అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పరస్పర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: శాసన సభలో శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య పరస్పరం మా టల తూటాలు పేలాయి. సభలో బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి భాషపై వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసు కున్నారు. ‘టీఆర్‌ఎస్ ఆవిర్భావంలో దళితుడు సీఎం అవుతారన్నారు.
బడ్జెట్‌పై చీల్చిచెండాడతానని కేసీఆర్ అన్నారు. దీంతో మేమంతా ఉదయం తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాం. కానీ కేసీఆర్‌కు ముఖం చెల్లక హరీశ్‌రావుతో మాట్లాడిస్తున్నారు’ అని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. దీంతో హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ‘టీపీసీసీ పదవిని రేవంత్ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అనలేదా? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హాఫ్ నాలెడ్జ్’ అంటూ విమర్శించారు.
దీనిపై అధికారపక్ష సభ్యులు నిరసన తెలిపినా హరీశ్ ఆవేశంతో ‘అవును ఆయన హాఫ్ నాలెడ్జే’ అని పునరుద్ఘాటించారు. దీంతో స్పీకర్ వెంటనే జోక్యం చేసుకొని ఆ మాటలను విరమించుకోవాలని హరీశ్ రావును కోరారు. అనంతరం కోమటిరెడ్డి జోక్యం చేసుకొని ‘హరీశ్‌రావు హాఫ్ నాలెడ్జే కాదు... ఆయనకు ఆకారం పెరిగిందే కానీ నాలెడ్జ్ ఎక్కడుంది? ఆయన ఒక డమ్మీ మంత్రి, డమ్మీ అల్లుడు’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
హరీశ్‌కు హాఫ్ నాలెడ్జ్.. కేసీఆర్‌కు ‘ఫుల్’ నాలెడ్జ్: సీఎం
ఈ తరుణంలో సీఎం రేవంత్ స్పందించారు. ‘వారికేమో (హరీశ్‌ను ఉద్దేశించి) హాఫ్ నాలెడ్జ్... పెద్దాయనకు (కేసీఆర్) ఫుల్ నాలెడ్జ్ (సైగలతో మోచేతిని చూపించారు). ఇలా ఉన్నప్పుడు మేమేం చేయగలం?’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్ కౌంటర్ ఇస్తూ మేము సరిగ్గా పనిచేయలేదనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు కూడా తప్పులు చేసి ఇక్కడ కూర్చుంటారా? మేము అక్కడికి వస్తాం. మంత్రులు మీటింగ్‌లు పెడితే కరెంట్ ఉంటుందో లేదోనన్న భయంతో అధికారులు జనరేటర్లు పెడుతున్నారు’ అని విమర్శించారు.
మరోవైపు హరీశ్‌రావు మాట్లాడుతున్నంత సేపు బీఆర్‌ఎస్ సభ్యులు ఆరు గ్యారంటీలపై ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరగా ప్లకార్డు లను మార్షల్స్‌కు ఇస్తేనే సభ నడుపుతానని స్పష్టం చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందిస్తూ తమ బడ్జెట్ చూసి హరీశ్‌రావుకు కంటగింపుగా ఉందని వ్యాఖ్యానించారు.
హరీశ్‌రావుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అభినందన
శాసనసభలో వార్షిక బడ్జెట్‌పై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ తరఫున ప్రసంగించిన సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావును పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ప్రసంగం పూర్తి చేసిన అనంతరం లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌కు వచ్చిన హరీశ్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీకి కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనల్లో లోపాలను సమర్థవంతంగా ఎత్తిచూపారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబునిచ్చారు. ట్రెజరీ బెంచ్ (ప్రభుత్వ పక్షం) నుంచి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ముగ్గురు మంత్రులు జోక్యం చేసుకుని చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా తిప్పికొట్టారని ప్రశంసించారు.
ప్రభుత్వ పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రసంగించారని, సీఎం, అధికార పక్షం నుంచి ఎదురైన విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టారని పార్టీ ఎమ్మెల్యేలు అభినందించారు. హరీశ్‌రావు ప్రసంగానికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందనే వాదనను బడ్జెట్ ప్రసంగంలో తిప్పికొట్టగలిగానని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment