వ్యవసాయం, పంట ఉత్పత్తుల శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ – ఈ గొలుసు మొత్తం కలిస్తే అది ‘ఆహార వ్యవస్థ’ (ఫుడ్ సిస్టం). ప్రతి ఒక్కరి మనుగడా ఆహార వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది. పది వేల ఏళ్ల సంప్రదాయ సేద్య జ్ఞానానికి ప్రతి రూపమై ఔషధంగా విరాజిల్లిన ఆహారం.. రసాయనాలు రంగంలోకొచ్చిన వందేళ్లలోనే – భూగోళానికి, మనుషులకు, పశు పక్ష్యాదులకు – హానికరంగా మారిపోవటం విషాదకరమైన వాస్తవం.
దశాబ్దాల తరబడి పారిశ్రామిక / రసాయనిక పద్ధతుల్లో ఆహార వ్యవస్థలను నిర్వహించడం వల్లనే ఈ ముప్పు వచ్చి పడింది. ‘ఇలా రసాయనిక పద్ధతుల్లో పండించిన/శుద్ధి చేస్తున్న, సుదూర ప్రాంతాలకు తరలించి పంపిణీ చేస్తున్న ఆహారం భూతాపోన్నతికి 34% కారణమవుతోంది. పోషకాల లోపంతో, రసాయనిక అవశేషాలతో కూడిన ఈ పారిశ్రామిక ఆహారం ప్రకృతి వనరులకు, వినియోగదారుల ఆరోగ్యానికి ‘నష్టదాయ కంగా’ తయారైంది. ఆహార వ్యవస్థల దుర్గతి వల్ల 70% మంచి నీరు ఖర్చవుతోంది. అంతేకాదు... జీవవైవిధ్యం తరిగి పోవడానికి 80% ఇవే కారణమ’ని ఐరాస తాజా నివేదిక విస్పష్టంగా ప్రకటించింది.
ఐరాస శిఖరాగ్రసభ
ఆహార వ్యవస్థలను పర్యావరణానికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని తీరులోకి ఇప్పటికైనా మార్చుకుంటే ఈ దుస్థితి నుంచి మానవాళిని, భూగోళాన్ని రక్షించుకోగలమని ఐరాస గుర్తించింది. ఇందుకు దోహదపడే అనుభవాలు, ఆవిష్కరణలను క్రోడీకరించి ప్రపంచ దేశాలకు అందించడానికి ‘ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ’ను 18 నెలల కసరత్తు చేసి మరీ గత నెల 23న ఐరాస నిర్వ హించింది. 193 దేశాలకు చెందిన 51 వేల మంది పాల్గొన్నారు. ఆహార వ్యవస్థలలో సమూలంగా, గుణాత్మక మార్పు తేవడానికి 2 వేలకు పైగా సూచనలు, అనుభవాలను పంచుకున్నారని ఐరాస ప్రకటించింది. అయితే, ఉత్తమ సంప్రదాయాలకు ఐరాస తిలోదకాలివ్వటంతో అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగింది. బహుళజాతి కంపెనీల కొమ్ము కాచే అంతర్జాతీయ వితరణ సంస్థల కనుసన్నల్లోనే ఆద్యంతం ఈ తంతు సాగిందంటూ పలు అంతర్జాతీయ పౌర, స్వచ్ఛంద, రైతు సంస్థలు భగ్గుమన్నాయి.
ఏమిటీ పౌర సంస్థల అభ్యంతరం?
ఆహారం గురించి, పౌష్టికత గురించి ప్రజాస్వామికంగా చర్చించి సభ్య దేశాలకు విధానపరమైన సూచనలు అందించే అధికారం ఐక్యరాజ్యసమితిలోని ఆహార భద్రతా కమిటీ (సి.ఎఫ్.ఎస్.)కి ఉంది. ఇందులో సభ్య దేశాలతో పాటు రైతులు, ఆదివాసులు, పౌర, స్వచ్ఛంద సంస్థలకు కూడా పూర్వం నుంచి సముచిత ప్రాతినిధ్యం ఉంది. విధాన నిర్ణయాలపై ఆయా దేశాలకు సూచనలు పంపడానికి ముందే పౌర సంస్థలు తమకున్న అభ్యంతరాలను తెలియజెప్పడానికి, ఆయా దేశాలతో చర్చించడా నికి అవకాశం ఉంటుంది. అయితే, ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభ విషయంలో ఐరాస సెక్రటరీ జనరల్ భిన్నంగా వ్యవహరిం చారు. సి.ఎఫ్.ఎస్.ను పక్కనపెట్టి.. కార్పొరేట్ సంస్థలతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తిని ప్రత్యేక ప్రతినిధిగా నియమించి శిఖరాగ్ర సభను జరిపించటం ఏమిటని స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆహార హక్కుపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి మైఖేల్ ఫక్రి కూడా నిరసించటం విశేషం.
కొద్ది కంపెనీలదే రాజ్యం
ప్రపంచ ఆహార, వినిమయ వస్తువుల వాణిజ్యం అతికొద్ది బహుళ జాతి కంపెనీల చేతుల్లో కేంద్రీ కృతం కావడమే ముఖ్య సమస్య. ప్రపంచ విత్తనాల మార్కెట్‌లో 53% వాటా 2 కంపెనీలదే. వ్యవసాయ రసాయనాల ఉత్పత్తి, వాణిజ్యంలో 70% వాటా 3 కంపెనీలదే. పశువులకు సంబంధించిన బ్రీడింగ్, ఔషధాలు, వ్యవసాయ యంత్రాల తయారీ, సరుకు వాణిజ్యంలోనూ రెండు, మూడు కంపెనీలదే సింహభాగం. బడా కంపెనీలు తమకు లాభాలు తెచ్చిపెట్టే ఆధునిక టెక్నాలజీలను, జన్యుమార్పిడి పంటలను సరికొత్త మాటల గారడీతో ఐరాస సభ్య దేశాలపై రుద్దే ప్రమాదం పొంచి ఉంది.
మన రైతుల విజయాలు చాలవూ?
అనేక ఖండాల్లో చిన్న, సన్నకారు రైతులు సంప్రదాయ విజ్ఞా నంతో ఆవిష్కర్తలుగా మారి ఆహార వ్యవస్థలను ప్రకృతికి, ఆరోగ్యానికి నష్టదాయకం కాని సాగు పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మన దేశం ముందుంది. పెద్ద వ్యవ సాయ రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచంలోకెల్లా పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాధారణ రైతులు అసాధారణ విజయాలు సాధిస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ గణాం కాల ప్రకారం.. 1,30,000 మంది రైతులు 3–4 ఏళ్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. మరో 3.5 లక్షల మంది రైతులు కొద్దిమేర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2.7 లక్షల మంది భూమి లేని గ్రామీణ పేదలు ఇళ్ల దగ్గర ఖాళీ స్థలాల్లో ప్రకృతి సేద్య పద్ధతుల్లో పెరటి తోటలు సాగు చేస్తున్నారు.
‘సెస్’, ఐ.డి.ఎస్.ల ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ ఎసెస్ మెంట్ మూడేళ్లుగా జరుగుతోంది. ‘ప్రకృతి వ్యవసాయం వల్ల ఏపీలో ఖర్చు తగ్గుతోంది, దిగుబడులు పెరుగుతున్నాయి, రైతుల నికరాదాయం పెరుగుతోంది..’ అని ఈ సంస్థలు నిర్ధారణకు వచ్చాయి. ఐరాస శిఖరాగ్ర సభలో ఉత్పత్తిదారుల విభాగంలో ఏపీ ప్రకృతి వ్యవసాయ విభాగం అధిపతి టి. విజయకుమార్ మన రైతుల ప్రకృతి సేద్య అనుభవాలను సాకల్యంగా వివరిం చారు. గుత్తాధిపత్యానికి దారితీసే బడా బహుళజాతి కంపెనీల అత్యాధునిక సాంకేతికతల అవసరం లేకుండానే, ఆహార వ్యవస్థ లను శాశ్వతంగా పునరుజ్జీవింపజేసుకునేందుకు దోహదపడే సుసంపన్న అనుభవాలు ఇవి.
అయితే, అత్యంత ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఐరాస ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సభలో భారత ప్రభుత్వ ప్రతినిధి సమర్పించిన అధికార పత్రంలో ఏపీ ప్రకృతి రైతుల అపురూప అనుభవాలను మచ్చుకు కూడా ప్రస్తావించలేదు. బడా కార్పొరేట్ సంస్థల లాబీ యింగ్ ప్రభావానికి ఇదొక మచ్చుతునకేమో మరి!
– పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment