కృష్ణా జలాలపై మళ్లీ మొదటికి!
- తెలంగాణ, ఏపీ కార్యదర్శుల చర్చల్లో కుదరని అవగాహన
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణా బోర్డు పరిధిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల చర్చలు మళ్లీ మొదటికి వచ్చాయి. మంగళవారం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శుల స్థాయిలో జరిగిన చర్చల్లో ఎలాంటి ఫలితం తేలలేదు. దీంతో 4 రోజుల్లో మరో సారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ఆ చర్చల్లోనూ ఇరు రాష్ట్రాలు ఒక అవగాహనకు రాలేకపోతే... కేంద్ర త్రిసభ్య కమిటీ రంగంలోకి దిగనుంది. ఈ కమిటీ నిర్ణయాలకు కట్టుబడతామని 2 రాష్ట్రాల అధికారులు ప్రకటించడం గమనార్హం.
కుదరని ఏకాభిప్రాయం
హైదరాబాద్‌లో మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సాగునీటి శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు శశిభూషణ్‌కుమార్, ఎస్‌కే జోషి, ఎం.వెంకటేశ్వరరావు, మురళీధర్ తదితరులు సమావేశమయ్యారు. కేంద్రం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసి, ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి తేవాలంటూ భేటీలో ఏపీ మరోసారి పట్టుబట్టింది. కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించని పక్షంలో నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తామే నిర్వహించుకోవడానికి అంగీకరించాలని కోరింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని.. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యే వరకూ బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవడానికి అంగీకరించబోమని తెలంగాణ స్పష్టం చేసింది.
గతేడాది విధానానికి సానుకూలం!
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రిటైర్డ్ అధ్యక్షులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బోర్డు పరిధిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది అనుసరించిన విధానాన్నే ఈసారీ కొనసాగించేందుకు అంగీకరించాలంటూ తెలంగాణ చేసిన ప్రతిపాదనకు ఏపీ కొంత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించిన గోదావరి జలాల్లో 45 టీఎంసీల వాటా ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను ఏపీ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు 45 టీఎంసీల్లో ఏపీకీ వాటా ఉంటుందని... 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల వంతున పంచుకున్నట్లుగానే ఈ నీటిని పంచుకోవాల్సి ఉంటుందని ఏపీ అధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అధికారులు ఎటువంటి అవగాహనకు రాలేదు. దీంతో 4 రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కేంద్ర జల వనరుల శాఖ విధించిన డెడ్‌లైన్ (ఈనెల 21)లోగా ఏకాభిప్రాయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు భావిస్తున్నారు. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్ర త్రిసభ్య కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలని నిర్ణయానికి వచ్చారు. సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ జరిగిందని, కానీ ఓ అభిప్రాయానికి రాలేకపోయామని చెప్పారు. కృష్ణా జలాల పంపకం, బోర్డు పరిధిపై కేంద్ర త్రిసభ్య కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడతామని చెప్పారు.