మన దేశ ప్రజల్లో 65 శాతం మంది తెల్లగా పాలిష్ పట్టిన వరి బియ్యాన్ని రోజువారీ ప్రధాన ఆహారంగా తింటున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి మనిషీ రోజుకు 400–500 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. అయితే, మనం ఇందులో సగం కూడా తినటం లేదు. గత పదేళ్లుగా మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని కుంగదీస్తున్న పెను సమస్య రక్తహీనత. దీని మూలంగా స్థూల జాతీయోత్పత్తిలో 4 శాతం మేరకు దేశంపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో దేశ ప్రజలను పీడిస్తున్న పౌష్టికాహార లోపాన్ని స్వల్పకాలంలో తక్కువ ఖర్చుతో అధిగమించడానికి కృత్రిమంగా పోషకాలను లేపనం చేసిన బియ్యాన్ని (ఫోర్టిఫైడ్ రైస్) పంపిణీ చేయటమే మేలైన మార్గమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల కోసం 2014 నాటికి పూర్తిగా ఫోర్టిఫై చేసిన సబ్సిడీ బియ్యాన్ని మాత్రమే అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఈ బియ్యం పంపిణీ ప్రయోగాత్మకంగా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రయోగాత్మక దశ మూడేళ్లు. ఇందుకోసం రూ. 174 కోట్లు కేటాయించారు. అయితే, ఈ విధాన నిర్ణయంపై స్వతంత్ర పౌష్టికాహార నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫోర్టిఫైడ్ బియ్యం అంటే?
సింథటిక్ పోషకాలతో తయారు చేసిన బియ్యాన్ని సాధారణ బియ్యంలో కలిపి అందించడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే పేదల ఆరోగ్యం మెరుగుపరచవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బియ్యపు నూకను పిండి చేసి, ఆ పిండికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12లను కలిపి, అధునాతన యంత్రాల ద్వారా ఫోర్టిఫైడ్ బియ్యపు గింజలను తయారు చేస్తారు. ఇవి రంగు, సైజు అంతా బియ్యపు గింజల మాదిరిగానే ఉంటాయి. వంద సాధారణ బియ్యపు గింజలకు ఒక ఫోర్టిఫైడ్ గింజను కలిపి చౌక దుకాణాలు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కిలో బియ్యానికి ఐరన్ 28 మిల్లీ గ్రాములు, ఫోలిక్ యాసిడ్ 25–125 మిల్లీ గ్రాములతోపాటు విటమిన్ బి–12... 0.75 నుంచి 1.25 మిల్లీ గ్రాముల రసాయనిక పోషకాలు కలిపి ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేస్తున్నారు.
ఏమిటీ అభ్యంతరాలు?
రక్తహీనతకు ఐరన్ లోపం ఒక్కటే కారణం కాదనీ, ఐరన్ తదితర రసాయనిక పోషకాలను బియ్యానికి లేపనం చేసి అందించినా రక్తహీనత తగ్గలేదనీ ఐదు ఖండాల్లో జరిగిన ఓ అధ్యయనంలో తేలిందని 170 మంది ప్రజారోగ్య, పౌష్టికాహార నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు సంయుక్త బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అందరికీ ఐరన్ అదనంగా అవసరం ఉండదు. అవసరం లేని వారు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని తినడం వల్ల మేలు కన్నా కీడు ఎక్కువ జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహార భద్రత పొందడానికి సరైన మార్గం ముడి, లేదా తక్కువ పాలిష్ చేసిన బియ్యం, దేశీ వరి బియ్యం, లేదా చిరుధాన్యాలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వినియోగాన్ని, ఆహార వైవిధ్యాన్ని పెంపొందించటమేనన్నారు. పెరటి తోటలు, మేడలపై ఇంటిపంటల సాగును, ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రతను పెంపొందించవచ్చు. పెరటి కోళ్లు, మాంసం, చేపల వినియోగం పెరగాలంటే ప్రజల ఆదాయం పెంపొందించే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. రక్తహీనతను ఆరోగ్యదాయకంగా, సమర్థంగా అధిగమించడానికి ఇదే ఉత్తమ మార్గమని, రసాయనిక పోషకాలను బియ్యంలో గుప్పించడం కాదని పౌష్టికాహార నిపుణులు అంటున్నారు.
ఇప్పటికే 13 దేశాల్లో ఫోర్టిఫైడ్ రైస్ వాడుతున్నాయి. దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి సరిపడే ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తికి రూ. 3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఫోర్టిఫికేషన్ ప్రక్రియలో వినియోగించే కృత్రిమ సూక్ష్మపోషకాలను 4–5 విదేశీ కంపెనీలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీలు మున్ముందు కూడబలుక్కొని ధరలు పెంచే ప్రమాదం లేకపోలేదు.
– పంతంగి రాంబాబు
సీనియర్ జర్నలిస్టు
ఈ బియ్యం బలవర్ధకమేనా?
Published Mon, Nov 15 2021 1:36 AM | Last Updated on Mon, Nov 15 2021 1:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment