సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో వరి అంచనాలకు మించి సాగైంది. గత నెల విస్తారంగా వర్షాలు పడటంతో వరి విస్తీర్ణం 107 శాతానికి చేరుకుంది. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటికే 25.44 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఇంకా వరి నాట్లు పడే అవకాశముం దని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని రకాల పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.03 కోట్ల ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు దాడి ఉధృతి మరింత పెరుగుతుంది. ఇప్పటివరకు 17 జిల్లాలకు అది వ్యాపించింది. పత్తిపై గులాబీ రంగు పురుగు దాడి చేస్తుంది. 12 జిల్లాల్లో పత్తికి గులాబీ రంగు పురుగు సోకిందని నివేదికలో తెలిపారు. ఇక కంది, పెసర, మినుములు, వేరుశనగ, సోయాబీన్ పంటలు పూత దశలో ఉన్నాయి.
12 జిల్లాల్లో లోటు వర్షపాతం..
గత నెల విస్తారంగా వర్షాలు కురిసినా 12 జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డయినట్లు ఆశాఖ తెలిపింది. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సీజన్ మొత్తం మీద సాధారణ వర్షపాతం రికార్డవ్వగా, నెలల వారీగా చూస్తే జూన్, ఆగస్టుల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 30%లోటు వర్షపా తం రికార్డయింది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 75% లోటుతో తీవ్ర వర్షాభావం నెలకొందని పేర్కొంది.
రబీ ‘రైతుబంధు’కు సన్నద్ధం బ్యాంకులతో వ్యవసాయశాఖ సమావేశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే రబీలో సరఫరా చేయాల్సి న రైతుబంధు పెట్టుబడి కోసం సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఖరీఫ్‌లో 8 బ్యాంకులు పెట్టుబడి చెక్కులను రైతులకు సరఫరా చేశాయని, ఈసారి మరిన్ని బ్యాంకులు ఇందులో పాల్గొనాలని కోరారు. అందుకు ఇతర బ్యాంకుల జాబితాను పంపాలన్నారు. ఖరీఫ్‌లో ఇప్పటివరకు పంట రుణాలు ఏమేరకు ఇచ్చారో సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారులతోనూ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకాలు, పంటల పరిస్థితులు, పంట నష్టం, ఎరువులు, రైతు బంధు, రైతుబీమా పైనా జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సీజన్‌లో ఎంత మేర పంట నష్టం జరిగిందో నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పథకంలో పంపిణీ చేసిన, చేయని చెక్కులను, ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత నమూనా పత్రాలలో నమోదు చేసి చెక్కుల పరిశీలనకు రావల్సిందిగా సూచించారు. ఆయా జిల్లాల్లో పంటల విస్తీర్ణం, దానికి అనుగుణంగా ఎరువులను సమకూర్చుకోవాలని సూచించా రు. సమావేశంలో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్, జాయింట్ డైరెక్టర్ విజయగౌరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment