Mission Kakateeya
-
31,000 పోస్టులు.. 900 కేసులు- హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో 95,345 పోస్టులు మంజూరు చేసిందని, ఇప్పటికే ఏర్పడిన ఖాళీలతో కలిపి 1,49,382 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,17,714 పోస్టులు భర్తీ చేయగా, మరో 31,660 పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉందని బుధవారం అసెంబ్లీలో ప్రశ్నత్తరాల సమయంలో వెల్లడించారు. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై 900 వరకు కేసులు వేశారని, ఇవి కొన్ని స్టే, మరికొన్ని అప్పీల్ దశలో ఉన్నాయన్నారు. దీంతో భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు కేసులు ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డు ఎక్కువ మందిని అన్‌ఫిట్‌గా నిర్ధారిస్తుందనే అంశంపై త్వరలో సింగరేణి సీఎండీ, సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాకతీయ మిషన్‌కు పైసా కూడా ఇవ్వలేదు.. మిషన్ కాకతీయను నీతి ఆయోగ్ మాజీ సీఈవో అర్వింద్ పనగరియా ప్రశంసించడంతో పాటు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానిమస్తూ.. వర్షాభావ పరిస్థితుల్లోనూ చెరువుల్లో జలకళ తీసుకొచ్చేందుకు ప్రాజెక్టుల కాల్వలపై 3 వేలకు పైగా తూములు నిర్మించి 9 వేల చెరువులను నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ కాకతీయ కింద 25,272 చెరువులను పునరుద్ధరించడం ద్వారా 14.15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. -
వర్షాలు లేక వెలవెల..
సాక్షి, మహబూబ్‌నగర్ : దేశమంతటా పుష్కలంగా వర్షాలు కురిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఏ చెరువు చూసినా.. ఏ కుంట చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండి కనిపిస్తోంది. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేయించినా వర్షాలతో నీటి చేరిక లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల పైచిలుకు చెరువులు జలకళ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 35 చెరువులు మాత్రమే నిండగా మరో 23 చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. ఇటీవల వారంరోజులు ముసురు పట్టినా భూగర్భజలాలు మాత్రం పెరగలేదు. 20 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతన్నాయి. కొనసాగుతున్న మరమ్మత్తులు ఏళ్ల నుంచి మరమ్మత్తులకు నోచకుండా ఆదరణకు దూరమైన చెరువులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 6,417 చెరువులు ఉండగా ఇప్పటివరకు 3,590 చెరువుల పనులు వందశాతం పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 854 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టగా అందులో 666 పనులు పూర్తయ్యాయి. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించగా రూ.105 కోట్లు చెల్లింపులు జరిగాయి. వనపర్తి జిల్లాలో 1,253 చెరువులు ఉంటే 754 చెరువుల పనులు పూర్తయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 346 చెరువులు ఉంటే 226 చెరువుల పనులు పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లాలో 1,125 చెరువులు ఉంటే 689 పనులు చేపట్టగా 394 చెరువుల మరమ్మత్తు జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,995 చెరువులు ఉంటే 1,550 చెరువులకు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కాగా 2,827 చెరువుల పనుల మరమ్మత్తు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చెరువులకు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో వాటిలో నీటనిల్వకు అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొంది. మత్స్యకారులకూ నిరాశే! ఆర్థికంగా చితికిపోయిన మత్స్యకారులను చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9.86 కోట్ల చేప పిల్లలను వదలాలని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే చెరువుల్లో చేప పిల్లలు పెరగానికి అనుకూల వాతావరణంతో పాటు 40 శాతం నీళ్లు ఉండి తీరాలి. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,200 చెరువుల్లో నీరు 40శాతానికి తగ్గి ఉంది. కేవలం రెండొందల చెరువులు మాత్రమే చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రెండ్రొజుల క్రితమే ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు 40శాతానికి మించి నీళ్లు ఉన్న చెరువుల్లో చేప పిల్లల్ని వదలారు. ఇప్పటి వరకు సుమారు ఐదు కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలారు. నీళ్లు తక్కువగా ఉన్న 4,200 చెరువుల్లో చేపపిల్లల పెరుగుదల ప్రశ్నార్ధకంగా మారడంతో వాటి పరిధిలో ఉన్న మత్స్యకారులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. జలాశయాలే దిక్కు ఆశించిన మేరకు వర్షాలు కురవకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, భీమాతో పాటు తుంగభద్ర కూడా వరద రూపంలో నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలపై పోటñత్తాయి. దీంతో అధికారులు జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకున్నారు. తాజాగా వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తుంగభద్ర నీటితో తుమ్మిళ్ల జలాశయాన్ని, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ను నింపి వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపుతున్నారు. -
‘కృష్ణ’ జలాభారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలు, ప్రాజెక్టుల్లో నీటి వాటాలు సహా వివాదాస్పద అంశాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి జల ప్రవాహాలు మొదలు కాకముందే.. వివాదాలను చక్కదిద్దే దిశగా బుధవారం జరుగుతున్న కృష్ణా బోర్డు కీలక సమావేశం ఇందుకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు, మళ్లింపు జలాలు, నీటి వాటాలు, వినియోగం, టెలిమెట్రీల ఏర్పాటు, బోర్డు వర్కింగ్ మాన్యువల్ తదితర అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదన వినిపించనున్నారు. ముఖ్యంగా 2018–19 ఏడాదికిగాను కృష్ణా జలాల్లో తమకు 33 శాతం కాకుండా 50 శాతం నీటి వాటా కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కృష్ణాబోర్డు ఎవరి వాదనకు మొగ్గు చూపుతుంది, ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కృష్ణాబోర్డు ఇన్చార్జి చైర్మన్ హెచ్‌కే సాహూ అధ్యక్షతన జలసౌధలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితోపాటు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు నాగేంద్రరావు, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొననున్నారు. 13 అంశాలతో బోర్డు.. ‘అదనపు’తో రాష్ట్రాలు బుధవారం జరిగే సమావేశంలో కృష్ణా బోర్డు మొత్తంగా 13 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. ఇందులో బోర్డుకు సిబ్బంది, నిధుల కేటాయింపు, వర్కింగ్ మాన్యువల్ ఆమోదం, మొదటి, రెండో దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు, తాగునీటికి కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి తక్కువగా ఉండటంపై ఏర్పాటు చేసిన కమిటీలిచ్చిన నివేదికలు, 2017–18లో నీటి వినియోగం, 2018–19లో నీరు, విద్యుత్ పంపిణీ తదితర అంశాలను పేర్కొంది. దీనికి అదనంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ తమ డిమాండ్లతో పలు అంశాలను భేటీ ఎజెండాలో చేర్చాలని కోరాయి. ఈ అంశాలపై సమావేశంలో చివరలో బోర్డు చర్చించనుంది. కొత్త ప్రాజెక్టులు కీలకం కృష్ణా బేసిన్లో తెలంగాణ, ఏపీలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల అంశం బోర్డు భేటీలో కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గురు రాఘవేంద్ర, శివభాస్యం సాగర్, మున్నేరు వంటి 13 ప్రాజెక్టులు, తెలంగాణ చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, వాటర్‌గ్రిడ్ వంటి ఎనిమిది ప్రాజెక్టులకు సంంబంధించిన డీపీఆర్‌ల అంశాలను బోర్డు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని బోర్డు ఇప్పటికే ఆదేశించినా ఇరు రాష్ట్రాలు స్పందించలేదు. డీపీఆర్‌లు లేకుండా అభిప్రాయం చెప్పడం, సాంకేతిక అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో.. భేటీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయన్నది ఆసక్తిగా మారింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి తమకు దక్కే 45 టీఎంసీలను వెంటనే కేటాయిస్తే వాటిని ఏఎమ్మార్–ఎస్ఎల్బీసీకి వాడుకుంటామని తెలంగాణ అంటోంది. మరోవైపు తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు 214 టీఎంసీల మేర నీటిని తరలిస్తోందని, అందులో తమ వాటా తేల్చాలని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ చర్చించాలంటున్న అదనపు అంశాలివీ.. ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని తీసుకుని తక్కువగా చూపించింది. ఈ తేడాను లెక్కల్లోకి తీసుకొని వినియోగం లెక్కించాలి. గోదావరి నుంచి మళ్లించే నీటిలో తెలంగాణ వాటాను ఏఎంఆర్–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు కేటాయించడంపై చర్చించాలి. కేటాయించిన నీటికంటే ఎక్కువ నీటిని వాడుకున్న రాష్ట్రానికి సంబంధించిన వాటాను తర్వాతి ఏడాదిలో తగ్గించడం. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఏకపక్షంగా బోర్డు పరిధిపై చైర్మన్ కేంద్రానికి లేఖ రాయడంపై చర్చించాలి. ఏపీ కోరిన అంశాలివీ.. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలి. ఆర్డీఎస్‌పై మూడు చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలి. పాలేరు రిజర్వాయర్ నుంచి భక్త రామదాసు ఎత్తిపోతలకు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తెలంగాణ తరలించే 214 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి. జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవడంతో పాటు ఆ రిజర్వాయర్ నుంచి మొత్తం వినియోగంపై పరిమితులు ఉండాలి. తెలంగాణ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్‌లను బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు పెట్టాలి. మిషన్ కాకతీయ కింద చెరువులు బాగుపడినందున చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు ఉన్న మొత్తం కేటాయింపు 89.15 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి. జూరాల వినియోగం, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద వినియోగించిన నీటిని తెలంగాణ తక్కువగా చూపుతోంది. దీనిపై చర్చించాలి. బోర్డు పెత్తనంపై గుర్రు.. ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునే విషయమై కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ సిద్ధం చేసి, నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపింది. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు దానిని ఆమోదించరాదని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89 (ఎ), (బి)ల ప్రకారం బ్రిజేశ్ ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారని.. దానిలో కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా, నాలుగు రాష్ట్రాల మధ్యా అన్నది తేలలేదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలూ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయని... అలాంటప్పుడు బోర్డు నియంత్రణ అన్న ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. దీనిని బోర్డు భేటీలో లేవనెత్తాలని నిర్ణయించింది. ‘మైనర్’లెక్కలతో పెద్ద సమస్య చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగం లెక్కలు కూడా బోర్డు భేటీలో కీలకం కానున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. మొత్తంగా ఉమ్మడి ఏపీకి మైనర్ ఇరిగేషన్ కింద 111.26 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. అందులో తెలంగాణకు 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలు కేటాయించారు. అయితే మైనర్ ఇరిగేషన్ కింద గత రెండేళ్లుగా పెద్దగా నీటిని వాడుకుంటున్న దాఖలాలే లేవు. ఎప్పుడో 1973లో రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని బచావత్ (కేడబ్యూడీటీ–1) ట్రిబ్యునల్ 89.15 టీఎంసీలను కేటాయించింది. తర్వాతి కాలంలో చెరువులు సహా ఇతర చిన్ననీటి వనరులన్నీ పూడిక నిండి, కబ్జాలకు గురై ఆ స్థాయిలో నీటిని వినియోగించుకోలేని స్థితికి చేరుకున్నాయి. మంచి వర్షాలు కురిసిన సందర్భాల్లోనూ గరిష్టంగా 20 నుంచి 30 టీఎంసీలకు మించి వాడుకోలేని పరిస్థితి ఉందని తెలంగాణ స్పష్టం చేస్తోంది. కానీ మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ పూర్తయినందున చిన్న నీటి వనరుల లభ్యత పెరిగిందని.. ఈ దృష్ట్యా వాటా మేరకు వినియోగం లెక్కించాలని ఏపీ కోరుతోంది. తాగునీటిపై కొత్త వాదన కృష్ణా జలాల లెక్కల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోసం కేటాయిస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకొని వినియోగాన్ని లెక్కించాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణా జలాలపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొందని.. గృహ అవసరాలకు వాడే నీటిలో 20 శాతాన్నే వినియోగం కింద లెక్కించాలని తెలిపిందన్న వాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటికి 15 టీఎంసీల మేర కేటాయిస్తే.. అందులో 4 నుంచి 6 టీఎంసీల మేర మాత్రమే వాస్తవ వినియోగం ఉంటోందని.. మిగతా నీరంతా డ్రైనేజీ రూపంలో తిరిగి మానేరు, మూసీ వంటి కృష్ణా ఉప నదుల్లోనే చేరుతోందని స్పష్టం చేస్తోంది. దీంతో హైదరాబాద్, నల్లగొండ, మిషన్ భగీరథ కింద విడుదల చేసిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే తెలంగాణ నీటి వినియోగ ఖాతాలో వేయాలని కోరుతోంది. -
మిషన్ కాకతీయ కేసీఆర్ మానస పుత్రిక: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకాన్ని అత్యుత్తమ జల నిర్వహణ చర్యగా ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ నివేదిక రూపొందించడం పట్ల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని, మంత్రి హరీశ్‌రావు దీన్ని సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. ఈ పథకాన్ని గుర్తించినందుకు మంగళవారం ట్విట్టర్లో నీతి ఆయోగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రైతు బీమా దేశానికే ఆదర్శం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు అజయ్ మిశ్రా, పార్థ సారథి, ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణారావు, ఆదర్ సిన్హా, శివశంకర్, జగన్మోహన్ రావు, భూపాల్ రెడ్డి, జీవిత బీమా సంస్థ అధికారులు పాల్గొన్నారు. పథకం ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరణించిన రైతుల కుటుంబాలకు బీమా కల్పించే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులందరికీ వర్తింపు ‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతు అనే తేడా లేకుండా అందరికీ బీమా సౌకర్యం వర్తింపజేయాలి. ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి పెద్ద యంత్రాంగం వుంది. అది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రజలపై దానికి నమ్మకముంది. కాబట్టి ఎల్ఐసీ ద్వారానే రైతుల బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిది కావడంతోపాటు రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది’అని పేర్కొన్నారు. రైతుల్లో వివిధ వయస్సులకు చెందిన వారు వుంటారు కాబట్టి ఎల్ఐసీ నిబంధనలు ఎలా వున్నాయి, తెలంగాణ రైతు బీమా పథకం ఎలా వుండాలి.. అనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా రైతు జాబితాలు, వారి నామినీల జాబితాను రూపొందించాలని సూచించారు. -
వివక్షతో దేశ సమగ్రతకే విఘాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు సాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తే దేశ సమగ్రతకు విఘాతం కలుగుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరిం చారు. శాసన మండలిలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ‘రాష్ట్రానికి సాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం కేంద్రానికి లేకపోవడం శోచనీయం. మిషన్ కాకతీయ, భగీరథలకు రూ.25 వేల కోట్ల వరకు అవసరమని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే రూ.500 కోట్లు కూడా ఇవ్వలేదు’అని విమర్శించారు. ‘జీఎస్డీపీలో 25 శాతం వరకు అప్పులు తీసుకోవచ్చన్న నిబంధనను, 20 శాతానికి కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. కనీసం రాష్ట్రం అప్పులు చేసుకోవడానికి కూడా కేంద్రం అవకాశం ఇవ్వడం లేదు’ అని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ, ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు దేశంలో సామాన్య ప్రజలకు ముఖ్యమైన పథకం ఒక్కటైనా మోదీ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాం ‘కేంద్రం ఇస్తుందన్న ఆశలేదు. కాబట్టి మాకు మేమే అభివృద్ధి చేసుకుంటున్నాం. గరీబోళ్లం అంటూ చెప్పి పక్క రాష్ట్రం వాళ్లు బాగుపడ్డారా? మేం అలా అనలేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నాం’ అని ఈటల అన్నారు. ‘దేశాన్ని దోచుకుతింటున్న నీరవ్ మోదీ వంటి వారికి బ్యాంకులు రూ.వేల కోట్లు అప్పులు ఇస్తున్నాయి. అదే సామాన్యుడు రూ.లక్ష అడిగితే వంద రూల్సు చెబుతున్నాయి. రుణమాఫీ సొమ్ము కోసం రిజర్వు బ్యాంకు వద్ద కు వెళితే, కుదరదన్నారు. దేశాన్ని దోచుకునే వారికి వేల కోట్లు ఇస్తున్నారు. ప్రభుత్వాలు మార్వాడీ దుకాణాలు కాదు. ప్రజల సంక్షేమమే వాటి లక్ష్యం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతిథులుగా అది వారి సంస్కారం.. రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రులు ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో బీజేపీ నేతలు విమర్శిస్తున్నారంటూ వస్తున్న వ్యాఖ్యలపై మండలిలో బీజేపీ నేత రామచందర్‌రావు సమాధానమిచ్చారు. ‘ఇంటికి వచ్చిన వారికి ఎలా వండి పెట్టినా బాగానే ఉందని చెబుతుంటారు. అతిథులుగా అది వారి సంస్కారం. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి అతిథులుగా వచ్చినప్పుడు సహజంగా పథకాలు బాగున్నాయంటారు. పథకాల్లోని లోపాలను విమర్శించడం రాష్ట్రంలో మా పని. కేంద్ర మంత్రుల పని కాదు’అని విశ్లేషించారు. రాష్ట్ర ప్రభుత్వం బాహుబలి సినిమా చూపిస్తోందని, తన కంటే పెద్ద డైరెక్టర్లు ఉన్నారని రాజమౌళి బాధపడతారని ఎద్దేవా చేశారు. మూడో ఫ్రంట్ అంటున్నారని, అసలు మీ ఫ్రంట్ చూసుకోండని చురకలు వేశారు. అనంతరం మండలి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది. ఇవేం విమర్శలు..? ‘వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నానని కాంగ్రెస్ నేతలు నన్ను విమర్శించారు. వేల కోట్లా? ఇవేం విమర్శలు. నేను రాజకీయాన్ని కుట్రగా భావించను. ప్రజల కన్నీళ్లు తుడిచే సామాజిక శాస్త్రంగా రాజకీయాలను చూస్తా’ అని ఈటల బదులిచ్చారు. ఇలాంటి సంస్కార హీనమైన పార్టీలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. -
అనుమతుల్లో ఆలస్యం.. అందేనా లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ నాలుగో విడత చెరువుల పునరుద్ధరణ పనులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఈ సంవత్సరం జనవరి ఆరంభానికే చెరువుల పనులకు పరిపాలనా అనుమతులు రావాల్సి ఉన్నా ఇప్పటికీ నిర్ణీత లక్ష్యంలో సగాన్ని మాత్రమే నీటి పారుదల శాఖ చేరుకుంది. దీంతో గడువు మేరకు చెరువుల పనులన్నింటినీ పూర్తి చేయడం కష్టతరం కానుంది. నాలుగో విడత మిషన్ కాకతీయలో మొత్తంగా 5,703 చెరువుల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయి నప్పటికీ జిల్లాల నుంచి మొత్తంగా లక్ష్యానికి మించి 6,061 చెరువుల అంచనాలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు. వీటిని పరిశీలించిన అనంతరం చిన్న నీటిపారుదల శాఖ 5,220 చెరువుల అంచనాలను ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,550 చెరువులకు మాత్రమే అనుమతులు వచ్చాయి. మరో 2,670 చెరువుల అనుమతులు రావాల్సి ఉంది. జూలై నాటికి లక్ష్యం నెరవేరేనా? అనుమతులకు సంబంధించి నీటి పారుదల శాఖ నుంచి ప్రభుత్వానికి వేగంగా ఫైళ్లు కదులుతున్నా ఉన్నత స్థాయిలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్, జూలై నాటికి చెరువుల పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంపై ప్రభావం పడనుంది. మిషన్ కాకతీయ పనులు చూస్తున్న ఉన్నతాధికారికే పంచాయతీరాజ్ శాఖ పనులూ కట్టబెట్టడంతో.. ఆయన ఆ పనులకే అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ప్రభుత్వం తేనున్న పంచాయతీరాజ్ చట్టం తయారీలో ఆయన తలమునకలు కావడంతో అనుమతుల విషయమై మరింత జాప్యం జరుగుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి. -
ట్రిపుల్ ఆర్’ కింద రూ.162 కోట్లు మంజూరు
సాక్షి, హైదరాబాద్: చిన్ననీటి వనరుల అభివృద్ధికి జలవనరుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునరావాసం (ఆర్ఆర్ఆర్) పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.162 కోట్లు మంజూరు చేసిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి వచ్చే నెలలో పనులు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి జలసౌధలో ట్రిపుల్ ఆర్, మిషన్ కాకతీయపై మంత్రి సమావేశం నిర్వహించారు. ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ట్రిపుల్ ఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ఖమ్మంలో 66, మెదక్‌లో 45, నల్లగొండలో 36 పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ట్రిపుల్ ఆర్ కింద ఇదివరకు పూర్తి చేసిన పనుల యూసీలను సమర్పించి అదనపు గ్రాంట్లు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను ఈ నెల 15 కల్లా ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో పనులను ప్రారంభించాలని, ఈ మేరకు వారి సమయాన్ని ముందుగానే తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంజూరైన మినీ ట్యాంక్ బండ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. -
ముందు చెరువు.. వెనుక దరువు!
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు సంబంధించిన మిషన్ కాకతీయ లక్ష్యాలు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్ప టికే పూర్తి కాని రెండో, మూడో విడతలో 5 వేల చెరువుల పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే నాలుగో విడత కింద మరో ఐదు వేల చెరువులు వారి లక్ష్యంలో చేరాయి. ఉన్న పనులనే ఎలా పూర్తి చేయాలన్న ఒత్తిడిలో ఉంటే, మరో ఐదే వేల చెరువులు కూడా జాబితాలో చేరడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుందన్నారు. 17 వేల చెరువుల పనులు పూర్తి.. రాష్ట్రంలో ఉన్న 46,500లకు పైగా చెరువులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయ కింద ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 23,233 చెరువులకు పరిపాలనా అనుమతులిచ్చారు. ప్రైవేటు చెరువులు, అటవీ శాఖ పరిధిలోని చెరువులు, భూసేకరణ సమస్యలు, కోర్టు కేసుల్లో ఉన్న చెరువులను పక్కన పెట్టి 22,875 చెరువుల్లోనే పనులు చేపట్టారు. ఇందులో 17 వేల చెరువుల పనులు పూర్తయ్యాయి. మొదటి విడతకు సంబంధించి ఇంకా 38 చెరువుల పనులను పూర్తి చేయాల్సి ఉండగా, రెండో విడతకు సంబంధించి సుమారు 800 చెరువులు, మూడో విడతకు సంబంధించి 4 వేలకు పైగా చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 5 వేల చెరువుల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. వర్షాకాలం ముగిశాక మిగిలిన చెరువుల పనుల వేగం పుంజుకున్నాయి. అయినా చాలా చెరువుల్లో నీరు ఉండటంతో వాటిని పునరుద్ధరించేందుకు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జూన్, జూలై వరకు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చెరువుల పనులను ఎలా పూర్తి చేయాలన్న సమయంలోనే నాలుగో విడతలో 5,073 చెరువులను లక్ష్యంగా పెట్టారు. వీటిని కూడా జూన్‌లో వర్షాలు కురిసే నాటికి సిద్ధం చేసి, ఖరీఫ్‌కు ఆయకట్టు ఇచ్చేలా పనులు ముగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కొత్తగా చెరువును గుర్తించడం, వాటికి అంచనా వేసి టెండర్లు పిలవడం, పనులు పూర్తి చేయడం ఇప్పుడు చిన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు పెద్ద సవాల్‌గా మారింది. అంచనాల్లో తప్పిదాలు దొర్లినా, పనుల్లో నాణ్యత లోపించినా ఇంజనీర్ల మీద కత్తి వేలాడటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా పనులను ఎలా ముగిస్తారు.. కొత్త వాటిని ఎలా చేపడతారన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. -
‘కాకతీయ’లో వెయ్యి కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో తవ్వి తీసిన ఏడు కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ పంట పొలాల్లో వేసుకున్నారని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఇలా ప్రజాభాగస్వామ్యం తో ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఆదా అయిందన్నారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆరూరిరమేశ్, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు ఈ అంశంపై ప్రశ్నలు సంధించారు. మిషన్ కాకతీయకు ఇప్పటివరకు రూ.7,357 కోట్లు మంజూరు చేస్తే, కేవలం రూ. 2,630 కోట్లే ఖర్చు అయ్యాయని, 40 శాతమే మిషన్ కాకతీయ పనులు జరిగాయని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. మరో సభ్యడు చిన్నారెడ్డి మాట్లాడుతూ మొదటి దశ మిషన్ కాకతీయ పనులు బాగానే జరిగాయని, కానీ రెండు, మూడో దశ పనులు మాత్రం లోపభూయిష్టంగా జరిగాయన్నారు. వీటికి మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ, నాబార్డు నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో నీరు పెరగడంతో 2016లో వాటి కింద 51.5 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. బోర్లు, బావుల్లో 17 శాతం నీటి లభ్యత పెరిగిందన్నారు. పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల పత్తి, వరి, కంది దిగుబడులు పెరిగాయన్నారు. రైతులపై 27.6 శాతం రసాయన ఎరువుల భారం తగ్గింద న్నారు. ఒక్కో రైతుకు రూ. 1,500–3,000 వరకు ఎరువుల మీద పెట్టుబడి ఖర్చు తగ్గిందన్నారు. అలాగే 36–39 శాతం వరకు చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. చెరువుల్లో మొత్తంగా 7 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. 2013–14లో చెరువుల కింద 10.71 లక్షల ఎకరాలు సాగైతే, 2016–17లో 15.99 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. కాగ్ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు మిషన్ కాకతీయపై కాగ్ ఎటువంటి నివేదిక ఇవ్వలేదన్నారు. కాగ్ నుంచి కొన్ని వివరాలు అడిగారని, అంతకుమించి ఏదీ లేదని హరీశ్ తెలిపారు. నాలుగో దశ పనులు ఇంకా సమగ్రంగా నిర్వహిస్తామన్నారు. పనుల పురోగతి చూశాకే కాంట్రా క్టర్లకు బిల్లులు ఇస్తున్నామన్నారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అదనంగా నీరు అందించడానికి దాదాపు 5 టీఎంసీలతో కుప్తి ప్రాజెక్టును నిల్వ రిజర్వాయరుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సభ్యులు అజ్మీరా రేఖ, దివాకర్‌రావు, రాథోడ్ బాపూరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కడెం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పారు. అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు మిషన్ కాకతీయ కింద తాము అనుకున్నదానికంటే తక్కువ ఖర్చుచేశామని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ పథకం కింద మూడు దశల్లో రూ. 7,357.42 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ. 2,630.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. పనులు చేసినా ఖర్చు తగ్గడానికి ప్రధాన కారణం ప్రజా భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన రూ. 400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే కొన్నిచోట్ల 20–25 శాతం వరకు లెస్ టెండర్ల వల్లకూడా ఆదా జరిగిందన్నారు. వివిధ రకాలుగా జరి గిన ఆదాను ఖర్చు పెట్టలేదనడంగా భావించకూడదన్నారు. -
వాటర్‌గ్రిడ్‌కు రూ.3, 470 కోట్లు
సింగూరుకు రూ. 1710 కోట్లు ఎస్ఆర్ఎస్పీకి రూ.1760 కోట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ : జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 1645 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా రూ.3,470 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో మిషన్ కాకతీయ పనులను, ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు సాగుకు అవసరమైనందున రూ.1710 కోట్లతో సింగూరు నుంచి వాటర్‌గ్రిడ్ పైప్‌లు వేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా బాన్సువాడ, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో 785 గ్రామాలకు నీరు సరఫరా చేస్తామని వివరించారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా రూ.1760 కోట్లతో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 860 గ్రామాలకు నీరందిస్తామని తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఎల్అండ్టీ కంపెనీ వారు కాంట్రాక్టు పొందారని చెప్పారు. వాటర్ గ్రిడ్ పూర్తరుుతే నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు పూర్తిగా సాగుకే వినియోగిస్తామని, ఆయకట్టు కింద రైతులకు పుష్కలంగా నీరు లభిస్తుందని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినా, కొందరు బ్యాంకర్లు అమలు చేయలేదని, దీని కోసం శనివారం సాయంత్రం నిజామాబాద్‌లోని ప్రగతి భవన్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. బాన్సువాడలో 50 ఫీట్లతో రోడ్డు వెడల్పు.. బాన్సువాడలోని ప్రధాన రహదారికి ఇరువైపులా 50 ఫీట్లతో రోడ్డును వెడల్పు చేయనున్నట్లు మంత్రి పోచారం స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పు చేస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని, అందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట బోధన్ ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నేతలు మహ్మద్ ఎజాస్, ఎర్వల కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నార్ల సురేష్, సర్పంచ్ వాణి విఠల్, అలీముద్దీన్ బాబా ఉన్నారు. -
బాబోయ్..! కాలుష్య భూతం
పటాన్చెరు : కాలుష్యంపై ఈ ప్రాంత వాసులు 1983 నుంచి పోరాటం చేస్తున్నారు. నేటికీ పాలకులు ఈ ప్రాంత సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు. కాలుష్య భూతాన్ని తరిమేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఘనంగా ప్రకటించినా.. ఏడాదిగా కాలుష్య ప్రక్షాళన కోసం చేసింది శూన్యం. చెరువులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలమని చెప్పిన ప్రభుత్వం.. వాటి పూడికతీత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కాని పటాన్చెరులో కాలుష్యం బారినపడ్డ చెరువులను శుద్ధి చేయడం లేదు. చెరువులను శుద్ధి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నేటికీ అమలు చేయలేదు. తూతూ మంత్రంగా అప్పట్లో రెండు చెరువుల్లో శుద్ధి కార్యక్రమం జరిగింది. ఆపై పాలకులు ఆ ప్రక్రియను విస్మరించారు. చెరువుల్లో కాలుష్య వ్యర్థాలు చేరడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి. వేలాది ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యం కావని అంతర్జాతీయ సంస్థలు నివేదికలిస్తున్నాయి. గ్రీన్‌పీస్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యంపై తమ ప్రత్యేక జర్నల్స్‌లో అనేక ప్రచురణలు నిర్వహించాయి. పటాన్చెరులో ఉన్న పర్యావరణ వేత్తలు 36 ఏళ్లుగా న్యాయ స్థానంలో న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు. న్యాయస్థానం ఇస్తున్న తీర్పులను పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు. ఈ చెరువులన్నీ కాలుష్యకాసారాలే! సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1998లో పటాన్చెరు, జిన్నారంలోని కాజిపల్లి, గండిగూడెం, నాగులాల్, కిష్టారెడ్డిపేట, మక్తకుంట, అమీన్పూర్, బొల్లారం ఆసానికుంట, సాకిచెరువు, ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్, లక్డారం పెద్దచెరువుల్లో కాలుష్యం ఉందని నివేదికలు సిద్ధం చేశాయి. అలాగే ఇసుకబావి, నక్కవాగులు కాలుష్యానికి గురయ్యాయని తేల్చారు. ఈ చెరువుల్లో భారలోహాలు ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇందులో భయంకరమైన ఆర్సెనిక్ రసాయనాలు నేటికీ నిల్వ ఉన్నాయి. చెరువుల్లోని నీటి గాఢత పెరిగి ఆమ్ల ప్రవృత్తిగా మారింది. పటాన్చెరు, బొల్లారం సీఈటీపీల కారణంగా నక్కవాగు కలుషితమైంది. ఇవి కాకుండా జిల్లాలో తూప్రాన్‌లోని కలాతిలెయల్, కోహీర్‌లోని దిగ్వాల్, మెదక్‌లోని పసుపులేరులు కలుషితమయ్యాయని 1998లో సీపీసీబి నివేదికలు ఇచ్చింది. ఈ ఆధారాలతో సుప్రీంకోర్టు 2003లో చెరువుల శుద్ధి జరగాలని ఆదేశించింది. ఈ చెరువుల్లో సెలినియం, మాంగనీసు, బోరాన్, నికెల్, క్రోమియం, క్యాడ్మియం తదితర భారలోహాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో మట్టిని పూర్తిగా తొలగించి అందులో కొత్తనీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం మిషన్ కాకతీయలో ఆ చెరువులను చేర్చి శుద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యుత్పత్తి దెబ్బతింటోంది.. పటాన్చెరులో 1973లో పరిశ్రమల రాక ప్రారంభమైంది. పరిశ్రమలతో అభివృద్ధి వస్తుందని భావించారు. కాలుష్యం పెరిగింది. భయంకరమైన రసాయన కాలుష్యం ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. భూమి, నీరు, గాలి కలుషితమయ్యాయి. ఫుడ్సైకిల్లో రసాయనాలు చేరాయి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ ప్రాంతంలో కొందరిలో దెబ్బతింది. తల్లిపాలలో కూడా రసాయనాలు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సింది. నేటికీ ఆ తీర్పు అమలు కాలేదు. 36 ఏళ్లుగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నాం. నవతరం యువత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టేందుకు యోచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో జరిగిన అనర్థాలే అక్కడా జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు ఇచ్చేందుకు పర్యావరణ వేత్తలు సిద్ధంగా ఉన్నారు. - డా.ఎ.కిషన్‌రావు, పర్యావరణ ఉద్యమకారుడు, పటాన్చెరు చర్యలు తీసుకుంటాం చెరువుల శుద్ధి కార్యక్రమం కచ్చితంగా చేపడతాం. మిషన్ కాకతీయలో కొన్ని చెరువులనే ఈ ఏడాది తీసుకున్నాం. త్వరలో మిగతా చెరువులన్నింటీలో కూడా కార్యక్రమం చేపడతాం. - జైభీమ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్-సంగారెడ్డి -
'మిషన్‌కాకతీయ' పై హైకోర్టులో పిటిషన్
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలంలో 'మిషన్ కాకతీయ'కు సంబంధించి టెండర్లలో అవకత వకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ఒత్తిడికి లొంగి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రెండోసారి టెండర్లు పిలిచారని ఆరోపిస్తూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్స్ తరపున కాంపల్లి చంద్రశేఖర్, తాళ్లపల్లి రమేశ్ గౌడ్ అనే న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ( ధర్మపురి) -
'ఆ పథకాలు కార్యకర్తల కోసమే'
కరీంనగర్: కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే కేసీఆర్ మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలను ప్రవేశపెట్టినట్టు బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఈ పథకాలన్నీ అవినీతిమయమని, ఆంధ్రా గుత్తేదారులతో కేసీఆర్ మిలాఖత్ ఆయ్యారన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం మాట్లాడారు. అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆర్ పట్టించుకోకుండా కలెక్టర్లు, ఇతర ముఖ్య యంత్రాగాన్ని హైదరాబాద్‌కు తరలించి సదస్సులు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని తప్పుబట్టారు. పంట నష్టంపై సర్వే చేసి తక్షణమే నివేదిక పంపితే పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన లక్ష ఎకరాలకు సాగునీరు, పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లు వంటి హామీలు ఏమయ్యాయని నాగం ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నాడని అన్నారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనలా ఉందని విమర్శించారు. -
'ఆయనది విష ప్రచారం'
హైదరాబాద్: ప్రజాప్రయోజన కార్యక్రమాలపై విష ప్రచారం చేయటంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మించినవారు లేరని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిషన్ కాకతీయ పథకంపై బురదజల్లటం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. బీజేపీకే చెందిన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్ వంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని మెచ్చుకున్నా..కిషన్‌రెడ్డి మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన మిషన్ కాకతీయను మిషన్ గులాబీ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించటాన్ని ఖండించారు. మంచిని మంచిగా, చెడును చెడుగాను గుర్తించే సంస్కారం అలవర్చుకోవటం రాజకీయ నేతలకు అవసరమని సూచించారు. మిషన్‌కాకతీయపై విష ప్రచారాన్ని మానుకుని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. -
బిచ్చమెత్తయినా డబ్బులిస్తాం..
మహబూబ్‌నగర్ : డబ్బు సంచులకోసమే ఆంధ్రోళ్లకు మోకరిల్లినట్లయితే రూపాయి రూపాయి బిచ్చమెత్తుకోనైనా డబ్బులిస్తాం..వారి మాయనుంచి బయటకు రావాలని తెలంగాణ టీడీపీ నాయకులను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. గురువారం జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ చెరువులో మిషన్‌కాకతీయ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. పాలమూరు జిల్లాను లేబర్‌జిల్లాగా మార్చిన ఘనత టీడీపీదే నని విమర్శించారు. అరవయ్యేళ్ల ఇతరుల పాలనలో తెలంగాణ దోపిడీకి గురైందని, దాని నుంచి కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం మిషన్‌కాకతీయ టెండరు ప్రక్రియలో ఎలాంటి రాజకీయం లేకుండా చేసిందని వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (జడ్చర్ల టౌన్) -
మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన కేసీఆర్
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ప్రత్యేక హెలికాప్టర్లో సదాశివనగర్ పాత చెరువు వద్దకు చేరుకున్నఆయన మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరించారు. రైతులతో కలిసి చెరువు పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.