‘కృష్ణ’ జలాభారం | Krishna River Management Board Will Meet On June 6 | Sakshi
Sakshi News home page

‘కృష్ణ’ జలాభారం

Published Wed, Jun 6 2018 2:25 AM | Last Updated on Wed, Jun 6 2018 2:25 AM

Krishna River Management Board Will Meet On June 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలు, ప్రాజెక్టుల్లో నీటి వాటాలు సహా వివాదాస్పద అంశాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టుల్లోకి జల ప్రవాహాలు మొదలు కాకముందే.. వివాదాలను చక్కదిద్దే దిశగా బుధవారం జరుగుతున్న కృష్ణా బోర్డు కీలక సమావేశం ఇందుకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు, మళ్లింపు జలాలు, నీటి వాటాలు, వినియోగం, టెలిమెట్రీల ఏర్పాటు, బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ తదితర అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదన వినిపించనున్నారు.

ముఖ్యంగా 2018–19 ఏడాదికిగాను కృష్ణా జలాల్లో తమకు 33 శాతం కాకుండా 50 శాతం నీటి వాటా కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కృష్ణాబోర్డు ఎవరి వాదనకు మొగ్గు చూపుతుంది, ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. కృష్ణాబోర్డు ఇన్‌చార్జి చైర్మన్‌ హెచ్‌కే సాహూ అధ్యక్షతన జలసౌధలో బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితోపాటు, ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు నాగేంద్రరావు, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొననున్నారు.

13 అంశాలతో బోర్డు.. ‘అదనపు’తో రాష్ట్రాలు
బుధవారం జరిగే సమావేశంలో కృష్ణా బోర్డు మొత్తంగా 13 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. ఇందులో బోర్డుకు సిబ్బంది, నిధుల కేటాయింపు, వర్కింగ్‌ మాన్యువల్‌ ఆమోదం, మొదటి, రెండో దశ 
టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు, తాగునీటికి కేటాయించిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, శ్రీశైలం నుంచి విడుదల చేసిన నీరు నాగార్జునసాగర్‌కు చేరేటప్పటికి తక్కువగా ఉండటంపై ఏర్పాటు చేసిన కమిటీలిచ్చిన నివేదికలు, 2017–18లో నీటి వినియోగం, 2018–19లో నీరు, విద్యుత్‌ పంపిణీ తదితర అంశాలను పేర్కొంది. దీనికి అదనంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ తమ డిమాండ్లతో పలు అంశాలను భేటీ ఎజెండాలో చేర్చాలని కోరాయి. ఈ అంశాలపై సమావేశంలో చివరలో బోర్డు చర్చించనుంది.

కొత్త ప్రాజెక్టులు కీలకం
కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఏపీలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల అంశం బోర్డు భేటీలో కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన గురు రాఘవేంద్ర, శివభాస్యం సాగర్, మున్నేరు వంటి 13 ప్రాజెక్టులు, తెలంగాణ చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, వాటర్‌గ్రిడ్‌ వంటి ఎనిమిది ప్రాజెక్టులకు సంంబంధించిన డీపీఆర్‌ల అంశాలను బోర్డు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని బోర్డు ఇప్పటికే ఆదేశించినా ఇరు రాష్ట్రాలు స్పందించలేదు. డీపీఆర్‌లు లేకుండా అభిప్రాయం చెప్పడం, సాంకేతిక అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని బోర్డు స్పష్టం చేసిన నేపథ్యంలో.. భేటీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయన్నది ఆసక్తిగా మారింది. ఇక ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి తమకు దక్కే 45 టీఎంసీలను వెంటనే కేటాయిస్తే వాటిని ఏఎమ్మార్‌–ఎస్‌ఎల్‌బీసీకి వాడుకుంటామని తెలంగాణ అంటోంది. మరోవైపు తెలంగాణ గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు 214 టీఎంసీల మేర నీటిని తరలిస్తోందని, అందులో తమ వాటా తేల్చాలని ఏపీ వాదిస్తోంది.

తెలంగాణ చర్చించాలంటున్న అదనపు అంశాలివీ..

  • ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని తీసుకుని తక్కువగా చూపించింది. ఈ తేడాను లెక్కల్లోకి తీసుకొని వినియోగం లెక్కించాలి.
  • గోదావరి నుంచి మళ్లించే నీటిలో తెలంగాణ వాటాను ఏఎంఆర్‌–ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు కేటాయించడంపై చర్చించాలి. 
  • కేటాయించిన నీటికంటే ఎక్కువ నీటిని వాడుకున్న రాష్ట్రానికి సంబంధించిన వాటాను తర్వాతి ఏడాదిలో తగ్గించడం. 
  • రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా ఏకపక్షంగా బోర్డు పరిధిపై చైర్మన్‌ కేంద్రానికి లేఖ రాయడంపై చర్చించాలి.

ఏపీ కోరిన అంశాలివీ..

  • కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలి.
  • ఆర్డీఎస్‌పై మూడు చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలి.
  • పాలేరు రిజర్వాయర్‌ నుంచి భక్త రామదాసు ఎత్తిపోతలకు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు తెలంగాణ తరలించే 214 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవడంతో పాటు ఆ రిజర్వాయర్‌ నుంచి మొత్తం వినియోగంపై పరిమితులు ఉండాలి.
  • తెలంగాణ కృష్ణాపై చేపట్టిన కొత్త ప్రాజెక్టులు పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్‌లను బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలనకు పెట్టాలి.
  • మిషన్‌ కాకతీయ కింద చెరువులు బాగుపడినందున చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు ఉన్న మొత్తం కేటాయింపు 89.15 టీఎంసీలను పరిగణనలోకి తీసుకోవాలి.
  • జూరాల వినియోగం, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల కింద వినియోగించిన నీటిని తెలంగాణ తక్కువగా చూపుతోంది. దీనిపై చర్చించాలి.

బోర్డు పెత్తనంపై గుర్రు..
ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునే విషయమై కృష్ణా బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ సిద్ధం చేసి, నోటిఫికేషన్‌ కోసం కేంద్రానికి పంపింది. ఈ అంశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ నిర్ణయం వచ్చే వరకు దానిని ఆమోదించరాదని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 89 (ఎ), (బి)ల ప్రకారం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ కాల పరిమితిని రెండేళ్లు పెంచారని.. దానిలో కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా, నాలుగు రాష్ట్రాల మధ్యా అన్నది తేలలేదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవని, నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలూ ట్రిబ్యునల్‌ పరిశీలనలో ఉన్నాయని... అలాంటప్పుడు బోర్డు నియంత్రణ అన్న ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. దీనిని బోర్డు భేటీలో లేవనెత్తాలని నిర్ణయించింది.

‘మైనర్‌’లెక్కలతో పెద్ద సమస్య
చిన్న నీటి వనరుల కింద నీటి వినియోగం లెక్కలు కూడా బోర్డు భేటీలో కీలకం కానున్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం.. మొత్తంగా ఉమ్మడి ఏపీకి మైనర్‌ ఇరిగేషన్‌ కింద 111.26 టీఎంసీల కేటాయింపులు ఉండగా.. అందులో తెలంగాణకు 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలు కేటాయించారు. అయితే మైనర్‌ ఇరిగేషన్‌ కింద గత రెండేళ్లుగా పెద్దగా నీటిని వాడుకుంటున్న దాఖలాలే లేవు. ఎప్పుడో 1973లో రాష్ట్రంలోని చిన్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని బచావత్‌ (కేడబ్యూడీటీ–1) ట్రిబ్యునల్‌ 89.15 టీఎంసీలను కేటాయించింది.

తర్వాతి కాలంలో చెరువులు సహా ఇతర చిన్ననీటి వనరులన్నీ పూడిక నిండి, కబ్జాలకు గురై ఆ స్థాయిలో నీటిని వినియోగించుకోలేని స్థితికి చేరుకున్నాయి. మంచి వర్షాలు కురిసిన సందర్భాల్లోనూ గరిష్టంగా 20 నుంచి 30 టీఎంసీలకు మించి వాడుకోలేని పరిస్థితి ఉందని తెలంగాణ స్పష్టం చేస్తోంది. కానీ మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణ పూర్తయినందున చిన్న నీటి వనరుల లభ్యత పెరిగిందని.. ఈ దృష్ట్యా వాటా మేరకు వినియోగం లెక్కించాలని ఏపీ కోరుతోంది.

తాగునీటిపై కొత్త వాదన
కృష్ణా జలాల లెక్కల్లో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నుంచి తాగునీటి కోసం కేటాయిస్తున్న నీటిలో 20 శాతాన్నే పరిగణనలోకి తీసుకొని వినియోగాన్ని లెక్కించాలని తెలంగాణ కోరుతోంది. కృష్ణా జలాలపై గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ వెలువరించిన తీర్పులో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొందని.. గృహ అవసరాలకు వాడే నీటిలో 20 శాతాన్నే వినియోగం కింద లెక్కించాలని తెలిపిందన్న వాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ తాగునీటికి 15 టీఎంసీల మేర కేటాయిస్తే.. అందులో 4 నుంచి 6 టీఎంసీల మేర మాత్రమే వాస్తవ వినియోగం ఉంటోందని.. మిగతా నీరంతా డ్రైనేజీ రూపంలో తిరిగి మానేరు, మూసీ వంటి కృష్ణా ఉప నదుల్లోనే చేరుతోందని స్పష్టం చేస్తోంది. దీంతో హైదరాబాద్, నల్లగొండ, మిషన్‌ భగీరథ కింద విడుదల చేసిన నీటిలో 20 శాతాన్ని మాత్రమే తెలంగాణ నీటి వినియోగ ఖాతాలో వేయాలని కోరుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement