సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ నాలుగో విడత చెరువుల పునరుద్ధరణ పనులకు పరిపాలనా అనుమతుల ప్రక్రియలో తీవ్రంగా జాప్యం జరుగుతోంది. ఈ సంవత్సరం జనవరి ఆరంభానికే చెరువుల పనులకు పరిపాలనా అనుమతులు రావాల్సి ఉన్నా ఇప్పటికీ నిర్ణీత లక్ష్యంలో సగాన్ని మాత్రమే నీటి పారుదల శాఖ చేరుకుంది. దీంతో గడువు మేరకు చెరువుల పనులన్నింటినీ పూర్తి చేయడం కష్టతరం కానుంది.
నాలుగో విడత మిషన్ కాకతీయలో మొత్తంగా 5,703 చెరువుల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయి నప్పటికీ జిల్లాల నుంచి మొత్తంగా లక్ష్యానికి మించి 6,061 చెరువుల అంచనాలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయానికి పంపారు. వీటిని పరిశీలించిన అనంతరం చిన్న నీటిపారుదల శాఖ 5,220 చెరువుల అంచనాలను ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. అయితే ఇప్పటివరకు కేవలం 2,550 చెరువులకు మాత్రమే అనుమతులు వచ్చాయి. మరో 2,670 చెరువుల అనుమతులు రావాల్సి ఉంది.
జూలై నాటికి లక్ష్యం నెరవేరేనా?
అనుమతులకు సంబంధించి నీటి పారుదల శాఖ నుంచి ప్రభుత్వానికి వేగంగా ఫైళ్లు కదులుతున్నా ఉన్నత స్థాయిలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్, జూలై నాటికి చెరువుల పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంపై ప్రభావం పడనుంది.
మిషన్ కాకతీయ పనులు చూస్తున్న ఉన్నతాధికారికే పంచాయతీరాజ్ శాఖ పనులూ కట్టబెట్టడంతో.. ఆయన ఆ పనులకే అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ప్రభుత్వం తేనున్న పంచాయతీరాజ్ చట్టం తయారీలో ఆయన తలమునకలు కావడంతో అనుమతుల విషయమై మరింత జాప్యం జరుగుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment