235 జిల్లాల్లో కరువు ఛాయలు
235 జిల్లాల్లో కరువు ఛాయలు
Published Thu, Sep 14 2017 3:03 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తినా చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదవలేదు. దేశంలోని 235 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువగా, తొమ్మిది జిల్లాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భలో ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌లో వరుసగా 31 శాతం, 28 శాతం, 25 శాతం సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ఆరంభంలో జూన్, జులై రెండు నెలలు దేశవ్యాప్తంగా 2.5 శాతం మిగులు వర్షపాతం నమోదై ఆశలు రేకెత్తించినా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 12 వరకూ సాధారణ వర్షపాతం కంటే 17 శాతం తక్కువ నమోదైంది.
రుతుపవనాల విస్తరణ ఆశాజనకంగా లేకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు తప్పేలా లేవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కేవలం 110 జిల్లాల్లో ఎక్కువ, అత్యధిక వర్షపాతం నమోదైంది. గుజరాత్, రాజస్ధాన్, హిమాలయాల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అసోం తదితర రాష్ర్టాల్లో వరదలు పోటెత్తాయి. మధ్య భారత్, సహా ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం సైతం నమోదవలేదు. అయితే మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు విస్తరించి మధ్యభారత్ సహా వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లోనూ వర్షాలు మెరుగవుతాయని ఐఎండీ ఆశాభావం వ్యక్తం చేసింది.
Advertisement