రాష్ట్రంలోని ఏకైక దీవిలో ప్రజల దీనగాథ
కృష్ణానది మధ్యలో ఉన్న గ్రామం
విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా నది దాటాల్సిన పరిస్థితి
వంతెన లేక అష్టకష్టాలుపడుతున్న జనం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చుట్టూ కృష్ణా నది.. మధ్యలో ఊరు.. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పడవలో నది దాటాల్సిందే.నది ఉప్పొంగే సమయంలో అయితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పేరు పొందిన గుర్రంగడ్డ వాసుల పరిస్థితి ఇది. పాలకులు మారుతున్నా తమ బాధలు తీరడం లేదని.. వంతెన నిర్మాణం చేపట్టినా ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.
సాహసం చేయాల్సిందే..
జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ ఉంది. గద్వాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వైశాల్యం సుమారు 2,400 ఎకరాలు. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు నివసిస్తుండగా, జనాభా వెయ్యికి పైనే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడి 1,500 ఎకరాల్లో వేరుశనగ, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు.
ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుకోవాలన్నా, ఏదైనా అనారోగ్యానికి గురైనా, నిత్యావసరాలు కావాలన్నా, చివరికి రేషన్ సరుకుల కోసం కూడా.. నది దాటి వెళ్లాల్సిందే. ఏటా వానాకాలం మొదలై నదిలో ప్రవాహం పెరిగాక కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనితో ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక ప్రతిదానికీ నది దాటాల్సి రావడంతో ఈ ఊరు పిల్లలను పెళ్లి చేసుకునేందుకు గానీ, ఊరి వారికి పిల్లను ఇచ్చేందుకు గానీ వెనుకాడే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం 40 మందికిపైగా పెళ్లికాకుండా ఉన్నారని స్థానికులు అంటున్నారు.
6 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే వంతెన
గుర్రంగడ్డకు సుమారు ఆరేళ్ల కింద వంతెన మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఏటా వానాకాలం ముందు పనులు ప్రారంభించడం, వరద పెరగగానే నిలిపివేయడం కాంట్రాక్టర్‌కు పరిపాటిగా మారిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు ఐదుసార్లు నోటీసులిచ్చామని, వచ్చే ఏడాది వానాకాలంలోపు వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని ఇరిగేషన్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.
ఈ ఫొటోలోని మహిళ పేరు పద్మమ్మ. గుర్రంగడ్డకు చెందిన ఆమెకు అయిజ మండలం ఉప్పలకు చెందిన వెంకటేశ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటికి రావాలంటే నది దాటాలి. దాంతో ఎప్పుడు వచి్చనా భర్తతో కలిసి వస్తుంది. నదికి వరద పోటెత్తితే.. బోట్లు నడవక కొన్నిరోజులు గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుందని.. అందుకే ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దాటుతున్నాం
గ్రామంలో ఆస్పత్రి లేదు. ఏ చిన్న చికిత్స కోసమైనా గద్వాలకు వెళ్లాలి. గర్భిణిగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక చెకప్ కోసం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బోట్‌లో నది దాటాల్సి వచి్చంది. వరద వచి్చనప్పుడు ఏ సమస్య వచ్చినా కష్టమే. – సంధ్య, గ్రామ మహిళ
Comments
Please login to add a commentAdd a comment