ, పంటకు అవసరమైనప్పుడల్లా వాన పడదు. అవసరమైనప్పుడల్లా నీరు అందుబాటులో ఉండాలంటే.. కురిసినప్పుడే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. ఇంటికి సరిపడే నీరైతే భూగర్భ ట్యాంకులో భద్రపరచుకోవచ్చు. పంటల సాగు కోసమైతే భూగర్భంలో తప్ప మరెక్కడ దాచుకోగలం? నీటిలో జీవశక్తి ఉంది. వాన నీటి సంరక్షణలో పునరుజ్జీవన మహత్తుంది. దీన్ని గ్రహించలేకపోతే ఎంత పుష్కలంగా వర్షం కురిసినా.. ఆ నీటి బొట్టు కోసం ఆనక అలో లక్ష్మణా అని అలమటించక తప్పదు. ఇప్పటి మాదిరిగా కరువొస్తే ఇక చెప్పనక్కర్లేదు. భూమ్మీద పడిన వర్షపు చినుకుల్లో 12 నుంచి 18 శాతం వరకు సహజంగానే మట్టిలోకి ఇంకుతాయి. ఆవిరైపోగా మిగిలిన 25-30 శాతం వాన నీరు వాగులు, వంకల ద్వారా నదుల్లోకి పారుతుంది. వృథాగా పోయే ఈ నీటిలో కొంత భాగాన్ని జాగ్రత్త చేసుకున్నా చాలు.. అది కేరళ అయినా, అనంతపురం అయినా తాగునీటికి, సాగునీటికి బెంగ ఉండదని కోటంక గ్రామ రైతులు రుజువు చేస్తున్నారు.దేశంలోకెల్లా అత్యల్ప వర్షపాతం(సగటున ఏటా 550 మిల్లీమీటర్ల) నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉంది. 750 అడుగుల్లోతుకు వెళితే కానీ నీటి జాడ దొరకని ప్రాంతాలకు నెలవైన ఈ జిల్లాలో ఏటా 29 శాతం బోర్లు ఎండిపోతుంటాయి. ఆర్థిక స్థోమతకు మించి రైతులు బోర్లు వేసిన, వేస్తున్న రైతులు వేల సంఖ్యలో వున్నారు. వాన నీటి సంరక్షణకు ఉపకరించే అనేక పద్ధతులు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా ఎండిపోతున్న బోర్లను రీచార్జి చేసే కొత్త పద్ధతి ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. ఎండిపోయిన బోరు బావుల పునరుజ్జీవం కోసం కర్ణాటకకు చెందిన భూగర్భ జల నిపుణుడు ఎన్జే దేవరాజ్ రెడ్డి(09448125498) రూపొందించి అమలు పరుస్తున్న నమూనా ప్రసిద్ధి పొందింది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూయస్) సంస్థ నిపుణులు మన ప్రాంత అవసరాలకు అనుగుణంగా ఈ నమూనాకు మెరుగులు దిద్ది సుస్థిర భూగర్భ జల యాజమాన్యం(సుగమ్) ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన బోర్లలో జలసిరిని నింపుతున్నది. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహాయంతో అనంతపురం, వరంగల్ జిల్లాల్లోని 6 పంచాయతీల్లోని 13 గ్రామాల్లో స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. వర్షపు నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం ద్వారా ఎండిపోయిన బోర్లు, బావులు తిరిగి జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నీటితో రైతులు తుంపర, బిందు సేద్య పద్ధతులను అనుసరిస్తూ కరువు కాలంలోనూ మెట్ట పొలాల్లో నిశ్చింతగా పంటలు పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల గ్రామాల్లో భూగర్భ జల సంరక్షణపై రిడ్స్ సంస్థ పని చేస్తోంది. గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామంలో తొలుత మంచినీటి బోరు వద్ద ఇంకుడు గుంతను నిర్మించారు. ఎండిపోయిన ఆ బోరులో నుంచి మళ్లీ నీళ్లు వస్తుండడంతో స్ఫూర్తి పొందిన రైతు బోయ రామాంజనేయులు తన బోరు వద్ద కూడా ఇంకుడు గుంతను నిర్మించుకున్నాడని రిడ్స్ డెరైక్టర్ కిష్టప్ప(94405 28626) తెలిపారు. ఆయనను మరో 18 మంది రైతులు అనుసరించారు. తత్ఫలితంగా కోటంక పరిసర భూముల్లో భూగర్భ జల మట్టం 165 అడుగుల(2012 మే) నుంచి 105 అడుగులకు(2013 మే) పెరిగింది. గ్రామ పరిధిలోని 370 బోర్లలో 174 బోర్లు గతంలో ఎండిపోయాయి. ఇంకుడు గుంతల నిర్మాణం తర్వాత వీటిల్లో 78 బోర్లు తిరిగి వినియోగంలోకి వచ్చాయి. గ్రామానికి సాగు నీటి భద్రత ఏర్పడడమే కాకుండా తాగు నీటి ఎద్దడీ తీరింది. మొదటి సారిగా మూడో పంట! నాలుగేళ్ల క్రితం వరకు చేనేత కార్మికుడిగా పనిచేసిన రామాంజ నేయులు(38) తన సోదరుడు ఓబులేశుతో కలిసి ఉమ్మడిగా ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా రు. తమకున్న 5 ఎకరాల పొలంలో 2011లో బోరు వేశాడు. ఒకటిన్నర ఇంచ్ నీళ్లు పడ్డాయి. మరుసటి ఏడాది మరో బోరు వేశాడు. అందులోనూ అదేమోస్తరు నీరు పడినా.. కొన్నాళ్లకు ఎండిపోయింది. స్వచ్ఛంద సంస్థ ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక సాయంతో ఎండిపోయిన బోరు వద్ద 2013 జూన్‌లో రీచార్జ్ పిట్ నిర్మించారు. నెల రోజుల్లోనే నీటి మట్టం పెరిగి బోరు రెండు అంగుళాల నీరు వచ్చింది. మొదటి బోరులోనూ నీరు పెరిగింది. రెండు బోర్లూ పనిచేస్తుండడంతో గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలు పండించడం విశేషం. వరుసగా రెండు పంటలు చేతికొచ్చే సరికి సాగు నీటికి భయపడాల్సింది లేదన్న భరోసా కలిగింది. దీంతో తమ ఐదెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఈ వేసవిలో మూడో పంట వేశారు. స్ప్రింక్లర్లతో ఆరు ఎకరాల్లో నెల క్రితం వేరుశనగ, డ్రిప్‌తో ఎకరంలో రెండు నెలల క్రితం మిరప, మరో ఎకరంలో టమాటా వేసి.. రెండు బోర్లలోనూ ప్రస్తుతం వస్తున్న ఇంచున్నర నీటితో నిశ్చింతగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పచ్చి మిరప కాయలను కేజీ రూ. 25-30కి అమ్ముతున్నానని సంతోషంగా చెప్పారు. ఏటా నీరు చాలక రెండు, మూడెకరాల్లో ఒకే పంటతో సరిపెట్టుకునే ఆయన ఈ కరువు కాలంలోనూ ధైర్యంగా 8 ఎకరాలు సాగు చేస్తుండడం విశేషం. ఈ చిన్న రైతు విజయగాథ వాన నీటి సంరక్షణ ప్రయోజనాన్ని రైతు లోకా నికి చాటి చెబుతోంది. ప్రభుత్వం పూనుకొని వాన నీటి సం రక్షణను ఉద్యమంగా చేపడితే.. గాల్లో దీపంలా కొట్టుమి ట్టాడుతున్న మెట్ట రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. వాననీటి సంరక్షణ కోసం బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తే రైతులను కరువు కోరల్లోంచి రక్షించవచ్చు. ఏ గ్రామ పొలాల్లోనైనా 20% బోర్ల వద్ద ఇంకుడు గుంతలను నిర్మిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. 4,5 రోజుల్లో దీన్ని నిపుణుల పర్యవేక్షణలో రైతులే రూ. 40-45 వేల ఖర్చుతో నిర్మించుకోవచ్చు. ప్రతి ఏటా 2,3 అడుగుల లోతు ఇసుకను మార్చుకుంటే చాలు. ప్రభుత్వం వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను రుణాలిచ్చి ప్రోత్సహించాలి. కరువు కాలంలో ఇది తక్షణావసరం. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్: జే ఆంజనేయులు, గార్లదిన్నె, అనంతపురం జిల్లా నీటి సంరక్షణ మహత్తును చాటడమే లక్ష్యం! మెట్ట, కరువు ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణతో ప్రజలకు ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో మేం కొత్త పద్ధతిలో అమలు చేస్తూ.. సత్ఫలితాలు సాధిస్తున్నాం. మూడేళ్లలో 13 గ్రామాల్లోని 65 బోర్లను రీచార్జ్ చేశాం. వాన నీటి సంరక్షణ మహత్తును రైతులకు, ప్రభుత్వానికి తెలిసేలా చేయడమే మా లక్ష్యం. వాన నీటి సంరక్షణ వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్, ఉప్పదనం, హార్డ్నెస్ తగ్గి.. నాణ్యత, రుచి పెరుగుతాయి. డ్రిప్ పరికరాల మన్నిక పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడులొస్తాయి. 100% పారిశుద్ధ్యం పాటించే చోట్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడని చోట్ల వాన నీటి సంరక్షణ ఉత్తమం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం. రైతులు గానీ, మరెవరైనా గానీ సమావేశాలు నిర్వహిస్తుంటే మమ్మల్ని పిలిస్తే నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం. - ఆర్.వి. రాంమోహన్, భూగర్భ జల నిపుణుడు, సుగమ్ ప్రాజెక్టు, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906 Emai:projectsugwm@cwsy.org, projectsugwm@gmail.com Weblink: http://www.cwsy.org/sugwm.htm ఎటువంటి బోర్లను బతికించగలం? సీడబ్ల్యూయస్ నిపుణుల కథనం ప్రకారం.. కొన్నాళ్లు పనిచేసి ఎండిపోయిన బోర్లనే తిరిగి బతికించగలం. మొదట్లోనే ఫెయిలైన బోర్లు పనికిరావు. ఏ బోరును రీచార్జ్ చేయవచ్చో లేదో రైతులే ఎటువంటి పరికరాలు లేకుండా, స్వయంగా, సులువుగా తెలుసుకోవచ్చు. 200 అడుగుల లోతు వేసిన బోరైతే 5 వేల లీటర్ల ట్యాంకర్‌తో నీటిని తెచ్చి ఈ బోరులోకి నీటిని పోయాలి. 400-600 అడుగుల లోతు బోరైతే.. 10 వేల లీటర్ల నీటిని పోయాలి. నీరు సజావుగా బోరు లోపలికి వెళ్లే.. ఆ బోర్లను వాన నీటి సంరక్షణ ద్వారా తిరిగి బతికించవచ్చు. పోస్తున్న నీరు లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటే మాత్రం ఆ బోరును ఏమీ చేయలేం. 10-15 ఎకరాల భూమిలో నుంచి వర్షపు నీటిని మళ్లించడానికి వీలయ్యే బోర్ల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించడమే ప్రయోజనకరం. నల్లరేగడి పొలాల్లోని బోర్లకన్నా, నీరు త్వరగా ఇంకే ఎర్ర, ఇసుక నేలల్లో బోర్లను రీచార్జ్ చేయడం సులభం. పుణ్యం కట్టుకున్నారు..! భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గత మూడేళ్లలో దాదాపు 450 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోయాయి. తాగడానికి నీరుకూడా సక్రమంగా అందేదికాదు. ఇంతకుముందు ఏడాదికి ఒకటే పంట పెట్టేవాళ్లం. కొద్ది కొద్దిగా నీళ్లు పోసే బోర్ల మీద నమ్మకం లేక రెండో పంట పెట్టే వాళ్లం కాదు. టౌనుకో, బెంగళూరుకో బేల్దారి పనులకు పోవాల్సివ చ్చేది. స్వచ్ఛంద సంస్థల వాళ్లు మా ఊరొచ్చి పుణ్యం కట్టుకున్నారు. నా లాగే 18 మంది రైతులు బోర్లు, బావులను మళ్లీ బతికించుకొని ఇప్పుడు పచ్చగా ఉన్నారు. తాగే నీళ్లక్కూడా కరువు లేకుండా చేశారు. మా రెండు బోర్లలో ఇప్పుడు ఇంచున్నర నీళ్లొస్తున్నాయి. ఈ నమ్మకంతోనే పంటలు పెట్టాం. మొట్టమొదటగా వేసవిలోనూ మిరప, వేరుశనగ పంటలు పెట్టా. మంచి ఆదాయం వస్తోంది. - బోయ రామాంజనేయులు (77993 32024), రైతు, కోటంక, అనంతపురం జిల్లా బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించేదెలా? బోరు బావి చుట్టూ 3 మీటర్ల(పొడవు, వెడల్పు, లోతు) గుంత తవ్వాలి. ప్లాస్టిక్ కేసింగ్ పైపు నాణ్యతను సరిచూచుకోవాలి. అది పాడైతే కొత్త పీవీసీ పైపు వేయాలి. దాని అడుగు భాగాన ఐరన్ క్లాంప్ను అమర్చి కేసింగ్ పట్టు సడలి పోకుండా జాగ్రత్తపడాలి. పైపునకు అన్ని వైపులా 4-6 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో రంధ్రాలు వేయాలి. వీటి ద్వారా ఇసుక, మట్టి బోరులోకి వెళ్లకుండా పైపు చుట్టూ నైలాన్ నెట్‌ను చుట్టాలి. ఆ తర్వాత గుంతను ఐదు దొంతర్లలో వివిధ సైజుల రాళ్లతో నింపి, పైపొరగా ఇసుక వేయాలి. అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు 30-40 సెంటీ మీటర్ల వ్యాసార్థం కలిగిన రాళ్లను వేయాలి. వాటిపైన ఒక అడుగు మందాన 15-20 సెంటీమీటర్ల రాళ్లను పేర్చాలి. ఆపైన అర అడుగు మందాన 7.5 సెంటీమీటర్ల చిన్న రాళ్లు, మరో అర అడుగు మందాన 2-4 సెంమీ గులక రాళ్లు పరవాలి. ఆపైన నైలాన్ నెట్‌ను పరిచి, దానిపై 2 అడుగుల మందాన ముతక ఇసుకను పోయాలి. ఇసుక పైన కూడా నైలాన్ నెట్‌ను అమర్చాలి. చెత్తా చెదారాన్ని పైనే వడకట్టి స్వచ్ఛమైన వర్షపు నీటిని బోరులోకి ఇంకింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని చుట్టూ ఇటుకలు, సిమెంట్‌తో అడుగు భూమి లోపలకు, అడుగు పైకి ఉండేలా గోడను నిర్మించాలి. ప్రతి ఏడాదీ పైన 2 అడుగుల మేరకు ఉన్న ఇసుకను తొలగించి, కొత్త ఇసుక నింపాలి. వర్షపు నీరు త్వరగా ఇంకడానికి కొత్త ఇసుక దోహద పడుతుంది. ఈ గుంత వైపు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చేలా చిన్న మట్టి కాలువను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. దీని నిర్మాణానికి రూ.40 నుంచి 45 వేలు ఖర్చవుతుంది. అదే గనక ఎండిపోయిన బావుల్లోకి నీటిని మళ్లించడానికైతే రూ.5 వేలు చాలు. పాడుపడిన బావుల్లోకి నీటిని ఇంకింపజేసినా 200 మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. -
‘పుట్టి’ ముంచిన ధనిక దేశాలు!
భూతాపోన్నతి వికృత కరాళ నృత్యం కళ్ల ముందు కనపడుతున్నా.. దానికి కళ్లెం వేసే పనులకు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాదీ మొండి చేయే చూపాయి. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల పుట్టి ముంచేందుకే భీష్మించుకు కూర్చున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. పోలెండ్ రాజధాని నగరం వార్సాలో ఇటీవల ముగిసిన అంతర్జాతీయ వాతావరణ సదస్సు సారాంశం ఇదే. ఫిలిప్పీన్స్‌ను రాకాసి తుపాను వల్లకాడుగా మార్చిన తెల్లారే వార్సాలో సదస్సు ప్రారంభమైంది. వేల మంది ప్రాణాలు కోల్పోయి, లక్షన్నర హెక్టార్ల పంట భూములు ఇసుక మేటలపాలై, 80 కిలోమీటర్ల పొడవున సాగునీటి కాల్వలు పూడిపోయి.. వచ్చే ఏడాదికైనా పరిస్థితి కుదుటపడి ఈ పొలాల్లో మళ్లీ పంట పండుతుందో లేదో తెలియని దయనీయ స్థితికి ఫిలిప్పీన్స్ చేరింది. వాతావరణ సదస్సు మొదట్లోనే ఈ విలయాన్ని గురించి చెబుతూ ఆ దేశ ప్రతినిధి భోరున విలపించారు. తోటి ప్రతినిధులూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మృతులకు నివాళుల ర్పించిన సదస్సులో ఉద్వేగభరిత వాతావరణం కొద్ది నిమిషాలకే ఆవిరై.. ‘ఇప్పుడేం తొందరన్న’ ధోరణిలో మళ్లీ ఎప్పటిలాగే సాగి పోయింది. రెండు దశాబ్దాల కాలయాపన ఇక అంతే.. 1992లో మొదలుకొని 195 దేశాల వాతావరణ సదస్సుల్లో ఇరవ య్యేళ్లుగా సాగుతున్న ఉత్తి మాటల బాగోతమే వార్సా సదస్సులోనూ కొనసా గింది. భూగోళాన్ని పారిశ్రామిక విప్లవ కాలం నుంచే కాలుష్య కాసారంగా మార్చి.. 80 శాతం ప్రపంచ జనాభా నివసిస్తున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను పెనువిపత్తుల విష వలయంలోకి నెట్టిన అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రం.. ఏ మాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడం విషాదకరమైన వాస్తవం. ఉద్గారాల తగ్గింపు, నిధుల కేటాయింపు వంటి విషయాల్లో ఈ దేశాలు ఇంతకుముందుకన్నా తీసికట్టు ధోరణిని ప్రదర్శించాయి. మోసపోవడమే అలవాటైన అభివృద్ధి చెందుతున్న దేశాలు మరోసారి దిమ్మెరపోయాయి. పెపైచ్చు.. ఉద్గారాల తగ్గింపు భారం అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా పంచుకోవాల్సిందేనని ఈ సదస్సులో నిర్ణయించడం నిరాశను కలిగించింది. విపత్తుల్లో చిక్కుకొని అల్లాడుతున్న తమకు చప్పున సాయం చేసే వ్యవస్థనైనా ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయాల్సిందేనన్న పాత డిమాండ్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలు వాకౌట్ చేసి మరీ ఈ సదస్సులో సాధించుకోవడంగుడ్డిలోమెల్ల. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుపై ఏర్పాటైన ప్రభు త్వాల బృందం (యూఎన్ఎఫ్సీసీసీ) ఇరవయ్యేళ్లుగా ఏటా వాతావరణ సద స్సులు నిర్వహిస్తున్నది. ఈ నెల 11న మొదలైన వార్సా సదస్సు 22నే ముగి యాల్సి ఉన్నా.. ఎడతెగని చర్చలతో మరో 30 గంటలు కొనసాగింది. భూతా పాన్ని తగ్గించేందుకు ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీ లేదు.. 2015 తర్వాత ఆలోచిద్దాం అన్న ధోరణిలో అభివృద్ధి చెందిన దేశాలు వ్యవహరించాయి. చివరకు.. 2015లో కుదిరే ఒడంబడికలో పొందుపరిచే అంశాలపై ఏకాభి ప్రాయం సాధించారు (ఈ ఒడంబడిక 2020 నుంచి అమల్లోకి రానుంది). అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆటంకం వార్సా వాతావరణ సమావేశాల్లో చెప్పుకోదగ్గ విషయాల్లో మొదటిదేమిటంటే.. ఉద్గారాల తగ్గింపు బాధ్యతకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తారతమ్యం పాటించనక్కర్లేదని అంగీకారం కుదరడం! అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా భారత్‌కు, ఆశనిపాతమైన నిర్ణయం ఇది. పారిశ్రామిక విప్లవ కాలం నుంచీ కాలుష్యాన్ని పెంచుతున్నది అభివృద్ధి చెందిన దేశాలే కాబట్టి, ముందు ఆ దేశాలే ఉద్గారాలను తగ్గించాలని భారత్, చైనా తదితర దేశాలు ఇరవయ్యేళ్లుగా వాదిస్తున్నాయి. ‘క్యోటో ప్రొటోకాల్’కు ఈ వాదనే ప్రాతిపదిక. అయితే, ఇప్పుడు ఈ విభజన రేఖ చాలా వేగంగా చెరిగిపోతున్న పరిస్థితికి వార్సా సదస్సు అద్దం పట్టింది. ఎంత నష్టం... ఎంత కష్టం...! వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు(సీవోటూ) 1990లో 355 పీపీఎం మేరకు ఉండేది. ఈ ఏడాది మే నాటికి 400 పీపీఎంకు పెరిగింది. ఈ లోగా అభివృద్ధి చెందుతున్న దేశాల ఉద్గారాలూ పెరిగాయి. అమెరికాను రెండో స్థానానికి నెట్టి చైనా అగ్రస్థానాన్ని అక్రమించింది. యూరోపియన్ యూనియన్, భారత్ 3,4 స్థానాల్లో ఉన్నాయి. పదేళ్ల క్రితం.. విపత్తుల వల్ల దాదాపు 20 వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగేది. ఇటీవల.. ఈ నష్టం 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్ల డాలర్లకు పెరిగింది. ఇదంతా ఉద్గారాల తగ్గింపుపై కాలయాపనకు మానవాళి చెల్లిస్తున్న మూల్యమే! వాకౌట్‌తో నెరవేరిన చిరకాల కోరిక విపత్తుల వల్ల నష్టపడుతున్న దేశాలకు నేరుగా సహాయం అందించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల చిరకాల కోరిక. కనాకష్టంగా ఇన్నాళ్లకు నెరవేరింది. దీనిపై 2015 తర్వాత ఆలోచిద్దామని ధనిక దేశాలు మంకుపట్టు పట్టాయి. వాటి మెడలు వంచడానికి జి77, చైనా సహా 134 దేశాలు వాకౌట్ చేయాల్సివచ్చింది. అయితే, ఇప్పటికి ఇది స్వతంత్రత లేని బలహీన యంత్రాంగమే. దీని పరిధి ఎంత? నిధుల మాటేమిటి?.. ఇవన్నీ సమాధానాల్లేని ప్రశ్నలే. ఏతావాతా.. ఉద్గారాల తగ్గింపు గురించి అభివృద్ధి చెందిన దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలూ విధిగా పట్టించుకోవాల్సిన దిశగా అంతర్జాతీయ వాతావరణ రాజకీయాలు మలుపు తిరిగిన విషయాన్ని వార్సా సదస్సు చాటుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన హక్కులను కాపాడు కుంటూనే.. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకునే దారులు వెదకాల్సిన పరిస్థితి తోసుకొస్తోందన్న మాట వాస్తవం. - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ ‘వార్సా’ విశేషాలు నిధులు: భూతాపంవల్ల సంభవించే విపత్తులను పేద దేశాలు ఎదుర్కోవడా నికి 2020 నుంచి ఏటా 10,000 కోట్ల డాలర్లు ఇవ్వడానికి 2009లోనే సంపన్న దేశాలు అంగీకరించాయి. అయితే, 2013-19 మధ్యకాలంలో ఎంత ఇచ్చేదీ చెప్పలేదు. 2016 నాటికి ఏటా 7,000 కోట్ల డాలర్లు ఇవ్వాలన్న అభివృద్ధి చెందుతున్న దేశాల మొరను ఆలకించిన నాధుడే లేడు. ఊరట: అడవుల అభివృద్ధికి గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు సంపన్న దేశాలు 10 కోట్ల డాలర్ల సాయం ప్రకటించాయి. విపత్తు సాయానికి కొత్త యంత్రాంగం: భూతాపం సృష్టించే విపత్తుల నష్టాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తట్టుకోవడానికి అవసరమైన నైపుణ్యం, ఆర్థిక సహాయం అందించడానికి కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దీని సంపూర్ణ రూపురేఖలపై 2016లో సమీక్షిస్తారట. వెనకడుగు: 2020లోగా భూతాపం తగ్గింపు చర్యలపై ఎటువంటి వాగ్దానాలూ లేవు. ఉద్గారాలను 1990 స్థాయికన్నా (2020 నాటికి) 25% తగ్గిస్తానని లోగడ చెప్పిన జపాన్ మాట మార్చి.. 3.1% పెరగనున్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. 2015 ఒడంబడిక: భూతాపాన్ని పెంచే కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015లో పారిస్ సదస్సులో ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం 2020 నుంచి అమల్లోకి రానుంది. క్యోటో ఒప్పందానికి కాలం చెల్లిన తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ ఒప్పందం ఇదే.