స్వపరిపాలనలో 75 ఏళ్లు గడిచాయి. భారతీయ వ్యవసాయ రంగం ఇప్పుడెలా మిగిలిందో సింహావలోకనం చేసుకొని.. రాబోయే పాతికేళ్లు ఎలా ఉండబోతోందో కొంతమేరకు అంచనా వేసుకుందాం. ఎలా ఉంటే బాగుంటుందో కూడా ఆలోచిద్దాం.
‘స్వతంత్ర భారత దేశాన్ని ఆహార కొరత నుంచి గట్టెక్కించి, స్వయం సమృద్ధి సాధించిపెట్టిన ‘హరిత విప్లవం’.. తదనంతర కాలంలో భారతీయ రైతుల పాలిట పెనుశాపంగా మారి ఆత్మహత్యల పరంపరకు తెర లేపింది. ఎన్నో శతాబ్దాలుగా చెక్కు చెదరని భారతీయ రైతుల ఉత్పత్తి సామర్థ్యం కొన్ని దశాబ్దాల కాలంలోనే తునాతునకలై పోయింది.
హరిత విప్లవ చోదకాలైన హైబ్రిడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, భారీ యంత్రాలు రైతుల్ని స్వాయత్తత కలిగిన ఉత్పత్తిదారుల స్థితి నుంచి బహుళజాతి సంస్థల వినియోగదారులుగా మార్చి వేశాయి. ఎడతెగని పెట్టుబడుల పర్వంలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోసాగారు.
వాతావరణంలో అనూహ్యమైన మార్పులు, చీడపీడల విజృంభణ, కూలీల కొరత, మార్కెట్ అనిశ్చితి, దళారుల దోపిడీ.. మొదలైనవి రైతుల ఆదాయంలో అస్థిరతను నింపాయి. భారత దేశ ఆర్థిక వ్యవస్థను సహస్ర శతాబ్దాలుగా తమ భుజస్కందాలపై మోసిన మన రైతులు నేడు రెక్కలు తెగిన పక్షలు..’ ఇదీ సమకాలీన వ్యవసాయ సంక్షోభంపై స్వతంత్ర సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి గుండె మండే వాస్తవిక వ్యాఖ్య.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘హరిత విప్లవం నమూనా వ్యవసాయం’ మన కడుపు నింపుతున్నట్లే కనిపిస్తూ మన పుట్టి ముంచింది, ముంచుతోంది. రైతుల జేబులు ఖాళీ చేస్తూ కంపెనీల బొక్కసాలు నింపుతోంది. గత ఆరు దశాబ్దాలుగా మనం ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి రసాయనాలు కొని వేస్తూ ఎంత ఎక్కువ దిగుబడి తీద్దాం అనే ధోరణిలోనే ఆలోచించాం. దీని వల్ల నేలకు, నీటికి, పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, పశు పక్ష్యాదుల ఆరోగ్యానికి ఏమి హాని జరుగుతోందో ఆలోచించలేదు.
పంజాబ్ సంక్షోభం
హరిత విప్లవానికి పట్టుగొమ్మగా నిలిచిన పంజాబ్ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటినీ ఇవ్వాళ కేన్సర్ మహమ్మారి కమ్ముకుంది. షుగర్, గుండెజబ్బులు, ఊబకాయం.. వంటి జబ్బులూ తక్కువేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యాధులు అనూహ్యంగా పెరుగుతూ ఉండటం మనకు తెలియనిది కాదు.
హరిత విప్లవ పెడ ధోరణులపై దూరదృష్టితో భాస్కర్ సావే వంటి వారు అప్పట్లోనే నెత్తీ నోరు మొత్తుకున్నా పెద్దగా చెవికెక్కించుకోలేదు మన పాలకులు. లేదా ఈ హాని గురించి ఆలోచించే అంత లగ్జరీ మనకు లేదని సరిపెట్టుకున్నారు.
కానీ, తీరా ఇప్పుడు చూస్తే.. వ్యవసాయానికి ఆర్థిక దృష్టి మాత్రమే చాలదు.. పౌష్టికాహార, ఆరోగ్య, పర్యావరణ పరమైన సమగ్ర దృష్టి అవసరం మాత్రమే కాదు.. భూమ్మీద జీవరాశి మనుగడ కొనసాగడానికి మనుషులు ఈ స్పృహను గమనించుకొని మెలగడం అనివార్యం అని స్పష్టంగా అర్థమవుతోంది.
భూమి పైపొర నేలలో పంటలు పండుతాయి. ఈ మట్టి ఆరోగ్యవంతంగా ఉంటేనే అందులో పండే పంట దిగుబడి బాగుంటుంది. అంతేకాదు. ఆ పంట దిగుబడుల్లో పోషకాల సమగ్రత కూడా నేలలో పోషకాల లభ్యత స్థాయిని బట్టే నిర్ణయమవుతుంది. నేలల్లో ఉండే సేంద్రియ కర్బనం నేల ఆరోగ్యానికి ఓ ముఖ్య సూచిక. ‘తెలుగు నాట భూముల్లో సేంద్రియ కర్బనం 30 ఏళ్ల క్రితం 0.5% ఉండేది.. ఇప్పుడు 0.2%కి అడుగంటింది.
రసాయనాలు కుమ్మరించటం మాని, సేంద్రియ కర్బనం పెంచుకుంటూనే పంటలు పండించుకునే సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించటం అనివార్యం. 0.7% నుంచి 1%కు పెంచుకుంటేనే ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు సాధ్యం అని జాతీయ మట్టి సర్వే–భూ వినియోగ ప్రణాళిక సంస్థ నిపుణులు డా. వి. రామమూర్తి స్పష్టం చేశారు.
మిగిలిందిక పాతిక పంట కాలాలే!
రసాయనిక సాంద్ర వ్యవసాయం వల్ల ముంచుకొస్తున్న ముప్పు మన ఒక్క దేశానికే పరిమితమై లేదు. ఐక్యరాజ్య సమితిలో ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతున్నదే మిటంటే.. మనందరం తినే ఆహారంలో 95% భూమి పైపొర మట్టిలో పండినదే. నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పంట భూములు నానాటికీ క్షీణిస్తున్నాయి.
భూసారం క్షీణించి భూములు సాగు యోగ్యం కాకుండా పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 83.3 కోట్ల హెక్టార్ల పొలాలు ఉప్పుదేలటమో, చౌడుబారిపోవటమో ఇప్పటికే జరిగింది. అంటే.. పంట భూముల్లో పది శాతం ఈ విధంగా సాగు యోగ్యం కాకుండా పోయాయి. చౌడు సమస్య మరింత పెరిగితే నికర సాగు భూముల విస్తీర్ణం ఇంకా తగ్గిపోతుంది.
వ్యవసాయం చేసే పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోక తప్పదు. నేల ఆరోగ్యమే మనుషులు, పశు పక్ష్యాదుల ఆరోగ్యమని అందరూ తెలుసుకోవాలి అని ఎఫ్.ఎ.ఓ. డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు చెబుతున్నారు.
– పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు
prambabu.35@gmail.com
Comments
Please login to add a commentAdd a comment