సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకాన్ని అత్యుత్తమ జల నిర్వహణ చర్యగా ప్రశంసిస్తూ నీతి ఆయోగ్ నివేదిక రూపొందించడం పట్ల రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక అని, మంత్రి హరీశ్‌రావు దీన్ని సమర్థవంతంగా అమలు చేశారని కొనియాడారు. ఈ పథకాన్ని గుర్తించినందుకు మంగళవారం ట్విట్టర్‌లో నీతి ఆయోగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రైతు బీమా దేశానికే ఆదర్శం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష జరిపారు.
మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు అజయ్ మిశ్రా, పార్థ సారథి, ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణారావు, ఆదర్ సిన్హా, శివశంకర్, జగన్‌మోహన్ రావు, భూపాల్ రెడ్డి, జీవిత బీమా సంస్థ అధికారులు పాల్గొన్నారు.
పథకం ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. మరణించిన రైతుల కుటుంబాలకు బీమా కల్పించే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులందరికీ వర్తింపు
‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వ్యవసాయ రంగం కుదుటపడుతోంది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోనే బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. చిన్నకారు, సన్నకారు, పెద్ద రైతు అనే తేడా లేకుండా అందరికీ బీమా సౌకర్యం వర్తింపజేయాలి.
ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కి పెద్ద యంత్రాంగం వుంది. అది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రజలపై దానికి నమ్మకముంది. కాబట్టి ఎల్‌ఐసీ ద్వారానే రైతుల బీమా పథకాన్ని అమలు చేయాలి. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిది కావడంతోపాటు రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతుంది’అని పేర్కొన్నారు.
రైతుల్లో వివిధ వయస్సులకు చెందిన వారు వుంటారు కాబట్టి ఎల్‌ఐసీ నిబంధనలు ఎలా వున్నాయి, తెలంగాణ రైతు బీమా పథకం ఎలా వుండాలి.. అనే అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా రైతు జాబితాలు, వారి నామినీల జాబితాను రూపొందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment