అసెంబ్లీలో మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణను ప్రభుత్వం పరిపూర్ణం చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంలో 95,345 పోస్టులు మంజూరు చేసిందని, ఇప్పటికే ఏర్పడిన ఖాళీలతో కలిపి 1,49,382 పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,17,714 పోస్టులు భర్తీ చేయగా, మరో 31,660 పోస్టుల భర్తీ ప్రక్రియ పురోగతిలో ఉందని బుధవారం అసెంబ్లీలో ప్రశ్నత్తరాల సమయంలో వెల్లడించారు. అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై 900 వరకు కేసులు వేశారని, ఇవి కొన్ని స్టే, మరికొన్ని అప్పీల్ దశలో ఉన్నాయన్నారు. దీంతో భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని వివరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కోర్టు కేసులు ఉన్న వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డు ఎక్కువ మందిని అన్‌ఫిట్‌గా నిర్ధారిస్తుందనే అంశంపై త్వరలో సింగరేణి సీఎండీ, సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
కాకతీయ మిషన్‌కు పైసా కూడా ఇవ్వలేదు..
మిషన్ కాకతీయను నీతి ఆయోగ్ మాజీ సీఈవో అర్వింద్ పనగరియా ప్రశంసించడంతో పాటు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానిమస్తూ.. వర్షాభావ పరిస్థితుల్లోనూ చెరువుల్లో జలకళ తీసుకొచ్చేందుకు ప్రాజెక్టుల కాల్వలపై 3 వేలకు పైగా తూములు నిర్మించి 9 వేల చెరువులను నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటివరకు మిషన్ కాకతీయ కింద 25,272 చెరువులను పునరుద్ధరించడం ద్వారా 14.15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment