జల దోపిడీకి దామాషానే విరుగుడు! | If there is a deficit rainfall the water for the projects below | Sakshi
Sakshi News home page

జల దోపిడీకి దామాషానే విరుగుడు!

Published Thu, Aug 24 2017 3:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

జల దోపిడీకి దామాషానే విరుగుడు!

జల దోపిడీకి దామాషానే విరుగుడు!

లోటు వర్షపాతం ఉంటే దిగువ ప్రాజెక్టులకు నీటి గండం
ఎగువ ప్రాజెక్టుల కింద మాత్రం విచ్చలవిడి వినియోగం
వాటా పేరుతో 1,319 టీఎంసీలు వాడుకుంటున్న కర్ణాటక, మహారాష్ట్ర
దీనికి దామాషా విధానమే సరైందంటున్న తెలంగాణ  
దీన్నే కేంద్రం, ట్రిబ్యునల్, కోర్టులకు చెప్పాలని నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకుంటే దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో మట్టే మిగులుతుందన్న తెలంగాణ రాష్ట్ర ఆందోళనను మరింత బలంగా కేంద్రం, సుప్రీంకోర్టు, బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తిగా ఎండిన వైనాన్ని వివరించి, దామాషా పద్ధతిన నీటి విడుదల అవసరాన్ని నొక్కి చెప్పాలనే నిశ్చయానికి వచ్చింది. కృష్ణాలో నీటి లోటు ఏర్పడిన సమయంలో సెప్టెంబర్, అక్టోబర్‌ వరకు ఖరీఫ్‌ ఆరంభం కష్టమే అన్న వాదనకు, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా అద్దం పడుతున్నాయో వివరించి న్యాయం చేయాలని కోరేందుకు రాష్ట్రం సిద్ధమైంది.  

మిగులు జలాలతో మొదటికే ముప్పు..  
వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్‌ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. నికర జలాలు వినియోగించుకుంటేనే ఖరీఫ్‌ తొలి రెండునెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారనుంది.

దీనికి తోడు మిగులు జలాల కేటాయింపు ఆధారంగా కర్ణాటక ఆల్మట్టిలో అదనంగా మరో 100 టీఎంసీల నిల్వ పెంచడానికి వీలుగా ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లు పెంచుకోవడానికి ట్రిబ్యునల్‌ అనుమతించింది. ట్రిబ్యునల్‌ తీర్పు నోటిఫై కాకముందే కర్ణాటక నీటి నిల్వకు దిగడం దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది. ఈ దృష్ట్యా.. ఖరీఫ్‌ ఆరంభంలోనే ఎగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలైనప్పుడే కేటాయింపుల దామాషా ప్రకారం నీటిని కిందకు విడిచే విధానం ఉండాలని తెలంగాణ కోరు తోంది.

ఎగువన 100 టీఎంసీల లభ్యత ఉంటే దామాషా పద్ధతిన దిగువకు కనీసంగా 10 నుంచి 15 టీఎంసీల నీటి వాటా దక్కుతుంది. అలా కాకుండా ప్రస్తుత విధానం కొనసాగి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎగువనే వినియోగిస్తే దిగువకు ఏటా నీటి గండం తప్పని పరిస్థితి. ఇదే అంశాన్ని ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ, వచ్చే నెల 1వ తేదీన సుప్రీం కోర్టు ముందు జరిగే విచారణలోనూ, తర్వాత 13, 14, 15 తేదీల్లో జరిగే ట్రిబ్యునల్‌ విచారణలోనూ వివరించి న్యాయం చేసేలా కోరాలని నిర్ణయించింది.

దిగువకు చుక్కనీరు లేదు..  
కృష్ణా బేసిన్‌లో సకాలంలో వర్షాలు రాకపోతే దిగువకు కలిగే నష్టాలు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ఎగువ కర్ణాటకలో జూన్‌ నుంచే విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి ప్రవాహాలు మొదలై సుమారు 160 టీఎంసీలు, నారాయణపూర్‌లో 50 టీఎంసీల నీరు వచ్చింది. వీటికి తోడు మైనర్‌ ఇరిగేషన్‌కింద ఉన్న చెరువుల్లోకి 200 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్రలోనే దాదాపు 400 టీఎంసీల మేర నీరు రాగా ఇందులో 100 టీఎంసీలకు పైగా వినియోగం సైతం జరిగిపోయింది. వినియోగమంతా వారి నికర జలాల కేటాయింపుల మేరకే అయినా.. వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువకు చుక్క నీరు రాలేదు. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారాయి. దీంతో సాగర్‌ కింద 6.6 లక్షల ఎకరాలు, కృష్ణా జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల పరిధిలోని మరో 7లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement