శ్వేత పత్రాలా హామీల ఎగవేత పత్రాలా? | BRS MLA Harishrao fires in Assembly | Sakshi
Sakshi News home page

శ్వేత పత్రాలా హామీల ఎగవేత పత్రాలా?

Published Thu, Dec 21 2023 4:22 AM | Last Updated on Thu, Dec 21 2023 4:22 AM

BRS MLA Harishrao fires in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, ఆర్థిక శ్వేతపత్రం తప్పుల తడకగా, అంకెల గారడీలా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే, దాని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ‘శ్వేతపత్రంలో అప్పులు రూ. 6,71,757 కోట్లు అని చూపించినా..అందులో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ కింద తీసుకున్న మొత్తం రూ.1,54,876 కోట్లు వారే భరిస్తారని మీరే పేర్కొన్నారు.

ఈ లెక్కన అప్పు రూ.5,16,881 కోట్లు అయితే.. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు తీసుకునే రుణాలు రూ.16 వేల కోట్లు కూడా దీంట్లో కలిపారు. అవి తీసేస్తే వాస్తవ అప్పు రూ.5 లక్షల కోట్లు మాత్రమే..’అని హరీశ్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఈ శ్వేతపత్రంలో కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే మార్కెట్‌లో తెలంగాణకు ఏర్పడ్డ విశ్వసనీయత దెబ్బ తింటుందని, పెట్టుబడులు రాకుండా పోతాయని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.  

శ్వేతపత్రాలా? హామీల ఎగవేత పత్రాలా? 
‘దివాలా.. దివాలా అని ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే, రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు ఆగి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక, రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం. శ్వేతపత్రంలో ప్రగతి కోణం కన్నా, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్న రాష్ట్రాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం అప్పులు, దివాలా, బీమారు రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్నవి శ్వేతపత్రాలా? లేక మీరిచ్చిన హామీల ఎగవేత పత్రాలా? అనే అనుమానం కలుగుతోంది..’అని హరీశ్‌ అన్నారు.  

సీఎం గురుశిష్యులు వండి వార్చారు 
‘సీఎం రేవంత్‌రెడ్డి పాత గురుశిష్యులు ఈ శ్వేతపత్రాన్ని వండి వార్చారు. సస్పెండ్‌ అయిన ఏపీ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఈ శ్వేతపత్రం తయారీ వెనుక ఉన్నారు. (దీనికి మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పగా అవసరమైతే తయారు చేసిన వాళ్ల పేర్లు కూడా చెప్తామని హరీశ్‌రావు అన్నారు) తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా రిటైర్డ్‌ అధికారులతో నివేదిక తయారు చేయించారు. అప్పు, జీఎస్‌డీపీ నిష్పత్తిని చూపకుండా అప్పు రెవెన్యూ రాబడని చూపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యయంలో తెలంగాణ వాటా కింద 1956–57 నుంచి 2013–14 వరకు 41.68 శాతం ఖర్చు చేసినట్లు గంపగుత్త లెక్క తీశారు. ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్‌ కమిటీ వేయాలి..’అని డిమాండ్‌ చేశారు.  

ప్రాజెక్టులన్నింటిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి 
‘మా హయాంలో నిర్మించిన ప్రాజెక్టున్నింటిపై వెంటనే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుంది. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్‌ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశాం..’అని తెలిపారు. 

ఆస్తులు పెరిగిన విషయం దాచిపెడుతున్నారు 
‘విద్యుత్‌ సంస్థలు తీసుకున్న రుణాలను విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి ఖర్చు చేయడం జరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంస్థలు తిరిగి ఆ రుణాలను చెల్లిస్తాయి. (మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి రైతులు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనేదేనా గత ప్రభుత్వ ఉద్దేశం అని నిలదీశారు) ఎంతసేపు అప్పులు అప్పులు అని నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు. నాణానికి రెండో వైపు ఆస్తులు పెరిగాయి. ఈ విషయం దాచిపెడుతున్నారు..’అంటూ హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సంపద సృష్టించి ఆస్తులు కూడబెట్టాం 
‘గత ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనల పరిధి దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించి, పరిమితి మేరకు మాత్రమే రుణాలు తీసుకుంది. సంపద సృష్టించి ఆస్తులు కూడబెట్టింది. 200 టీఎంసీల నీరున్న రిజర్వాయర్లు నిర్మించింది. (ఈ సమయంలో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకొని సచివాలయం, ప్రగతి భవన్, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు) విద్యుత్‌ సంస్కరణల పేరిట బోర్లు, బావులకు మీటర్లు పెడితే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి అదనంగా 0.5 శాతం రుణాలు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.

కానీ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్‌ దానికి అంగీకరించలేదు. ఒకవేళ ఆ నిబంధనకు అంగీకరించి ఉంటే రూ.35 వేల కోట్లు రాష్ట్రానికి అదనంగా వచ్చేవి. (ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మోటార్లకు బిల్లులు వసూలు చేసే నిబంధన విద్యుత్‌ సంస్కరణల్లో లేదన్నారు. దీంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది) వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను కూడా ప్రభుత్వ రుణాలుగా చిత్రీకరించి గగ్గోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేషన్లు తీసుకునే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీని మాత్రమే ఇస్తుంది..’అని హరీశ్‌రావు చెప్పారు.  

బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ 
‘రాష్ట్రం ఆర్థికంగా బలపడడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసింది. పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలను తట్టుకుని బలీయమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచింది. అప్పులు తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింద నుంచి తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. కేంద్రం నుంచి రావలసిన రూ.లక్ష కోట్లు రాకపోవడం వల్ల ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బంది కలిగింది. ఎస్‌పీవీలను అప్పులుగా తప్పుగా చూపించారు.

ఏ ప్రభుత్వం వద్ద డబ్బులు కట్టల రూపంలో బీరువాల్లో ఉండవు. (మంత్రి పొన్నం ప్రభాకర్‌ జోక్యం చేసుకుని.. బంగారు తెలంగాణ అంటూ గోబెల్స్‌ ప్రచారం చేశారని, ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కల్పించారని అన్నారు) కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు తీసుకోజాలవు..’అని స్పష్టం చేశారు. 

ఆస్తులు పెంచాం.. అభివృద్ధి చేశాం
♦ ‘పదేళ్లలో తెలంగాణ ఆస్తులు’ పేరిట నివేదిక విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ 
♦కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి సమాధానమని ప్రకటన 
♦తప్పుడు లెక్కలతో మోసం చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన శ్వేతపత్రానికి సమాధానంగా భారత్‌ రాష్ట్ర సమితి ‘పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు’అంటూ 51 పేజీల నివేదికను విడుదల చేసింది. రంగాల వారీగా పదేళ్ల పాలనలో తాము సృష్టించిన ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెంచడంతో పాటు రూ.1649 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌ భవనాలు నిర్మించామని పేర్కొంది.

2014కు ముందు ప్రస్తుతం రంగాల వారీగా సృష్టించిన మౌలిక వసతుల వివరాలను వెల్లడించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సంఖ్య పెంపు, మౌలిక వసతుల కల్పన, రోడ్లు, చెత్త సేకరణ వాహనాలు, గురుకులాల సంఖ్య పెంపు వంటి అంశాలను గణాంకాలతో సహా ప్రస్తావించింది. విద్య, పారిశ్రామిక పెట్టుబడులు, హరితహారంతో పాటు ఆధ్యాత్మిక సంపద పెంచామంటూ ఆ నివేదికలో వివరాలను పొందుపరిచింది. 

కొత్త ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలు 
ఆరోగ్య శాఖ ద్వారా పెరిగిన బెడ్ల సంఖ్య, కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు తదితరాలను వివరంగా పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నీటిపారుదల రంగంలో సాగించిన నిర్మాణాలు, వాటికి అయిన ఖ ర్చును నివేదికలో ప్రకటించింది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథతో సహా పదేళ్ల కాలంలో చేపట్టిన అనేక పనులు, వాటికి వెచ్చించిన మొత్తాన్ని గణాంకాలతో సహా వివరించింది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా పని చేతకాక అప్పుల పేరు చెప్పి తెలంగాణ సమాజాన్ని మోసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement