చింతల వెంకటరెడ్డి
ఆహారం ఆరోగ్యదాయకంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండ గలం. ఆగ్నేయాసియా దేశాల్లోని పేద, కింది మధ్యతరగతి ప్రజల్లో విటమిన్ ‘ఎ’ లోపం విస్తారంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఏటా 20–30 లక్షల మంది చిన్న పిల్లలు కంటి చూపుతోపాటు ప్రాణా లను సైతం కోల్పోతున్నారని ఒక అంచనా. విటమిన్ ‘ఎ’ తెల్ల బియ్యంలో ఉండదు. అందువల్ల విటమిన్ ‘ఎ’ను అందించేలా వరి వంగడానికి జన్యుమార్పిడి చేయటమే ఈ సమస్యకు పరిష్కారమని భావించిన రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, సింజెంట ఫౌండేషన్ వంటి కొన్ని సంస్థలు గోల్డెన్ రైస్ రూపకల్పనకు 20 ఏళ్ల క్రితమే నడుం బిగించాయి.
బీటా కెరొటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను అందిస్తే, తనకు అవసరమైనంత మేరా విటమిన్ ‘ఎ’ను దేహమే తయారు చేసుకుంటుంది. ఇందుకోసం బీటా కెరొటిన్‌తో కూడిన వరి వంగ డాన్ని రూపొందించే ప్రయత్నాలకు శాస్త్రవేత్తలు ఇంగో పోట్రికస్, పీటర్ బేయర్ 1999లో శ్రీకారం చుట్టారు. మట్టిలోని ఒక సూక్ష్మ జీవి, మొక్కజొన్న గింజల నుంచి తీసిన రెండు జన్యువులను వరి వంగడానికి జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా జోడించారు. ఈ జన్యుమార్పిడి బియ్యపు గింజలు లేత నారింజ రంగులో ఉంటాయి కాబట్టి ‘గోల్డెన్ రైస్’ అని పేరు వచ్చింది. ఫిలిప్పీన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ కేంద్రంగా గోల్డెన్ రైస్‌పై పరిశోధనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ‘గోల్డెన్ రైస్’ సాగుకు జూన్ 21న అనుమతినివ్వటం దుమారం రేపుతోంది.
జన్యుమార్పిడి వంగడాలు, జన్యుమార్పిడి ఆహారం వల్ల జీవ భద్రతాపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ప్రశ్నలకు సమాధానాలు ఇంకా లభించ కుండానే... వాణిజ్యపరంగా గోల్డెన్ రైస్ సాగుకు ఫిలిప్పీన్స్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, వ్యవసాయ శాఖ ఆదరాబాదరాగా అను మతి మంజూరు చేయటం తగదని స్టాప్ గోల్డెన్ రైస్ నెట్‌వర్క్ విమర్శించింది. దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో అనాదిగా సాగవు తున్న విశిష్ట గుణగణాలు కలిగిన లక్షలాది సంప్రదాయ వరి వంగడాల జన్యు స్వచ్ఛతకు, ఎంతో విలువైన వ్యవసాయ జీవవైవి ధ్యానికి గోల్డెన్ రైస్ గొడ్డలి పెట్టని రైతులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, నిపు ణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజువారీ ఆహారంలో గోల్డెన్ రైస్‌ను ఎంత పరిమాణంలో తీసుకుంటే విటమిన్ ‘ఎ’ లోపం తీరుతుంది? విటమిన్ ‘ఎ’ కొవ్వులో కరిగే ఎంజైమ్. దీని లోపం ఉన్న పిల్లలు అతి పేద వర్గాల వారు. వారు కొవ్వును రోజువారీగా తగినంత తీసుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారికి గోల్డెన్ రైస్ ఎలా ఉపకరిస్తుంది? గోల్డెన్ రైస్ ధాన్యాన్ని మరపట్టి నిల్వ చేసిన బియ్యంలో కాలం గడిచేకొద్దీ బీటా కెరొటిన్ ఎంత మోతాదులో మిగిలి ఉంటుంది? అన్న ప్రశ్నలను వీరు లేవనెత్తుతున్నారు.
అయితే, రోజుకు 40 గ్రాముల గోల్డెన్ రైస్‌ను తినిపిస్తే చాలు పిల్లల కంటి చూపును, ప్రాణాలను కాపాడవచ్చని గోల్డెన్ రైస్ ప్రాజెక్టు శాస్త్రవేత్తలు 2015లో పేర్కొన్నప్పటికీ తాజాగా ఎటు వంటి స్పష్టతా ఇవ్వలేదు. రోజువారీగా అవసరమయ్యే విట మిన్ ‘ఎ’ మోతాదులో ఏర్పడిన కొరతను తీర్చితే చాలని, మొత్తాన్నీ బియ్యం ద్వారానే అందించాల్సిన అవసరంలేదని మాత్రం చెబుతున్నారు.
సీవీఆర్ ఆవిష్కరణలు కనపడవా?
అంతర్జాతీయంగా వివాదాస్పదమైన జన్యుమార్పిడి సాంకేతి కత ద్వారా తయారైన గోల్డెన్ రైస్‌కు సహజ ప్రత్యామ్నాయం లేకపోలేదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ మిశ్రమాల పిచికారీ ద్వారా వరి, గోధుమ తదితర పంటల్లో విటమిన్ ‘ఎ’తో పాటు ‘సి’, ‘డి’ విటమిన్లు రాబట్టిన రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పుర స్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ఆవిష్కరణలు మనకు అందు బాటులో ఉన్నాయి. క్యారెట్, టమాటాల గుజ్జు, మొక్కజొన్న పిండిని మట్టి ద్రావణంలో కలిపి పంటలపై నాలుగు దఫాలు పిచికారీ చేసి విటమిన్లతో కూడిన బియ్యం, గోధుమలను ఉత్పత్తి చేసే సహజ పద్ధతిని సీవీఆర్ కనుగొనటం దేశానికే గర్వకారణం. బీపీటీ తెల్ల బియ్యంలో 100 గ్రాములకు 1,242 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.), గోధుమల్లో 1,362 ఐయూల మేర విట మిన్ ‘ఎ’ వచ్చింది. ఈ ఆవిష్కరణలే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపె ట్టాయి. ప్రధాని మోదీ ఇటీవల మన్ కీ బాత్‌లో సైతం సీవీఆర్ ఆవిష్కరణల విశిష్టతను కొనియాడారు.
అయితే, పురస్కారాలు, పొగడ్తలతోనే సరిపెడుతుండటం అసమంజసం. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ద్వారా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సీవీఆర్ ఆవిష్కరణలపై విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టాలి. జన్యుమార్పిడి అవసరం లేకుండా ఎక్కడికక్కడే సాధారణ వంగడాలతోనే కోరిన విటమి న్లను బియ్యం, గోధుమల్లో పొందుపర్చుకునే సులువైన అవకాశం ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయో అర్థం కాదు. విటమిన్ల బియ్యం, గోధుమలను ఆర్గానిక్‌గా పండించి మనం తిని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎగుమతి చేసి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. ఫిలిప్పీన్స్‌లో ‘గోల్డెన్‌రైస్’ హడావుడి చూసైనా మన పాలకులు, శాస్త్రవేత్తలు కళ్లు తెరుస్తారని ఆశించవచ్చా?
– పంతంగి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment