
జల దోపిడీపై.. రంగంలోకి కృష్ణా బోర్డు
శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డులో చలనం వచ్చింది.
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అక్రమ నీటి వినియోగంపై ఫిర్యాదుతో కదలిక
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాగిస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో కృష్ణా బోర్డులో చలనం వచ్చింది. నీటి వినియోగ లెక్కలకు సంబంధించి టెలిమెట్రీ అమల్లోకి వచ్చేదాకా సంయుక్త కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్న విజ్ఞప్తిపై స్పందించింది.
తెలంగాణ, ఏపీ, బోర్డు అధికారులతో కలిపి సంయుక్త కమిటీ వేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఆ కమిటీలోకి సభ్యుల పేర్లు సూచించాలని ఇరు రాష్ట్రాలకు బుధవారం లేఖలు రాసింది. దీంతోపాటు టెలీమెట్రీకి అవసరమైన నిధులు, పట్టిసీమ, పులిచింతల నీటి వినియోగ అంశాలు, సాగర్ ఎడమ కాల్వ కింద నీటి వినియోగం, మహానది జలాలపై ఏర్పాటైన జయశీలన్ కమిటీకి రాష్ట్ర ప్రాజెక్టుల వివరాల అందజేత తదితర అంశాలపైనా ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
హరీశ్‌రావు ఫిర్యాదుతో..
టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చేదాకా సంయుక్త కమిటీతో ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను పర్యవేక్షించాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినా.. దాన్ని అమల్లోకి తేవడంలో కృష్ణా బోర్డు విఫలమైందని మంత్రి హరీశ్‌రావు కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఏపీ ఇష్టమున్నట్లుగా నీటిని తోడేసుకుని, లెక్కల్లో తక్కువగా చూపుతోందని హరీశ్ అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో కృష్ణా బోర్డులో కదలిక వచ్చింది.
సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తామని, అందులో ఆయా రాష్ట్రాల తరఫున సభ్యులుగా నియమించే అధికారుల పేర్లను రెండు రోజుల్లో తమకు తెలపాలని తెలంగాణ, ఏపీలకు లేఖలు రాసింది. అపెక్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపింది. ఇక ఇప్పటికే నిర్ణయించిన 49 చోట్ల టెలీమెట్రీ పరికరాలను అమర్చేందుకు మొత్తంగా రూ.2.5 కోట్లు అవసరమని.. ఈ భారాన్ని ఇరు రాష్ట్రాలు సమానంగా భరించి, బోర్డు సూచించిన ఖాతాలో జమ చేయాలని సూచిస్తూ మరో లేఖ రాసింది.
పట్టిసీమ లెక్కలు చెప్పండి
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటున్న నీటి లెక్కలు చెప్పాలంటూ ఏపీకి బోర్డు మరో లేఖ రాసింది. పట్టిసీమ, పులిచింతల, పాలేరు, మున్నేరుల కింద ఏపీ వినియోగిస్తున్న నీటికి లెక్కలు లేవని... ఇప్పటికై నా రోజువారీ లెక్కలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఖరీఫ్ అవసరాల కోసం 15 టీఎంసీలను కేటాయించాలంటూ తెలంగాణ చేసిన విజ్ఞప్తిపై అభిప్రాయం చెప్పాలంటూ ఏపీకి మరో లేఖ రాసింది.
మరోవైపు ఒడిశాలోని మహానదిపై నిర్మించిన హీరాకుడ్ రిజర్వాయర్ కింద విద్యుత్ పరిశ్రమలు, ఇరిగేషన్ అవసరాలకు నీటిని వినియోగిస్తున్న తీరుపై ఏర్పాటు చేసిన జయశీలన్ కమిటీ నివేదికను బోర్డు బుధవారం ఇరు రాష్ట్రాలకు పంపింది. యాభై ఏళ్లుగా వివిధ అవసరాలకు రిజర్వాయర్ నీటిని వినియోగిస్తున్న తీరుపై ఆ కమిటీ చేసిన విశ్లేషణలను అందులో వివరించింది. ఆ తరహా పరిశీలన నిమిత్తం జయశీలన్ కమిటీకి జూరాల, శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీల వద్ద నీటి లభ్యత వివరాలు ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.