సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో తవ్వి తీసిన ఏడు కోట్ల ట్రాక్టర్ల మట్టిని రైతులు తమ పంట పొలాల్లో వేసుకున్నారని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఇలా ప్రజాభాగస్వామ్యం తో ప్రభుత్వానికి వెయ్యి కోట్లు ఆదా అయిందన్నారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆరూరిరమేశ్, జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు ఈ అంశంపై ప్రశ్నలు సంధించారు.
మిషన్ కాకతీయకు ఇప్పటివరకు రూ.7,357 కోట్లు మంజూరు చేస్తే, కేవలం రూ. 2,630 కోట్లే ఖర్చు అయ్యాయని, 40 శాతమే మిషన్ కాకతీయ పనులు జరిగాయని కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి విమర్శించారు. మరో సభ్యడు చిన్నారెడ్డి మాట్లాడుతూ మొదటి దశ మిషన్ కాకతీయ పనులు బాగానే జరిగాయని, కానీ రెండు, మూడో దశ పనులు మాత్రం లోపభూయిష్టంగా జరిగాయన్నారు. వీటికి మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ, నాబార్డు నివేదిక ప్రకారం మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో నీరు పెరగడంతో 2016లో వాటి కింద 51.5 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
బోర్లు, బావుల్లో 17 శాతం నీటి లభ్యత పెరిగిందన్నారు. పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల పత్తి, వరి, కంది దిగుబడులు పెరిగాయన్నారు. రైతులపై 27.6 శాతం రసాయన ఎరువుల భారం తగ్గింద న్నారు. ఒక్కో రైతుకు రూ. 1,500–3,000 వరకు ఎరువుల మీద పెట్టుబడి ఖర్చు తగ్గిందన్నారు. అలాగే 36–39 శాతం వరకు చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. చెరువుల్లో మొత్తంగా 7 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. 2013–14లో చెరువుల కింద 10.71 లక్షల ఎకరాలు సాగైతే, 2016–17లో 15.99 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందన్నారు.
కాగ్ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు
మిషన్ కాకతీయపై కాగ్ ఎటువంటి నివేదిక ఇవ్వలేదన్నారు. కాగ్ నుంచి కొన్ని వివరాలు అడిగారని, అంతకుమించి ఏదీ లేదని హరీశ్ తెలిపారు. నాలుగో దశ పనులు ఇంకా సమగ్రంగా నిర్వహిస్తామన్నారు. పనుల పురోగతి చూశాకే కాంట్రా క్టర్లకు బిల్లులు ఇస్తున్నామన్నారు.
కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అదనంగా నీరు అందించడానికి దాదాపు 5 టీఎంసీలతో కుప్తి ప్రాజెక్టును నిల్వ రిజర్వాయరుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సభ్యులు అజ్మీరా రేఖ, దివాకర్‌రావు, రాథోడ్ బాపూరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కడెం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పారు.
అనుకున్న దానికంటే తక్కువ ఖర్చు
మిషన్ కాకతీయ కింద తాము అనుకున్నదానికంటే తక్కువ ఖర్చుచేశామని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ పథకం కింద మూడు దశల్లో రూ. 7,357.42 కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ. 2,630.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. పనులు చేసినా ఖర్చు తగ్గడానికి ప్రధాన కారణం ప్రజా భాగస్వామ్యమేనన్నారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన రూ. 400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే కొన్నిచోట్ల 20–25 శాతం వరకు లెస్ టెండర్ల వల్లకూడా ఆదా జరిగిందన్నారు. వివిధ రకాలుగా జరి గిన ఆదాను ఖర్చు పెట్టలేదనడంగా భావించకూడదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment