వర్షాలు లేక వెలవెల.. | Deficit Rainfall in Mahabubnagar District | Sakshi
Sakshi News home page

వర్షాలు లేక వెలవెల..

Published Mon, Aug 19 2019 7:56 AM | Last Updated on Mon, Aug 19 2019 7:58 AM

Deficit Rainfall in Mahabubnagar District - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : దేశమంతటా పుష్కలంగా వర్షాలు కురిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఏ చెరువు చూసినా.. ఏ  కుంట చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండి కనిపిస్తోంది. ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేయించినా వర్షాలతో నీటి చేరిక లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల పైచిలుకు చెరువులు జలకళ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 35 చెరువులు మాత్రమే నిండగా మరో 23 చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. ఇటీవల వారంరోజులు ముసురు పట్టినా భూగర్భజలాలు మాత్రం పెరగలేదు. 20 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతన్నాయి. 

కొనసాగుతున్న మరమ్మత్తులు 
ఏళ్ల నుంచి మరమ్మత్తులకు నోచకుండా ఆదరణకు దూరమైన  చెరువులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 6,417 చెరువులు ఉండగా ఇప్పటివరకు 3,590 చెరువుల పనులు వందశాతం పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 854 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టగా అందులో 666 పనులు పూర్తయ్యాయి. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించగా రూ.105 కోట్లు చెల్లింపులు జరిగాయి. వనపర్తి జిల్లాలో 1,253 చెరువులు ఉంటే 754 చెరువుల పనులు పూర్తయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 346 చెరువులు ఉంటే 226 చెరువుల పనులు పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లాలో 1,125 చెరువులు ఉంటే 689 పనులు చేపట్టగా 394 చెరువుల మరమ్మత్తు జరిగింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1,995 చెరువులు ఉంటే 1,550 చెరువులకు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కాగా 2,827 చెరువుల పనుల మరమ్మత్తు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చెరువులకు మరమ్మతు  పనులు చేపట్టకపోవడంతో వాటిలో నీటనిల్వకు అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొంది. 

మత్స్యకారులకూ నిరాశే! 
ఆర్థికంగా చితికిపోయిన మత్స్యకారులను చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9.86 కోట్ల చేప పిల్లలను వదలాలని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే చెరువుల్లో చేప పిల్లలు పెరగానికి అనుకూల వాతావరణంతో పాటు 40 శాతం నీళ్లు ఉండి తీరాలి. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,200 చెరువుల్లో నీరు 40శాతానికి తగ్గి ఉంది. కేవలం రెండొందల చెరువులు మాత్రమే చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రెండ్రొజుల క్రితమే ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు 40శాతానికి మించి నీళ్లు ఉన్న చెరువుల్లో చేప పిల్లల్ని వదలారు. ఇప్పటి వరకు సుమారు ఐదు కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలారు. నీళ్లు తక్కువగా ఉన్న 4,200 చెరువుల్లో చేపపిల్లల పెరుగుదల ప్రశ్నార్ధకంగా మారడంతో వాటి పరిధిలో ఉన్న మత్స్యకారులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. 

జలాశయాలే దిక్కు 
ఆశించిన మేరకు వర్షాలు కురవకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, భీమాతో పాటు తుంగభద్ర కూడా వరద రూపంలో నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలపై పోటñత్తాయి. దీంతో అధికారులు జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకున్నారు. తాజాగా వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తుంగభద్ర నీటితో తుమ్మిళ్ల జలాశయాన్ని, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను నింపి వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement