
సాక్షి, హైదరాబాద్: చిన్ననీటి వనరుల అభివృద్ధికి జలవనరుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునరావాసం (ఆర్‌ఆర్‌ఆర్) పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.162 కోట్లు మంజూరు చేసిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి వచ్చే నెలలో పనులు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. గురువారం రాత్రి జలసౌధలో ట్రిపుల్ ఆర్, మిషన్ కాకతీయపై మంత్రి సమావేశం నిర్వహించారు.
ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో ట్రిపుల్ ఆర్ పనులు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ఖమ్మంలో 66, మెదక్‌లో 45, నల్లగొండలో 36 పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ట్రిపుల్ ఆర్ కింద ఇదివరకు పూర్తి చేసిన పనుల యూసీలను సమర్పించి అదనపు గ్రాంట్లు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ నాలుగో దశ పనులను ఈ నెల 15 కల్లా ప్రారంభించాలని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో పనులను ప్రారంభించాలని, ఈ మేరకు వారి సమయాన్ని ముందుగానే తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంజూరైన మినీ ట్యాంక్ బండ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment