
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. బోర్డు సమర్థంగా పని చేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంబిస్తోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. సోమవారం ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. బోర్డు పని తీరుపై అసంతృప్తితోనే లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నీళ్లు ప్రధాన అంశం. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా సాగునీటి అంచనాలు రూపొందించి అందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన బజాజ్ కమిటీ గడువు కనీసం నివేదిక ఇవ్వకుండానే ముగిసింది. కృష్ణా బోర్డు ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో బోర్డు పని తీరును సమీక్షించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరించడం భవిష్యత్తులో ఇబ్బందులకు దారి తీస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటి విడుదల విషయంలో బోర్డు విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. తద్వారా సాగర్ ఆయకట్టుకు నీరందకపోగా.. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అధికంగా నీరు తీసుకుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment