deficit rainfall
-
దేశంలో సాధారణం కంటే 6 % అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం ప్రకటించింది. కానీ, ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే లోటు వర్షపాతమే కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ, మధ్య, ఈశాన్య, తూర్పు భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షం కురిసిందని తెలియజేసింది. వాయవ్య భారతదేశంలో 19 శాతం లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు నెలలపాటు వర్షాలు కురుస్తాయి కాబట్టి వాయవ్య భారతంలోనూ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా చెప్పారు. దక్షిణాదిలో సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం రికార్డు అయ్యిందని ఐఎండీ స్పష్టం చేసింది. -
వర్షాలు లేక వెలవెల..
సాక్షి, మహబూబ్‌నగర్ : దేశమంతటా పుష్కలంగా వర్షాలు కురిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఏ చెరువు చూసినా.. ఏ కుంట చూసినా కంపచెట్లు, పిచ్చిమొక్కలతో నిండి కనిపిస్తోంది. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత పనులు చేయించినా వర్షాలతో నీటి చేరిక లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు వేల పైచిలుకు చెరువులు జలకళ లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం 35 చెరువులు మాత్రమే నిండగా మరో 23 చెరువులు మత్తడి దూకి ప్రవహిస్తున్నాయి. ఇటీవల వారంరోజులు ముసురు పట్టినా భూగర్భజలాలు మాత్రం పెరగలేదు. 20 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతన్నాయి. కొనసాగుతున్న మరమ్మత్తులు ఏళ్ల నుంచి మరమ్మత్తులకు నోచకుండా ఆదరణకు దూరమైన చెరువులకు మరమ్మతు పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం పనులు ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి పాలమూరు పరిధిలోని ఐదు జిల్లాల్లో మొత్తం 6,417 చెరువులు ఉండగా ఇప్పటివరకు 3,590 చెరువుల పనులు వందశాతం పూర్తయ్యాయి. మిగిలిన చెరువుల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 854 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టగా అందులో 666 పనులు పూర్తయ్యాయి. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.185 కోట్లు కేటాయించగా రూ.105 కోట్లు చెల్లింపులు జరిగాయి. వనపర్తి జిల్లాలో 1,253 చెరువులు ఉంటే 754 చెరువుల పనులు పూర్తయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 346 చెరువులు ఉంటే 226 చెరువుల పనులు పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లాలో 1,125 చెరువులు ఉంటే 689 పనులు చేపట్టగా 394 చెరువుల మరమ్మత్తు జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,995 చెరువులు ఉంటే 1,550 చెరువులకు మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. కాగా 2,827 చెరువుల పనుల మరమ్మత్తు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న చెరువులకు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో వాటిలో నీటనిల్వకు అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితి నెలకొంది. మత్స్యకారులకూ నిరాశే! ఆర్థికంగా చితికిపోయిన మత్స్యకారులను చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు అందిస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9.86 కోట్ల చేప పిల్లలను వదలాలని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే చెరువుల్లో చేప పిల్లలు పెరగానికి అనుకూల వాతావరణంతో పాటు 40 శాతం నీళ్లు ఉండి తీరాలి. కానీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 4,200 చెరువుల్లో నీరు 40శాతానికి తగ్గి ఉంది. కేవలం రెండొందల చెరువులు మాత్రమే చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో రెండ్రొజుల క్రితమే ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు 40శాతానికి మించి నీళ్లు ఉన్న చెరువుల్లో చేప పిల్లల్ని వదలారు. ఇప్పటి వరకు సుమారు ఐదు కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలారు. నీళ్లు తక్కువగా ఉన్న 4,200 చెరువుల్లో చేపపిల్లల పెరుగుదల ప్రశ్నార్ధకంగా మారడంతో వాటి పరిధిలో ఉన్న మత్స్యకారులు, సంబంధిత సంఘాల ప్రతినిధులు ఆందోళనలో ఉన్నారు. జలాశయాలే దిక్కు ఆశించిన మేరకు వర్షాలు కురవకపోయినా కర్ణాటక, మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, భీమాతో పాటు తుంగభద్ర కూడా వరద రూపంలో నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలపై పోటñత్తాయి. దీంతో అధికారులు జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకున్నారు. తాజాగా వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు తుంగభద్ర నీటితో తుమ్మిళ్ల జలాశయాన్ని, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌ను నింపి వాటి పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నింపుతున్నారు. -
చినుకు జాడేది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడైనా అంతా సవ్యంగా ఉంటుందనుకుంటే సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నెల ఒకటిన ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో 26వ తేదీ వరకు పరిశీలిస్తే నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 59 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ పరిభాషలో స్కాంటీ (తీవ్ర దుర్భిక్షం) అని అంటారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 58 శాతం వరకు తక్కువ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో సాధారణం కంటే 79.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 63.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 62 శాతం, కృష్ణా జిల్లాలో 60.6 శాతం లోటు వర్షం కురిసింది. ఇదే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సగటు సాధారణ వర్షం కంటే 42.9 శాతం తక్కువ కురిసింది. మూడొంతుల ప్రాంతంలో వర్షాభావమే.. రాష్ట్రంలో మూడొంతుల ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా 276 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితి (59 శాతం పైగా లోటు వర్షపాతం) ఉంది. మరో 228 మండలాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం కురిసింది. గత ఐదేళ్లలో వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. జలాశయాలు, ప్రాజెక్టులు నీరు లేక అడుగంటాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. జూన్ చివరి వారం వచ్చినా వర్షం జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా వర్షం కురిస్తే వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయాలని రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేయాలని యోచిస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ప్రభావం ఈ ఏడాది కూడా వర్షాభావం ప్రభావం ఖరీఫ్ సాగుపై తప్పేలా లేదని అధికారులు అంటున్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు వేరుశనగ, ఇతర మెట్ట పంటలు సాగు చేస్తుంటారు. రాష్ట్రంలో 9.15 లక్షల హెక్టార్లు (సుమారు 23 లక్షల ఎకరాల్లో) వేరుశనగ సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1.9 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1.6 శాతం మాత్రమే సాగైంది. ఇంకా సాగుకు సమయం ఉన్నప్పటికీ వర్షాభావం వల్ల సాగు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
నైరుతి నైరాశ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అంతులేని సమస్యలు తెచ్చిపెడుతోంది. వర్షాకాల సీజన్ మొదలై 15 రోజులు కావస్తున్నా నైరుతి స్తంభించడంతో సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యంతో వర్షాలు కురవక కోటి ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై రైతులు దిగాలు చెందుతున్నారు. భారీ రిజర్వాయర్లలో నిల్వలు ఖాళీ కావడం, భూగర్భ జలాల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో భారీ తగ్గుదల కనిపిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలవగా అవి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెల 20 నుంచి రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం ఉంటుందన్న సంకేతాలు కొంత ఉపశమనం కల్గిస్తున్నాయి. 46 శాతం లోటు వర్షపాతం... రాష్ట్రంలో మామూలుగా జూన్‌లో 136 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. కానీ రుతుపవనాల ఆలస్యంతో సాధారణంకన్నా 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణం కంటే 60–70% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ నెల 8నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినా అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను ప్రభావంతో అవి స్తంభించాయి. దీంతో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అయితే గత రెండ్రోజులుగా నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా రాష్ట్రంవైపు కదులుతున్నాయి. అవి ఈ నెల 20న రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నుంచి సాధారణంకంటే 60–70శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎస్సారెస్పీ పరిస్థితి ఇలా.. చుక్కలేని కొత్త నీరు... రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లన్నీ నోరెళ్లబెట్టాయి. ఏ రిజర్వాయర్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో నీటి నిల్వలు లేవు. ఒక్క ఎల్లంపల్లిలో మాత్రం ఒకట్రెండు నెలల తాగునీటి అవసరాలకు సరిపడే నిల్వలు ఉండగా మిగతావన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగూరు, నిజాంసాగర్‌లో చుక్కనీరు లేదు. ఎస్సారెస్పీది అదే పరిస్థితి. బేసిన్లో మొత్తంగా 215 టీఎంసీల నిల్వ ప్రాజెక్టులుండగా ఏకంగా 200 టీఎంసీల నీటి లోటు కనబడుతోంది. ప్రస్తుతం జూన్ మూడో వారంలోకి వస్తున్నా ఇంతవరకు చుక్క నీటి ప్రవాహాలు లేవు. సాధారణంగా గోదావరిలో జూన్ రెండో వారం నుంచి నీటి ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నా రుతుపవనాల ఆలస్యం కారణంగా ఇంతవరకు ప్రవాహాల జాడ కనిపించడం లేదు. ఈ ప్రభావం గోదావరి బేసిన్‌లోని 15–18 లక్షల ఎకరాలపై ప్రభావం చూపనుంది. కృష్ణా బేసిన్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తుతం 375 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 128.63 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇక్కడ డెడ్ స్టోరేజీ 510 మీటర్లుకాగా ఇప్పటికే 508 మీటర్ల వరకు వెళ్లి హైదరాబాద్ తాగునీటి అవసరాలపై నీటిని అత్యవసర పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 32.24 టీఎంసీల లభ్యతగా ఉండగా ఇప్పటికే కనీస నీటిమట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలూ నీటిని తీసుకుంటున్నాయి. ఎగువన కర్ణాటక ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 225 టీఎంసీల నీరు చేరితేగానీ రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు రావు. సాధారణ వర్షపాతాలు నమోదయ్యే ఏడాదుల్లోనూ ఆగస్టు, సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రాజెక్టులు నిండవు. ప్రస్తుతం రుతుపవనాల ఆలస్యం కారణంగా అక్టోబర్ వరకు ప్రాజెక్టులు నిండుతాయో లేదో చెప్పలేని పరిస్థితులున్నాయి. ఇదే జరిగితే జూరాల, సాగర్ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా నీళ్లు రాలేదు. రాష్ట్రంలో 40 వేలకుపైగా చెరువులు ఉండగా 90 శాతానికిపైగా చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వీటి కింద సాగయ్యే 25 లక్షల ఎకరాలు సాగుక్లిష్టంగానే మారనుంది. భూగర్భ జలాలు దయనీయం.. రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో రబీ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది మే నెలలో రాష్ట్ర సాగటు నీటిమట్టం 12.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది అది 14.46 మీటర్లుగా నమోదైంది. గతేడాది మే నెల మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.83 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 26.47 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, సిధ్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో 20 మీటర్లకన్నా ఎక్కువగా నీటి మట్టాలు పడిపోగా కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయి. భూగర్భమట్టాలు తగ్గుతుండటంతో చాలా జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. బోర్లు పనిచేయకపోవడంతో పట్టణాల్లో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఈ దృష్ట్యానే సాగునీటి ప్రాజెక్టుల్లో తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరధ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలోనూ నిల్వలు తగ్గుతున్న క్రమంలో వర్షాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడే వర్షాధార పంటలు వద్దు... ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు సాగు లక్ష ఎకరాలకు మించింది లేదు. ఈ సాగు సైతం బోర్లు కింద జరిగినదే. గతేడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాలు సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. అంటే గతేడాది కంటే గణనీయంగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు ఎక్కడా నార్లు పోసిన దాఖలాలు కనిపించడం లేదు. వర్షాలు కురిస్తే జూలై, ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు ఒక సంయుక్త ప్రణాళికను రూపొందించి శనివారం విడుదల చేశాయి. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల వర్షపాతం సాధారణం కంటే 60–70శాతం వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా జూలైలో 60–70 శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవన వర్షాలు కానందున వర్షాధార పంటలు విత్తుకోకూడదని సూచించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత తేలికపాటి నేలల్లో 50–60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60–70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాక వర్షాధార పంటలైన సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు విత్తుకోవాలని తెలిపింది. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనుము, జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేక పచ్చిరొట్టగా విత్తుకోవాలని సూచించింది. పెసర, జొన్న ఈ నెల 30వ తేదీ వరకు, మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు జూలై 15 వరకు, కంది జూలై 31 వరకు, ఆముదం ఆగస్టు 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయమని వెల్లడించింది. వరినార్లు వేసుకోవడానికి దీర్ఘకాలిక రకాలను జూన్ 20 వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10 వరకు, స్వల్పకాలిక రకాలు జూలై 31 వరకు అనువైన సమయమని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 4.5 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 4–5 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు కాశిబుగ్గ: రాష్ట్రంలో వర్షాలు కురవాలని కోరుతూ వరంగల్ నగరంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించి వానలు కురిపించాలని కోరుతూ వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు వెయ్యి మంది వరకు ఆదివారం ఉదయం వరంగల్ ఓసిటీ మైదానానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
వామ్మో నీటి లోటు..543 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్ : లోటు వర్షపాతం, ఎగువ నుంచి కరువైన ప్రవాహాల కారణంగా గడిచిన ఏడాది నిర్జీవంగా మారిన కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జూన్ నుంచి ఆరంభమైన కొత్త వాటర్ ఇయర్లో నీటి రాకకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాదైనా నైరుతి కరుణిస్తుందనే గంపెడాశతో ఉన్నాయి. ప్రçస్తుతం రెండు బేసిన్ల పరిధిలో 543 టీఎంసీల నీటి లోటు ఉండగా, అవి పూర్తి స్థాయిలో నిండి రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాలు తీరాలంటే కురిసే వానలపై భవిష్యత్తు ఆధారపడి ఉంది. వానలు కురవకపోతే మాత్రం రెండు బేసిన్ల పరిధిలో 26 లక్షల ఎకరాలపై ప్రభావం పడనుంది. నోరెళ్లబెట్టిన ప్రాజెక్టులు.. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు కూడా నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణాబేసిన్ ప్రాజెక్టులకు నీటి రాక కరువైంది. దీని ప్రభా వం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాలపై పడింది. ప్రస్తుతం ఈ 3 ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకు గానూ 372.46 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో 130 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా, ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇందులో గరిష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు 8 టీఎంసీలకు మించి వాడుకునే అవకాశం లేదు. ఇక శ్రీశైలం లో 215 టీఎంసీలకు గాను 32 టీఎంసీల లభ్యతగా ఉండగా, ఇప్పటికే కనీస నీటి మట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నాయి. జూరాలలోనూ 2.31 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి. మొత్తంగా 12 టీఎంసీలకు మించి నీటి లభ్యత లేదు. ఇక ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ తీవ్ర నీటి లోటు ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 223 టీఎంసీల నీరు చేరితే కానీ అవి నిండే పరిస్థితులు లేవు. ఎగువన 180 టీఎంసీల మేర నీరు చేరి తే గానీ దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశాలు లేవు. ఈ స్థాయిలో నీటి రాక రావాలంటే జూలై, ఆగస్టు నెలలో ఎగువన వర్షాలు కురవాలి. లేకుంటే దిగువకు ప్రవాహాలు మొదలయ్యేందుకు సెప్టెంబర్, అక్టోబర్ కూడా పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే జూరాల, సాగర్ల కింద ఖరీఫ్ పంటల సాగుపై స్పష్టత కొరవడుతుంది. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితుల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయ కట్టు పై ప్రభావం పడే అవకాశం ఉంది. గోదావరి నిర్జీవం.. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లోనూ గడ్డు పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూ ర్, కడెం, ఎల్లంపల్లిలలో ప్రస్తుత లభ్యత జలం కేవలం 18 టీఎంసీలు మాత్రమే ఉండటం, 172 టీఎంసీల మేర నీటి లోటు ఉండటం కలవరపెడుతోంది. ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టుల కింద సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరథ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలో లభ్యత జలం 30 టీఎంసీలకు మించి లేకపోవడం, మరో 30 టీఎంసీల నీరు వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సాగు అంతా వర్షాలపైనే ఆధారపడి ఉంది. -
వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది నవంబర్ మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 2.54 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 20.71 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది 19 శాతం మేర లోటు వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ ఏడాది నవంబర్‌లో భూగర్భ జల శాఖ 584 మండలాల పరిధిలో భూగర్భ మట్టాలను పరిశీలించింది. గతేడాది నవంబర్‌లో రాష్ట్ర సగటు నీటి మట్టం 8.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 10.90గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 2.54 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. కేవలం 8 జిల్లాల్లో మాత్రమే 0.34 మీటర్ల నుంచి 1.64 మీటర్ల పెరుగుదల కనిపించగా, 23 జిల్లాల్లో 7.85 మీటర్ల నుంచి 0.15 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, మెదక్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఏకంగా కొన్ని జిల్లాలో 7 మీటర్లు పడిపోగా, మరికొన్ని జిల్లాలో 6 మీటర్లకు పైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేసవికి మరో 4 నెలల ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఇక నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న గుబులు కలిగిస్తోంది. -
లోటు వర్షపాతమే!
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ఈ ఏడాది జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే కురిసా యి. ఒక్క ఆగస్టు నెలలోనే ఆశాజనకంగా 40 సెం టీ వర్షపాతం నమోదై జిల్లాను ఆదుకుంది. జూన్ 1 నుంచి వర్షకాలం ముగిసే సమయానికి సెప్టెంబర్ 31 వరకు రెండు, మూడు అల్ప పీడనాలే వచ్చాయి. జూన్‌లో 19, జూలైలో 21, సెప్టెంబర్‌లో 03 సెంటీ మీటర్ల వర్షపాతం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షకాలం సీజన్లో మొత్తంగా 94 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదవాల్సి ఉండగా, మైనస్ 12 సెంటీ మీటర్లతో కేవలం 83 సెంటీ మీటర్లు కురిసి జిల్లాలో లోటు, సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఏడు మండలాలు లోటు వర్షపాతంలో ఉండగా, 19 మండలాలు సాధారణం, కేవలం ఒక్క మోర్తాడ్ మండలమే అధిక వర్షపాతంలో ఉంది. వాస్తవానికి సాధారణ వర్షపాతం అంటే మైనస్‌లో ఉన్నట్లే అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన లెక్క ప్రకారం మైనస్‌లో ఉన్న మండలాలు 23 ఉన్నాయి. గతేడాది కంటే మేలే కానీ... గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 60 సెంటీ మీటర్ల సగటు వర్షపాతమే కురిసింది. అంటే జిల్లాలో దాదాపు కరువు ఛాయలు కనిపించాయి. ఈ ఏడాది గతేడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ లోటు వర్షపాతం నుంచి బటయపడలేకపోయాం. ఒక్క ఆగస్టు నెలలోనే 40 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురవడం వల్ల కొంత మేలు జరిగింది. ఇటు ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపడం వల్ల పంటలకు ఎలాంటి నీటి సమస్య ఏర్పడలేదు. ప్రస్తుతం వర్షకాలం ముగిసి చలికాలం ప్రారంభమైంది. ఉదయం, రాత్రుల్లో చల్లగానే ఉంటున్నా వాతావరణం మధ్యాహ్నం వేళలో సూర్యుడు మండిపోతున్నాడు. ఉక్కపోత వాతావరణం ఏర్పడుతోంది. చెరువుల్లో, ప్రాజెక్టుల్లో ఎండా కాలం సమయానికి నీళ్లు లేకపోతే సాగుకు, తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు. ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు సిరికొండ: సిరికొండ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్లుగా మండలంలో వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయి. చెరువులు కూడా నిండలేదు. బోరుబావుల్లో నుంచి నీళ్లు రాకపోతుండటంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పొలాలను కాపాడుకోవటానికి రైతన్నలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన బడాల.రామకృష్ణ అనే రైతు తన పొలాన్ని కాపాడుకోవటానికి ట్యాంకర్‌తో నీళ్లు పోస్తున్నాడు. లోటు వర్షపాతం మండలాలు మెండోరా ముప్కాల్ నిజామాబాద్ రూరల్ ధర్పల్లి ఇందల్వాయి రుద్రూర్ జల్ సాధారణ వర్షపాతం మండలాలు మోపాల్ కమ్మర్పల్లి భీమ్‌గల్ బాల్కొండ మాక్లూర్ నిజామాబాద్ నార్త్ నందిపేట్ కోటగిరి బోధన్ సిరికొండ ఆర్మూర్ డిచ్పల్లి వేల్పూర్ ఏర్గట్ల వర్ని ఎడపల్లి నవీపేట్ నిజామాబాద్ సౌత్ జక్రాన్‌పల్లి ఈ వర్షాకాల సీజన్లో నెల వారీగా కురిసిన వర్షపాతం (సెంటీ మీటర్లు) జూన్ -19 జూలై -21 ఆగస్టు -40 సెప్టెంబర్ -03 మొత్తం -83 కురవాల్సిన వర్షపాతం - 94 సెంటీ మీటర్లు కురిసిన వర్షపాతం- 83 సెంటీ మీటర్లు -
అంచనాలను మించిన వరి సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి అంచనాలకు మించి సాగైంది. గత నెల విస్తారంగా వర్షాలు పడటంతో వరి విస్తీర్ణం 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా వరి నాట్లు పడే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 17 జిల్లాలకు అది వ్యాపించింది. పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుంది. 12 జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు పురుగు సోకిందని నివేదికలో తెలిపారు. ఇక కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్ పంటలు పూత దశలో ఉన్నాయి. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం.. గత నెల విస్తారంగా వర్షాలు కురిసినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్లు ఆశాఖ తెలిపింది. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద సాధారణ వర్షపాతం రికార్డవ్వగా, నెలల వారీగా చూస్తే జూన్, ఆగస్టుల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 30%లోటు వర్షపా తం రికార్డయింది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 75% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొందని పేర్కొంది. రబీ ‘రైతుబంధు’కు సన్నద్ధం బ్యాంకులతో వ్యవసాయశాఖ సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీలో సరఫరా చేయాల్సి న రైతుబంధు పెట్టుబడి కోసం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్‌లో 8 బ్యాంకులు పెట్టుబడి చెక్కులను రైతులకు సరఫరా చేశాయని, ఈసారి మరిన్ని బ్యాంకులు ఇందులో పాల్గొనాలని కోరారు. అందుకు ఇతర బ్యాంకుల జాబితాను పంపాలన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు పంట రుణాలు ఏమేరకు ఇచ్చారో సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారులతోనూ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలు, పంటల పరిస్థితులు, పంట నష్టం, ఎరువులు, రైతు బంధు, రైతుబీమా పైనా జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సీజన్లో ఎంత మేర పంట నష్టం జరిగిందో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకంలో పంపిణీ చేసిన, చేయని చెక్కులను, ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత నమూనా పత్రాలలో నమోదు చేసి చెక్కుల పరిశీలనకు రావల్సిందిగా సూచించారు. ఆయా జిల్లాల్లో పంటల విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఎరువులను సమకూర్చుకోవాలని సూచించా రు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, జాయింట్ డైరెక్టర్ విజయగౌరి పాల్గొన్నారు. -
11 సబ్డివిజన్లలో లోటు వర్షపాతం
న్యూఢిల్లీ: దేశంలోని 36 వాతావరణ సబ్డివిజన్లలో 11 సబ్డివిజన్లలో ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) తెలిపింది. అలాంటి ప్రాంతాలు ఎక్కువగా తూర్పు, ఈశాన్య భారత్‌లో ఉన్నాయంది. 23 సబ్డివిజన్లు సాధారణ వర్షపాతం పొందాయని, 2 సబ్డివిజన్లలో(కేరళ, కోస్తా ఏపీ) సాధారణం కన్నా అధిక వర్షపాతం కురిసిందని తెలిపింది. లోటువర్షపాతం నమోదైన తూర్పు, ఈశాన్య డివిజన్లలో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం–మేఘాలయ, నాగాలాండ్–మిజోరాం–త్రిపుర, హిమాలయ బెంగాల్–సిక్కిం, గంగామైదానాల పశ్చిమ బెంగాల్, జార్ఖండ్–బిహార్ ఉన్నాయి. దక్షిణాదిలో రాయలసీమ, ఉత్తర కర్ణాటక, తెలంగాణ సబ్డివిజన్లు ఉన్నాయి. తెలంగాణలో 41 శాతం, లక్ష్యద్వీప్‌లో 44 శాతం లోటు ఏర్పడింది. వరదలతో అతలాకుతలమైన కేరళలో జూన్ 1 నుంచి 41 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
నాలుగోవంతు లోటు వర్షపాతమే!
న్యూఢిల్లీ: భారత్‌లోని 25 శాతం భూభాగంలో ఈసారి లోటు వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఈ జాబితాలో 48 శాతం లోటు వర్షపాతంతో బిహార్ తొలిస్థానంలో, ఉత్తరప్రదేశ్(46 శాతం), జార్ఖండ్(42 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా సగటు లోటు వర్షపాతం 3 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. వీటిలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా 34% తక్కువ వర్షపాతం నమోదయింది. ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో సాధారణం కంటే 9 %తక్కువ వర్షపాతం రికార్డయింది. వీటితో పోల్చుకుంటే మధ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 16 శాతం అధిక వర్షపాతం నమోదయింది. -
235 జిల్లాల్లో కరువు ఛాయలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తినా చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదవలేదు. దేశంలోని 235 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువగా, తొమ్మిది జిల్లాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భలో ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌లో వరుసగా 31 శాతం, 28 శాతం, 25 శాతం సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ఆరంభంలో జూన్, జులై రెండు నెలలు దేశవ్యాప్తంగా 2.5 శాతం మిగులు వర్షపాతం నమోదై ఆశలు రేకెత్తించినా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 12 వరకూ సాధారణ వర్షపాతం కంటే 17 శాతం తక్కువ నమోదైంది. రుతుపవనాల విస్తరణ ఆశాజనకంగా లేకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు తప్పేలా లేవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కేవలం 110 జిల్లాల్లో ఎక్కువ, అత్యధిక వర్షపాతం నమోదైంది. గుజరాత్, రాజస్ధాన్, హిమాలయాల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అసోం తదితర రాష్ర్టాల్లో వరదలు పోటెత్తాయి. మధ్య భారత్, సహా ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం సైతం నమోదవలేదు. అయితే మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు విస్తరించి మధ్యభారత్ సహా వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లోనూ వర్షాలు మెరుగవుతాయని ఐఎండీ ఆశాభావం వ్యక్తం చేసింది. -
జల దోపిడీకి దామాషానే విరుగుడు!
► లోటు వర్షపాతం ఉంటే దిగువ ప్రాజెక్టులకు నీటి గండం ► ఎగువ ప్రాజెక్టుల కింద మాత్రం విచ్చలవిడి వినియోగం ► వాటా పేరుతో 1,319 టీఎంసీలు వాడుకుంటున్న కర్ణాటక, మహారాష్ట్ర ► దీనికి దామాషా విధానమే సరైందంటున్న తెలంగాణ ► దీన్నే కేంద్రం, ట్రిబ్యునల్, కోర్టులకు చెప్పాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేకుంటే దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో మట్టే మిగులుతుందన్న తెలంగాణ రాష్ట్ర ఆందోళనను మరింత బలంగా కేంద్రం, సుప్రీంకోర్టు, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర నీటి కరువును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తిగా ఎండిన వైనాన్ని వివరించి, దామాషా పద్ధతిన నీటి విడుదల అవసరాన్ని నొక్కి చెప్పాలనే నిశ్చయానికి వచ్చింది. కృష్ణాలో నీటి లోటు ఏర్పడిన సమయంలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఖరీఫ్ ఆరంభం కష్టమే అన్న వాదనకు, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా అద్దం పడుతున్నాయో వివరించి న్యాయం చేయాలని కోరేందుకు రాష్ట్రం సిద్ధమైంది. మిగులు జలాలతో మొదటికే ముప్పు.. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. నికర జలాలు వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి రెండునెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారనుంది. దీనికి తోడు మిగులు జలాల కేటాయింపు ఆధారంగా కర్ణాటక ఆల్మట్టిలో అదనంగా మరో 100 టీఎంసీల నిల్వ పెంచడానికి వీలుగా ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లు పెంచుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కాకముందే కర్ణాటక నీటి నిల్వకు దిగడం దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తోంది. ఈ దృష్ట్యా.. ఖరీఫ్ ఆరంభంలోనే ఎగువ ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలైనప్పుడే కేటాయింపుల దామాషా ప్రకారం నీటిని కిందకు విడిచే విధానం ఉండాలని తెలంగాణ కోరు తోంది. ఎగువన 100 టీఎంసీల లభ్యత ఉంటే దామాషా పద్ధతిన దిగువకు కనీసంగా 10 నుంచి 15 టీఎంసీల నీటి వాటా దక్కుతుంది. అలా కాకుండా ప్రస్తుత విధానం కొనసాగి వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఎగువనే వినియోగిస్తే దిగువకు ఏటా నీటి గండం తప్పని పరిస్థితి. ఇదే అంశాన్ని ఇప్పటికే బోర్డు దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ, వచ్చే నెల 1వ తేదీన సుప్రీం కోర్టు ముందు జరిగే విచారణలోనూ, తర్వాత 13, 14, 15 తేదీల్లో జరిగే ట్రిబ్యునల్ విచారణలోనూ వివరించి న్యాయం చేసేలా కోరాలని నిర్ణయించింది. దిగువకు చుక్కనీరు లేదు.. కృష్ణా బేసిన్లో సకాలంలో వర్షాలు రాకపోతే దిగువకు కలిగే నష్టాలు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. ఎగువ కర్ణాటకలో జూన్ నుంచే విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టులోకి ప్రవాహాలు మొదలై సుమారు 160 టీఎంసీలు, నారాయణపూర్‌లో 50 టీఎంసీల నీరు వచ్చింది. వీటికి తోడు మైనర్ ఇరిగేషన్‌కింద ఉన్న చెరువుల్లోకి 200 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్రలోనే దాదాపు 400 టీఎంసీల మేర నీరు రాగా ఇందులో 100 టీఎంసీలకు పైగా వినియోగం సైతం జరిగిపోయింది. వినియోగమంతా వారి నికర జలాల కేటాయింపుల మేరకే అయినా.. వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువకు చుక్క నీరు రాలేదు. దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్‌స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారాయి. దీంతో సాగర్ కింద 6.6 లక్షల ఎకరాలు, కృష్ణా జలాలపై ఆధార పడ్డ ప్రాజెక్టుల పరిధిలోని మరో 7లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
కరువు కాటు
జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్‌కు చినుకు లోటు... రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం (–54.9) నమోదు నెల్లూరే ఉదయగిరి: జిల్లాను కరువు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత సీజన్లో వర్షపులోటు –54.9గా నమోదైంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాగా (ఖరీఫ్ సీజన్లో) నెల్లూరే కావటం విశేషం. ఉత్తర, హస్త, చిత్తకార్తెలు.. ఒక్కొక్కటి కరిగిపోతున్నా చినుకు జాడ కనిపించడం లేదు. ఈ కార్తెల్లో వర్షం ఎక్కువగా నమోదవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు వర్షానికి బలమైన నెలలుగా భావిస్తారు. గత వారంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడినా నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడితే ఆ ప్రభావం మన జిల్లాపై కూడా ఉంటుంది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఖరీఫ్ (జూన్–సెప్టెంబర్)లో ఏకంగా సాధారణ వర్షపాతంలో 50 శాతం పైగా లోటు కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ఏ ఏడాదికాయేడాది వాతావరణంలో మార్పులు స్పష్టంగా చోటుచేసుకుంటున్నాయి. వర్షాలు కురుస్తాయని భావిస్తున్న నెలలు, కార్తెలు మొహం చాటేస్తున్నాయి. దీంతో సకాలంలో పంటలు సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మెట్ట నియోజకవర్గాలైన ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, తదితర ప్రాంతాల్లో వర్షాలు లేక మెట్టపైర్లు సాగుకాలేదు. జిల్లాలో ప్రతి ఏడాదీ సెప్టెంబర్ చివరినాటికి మినుము వేత వేయటం పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు సాధారణ విస్తీర్ణంలో పది శాతం కూడా సాగుకాలేదు. ఈ ఒక్క ఉదాహరణే చాలు..జిల్లాలో కరువు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేయటానికి. వర్షపాతం లోటు ఈ ఏడాది వర్షపాతాన్ని పరిశీలిస్తే జూన్ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జిల్లాలో 351.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదుకావాలి. అయితే అక్టోబరు 4వ తేదీవరకు 170.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే జిల్లాలో సాధారణ వర్షపాతంకంటే 54.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే మన జిల్లాలోనే తక్కువ వర్షం కురిసిందన్నమాట. అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులే జిల్లాలో 46 మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మండలాల్లో –21 నుంచి 78 శాతం మధ్య తీవ్ర లోటు వర్షాభావం నెలకొనివుంది. వరికుంటపాడు, అనంతసాగరం, తడ, మర్రిపాడు మండలాల్లో గత నెల మొదటి వారం వరకు వర్షం కాస్త మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత చినుకు జాడ లేదు. రబీ వాసుల్ని కరుణించేనా...! జిల్లా రైతులకు ఖరీఫ్ సీజన్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. నేలతల్లినే నమ్ముకున్న అన్నదాతల కలలు తల్లకిందులయ్యాయి. ఈ నెల 15 నుంచి పారంభమయ్యే రబీ సీజన్‌పైనే రైతన్నలు గంపెడాశలు పెట్టుకున్నారు. అక్టోబర్‌లో కురిసే వర్షాలనుబట్టే రబీ సీజన్ పంటలు ఆధారపడి ఉంటాయి. ఈ నెలలో కూడా వరుణుడు కరుణించకపోతే జిల్లాలోని మెట్ట రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. గత ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 9.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి. జూన్ – సెప్టెంబరు 3వతేది వరకు సాధారణ వర్షపాతం 351.4 మి.మీ ఈ ఏడాది నమోదైన వర్షపాతం 170.5 మి.మీ వర్షపాతం లోటు – 54.9 శాతం గత ఏడాది వర్షపాతం వివరాలు జూన్‌లో లోటు –22.5 శాతం జులైలో లోటు – 70.9 శాతం ఆగస్టులో వర్షపాతం + 78.3 శాతం సెప్టెంబర్‌లో వర్షపాతం +11.4 శాతం