బాబోయ్..! కాలుష్య భూతం | Pollution demon | Sakshi
Sakshi News home page

బాబోయ్..! కాలుష్య భూతం

Published Mon, Aug 3 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

బాబోయ్..!  కాలుష్య భూతం

బాబోయ్..! కాలుష్య భూతం

 పటాన్‌చెరు : కాలుష్యంపై ఈ ప్రాంత వాసులు 1983 నుంచి పోరాటం చేస్తున్నారు. నేటికీ పాలకులు ఈ ప్రాంత సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదు. కాలుష్య భూతాన్ని తరిమేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఘనంగా ప్రకటించినా.. ఏడాదిగా  కాలుష్య ప్రక్షాళన కోసం చేసింది శూన్యం. చెరువులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలమని చెప్పిన ప్రభుత్వం.. వాటి పూడికతీత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కాని పటాన్‌చెరులో కాలుష్యం బారినపడ్డ చెరువులను శుద్ధి చేయడం లేదు. చెరువులను శుద్ధి చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నేటికీ అమలు చేయలేదు.

తూతూ మంత్రంగా అప్పట్లో రెండు చెరువుల్లో శుద్ధి కార్యక్రమం జరిగింది. ఆపై పాలకులు ఆ ప్రక్రియను విస్మరించారు. చెరువుల్లో కాలుష్య వ్యర్థాలు చేరడంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పనికిరాకుండా పోయాయి. వేలాది ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యం కావని అంతర్జాతీయ సంస్థలు నివేదికలిస్తున్నాయి. గ్రీన్‌పీస్ వంటి సంస్థలు ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్యంపై తమ ప్రత్యేక జర్నల్స్‌లో అనేక ప్రచురణలు నిర్వహించాయి. పటాన్‌చెరులో ఉన్న పర్యావరణ వేత్తలు 36 ఏళ్లుగా న్యాయ స్థానంలో న్యాయం కోసం పోరాటాలు చేస్తున్నారు. న్యాయస్థానం ఇస్తున్న తీర్పులను పాలకులు ఏనాడూ పట్టించుకోలేదు.

 ఈ చెరువులన్నీ కాలుష్యకాసారాలే!
 సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1998లో పటాన్‌చెరు, జిన్నారంలోని కాజిపల్లి, గండిగూడెం, నాగులాల్, కిష్టారెడ్డిపేట, మక్తకుంట, అమీన్‌పూర్, బొల్లారం ఆసానికుంట, సాకిచెరువు, ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్, లక్డారం పెద్దచెరువుల్లో కాలుష్యం ఉందని నివేదికలు సిద్ధం చేశాయి. అలాగే ఇసుకబావి, నక్కవాగులు కాలుష్యానికి గురయ్యాయని తేల్చారు. ఈ చెరువుల్లో భారలోహాలు ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇందులో భయంకరమైన ఆర్సెనిక్ రసాయనాలు నేటికీ నిల్వ ఉన్నాయి. చెరువుల్లోని నీటి గాఢత పెరిగి ఆమ్ల ప్రవృత్తిగా మారింది. పటాన్‌చెరు, బొల్లారం సీఈటీపీల కారణంగా నక్కవాగు కలుషితమైంది.

ఇవి కాకుండా జిల్లాలో తూప్రాన్‌లోని కలాతిలెయల్, కోహీర్‌లోని దిగ్వాల్, మెదక్‌లోని పసుపులేరులు కలుషితమయ్యాయని 1998లో సీపీసీబి నివేదికలు ఇచ్చింది. ఈ ఆధారాలతో సుప్రీంకోర్టు 2003లో చెరువుల శుద్ధి జరగాలని ఆదేశించింది. ఈ చెరువుల్లో సెలినియం, మాంగనీసు, బోరాన్, నికెల్, క్రోమియం, క్యాడ్‌మియం తదితర భారలోహాలు ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో మట్టిని పూర్తిగా తొలగించి అందులో కొత్తనీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం మిషన్ కాకతీయలో ఆ చెరువులను చేర్చి శుద్ధి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 ప్రత్యుత్పత్తి దెబ్బతింటోంది..
 పటాన్‌చెరులో 1973లో పరిశ్రమల రాక ప్రారంభమైంది. పరిశ్రమలతో అభివృద్ధి వస్తుందని భావించారు. కాలుష్యం పెరిగింది. భయంకరమైన రసాయన కాలుష్యం ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది. భూమి, నీరు, గాలి కలుషితమయ్యాయి. ఫుడ్‌సైకిల్‌లో రసాయనాలు చేరాయి. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ ప్రాంతంలో కొందరిలో దెబ్బతింది. తల్లిపాలలో కూడా రసాయనాలు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సింది.

నేటికీ ఆ తీర్పు అమలు కాలేదు. 36 ఏళ్లుగా కోర్టుల్లో పోరాటం చేస్తున్నాం. నవతరం యువత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వెయ్యి ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టేందుకు యోచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో జరిగిన అనర్థాలే అక్కడా జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి కావాల్సిన సలహాలు ఇచ్చేందుకు పర్యావరణ వేత్తలు సిద్ధంగా ఉన్నారు.
 - డా.ఎ.కిషన్‌రావు, పర్యావరణ ఉద్యమకారుడు, పటాన్‌చెరు
 
 చర్యలు తీసుకుంటాం
 చెరువుల శుద్ధి కార్యక్రమం కచ్చితంగా చేపడతాం. మిషన్ కాకతీయలో కొన్ని చెరువులనే ఈ ఏడాది తీసుకున్నాం. త్వరలో మిగతా చెరువులన్నింటీలో కూడా కార్యక్రమం చేపడతాం.
 - జైభీమ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్-సంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement