ఎడారులు వేరు, ఎడారీకరణ జరగడం వేరు. మానవ తప్పిదాల వల్ల భూములు ఎడారీకరణకు గురవడం ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద సమస్య. తగని వ్యవసాయ పద్ధతులు, కాలుష్యం, అడవుల నరికివేత, యుద్ధాలు లాంటివెన్నో దీనికి కారణం. ఎడారీకరణ భూమిని నిస్సారం చేస్తుంది. దీనివల్ల ఆహార అభద్రత, నీటి కొరత లాంటి విపరిణామాలు తలెత్తుతాయి.
తద్వారా వలసలు, పేదరికం పెరుగుతాయి. అందుకే నిరుపయోగమైన భూములను తిరిగి సస్యశ్యామలంగా మార్చాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. దీనికి సౌర, పవన శక్తులు సహకారం అందించగలవని శాస్త్రవేత్తలు ఆశ పెడుతున్నారు. రానున్న దశాబ్దకాలంలో చైనా విస్తీర్ణానికి సమానమైన భూమిని సారవంతం చేయాలని ప్రపంచం సంకల్పించుకోవడం శుభసూచకం.
ప్రతి సంవత్సరం జూన్ 17ను ‘ప్రపంచ ఎడారీకరణ, కరువు పోరాట దినోత్సవం’గా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 1994లో ప్రకటించింది. దీని ముఖ్యోద్దేశం నిరుపయోగంలో ఉన్న భూమిని సస్యశ్యామలమైన భూమిగా మార్చడం. ఆ భూమిని పునరుద్ధరించడం ద్వారా ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. దీనివల్ల నూతన ఉద్యోగ కల్పన జరుగు తుంది. ఆహార భద్రత పెరుగుతుంది.
అంతేగాక జీవన వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ చర్యల వలన భూమిపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడతాయి. తద్వారా భవిష్యత్ తరాలవారికి భూమి మరింత నివాస యోగ్యం అవుతుంది.
సముద్రాలు, మహాసముద్రాలు, మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగిలిన భూమిపై వ్యవసాయం, రహదారులు, పరిశ్రమలు, గృహనిర్మాణాల కోసం మానవులు నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ నూతన ఆవిష్కరణల వల్ల అవసరమైన మేరకు తప్ప మిగతా వాటివల్ల సహజ పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. అటవీ నిర్మూలన, తగని, నిలకడలేని వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వైపరీత్యాలు, కొన్ని సందర్భాలలో మానవ తప్పిదాలైనా యుద్ధాల వలన కూడా సారవంతమైన భూమి ఎడారిగా మారు తోంది.
పర్యావరణ వ్యవస్థలు విపరీతంగా దోపిడీకి గురవటం, అతిగా మైనింగ్ కార్యకలాపాలు, కలుషిత నీటిపారుదల వలన కూడా భూమి ఎడారి అవుతుంది. తద్వారా ఆ ప్రాంతం అసహజ ఎడారీ కరణ అవుతుంది. ఈ ఎడారీకరణలో భూమి పూర్తిగా లేదా పాక్షికంగా ఎండిపోతుంది. దాని ఫలితంగా ఆ ప్రాంతమంతటా తీవ్ర కరువు ఏర్పడుతుంది. ఈ కరువు, కాటకాలతో మానవాళి జీవనం అస్తవ్యస్త మవుతుంది.
ఈ అసహజ ఎడారీకరణ అనేది ప్రకృతి రీత్యా ఏర్పడిన సహజ ఎడారులను సూచించదు. ఇది ముమ్మాటికీ మానవ తప్పిదాల వలన జరుగుతుంది. అనేక దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదాలలో ఇది మైఖ్యమైనది. ఇది భూమి స్థితిని, సాంద్రతను క్రమంగా క్షీణింపజేసే ప్రక్రియ.
వాస్తవం ఏమిటంటే, ప్రపంచంలోని గ్రామీణ పేదలలో చాలా ఎక్కువ భాగం ఈ భూములపైనే నివసిస్తు న్నారు. దీని అర్థం వారు నీటి కొరత, కరువులు, అధిక ఉష్ణోగ్రత, పేదరికం, ఆహార అభద్రత, సంఘర్షణల బారిన మరింతగా పడను న్నారనే! ఎడారీకరణ వలన మరో పెనుముప్పు, నీటి కొరత. 2025 నాటికి 180 కోట్ల మంది సంపూర్ణ నీటి కొరతను ఎదుర్కో వాల్సిన ప్రమాదం ఉంది. ప్రపంచంలోని మూడింట రెండు వంతుల మంది నీరు అందని పరిస్థితులలో జీవిస్తారు.
మనం ప్రతిరోజూ చూసే వార్తా నివేదికలను బట్టి, గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వాతావరణ విధానాలు మారుతున్నాయని సులభంగా గుర్తించవచ్చు. తరచుగా వర్షాలు కురిసే ప్రదేశాలలో కూడా కరువు అనేది ఒక సాధారణ విషయం అవుతోంది. కొద్దిపాటి చినుకులు కూడా అరుదుగా పడే దేశాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తు న్నాయి.
వాతావరణ మార్పు అనేది నెమ్మదిగా మన ప్రపంచంపై అంటే మానవాళికున్న ఏకైక ఇంటిపై ప్రభావం చూపుతోంది. ప్రతి సంవత్సరం మనం 12 మిలియన్ హెక్టార్ల భూమిని కోల్పోతున్నాం. ప్రపంచ అటవీ విస్తీర్ణం 13 మిలియన్ హెక్టార్లు తగ్గిపోతోంది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం– కరువు, ఎడారీకరణ కారణంగా సుమారు 1.9 బిలియన్ హెక్టార్ల భూమి క్షీణీస్తోంది. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఆఫ్రికా ఖండాలలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో పొడి భూముల్లో దాదాపు మూడు వంతులు ఎడారులయ్యాయి.
ప్రపంచంలో వ్యవసాయం కోసం ఉపయోగించే పొడి భూముల్లో కూడా 70 శాతం వివిధ రకాల కారణాలతో నిస్సారమవుతున్నాయి. ఆఫ్రికా ఖండంలో భూమి ఎడారిగా మారడంతో గత ఐదేళ్లలో 6 కోట్ల మంది ప్రజలు వలసలు వెళ్లారు. వాస్తవానికి 2025 నాటికి ఆఫ్రికాలోని సారవం తమైన భూమిలో మూడింట రెండు వంతులు ఎడారీకరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
ఇక భారతదేశంలో మొత్తం భౌగోళిక ప్రాంతం 328.72 మిలియన్ హెక్టార్లలో దాదాపు 97.85 మిలియన్ హెక్టార్ల భూమి క్షీణతకు గురయింది. ఇందులో రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, లదాఖ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలున్నాయి. అయితే ఈ ఎడారీకరణకు పరిష్కారం ఉందా? అంటే ఉందనే! దానికి ఉత్తమమైన వ్యవసాయ పద్ధతులు అవలం బించటం, కరువు నిరోధకత కలిగిన వివిధ పంటలు సాగుచేయటమే మార్గం.
అలాగే శాస్త్రవేత్తలు ఎడారులలో సమృద్ధిగా కనిపించే రెండు విషయాలను గమనించారు. అవి ఒకటి సూర్యుడు, రెండవది గాలి. సహారా ఎడారిలో భారీ సంఖ్యలో సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లను నిర్మించడం ద్వారా వర్షపాతం, వృక్షసంపద, ఉష్ణోగ్రతలపై అవి ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. విండ్ టర్బైన్ల ద్వారా ఈ ప్రాంతంలో కురిసే వర్షాన్ని రెట్టింపు చేయవచ్చని వారు గుర్తించారు. సహారా ఎడారిలోని తొమ్మిది మిలియన్ చదరపు కిలోమీటర్ల మేరా సౌర, పవన కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.
ఎందుకంటే ఇక్కడ తక్కువ జనాభా ఉంటుంది. సౌర, పవన క్షేత్రా లకు అనువైన ప్రదేశం కూడా. దాని ప్రకారం, ఈ ఎడారిలో ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం వినియోగించే విద్యుత్ కంటే నాలుగు రెట్ల ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీనికి కొన సాగింపుగా సాహెల్ ఎడారి ప్రాంతంలో కూడా ఈ తరహా ప్రయో గాలు జరిగాయి. దీని అనంతరం ఇక్కడ సంవత్సరానికి 20 మిమీ నుండి 500 మిమీ మధ్య వర్షపాతం నమోదు అవుతుందని యూని వర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ (అమెరికా) వారి అధ్యయనం తేల్చింది. ఫలితంగా, వృక్ష సంపద సుమారు 20 శాతం పెరుగు తుందని గుర్తించారు.
ఇది ప్రపంచంలోని అన్ని దేశాల ప్రధాన సమస్య. కాబట్టి అన్ని దేశాలూ సమష్టిగా పరిష్కారాలను కనుగొనాలి. సహారా తరహా సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల వ్యవస్థాపన నిజంగా ఎడారీకరణను ఆపగలిగితే అన్ని దేశాలూ ఆ వైపుగా పయనించాలి. అభివృద్ధి చెందు తున్న దేశాలకే ఎడారీకరణ ముప్పు ఎక్కువగా ఉన్నది.
కాబట్టి దీన్ని అరికట్టడానికి మనం తక్షణమే వ్యవసాయాన్ని పరిరక్షించాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టాలి, వాయు కాలుష్యాన్ని అదుపులో ఉంచాలి, సహజ ప్రకృతి సంపదను కాపాడుకోవాలి, అడవులను నిర్మూలించ కుండా పరిరక్షించుకోవాలి, రసాయన క్షిపణుల వాడకం తగ్గించాలి. ముఖ్యంగా యుద్ధాలు జరగకుండా జాగ్రత్త పడాలి.
ఒక విధంగా చెప్పాలంటే మన శరీరాన్ని ఏవిధంగా ప్రతిరోజూ పరిరక్షించు కుంటామో అదే విధంగా మనకు ఉన్న ఏకైక నివాసం మన భూమిని కూడా అలాగే కాపాడుకోవాలి. ఇందుకు ప్రపంచ దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలి. లేదంటే ఏదో ఒకరోజు ఈ మానవాళి మొత్తం శాశ్వత నిద్రలోకి పయనించటం ఖాయం.
అందుకే ప్రపంచ దేశాలు రానున్న దశాబ్దంలో బిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఈ పునరుద్ధరించాలన్న ప్రాంతం సుమారు చైనా దేశ విస్తీర్ణానికి సమానం. ఇన్ని హెక్టార్ల భూమిని పునరుద్ధరిస్తే మానవాళికీ, పుడమికీ భారీ ప్రయోజనాలను అందించగలమని ఐక్యరాజ్యసమితి పేర్కొన డం శుభపరిణామం.
నూతలపాటి రవికాంత్
వ్యాసకర్త రాజకీయ, సామాజిక విశ్లేషకులు
మొబైల్: 97044 44108
(నేడు ప్రపంచ ఎడారీకరణ, కరువు పోరాట దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment