చినుకు బతికిం‘చేను’ | Encouraging farmers in the cultivation by giving bank loan for water safety | Sakshi
Sakshi News home page

చినుకు బతికిం‘చేను’

Published Sun, Jul 6 2014 11:19 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

చినుకు బతికిం‘చేను’ - Sakshi

చినుకు బతికిం‘చేను’

ఎండిన బోర్లలోకి వాన నీటిని ఒడిసిపట్టి కరువుకు చెక్!
 
కరువు తాకిడికి రైతులు విలవిల్లాడుతుంటే.. పూర్తిస్థాయి వర్షాల జాడ లేక కళ తప్పిన పొలాలు బావురుమంటున్నాయి. కానీ, కోటంక గ్రామానికి చెందిన రైతు బోయ రామాంజనేయులు మాత్రం ముందెన్నడూ లేనంత ధైర్యంగా ఉన్నాడు! వర్షాలు ఆలస్యమైనా తన మిరప, వేరుశనగ తోటలకేమీ ఢోకా లేదంటున్నాడు! ఈ రైతే కాదు..ఆ గ్రామంలో మరికొందరు రైతులు కూడా ఇంతే ధీమాగా పంటలు పండిస్తున్నారు.  అంతేకాదు.. తాగునీటి కొరతతో ఊళ్లకు ఊళ్లు అల్లాడుతుంటే.. ఆ గ్రామంలో మాత్రం తాగునీటి ఎద్దడి లేదు! అలాగని.. ఈ గ్రామం నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్రాంతంలోనిదనుకుంటే పొరపాటే. కరువు సీమైన అనంతపురం జిల్లాలో ఉంది! ఎండిపోయిన బోర్లు, బావులను వాన నీటి ఇంకుడు గుంతల ద్వారా రీచార్జి చేయడం తాలూకూ మహత్తు ఇది..!
 
* కరువు సీమలో కాంతిరేఖ
* వాన నీటి సంరక్షణ మహత్తు చాటుతున్న అనంతపురం జిల్లా కోటంక రైతులు
* ఎండిన బోరుకు రీచార్జితో వేసవిలోనూ నిశ్చింతగా తుంపర్లు, బిందు సేద్యం
* గ్రామంలో 20% బోర్ల చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మిస్తే చాలంటున్న నిపుణులు
* సులభమైన పద్ధతిలో రైతులే నిర్మించుకునే అవకాశం
* మెట్ట రైతులను బ్యాంకు రుణంతో ప్రోత్సహిస్తే సాగు నీటికి భద్రత  
 
తొలకరి చినుకు నేలతల్లిని పులకింపజేస్తుంది. మొలకెత్తిన విత్తనం పంటవుతుంది. కానీ, పంటకు అవసరమైనప్పుడల్లా వాన పడదు. అవసరమైనప్పుడల్లా నీరు అందుబాటులో ఉండాలంటే.. కురిసినప్పుడే ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలి. ఇంటికి సరిపడే నీరైతే భూగర్భ ట్యాంకులో భద్రపరచుకోవచ్చు. పంటల సాగు కోసమైతే భూగర్భంలో తప్ప మరెక్కడ దాచుకోగలం? నీటిలో జీవశక్తి ఉంది. వాన నీటి సంరక్షణలో పునరుజ్జీవన మహత్తుంది. దీన్ని గ్రహించలేకపోతే ఎంత పుష్కలంగా వర్షం కురిసినా.. ఆ నీటి బొట్టు కోసం ఆనక అలో లక్ష్మణా అని అలమటించక తప్పదు. ఇప్పటి మాదిరిగా కరువొస్తే ఇక చెప్పనక్కర్లేదు.
 
భూమ్మీద పడిన వర్షపు చినుకుల్లో 12 నుంచి 18 శాతం వరకు సహజంగానే మట్టిలోకి ఇంకుతాయి. ఆవిరైపోగా మిగిలిన 25-30 శాతం వాన నీరు వాగులు, వంకల ద్వారా నదుల్లోకి పారుతుంది. వృథాగా పోయే ఈ నీటిలో కొంత భాగాన్ని జాగ్రత్త చేసుకున్నా చాలు.. అది కేరళ అయినా, అనంతపురం అయినా తాగునీటికి, సాగునీటికి బెంగ ఉండదని కోటంక గ్రామ రైతులు రుజువు చేస్తున్నారు.దేశంలోకెల్లా అత్యల్ప వర్షపాతం(సగటున ఏటా 550 మిల్లీమీటర్ల) నమోదయ్యే ప్రాంతాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉంది. 750  అడుగుల్లోతుకు వెళితే కానీ నీటి జాడ దొరకని ప్రాంతాలకు నెలవైన ఈ జిల్లాలో ఏటా 29 శాతం బోర్లు ఎండిపోతుంటాయి. ఆర్థిక స్థోమతకు మించి రైతులు బోర్లు వేసిన, వేస్తున్న రైతులు వేల సంఖ్యలో వున్నారు.
 
వాన నీటి సంరక్షణకు ఉపకరించే అనేక పద్ధతులు ఎప్పటి నుంచో అమల్లో ఉన్నా ఎండిపోతున్న బోర్లను రీచార్జి చేసే కొత్త పద్ధతి ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. ఎండిపోయిన బోరు బావుల పునరుజ్జీవం కోసం కర్ణాటకకు చెందిన భూగర్భ జల నిపుణుడు ఎన్‌జే దేవరాజ్ రెడ్డి(09448125498) రూపొందించి అమలు పరుస్తున్న నమూనా ప్రసిద్ధి పొందింది. సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ(సీడబ్ల్యూయస్) సంస్థ నిపుణులు మన ప్రాంత అవసరాలకు అనుగుణంగా ఈ నమూనాకు మెరుగులు దిద్ది సుస్థిర భూగర్భ జల యాజమాన్యం(సుగమ్) ప్రాజెక్టు ద్వారా ఎండిపోయిన బోర్లలో జలసిరిని నింపుతున్నది. యూరోపియన్ యూనియన్ ఆర్థిక సహాయంతో అనంతపురం, వరంగల్ జిల్లాల్లోని 6 పంచాయతీల్లోని 13 గ్రామాల్లో  స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది. వర్షపు నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం ద్వారా ఎండిపోయిన బోర్లు, బావులు తిరిగి జలకళను సంతరించుకుంటున్నాయి.
 
ఈ నీటితో రైతులు తుంపర, బిందు సేద్య పద్ధతులను అనుసరిస్తూ కరువు కాలంలోనూ మెట్ట పొలాల్లో నిశ్చింతగా పంటలు పండిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల గ్రామాల్లో భూగర్భ జల సంరక్షణపై  రిడ్స్ సంస్థ పని చేస్తోంది. గార్లదిన్నె మండలంలోని కోటంక గ్రామంలో తొలుత మంచినీటి బోరు వద్ద ఇంకుడు గుంతను నిర్మించారు. ఎండిపోయిన ఆ బోరులో నుంచి మళ్లీ నీళ్లు వస్తుండడంతో స్ఫూర్తి పొందిన రైతు బోయ రామాంజనేయులు  తన బోరు వద్ద కూడా ఇంకుడు గుంతను నిర్మించుకున్నాడని రిడ్స్  డెరైక్టర్ కిష్టప్ప(94405 28626) తెలిపారు.

ఆయనను మరో 18 మంది రైతులు  అనుసరించారు. తత్ఫలితంగా కోటంక పరిసర భూముల్లో భూగర్భ జల మట్టం 165 అడుగుల(2012 మే) నుంచి 105 అడుగులకు(2013 మే) పెరిగింది. గ్రామ పరిధిలోని 370 బోర్లలో 174 బోర్లు గతంలో ఎండిపోయాయి. ఇంకుడు గుంతల నిర్మాణం తర్వాత వీటిల్లో 78 బోర్లు తిరిగి వినియోగంలోకి వచ్చాయి. గ్రామానికి సాగు నీటి భద్రత ఏర్పడడమే కాకుండా తాగు నీటి ఎద్దడీ తీరింది.
 
మొదటి సారిగా మూడో పంట!

నాలుగేళ్ల క్రితం వరకు చేనేత కార్మికుడిగా పనిచేసిన రామాంజ నేయులు(38) తన సోదరుడు ఓబులేశుతో కలిసి ఉమ్మడిగా ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా రు. తమకున్న 5 ఎకరాల పొలంలో 2011లో బోరు వేశాడు. ఒకటిన్నర ఇంచ్ నీళ్లు పడ్డాయి. మరుసటి ఏడాది మరో బోరు వేశాడు. అందులోనూ అదేమోస్తరు నీరు పడినా.. కొన్నాళ్లకు ఎండిపోయింది. స్వచ్ఛంద సంస్థ ఆర్థిక తోడ్పాటు, సాంకేతిక సాయంతో ఎండిపోయిన బోరు వద్ద 2013 జూన్‌లో రీచార్జ్ పిట్ నిర్మించారు. నెల రోజుల్లోనే నీటి మట్టం పెరిగి బోరు రెండు అంగుళాల నీరు వచ్చింది. మొదటి బోరులోనూ నీరు పెరిగింది. రెండు బోర్లూ పనిచేస్తుండడంతో గత ఏడాది ఖరీఫ్, రబీ పంటలు పండించడం విశేషం. వరుసగా రెండు పంటలు చేతికొచ్చే సరికి సాగు నీటికి భయపడాల్సింది లేదన్న భరోసా కలిగింది.
 
దీంతో తమ ఐదెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని ఈ వేసవిలో మూడో పంట వేశారు. స్ప్రింక్లర్లతో ఆరు ఎకరాల్లో నెల క్రితం వేరుశనగ, డ్రిప్‌తో ఎకరంలో రెండు నెలల క్రితం మిరప, మరో ఎకరంలో టమాటా వేసి.. రెండు బోర్లలోనూ ప్రస్తుతం వస్తున్న ఇంచున్నర నీటితో నిశ్చింతగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పచ్చి మిరప కాయలను కేజీ రూ. 25-30కి అమ్ముతున్నానని సంతోషంగా చెప్పారు. ఏటా నీరు చాలక రెండు, మూడెకరాల్లో  ఒకే పంటతో సరిపెట్టుకునే ఆయన ఈ కరువు కాలంలోనూ ధైర్యంగా 8 ఎకరాలు సాగు చేస్తుండడం విశేషం. ఈ చిన్న రైతు విజయగాథ వాన నీటి సంరక్షణ ప్రయోజనాన్ని రైతు లోకా నికి చాటి చెబుతోంది.
 
ప్రభుత్వం పూనుకొని వాన నీటి సం రక్షణను ఉద్యమంగా చేపడితే.. గాల్లో దీపంలా కొట్టుమి ట్టాడుతున్న మెట్ట రైతులకు శాశ్వతంగా మేలు జరుగుతుంది. వాననీటి సంరక్షణ కోసం బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తే రైతులను కరువు కోరల్లోంచి రక్షించవచ్చు. ఏ గ్రామ పొలాల్లోనైనా 20% బోర్ల వద్ద ఇంకుడు గుంతలను నిర్మిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. 4,5 రోజుల్లో దీన్ని నిపుణుల పర్యవేక్షణలో రైతులే  రూ. 40-45 వేల ఖర్చుతో నిర్మించుకోవచ్చు. ప్రతి ఏటా 2,3 అడుగుల లోతు ఇసుకను మార్చుకుంటే చాలు.  ప్రభుత్వం వాన నీటి సంరక్షణ కార్యక్రమాలను రుణాలిచ్చి  ప్రోత్సహించాలి. కరువు కాలంలో ఇది తక్షణావసరం.  
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఇన్‌పుట్స్: జే ఆంజనేయులు, గార్లదిన్నె, అనంతపురం జిల్లా
 
నీటి సంరక్షణ మహత్తును చాటడమే లక్ష్యం!
మెట్ట, కరువు ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణతో ప్రజలకు ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో మేం  కొత్త పద్ధతిలో అమలు చేస్తూ.. సత్ఫలితాలు సాధిస్తున్నాం. మూడేళ్లలో 13 గ్రామాల్లోని 65 బోర్లను రీచార్జ్ చేశాం. వాన నీటి సంరక్షణ మహత్తును రైతులకు, ప్రభుత్వానికి తెలిసేలా చేయడమే మా లక్ష్యం. వాన నీటి సంరక్షణ వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్, ఉప్పదనం, హార్డ్‌నెస్ తగ్గి.. నాణ్యత, రుచి పెరుగుతాయి. డ్రిప్ పరికరాల మన్నిక పెరుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడులొస్తాయి. 100% పారిశుద్ధ్యం పాటించే చోట్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు అతిగా వాడని చోట్ల వాన నీటి సంరక్షణ ఉత్తమం. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చాం.  రైతులు గానీ, మరెవరైనా గానీ సమావేశాలు నిర్వహిస్తుంటే మమ్మల్ని పిలిస్తే నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తాం.

 - ఆర్.వి. రాంమోహన్, భూగర్భ జల నిపుణుడు,
సుగమ్ ప్రాజెక్టు, సికింద్రాబాద్. ఫోన్: 040-27007906  Emai:projectsugwm@cwsy.org, projectsugwm@gmail.com
 Weblink: http://www.cwsy.org/sugwm.htm
 
ఎటువంటి బోర్లను బతికించగలం?

సీడబ్ల్యూయస్ నిపుణుల కథనం ప్రకారం.. కొన్నాళ్లు పనిచేసి ఎండిపోయిన బోర్లనే తిరిగి బతికించగలం. మొదట్లోనే ఫెయిలైన బోర్లు పనికిరావు. ఏ బోరును రీచార్జ్ చేయవచ్చో లేదో రైతులే ఎటువంటి పరికరాలు లేకుండా, స్వయంగా, సులువుగా తెలుసుకోవచ్చు. 200 అడుగుల లోతు వేసిన బోరైతే 5 వేల లీటర్ల ట్యాంకర్‌తో నీటిని తెచ్చి ఈ బోరులోకి నీటిని పోయాలి. 400-600 అడుగుల లోతు బోరైతే.. 10 వేల లీటర్ల నీటిని పోయాలి. నీరు సజావుగా బోరు లోపలికి వెళ్లే.. ఆ బోర్లను వాన నీటి సంరక్షణ ద్వారా తిరిగి బతికించవచ్చు. పోస్తున్న నీరు లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటే మాత్రం ఆ బోరును ఏమీ చేయలేం. 10-15 ఎకరాల భూమిలో నుంచి వర్షపు నీటిని మళ్లించడానికి వీలయ్యే బోర్ల దగ్గర ఇంకుడు గుంతలు నిర్మించడమే ప్రయోజనకరం. నల్లరేగడి పొలాల్లోని బోర్లకన్నా, నీరు త్వరగా ఇంకే ఎర్ర, ఇసుక నేలల్లో బోర్లను రీచార్జ్ చేయడం సులభం.
 
పుణ్యం కట్టుకున్నారు..!
భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గత మూడేళ్లలో దాదాపు 450 ఎకరాల్లో చీనీ చెట్లు ఎండిపోయాయి. తాగడానికి నీరుకూడా సక్రమంగా అందేదికాదు. ఇంతకుముందు ఏడాదికి ఒకటే పంట పెట్టేవాళ్లం. కొద్ది కొద్దిగా నీళ్లు పోసే బోర్ల మీద నమ్మకం లేక రెండో పంట పెట్టే వాళ్లం కాదు. టౌనుకో, బెంగళూరుకో బేల్దారి పనులకు పోవాల్సివ చ్చేది. స్వచ్ఛంద సంస్థల వాళ్లు మా ఊరొచ్చి పుణ్యం కట్టుకున్నారు. నా లాగే 18 మంది రైతులు బోర్లు, బావులను మళ్లీ బతికించుకొని ఇప్పుడు పచ్చగా ఉన్నారు. తాగే నీళ్లక్కూడా కరువు లేకుండా చేశారు. మా రెండు బోర్లలో ఇప్పుడు ఇంచున్నర నీళ్లొస్తున్నాయి. ఈ నమ్మకంతోనే పంటలు పెట్టాం. మొట్టమొదటగా వేసవిలోనూ మిరప, వేరుశనగ పంటలు పెట్టా. మంచి ఆదాయం వస్తోంది.     - బోయ రామాంజనేయులు (77993 32024), రైతు, కోటంక, అనంతపురం జిల్లా
 
బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించేదెలా?
బోరు బావి చుట్టూ 3 మీటర్ల(పొడవు, వెడల్పు, లోతు) గుంత తవ్వాలి. ప్లాస్టిక్ కేసింగ్ పైపు నాణ్యతను సరిచూచుకోవాలి. అది పాడైతే కొత్త పీవీసీ పైపు వేయాలి. దాని అడుగు భాగాన ఐరన్ క్లాంప్‌ను అమర్చి కేసింగ్ పట్టు సడలి పోకుండా జాగ్రత్తపడాలి. పైపునకు అన్ని వైపులా 4-6 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో రంధ్రాలు వేయాలి. వీటి ద్వారా ఇసుక, మట్టి బోరులోకి వెళ్లకుండా పైపు చుట్టూ నైలాన్ నెట్‌ను చుట్టాలి. ఆ తర్వాత గుంతను ఐదు దొంతర్లలో వివిధ సైజుల రాళ్లతో నింపి, పైపొరగా ఇసుక వేయాలి. అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు 30-40 సెంటీ మీటర్ల వ్యాసార్థం కలిగిన రాళ్లను వేయాలి. వాటిపైన ఒక అడుగు మందాన 15-20 సెంటీమీటర్ల రాళ్లను పేర్చాలి. ఆపైన అర అడుగు మందాన 7.5 సెంటీమీటర్ల చిన్న రాళ్లు, మరో అర అడుగు మందాన 2-4 సెంమీ గులక రాళ్లు పరవాలి.
 
ఆపైన నైలాన్ నెట్‌ను పరిచి, దానిపై 2 అడుగుల మందాన ముతక ఇసుకను పోయాలి. ఇసుక పైన కూడా నైలాన్ నెట్‌ను అమర్చాలి. చెత్తా చెదారాన్ని పైనే వడకట్టి స్వచ్ఛమైన వర్షపు నీటిని బోరులోకి ఇంకింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని చుట్టూ ఇటుకలు, సిమెంట్‌తో అడుగు భూమి లోపలకు, అడుగు పైకి ఉండేలా గోడను నిర్మించాలి. ప్రతి ఏడాదీ పైన 2 అడుగుల మేరకు ఉన్న ఇసుకను తొలగించి, కొత్త ఇసుక నింపాలి. వర్షపు నీరు త్వరగా ఇంకడానికి కొత్త ఇసుక దోహద పడుతుంది. ఈ గుంత వైపు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చేలా చిన్న మట్టి కాలువను ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. దీని నిర్మాణానికి రూ.40 నుంచి 45 వేలు ఖర్చవుతుంది. అదే గనక ఎండిపోయిన బావుల్లోకి నీటిని మళ్లించడానికైతే రూ.5 వేలు చాలు. పాడుపడిన బావుల్లోకి నీటిని ఇంకింపజేసినా 200 మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement